ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, May 8, 2011

ఎప్పటికీ అమ్మ అమ్మే!


 అమ్మ అమ్మే!...అమ్మ- ‘అనన్వయము.’
ఉపమానంగానూ, ఉపమేయంగానూ ఒకటే చెబితే, దానిని ‘అనన్వయాలంకారం’ అంటారు.
‘‘గగనం గగనాకారం సాగరస్సాగరోపమః
రామరావణ యోర్యుద్ధం రామరావణయోరివః
అంటూ గగనం గగనాకారము, సాగరం సాగరంలా వుంది, రామరావణ యుద్ధం రామరావణ యుద్ధం వలె వుంది అని సదృశమైన ద్వితీయ వస్తువు లేదని చెప్పినట్లే- ‘అమ్మ అమ్మే’ అనడం- అనన్వయాలంకారం మాత్రమే కాదు. ఎందుకంటే అమ్మ అన్నది, మాతృత్వం అన్నది, స్ర్తికి అలంకారం కాదు ‘మాతృత్వంలోనే వుంది ఆడజన్మ సార్థకం’ అని- ఒక స్ర్తి పరిపూర్ణత ‘అమ్మ’ అయినప్పుడే అన్నది, నాటికీ నాటికీ నిర్థారితంగా, స్ర్తిలచేత కూడా భావింపబడుతున్న విషయమే!
నిజమే! కాలం మారింది. సమాజం మారింది.కానీ కాలమేదైనా, మతమేదైనా, మాతృత్వాన్ని ఆరాధించింది. ఆరాధిస్తోంది. కేవలం తల్లి కావడంవల్లనే ఆమెకు దైవత్వాన్నిచ్చి పూజించింది. తల్లితండ్రులూ, అమ్మానాన్నా అంటూ - అమ్మయే ప్రధమగణ్యం! క్రిస్టియన్లు, జ్యూస్, ముస్లిం మతాల్లో కూడా ‘తల్లి’స్థానం గణనీయం. కేథలిక్స్ ‘మేరీమాత’నే ఆరాధిస్తారు. హిందూమతంలో- జగజ్జననిగా పార్వతిని తొలుత సంభావించడం వుంది. ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మగా జగజ్జనని ఆరాధింపబడుతోంది. గ్రీకుల ‘డిమేటర్’ స్థానమూ అలాంటిదే!
అమ్మ వాస్తవం, తండ్రి విశ్వాసం.
అమ్మను మోసంచేసే నాన్నలూ, అమ్మను హింసించే కొడుకులూ, ‘కలుగనేటికి తల్లుల కడుపుచేటు’గా వర్తించే సంతానం, సమాజంలో కానవస్తున్న కాలంలో- ‘మదర్స్‌డే’ అంటూ తల్లికోసం ఒకరోజును అంతర్జాతీయంగా గుర్తించడంలో, మాతృమూర్తులైన స్ర్తిల ఔన్నత్యాన్నీ, వారి గౌరవాదరాలనూ విధిగా సమాదరించే సంస్కారాన్ని మేల్కొల్పడం కూడా, ఓ హేతువై వుండడంలో తప్పేంలేదు! అది నేటి అగత్యం కూడాను.
ఒకప్పుడు ‘అమ్మ’అంటే ఇంటి పట్టునే వుండి, నాన్న సంపాదించి సంసార భారాన్ని వహిస్తూంటే- అమ్మ ఇంటి పనీ, వంట పనీ చేస్తూ, పిల్లలను సంరక్షించుకుంటూ, ఇంటికి వచ్చిన అతిథులకు వండి వడ్డిస్తూ, తండ్రికి చేదోడు వాదోడుగా ఉండే ఇల్లాలు మాత్రమే. భర్త మాట జవదాటక, అత్తమామలకు అణగిమణగి వుంటూ, పుట్టింటి గౌరవాన్నీ, మెట్టినింటి ప్రతిష్ఠనూ నిలుపుతూ- పిల్లల పెంపకం, వారికి క్రమశిక్షణ గరపడం, విద్యాబుద్ధులు కలిగించడంలో తోడ్పడడం అమ్మ పని.
వీటికి అదనంగా ఇవాళ- ‘అమ్మ’ ఆఫీసులోనూ పనిచేస్తుంది! నాన్నకన్నా ఎక్కువ సంపాదిస్తున్న అమ్మలూ వున్నారు. హోదాల్లో, అధికారంలో, మేథస్సులో, కార్యనిర్వహణలో, ‘అమ్మలై’కూడా స్ర్తిలు అధిగమిస్తున్న వారున్నారు. అలాగని ఆమె గృహ బాధ్యతల్లో మార్పేమీలేదు. 20వ శతాబ్దం- పురుషులు కూడా ఇంటి పనిలో, వంట పనిలో సహకరించే మార్పును కొంత తీసుకువచ్చి, పిల్లల పెంపకంలోనూ బాధ్యతా నిర్వహణం చేయిస్తున్నా, ఇవాళ్టికే స్ర్తిలే - ‘అమ్మ’గా పిల్లల పెంపకంలో అదనపు కష్టం పొందుతూ, బాధ్యతాయుతులుగా నిర్దేశింపబడి, మెలుగుతున్నారు. ఒక్క యునైటెడ్ స్టేట్స్‌లోనే- 82.5 శాతం స్ర్తిలు తల్లులుగా వుండగా, వారిలో 63 శాతం మంది తల్లులు చంటి పిల్లలతో వుంటూనే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారట. 72 శాతం మంది ఉద్యోగినులైన స్ర్తిలకు పిల్లలే లేరన్నది కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక అంచనా!
నిజానికి ఆధునిక సమాజంలో తల్లి పాత్ర మరింత బాధ్యతాయుతమూ, ఒత్తిడుల మయమూ అవుతోంది. పిల్లల రక్షణ గురించి తల్లి పడే ఆతురత అధికం.
‘‘మీకు తెలుసా?.. వాడికేం కావాలో
తిట్టేస్తాడు మిమ్మల్ని... పిల్లలు ఇంట్లో ఉన్నట్లే బయటా ఉంటారనుకోకండి’’
ఈ సంభాషణ ‘బొమ్మరిల్లు’ చిత్రంలో తల్లిగా, గృహిణి అయిన జయసుధ పాత్రది అని వేరుగా చెప్పక్కర్లేదు.
నిజమే! తమ పిల్లలను సంతోషంగానూ, గొప్పగానూ వుంచడానికి- ఇద్దరూ ఉద్యోగస్తులవడంతో, తల్లిదండ్రులు ఆర్థికంగా మునుపటిలా ఇబ్బందులు అంతగాపడడం లేదన్నమాట వాస్తవమే కావచ్చు. కానీ మంచి ఇల్లు, మంచి ఆహారం, శారీరకంగా మానసికంగా మంచి ఆసరా, పిల్లలకు తల్లియే ప్రధానంగా కల్పించగలుగుతుంది! అయితే అందుకు అనుగుణమైన పరిస్థితులు- ఉద్యోగినియైన స్ర్తికి ఏమేరకు వున్నాయన్నదీ ఆలోచించాల్సిన విషయం! మాతృత్వం అనేదాన్ని తనకొక పునర్జన్మగా స్వీకరించి, పిల్లల పెంపకంలో శ్రమించే ఆ అమ్మ- ఒక వయసు వచ్చాక పిల్లలు తనమీదనే ఆధారపడరనీ, అన్ని విషయాలూ తనతో పంచుకోరనీ, ఒక దశలో ‘‘అమ్మ నీకేం తెలియదు! నువ్వూరుకో’’అంటూ ఆమె వైయక్తిక అస్తిత్వానే్న అల్పం కావిస్తారనీ, గ్రహిస్తూనే వుంటుంది! అయితే ఒక రక్షిత వాతావరణంలో ఆ స్థాయి పిల్లల ఎదుగుదలకు ఆమె పడిన శ్రమకు విలువకట్టగలమా?
1870లోనే అమెరికాలో ‘మదర్స్‌డే’ బీజాలు పడినా, 1912లో మే నెల రెండవ ఆదివారాన్ని అంతర్జాతీయంగా మాతృదినోత్సవం చేయాలనే సంకల్పం ‘అన్నా జార్విస్’ మూలంగా స్థిరపడింది. అయితే మహిళా దినోత్సవంగా సంభావిస్తున్న మార్చి 8నే ‘అఫ్ఘనిస్తాన్’, అల్బేనియా, ఆర్మేనియా, వియత్నాం, అజర్‌బైజాన్, బోన్సియా, బల్గేరియా, లావోస్, కజికిస్థాన్, మాల్డోవా, ఉక్రెయిన్ వంటి దేశాలు ‘మదర్స్‌డే’గానూ భావిస్తున్నాయి.
మేథస్సుతో పరుగులు పెడుతూ యాంత్రికతకు దగ్గరవుతున్న నేటి తరంలో- మానవీయ విలువల పట్ల శ్రద్ధాసక్తులనూ, ఆర్తినీ పెంచడానికి ‘మదర్స్‌డే’ వంటిది అనివార్యమేనేమో! అందునా ‘అమ్మ’గా మునుపటికన్నా స్ర్తి పడుతున్న శ్రమ, ఆ శ్రమవల్ల కోల్పోతున్న కుటుంబ మాధుర్యం, అనురాగాలు నిలిపేందుకు, విత్తులుగా ఈ ‘గుర్తింపు’ దినోత్సవాలు ఉపకరించినా ఎంతో మేలే!
ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న తల్లుల బాధ్యతనూ, వారి అదనపు ఇబ్బందులనూ గ్రహించకపోలేదు. అందుకే స్ర్తిలు పనిచేస్తున్న కార్యాలయాల్లో- తల్లులుగా వారి బాధ్యతలకు ఉపకరించే చర్యలు చేపట్టడమూ వుంది. ‘క్రెచ్’లు అంటే పిల్లల సంరక్షణ గదులు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఏర్పరచబడి వుంటున్నాయి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద - స్ర్తిలు పనిచేసే చోట్ల, శ్రామిక స్ర్తిలకు కూడా- తమ పిల్లలను పనిచేసేచోటుకు దగ్గరగా, కనిపెట్టి చూసుకోగల వెసులుబాటు కల్పించబడింది! ఉద్యోగినులకు ప్రసూతి సెలవు వుంటుంది. ‘పెటర్నల్ లీవ్’ అంటూ తండ్రులకు కూడా ఇటీవల కొంత సెలవు సౌకర్యం కల్పించబడింది. అయినా పిల్లల సంరక్షణలో అమ్మదే ప్రధాన బాధ్యతగా వుండడంవల్లనే- ఆరవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వంలోని తల్లులైన మహిళా ఉద్యోగినులకు 2008 సెప్టెంబర్ 1నుండి అమలులోకి వచ్చే విధంగా ‘్ఛల్డ్ కేర్ లీవ్’ అనేది ప్రత్యేకంగా కల్పించింది. ఇది ప్రసూతి సెలవులకూ, వారికి వుండే ఆర్జిత సెలవులకూ, మిగతా సెలవులకూ- ‘అదనంగా’ కల్పించబడిన సౌకర్యం! అంతకుముందు వున్న ప్రసూతి సెలవు దినాలను కూడా 180 రోజులకు పెంచడమేకాక, ఈ ‘్ఛల్డ్ కేర్ లీవ్’ క్రింద ఇద్దరు పిల్లలవరకూ, వారికి 18 సంవత్సరాలు నిండేలోగా, ఉద్యోగిని అయిన ఆ తల్లి, సంవత్సరానికి మూడు విడతలుగా, విడతకు పదిహేను రోజులు తక్కువ కాకుండా, మొత్తం 730 రోజులు, అంటే రెండు సంవత్సరాలు- పూర్తి జీతం పొందుతూ, సెలవులో వుండే సౌకర్యం అమలవుతోంది! పిల్లలకు జ్వరం వచ్చినా, వారి పరీక్షలకైనా తల్లి సెలవుపెట్టి, వారి పెంపకం బాధ్యతలను నిర్వర్తించడానికి, ‘అమ్మ’తనానికి కల్పించిన గౌరవమే ఇది! రెండేళ్ల కాలం ఆర్థిక లోటు కూడా లేకుండా, ‘్ఛల్డ్ కేర్ లీవ్’ అనేది - పిల్లల పట్ల తల్లులకు, వారి బాధ్యతా నిర్వహణకు ఒక వెసులుబాటే ఇది. నిజంగా అభినందనీయం.
‘తల్లిగా-’ ఉద్యోగిని తన పిల్లల సంరక్షణకూ; వారి అభివృద్ధికీ, సమయం కేటాయించడానికి వీలుగా కల్పించబడిన ఈ సౌకర్యం-
అందువల్ల ‘అమ్మ’కావడం వాయిదావేసుకోవలసిన అగత్యమూ ఉద్యోగిని అయిన స్ర్తికి లేదన్నది గ్రహించవలసిన విషయం.
స్ర్తికి అమ్మకాదగిన వయసు- నేడు 25 సంవత్సరాలుగా సగటున నిర్ధారించబడింది. గతంలోవలె బాల్య వివాహాలు, లేత గర్భాలవల్ల తల్లీపిల్లలకు ప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం దాల్చాయి! స్ర్తిల సుఖ ప్రసవానికి నేడు స్కాండినేవియన్ దేశాలు ప్రముఖంగా చక్కగా వున్నాయిట. తల్లీ పిల్లల ఆరోగ్యం ఎక్కువ. శిశుమరణాల సంఖ్య అతి తక్కువ అక్కడ.
ప్రపంచవ్యాప్తంగా పిల్లల భాష విషయంలో కూడా- తల్లిదే ప్రముఖ పాత్రగా గుర్తించబడింది. అమ్మ గర్భంనుంచే శిశువు భాష నేరుస్తాడనీ, పెరిగే క్రమంలోకూడా తండ్రికంటే కూడా తల్లినుంచే పిల్లలు భాషను త్వరగానూ, సులభంగానూ గ్రహిస్తారనీ నిర్ధారితమైన అంశం! అందువల్లనే- ‘మాతృభాష’ అంటాం. ‘మదర్‌టంగ్’ అనే అంటారు. తండ్రి పాత్ర పిల్లల భాషాభివృద్ధిలో వున్న, తల్లినుండి గ్రహించేదే ఎక్కువ అనేది సారాంశం.
కుమార శతకంలో- పంచమాతల గురించి చెప్పబడింది. రాజుగారి భార్య అంటే రాణి, అన్నగారి భార్య. అనగా వదిన, గురువుగారి భార్య అనగా గురుపత్ని, అలాగే భార్య తల్లి అంటే అత్తగారు, తనను కన్నతల్లి అంటే ‘అమ్మ’-ఈ అయిదుగురూ అమ్మలే! ‘మదర్స్‌డే’ని విస్తృతార్థంలో తీసుకున్నా వీరందరినీ గౌరవించడం, వారి పట్ల గౌరవాదరాలు, శ్రద్ధాసక్తులు కలిగి వుండడం మనిషి కర్తవ్యం!
* *

0 comments: