ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, May 6, 2011

రైతుల రసాయనంఒరే నాయనా ఎండ్ చేయవా ఆ సెల్‌ఫోన్! ఎంతసేపు మాట్లాడుతావ్? ఇక్కడ మేం ఒకరం ఉన్నామని మరిచిపోతే ఎలా?-’ అన్నాడు రాంబాబు, సెల్‌ఫోన్లో అదేపనిగా మాట్లాడుతున్న శంకరంతో ‘‘ దాన్ని గురించే మా ఊళ్లో రైతు అడిగితే చెబుతున్నానోయ్’’ అన్నాడు ఓ చేత్తో సెల్‌ఫోన్-టాక్ స్పేస్‌ను మూస్తూ శంకరం.
‘‘దేన్ని గురించి చెబుతున్నావ్?’’ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు రాంబాబు.
‘‘ఏమిటన్నావ్ నువ్వు’’ అన్నాడు శంకరం కాల్ ముగిస్తూ.
 ‘‘ఎండ్ చేయవా ఆ సెల్‌ఫోన్-అన్నాను’’ అన్నాడు రాంబాబు
‘‘అవునా! నాకు ఆ మాట ‘ఎండోసల్ఫాన్’ అని వినబడిందిలే! ‘దాని వాడకం మానేస్తే రైతులం నష్టపోతాం’’ అంటున్నాడు మా వూరి రైతు. ఎండోసల్ఫాన్ నిషేధించాలని, మొన్న ఏప్రిల్ 29న స్టాక్‌హోమ్ కనె్వన్షన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఈ నిషేధం అమలుపరచాలనీ, ముఖ్యంగా భారతదేశం ఎండోసల్ఫాన్‌ను మొత్తంగా నిషేథించాలనీ, మన దేశంపై ఒత్తిడి కూడా తెచ్చారు కదా!’’ అన్నాడు శంకరం.
‘‘ఎండో సల్ఫాన్ అంటే పురుగుల మందు కదా! కోరమాండల్ ఫెర్టిలైజర్స్, ఎక్సెల్ కేప్‌కెర్, హిందూస్తాన్ ఇన్‌సెక్టిసైడ్స్ కంపెనీలు ‘ఎండో సల్ఫాన్’ ఉత్పత్తిలో అగ్రశ్రేణి కంపెనీలుగా ఉన్నాయని ఎక్కడో చదివాను! దేశంలో ఈ మూడు కంపెనీలే ప్రస్తుతం ఏడాదికి నాలుగువేల అయిదు వందల టన్నులు మనదేశంలో వాడడానికీ, మరో నాలుగు వేల టన్నులు ఎగుమతికీ, ఉత్పత్తి చేస్తున్నాయట! గత యాభై ఏళ్లకు పైగా రైతుల పంట రక్షణకు ఈ మందు వినియోగంలో బానే ఉంది కదా!’’ అన్నాడు ప్రసాదు. ‘‘కానీ పర్యావరణం మీదా, మనుషుల ఆరోగ్యం మీదా ‘ఎండోసల్ఫాన్’ వాడకం, తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగిస్తోందని-ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు తేల్చాయి. రంగులేని ఈ రసాయనం విషప్రభావం కలిగినదనీ, అందువల్ల పర్యావరణం మీదనే కాకుండా, ఆ పంటల ఉత్పత్తులు వాడిన జనం మీద కూడా వాటి దుష్ప్రభావం పడుతుందని, హానికరమైన ఈ పురుగుల మందును ఇప్పటికే 80కి పైగా దేశాలు నిషేధించాయని, యునైటెడ్ స్టేట్స్ కూడా దీనిపై నిషేధం విధించిందని, భారతదేశమే దీని వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలనీ అంటున్నారట’’ అన్నాడు రాంబాబు-తన మాట ‘ఎండోసల్ఫాన్’ వైపు సంభాషణ మరలించినందుకు సంతోషిస్తూ
‘‘కానీరాంబాబూ! మనది అభివృద్ధి చెందుతున్న దేశం. అందునా వ్యవసాయాధారిత దేశం. ఇక్కడ రైతుకు వుండే భూమియే తక్కువ. ఆ భూమిలోనే అధిక దిగుబడి సాధించాలంటే-పంటను నాశనం చేసే క్రిములనుండి, తెగుళ్లనుండీ రక్షించుకోవాలి! రసాయన మందులు ఏవయినా కొంతమేరకు ఎలాగూ హానికారకాలే! కానీ పంట దిగుబడి పెంచుకుందుకు, ముఖ్యంగా 29 రకాల పంటలలో, అరవై రకాల తెగుళ్లను సమర్ధవంతంగా రూపుమాపి-పంటను రక్షించుకునేందుకు, ఉత్పత్తి పెరుగుదలకూ ’ఎండోసల్ఫాన్’ ఎంతో కాలంగా రైతుకు మేలుచేస్తోంది! 1980నుంచీ దీని వాడకం అధికంగా ఉంది. నిజానికి-కొన్ని రసాయనాలు వాడగా వాడగా ఆ పురుగులు, తెగుళ్లు వాటికి అలవాటుపడి, అతిగమించి, పంటను విజయవంతంగా నాశనం చేసేయగలవు! కానీ, గత యాబయ ఏళ్లుగా-‘ఎండోసల్ఫాన్’, తెగుళ్ల నివారణలో తగ్గలేదు సరికదా, ఈ పురుగుల మందు కారణంగా అనేక రకాల పంట దిగుబడులు అనూహ్యంగా పెరిగాయి. మా వూళ్లో రైతు ఆ మాటే అంటున్నాడు. ఇప్పుడు దీదిని మన దేశం నిషేధిస్తే ప్రత్యామ్నాయంగా-అంత ప్రభావోపేతమైన కీటకనాశని మందులెక్కడున్నాయి అని నిలదీస్తున్నాడు’’ అన్నాడు శంకరం.
 ‘‘1950ల్లో మొదలైన ‘ఎండోసల్ఫాన్’ 1954లో యుఎస్‌లోనూ విస్తరించింది. అయితే 2000 వ సంవత్సరంలో ఇంటి పెరడుల్లో, తోటల్లో యుఎస్ దీనిని నిషేధించింది. ‘స్టాక్ హోమ్ కనె్వన్షన్ ఆన్ పెర్సిస్టెంట్ ఆర్గనిక్ పొల్యూటెంట్‌స’ 2007లో జరిగినపుడు-మానవదేహం మీదా, పర్యావరణం మీదా దీని విషప్రభావం గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఈ రసాయన ఔషధాన్ని నిషేధించాలనే ఉద్యమం ఊపందుకుంది’’ అన్నాడు రాంబాబు.
 ‘‘సరేలే! భోపాల్ గ్యాస్ ప్రమాదంలా, కేరళలో-దీనిపట్లా ప్రమాదాన్ని గుర్తించి, మనదేశంలోనే-2001లో అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఎ.కె.ఆంటోనీ ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్’ వారి సిఫార్సు మేరకు తమ రాష్ట్రంలో ‘ఎండోసల్ఫాన్’పై నిషేధం విధించారు! కేరళలోని ‘కాసరగాడ’లో-దీని ప్రభావంతో గర్భస్థ శిశువులు ‘మందులు’ కావడాన్నీ, పిల్లలలో అందునా మగపిల్లల్లో, ‘ఎండోసల్ఫాన్’ ప్రభావంవలన, సెక్స్ హార్మోన్ల పెరుగుదల, పునరుత్పత్తి శక్తులు ఆలస్యం కావడం పరిశోధనల్లో గుర్తించారు. 2006లో అలా దుష్ప్రభావం వలన 135మంది, తలో యాభైవేల రూపాయల నష్టపరిహారం కేరళ ప్రభుత్వం చెల్లించింది కూడాను! బిజెపి నాయకులైన ముక్తాల్ అబ్బాస్ నక్వీ, సుష్మాస్వరాజ్ ఎండో సల్ఫాన్ నిషేధాన్ని నాడే సమర్ధించారు. మధ్యప్రదేశ్‌లో కూడా దీని నిషేధం మొదట్లో జరిగినా, మళ్లీ ఆ రాష్ట్రాలలో వాడకం జరిగింది’’ అన్నాడు ప్రసాదు.
‘‘దీని దుష్ఫలితాలు అధికం అవుతున్నాయని -ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియా,పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఈ రసాయన మందు నిషేధం చేసాయి! ’ అన్నాడు రాంబాబు.
‘‘ పునరుత్పత్తి శక్తిని యువకుల్లో తగ్గించేదన్న మాట కొంత వాస్తవమే కావచ్చు. అయితే కాన్సర్‌కు ముఖ్యంగా బ్రెస్ట్ కాన్సర్‌కు హేతువన్న విషయం పరిశోధనల్లో ఇంకా నిర్ధారణ కాలేదు! మనుషుల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ ప్రధమ కర్తవ్యాలు. నిజమే కాదనం! కానీ ఇంట్లో ఎలకలున్నాయని ఇంటికి నిప్పు పెట్టుకోం కదా! ప్రత్యామ్నాయమూ ఆలోచించాలి. రైతు సంక్షేమమూ చూడాలి. ‘ఎండోసల్ఫాన్’ గురించి, నీ ‘ఎండ్‌ఎ సెల్‌ఫోన్’ మాట మొత్తానికి ఇలా విషయచర్చకు పనికొచ్చింది. ‘భేష్’ అని రాంబాబు భుజం తట్టాడు శంకరం

2 comments:

CH.K.V.Prasad said...

20 సంవత్సరాలు ఎరువులు,పురుగుమందుల హోల్ సేల్,రిటైల్ దుకాణంలో పనిచేసివున్నన్డువలన ఈ విషయంపైన నా అభిప్రాయం వ్యక్తంచేసేందుకు సాహసిస్తున్నాను రసాయనిక ఎరువులు ఐనా,పురుగుమందులైనా నిర్నీత మోతాదులో వాడకం గణనీయమైన హానికరం కాదు. అసలు రసాయనిక ఎరువులు,పురుగుమందుల వాడకం అవుసరం మేరకు వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకోవటానికి మాత్రమె! ఇదే రైతు విషయంలో ఐతే దిగిబడి,గిట్టుబాటు ప్రధాన అంశాలు . నేను పరిశీలించినమేరకు తయారిదారు మందు డబ్బాపై వాడవలసిన మోతాదు సూచిస్తాడు.ఎకరానికి ఎంత మందు ఎన్నిలీటర్ల నీళ్ళలో కలిపి పిచికారి చేయాలో వ్రాసి వుంటుంది. వ్యసాయ అధికారుల సలహా,సహకారం కుడా తీసుకోవచ్చు. అనుభవజ్ఞుడైన రైతుకు కుడా అవగాహన వుంటుంది,కాని తోట స్థితి,పురుగు ఉధృతి,గమనించే రైతు పంట దక్కించుకోవాలనే తపనలో అధిక మోతాదులో మందులు పిచికారి చేయటం తద్వారా పంటకు ఉపకరించే కొన్ని పురుగులను నష్టపోవటం, అపకారం కల్గించే పురుగులు శక్తిని పుంజుకోవటం,పంట ఉపయోగించే వారి శరిరాలపై ప్రభావం చూపటం ఉంటున్నది. నిపుణుల పర్యవేక్షణలో మందుల వాడకం ఆచరణీయం. వినియోగ నిషేధం కంటే క్రమబద్ధీకరణ ముఖ్యం.

సుధామ said...

ప్రసాద్ గారూ! మీ అమూల్యమైన అభిప్రాయనికి ఎంతగానో ధన్యవాదాలు.మీరు ఈ రంగంలో అనుభవంతో చెప్పినట్టు నిషేధం కన్న క్రమబద్ధీకరణ అవసరమన్న సంగతి గ్ర్హించదగింది. నా రచన కన్నా మీ అభిప్రాయం నాకెంతో విలువైనది.కృతజ్ఞతలు మిత్రమా!