ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, January 3, 2015

మృత్యు’ముఖంలో ఎనెన్ని హావభావాలో..!





‘మరణం అంతం కాదు- అది అందమైన ప్రారంభం’ అంటారు కె.బి.గోపాలం.

‘‘ఎంతొ ఆరాటపడుతు జీవింతు వౌర
మృతియె లేకున్న రుచి ఏది బ్రతుకులోన’’

-అని గాలిబ్ అన్నట్లు, జీవించి వుండగానే మరణం పట్ల సజావైన దృక్పథం ఏర్పడాలి. 

చాలామంది మృత్యుభయంతో అనుక్షణం ఛస్తూండడం కూడా చూస్తూంటాం. ఏ పనిచేసినా అందరిలా చేయనివాడు కూడా అందరిలాగే చచ్చిపోతాడు. పాలగుమ్మి పద్మరాజుగారి ‘వియ్యన్న తాత మరణం’ కథ ఈ సంకలనంలో వుంది. ఆ మాటకొస్తే ఆయనవే ‘బాల్యం’, ‘గాలివాన’ కథలూ వున్నాయి. ‘మరణాన్ని గౌరవించిన రచయితల్లో పాలగుమ్మి పద్మరాజుగారి తరువాత ఎవరయినా.. ’అంటారు గోపాలం.

 ‘మరణ తరంగం’ పేర గోపాలం గారు వివిధ భాషలనుండి అనువదించిన పదహారు కథలు ఇందులో వున్నాయి. వివిధ ప్రపంచ భాషా కథలివి. పాలగుమ్మి పద్మరాజుగారి శత జయంతి సందర్భంగా ‘కథానికాజీవి’ వేదగిరి రాంబాబు శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ పేర వీటికి గ్రంథరూపం కల్పించారు.

‘‘మనం పుట్టిన మరుక్షణం నుంచే చావుమొదలవుతుంది. ఈ సంగతి ఎవరికీ నచ్చదు. ఎవరికీ అర్థం కాదు. మనిషి బతుకు కథకు చావు ఒక అందమైన అంతం. వద్దంటే అది ఆగదు! ఎప్పుడొస్తుందో తెలియదు. కనుకనే చావంటే అదొక అర్థం గాని విషయం!

మరణం మనిషిని రకరకాలుగా తాకుతుంది. బుజ్జగిస్తుంది. బాధ పెడుతుంది. బాధనుండి విముక్తివస్తుంది. కావలసిందల్లా మనం మరణం గురించి అర్థం చేసుకోవడమే!’’ అంటారు గోపాలం.

ఇందులోని పదహారు మరణ తరంగాలూ ఆ అర్థం చేసుకునే క్రమంలో ఉపకరించేవే. ‘మృత్యువంటే?’అనే రచనలో పోయినవాళ్ళకోసం దుఃఖించడం వ్యర్థం అన్న భావన వుంది. ‘‘పిన్నవారూ, పెద్దవారూ, అజ్ఞులూ, విజ్ఞులూ అందరూ మరణానికి సమానులే. తండ్రి కొడుకును కాపాడలేడు. తల్లి కూతురిని కాపాడలేదు. ఎవరూ ఎవరినీ కాపాడలేరు. అందుకని శాంతి కోరుకున్నవారు మరణంవల్ల కలిగే దుఃఖాన్ని త్యజించాలి!’’ అని బోధించాడు బుద్ధుడు. దక్షిణ అమెరికా, టర్కిష్ జానపద కథలూ ఇందులో అందించారు రచయిత. మిగిలిన జీవిత ఘటనల్లో ఎంతటి వైవిధ్యం కనబడుతుందో చావులోనూ అంత వైవిధ్యం కనబడుతుంది అన్న ‘ఉదయం’ కథలోని మాట సత్యం.

మడగాస్కర్ ప్రజల జానపద కథలో మనిషే మరణాన్ని కోరుకున్నాడనే విషయం వుంది. మీకెలాంటి మరణం కావాలో కోరుకోండి అని తొలి మానవుల జంటని దేవుడు అడిగాడట- ‘చంద్రుడి లాగానా? చెట్టులాగానా?’ అని.
చంద్రుడయితే తరిగి తరిగి ఒకనాడు మాయమవుతాడు. కానీ తిరిగి తను పుడతాడు. పెరుగుతాడు. కానీ చెట్టు విత్తులనూ, పిలకలనూ విడిచి తాను నశిస్తుంది. తన సంతతి మాత్రం సాగుతూనే వుంటుంది. సంతానం అవసరం లేదనుకుంటే చావుకూడా వుండదు. కానీ ఆ ఇద్దరు తొలి మానవులే ఎన్నాళ్ళు ఎవరికోసం బ్రతకాలి అందుకని వారు పిల్లలే కావాలని దేవుణ్ణి అడిగారట. అంచేతే మనం పోతాం, మనవారు వుంటారు అది సాగుతూంటుంది. 

‘మృత్యుభోజనాలు’ కథ ఒళ్ళు జలదరింపచేస్తుంది. ఎవరైనాపోతే ఆ ఇంట వండుకోరు. పక్కవారు ఎవరైనా భోజనం పంపిస్తారు. ఈ టర్కిష్ కథలో ఆకలి ఆరాటాన్నీ, ఆర్తినీ విశదపరుస్తూ దరిద్ర స్వరూపానికి పరాకాష్టగా- పిల్లవాడు జ్వరం వచ్చిన ‘‘అన్న చచ్చిపోతే మూల బంగళావాళ్ళు భోజనం పంపిస్తారు కదూ!’’ అని తల్లిని అడుగుతాడు. 

ఇటాలియన్ కథ ‘యుద్ధం’, ఫ్రెంచ్‌కథ ‘ప్రియురాలి కోసం’ జపాన్ కథ ‘దేశభక్తి’ అర్జెంటీనా కథ ‘గొడ్డలివేటు’ అన్నీ మృత్యువుతో ముడివడిన కథలే.

‘సహజ మరణాలకన్నా హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాల్లో ప్రాణం కోల్పోవడాలు వార్తాపత్రికల్లో ప్రముఖంగా వస్తూంటాయి. సెలబ్రిటీల చావులు, అంతిమ సంస్కారాల ఫొటోలతో సహా సంతాప సందేశాలతో సహా అచ్చవుతూంటాయి. చావు అందరికీ ఒకటే అ యినా- చనిపోయినవారి గురించిన మీడియా కవరేజ్‌లు, నివాళి వ్యాసాలతో ‘చచ్చే చావుగా వుంద’ని వాపోయేవాళ్ళూ వున్నారు. మ రణం తరువాత తన గురించి సమాజంలో, కుటుంబ సభ్యులలోనూ ప్రకంపనలూ, ప్రతిస్పందనలూ మరణించినవారికి తెలుస్తాయో లేదోకూడా తెలియదు. 

ఆత్రేయ అన్నట్లు-

పోయినోళ్ళందరూ మంచోళ్ళు
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగుర్తులు..

మరణ తరంగం అంతరాంతరాల్లో ఆలకించదగిన సముద్ర 
 ఘోష. 
గోపాలం రేపిన ‘అల’జడి ఆహ్వానింపదగింది.

  • -సుధామ

మరణ తరంగం
(కథానికా సంకలనం)- డా.కె.బి.గోపాలం
వెల: రూ.100/-
శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ బ్లాక్-6, ఫ్లాట్-10, హెచ్.ఐ.జి.1
బాగ్‌లింగంపల్లి,
హైదరాబాద్- 44

0 comments: