విషాద ఛాయల మాటున.. దాగిన విలువలెన్నో!
‘నవ్విన ధాన్యరాశి’... సి.వేణుగారి పాత, కొత్తల ఇరవై కథల సంపుటి. చిత్తూరు జిల్లా సాక్షరతా సమితి వారి ‘అక్షరభిక్ష’కై రాసిన కథలు కూడా ఇందులో వున్నాయి. ఇందులోని కథలు ఎక్కువగా విషాదఛాయల్లో కానవస్తాయి. వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయులైన వేణుగారు ఎనభై ఎనిమిదేళ్ళ ప్రాయంలో ఈ గ్రంథాన్ని వెలువరించడం బహుథా అభినందనీయం.
కవిగా, కథకునిగా తన సాహితీ ప్రియత్వాన్ని చాటుకున్నవారు వేణుగారు. 1961లో ఆంధ్రపత్రికలో ‘మారెమ్మగుడి’ ఆయన తొలి కథ. అదీ విషాదాంత గాథే! 1962 ఆంధ్రప్రభ దీపావళి కథల పోటీలో ‘నవ్విన ధాన్యరాశి’ కథకు ప్రథమ బహుమతి లభించింది.
‘‘ఈ ప్రాంతపు సాహితీ వికసనానికి
మీ నవ్విన ధాన్యరాశి ఒక మజిలీ
తియ్యందనాలకు మీ కలం కాణాచి
మీరు మట్టిని సైతం బంగారంగా మార్చగలరు’’
-అంటూ ప్రముఖ కథారచయిత కీ.శే.మధురాంతకం రాజారాం గారి ప్రశంసలందుకున్నారు వేణు.
ఈయన కథల్లోని పాత్రలు సమాజంలోని సాదాసీదా మనుషులే! అమానవీయ ఘటనలకు బలైనవారు కనిపిస్తారు. అందం, ఆనందంలానే దుర్మార్గమూ, దౌష్ట్యమూ సమాజంలో సహజాలన్నది ఆయన రచనాధోరణి. అందుకే విషాదాంతాలుగా ముగిసే కథలు ప్రధానంగా కానవస్తాయి.
విషాదాంత కథలే అయినా- భవభూతి అన్నట్లు ‘ఏకోరసఃకరుణఏవ’ అన్నట్లుగా, బ్రతుకులో ‘కరుణ’ ప్రాధాన్యాన్ని కరతలామలకం చేసే కథలివి. ‘‘చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మదనము చూడలేవు. చెమ్మగిలని కనులు బ్రతుకుకమ్మదనము చాటలేవు’’ అని కాళోజీ అన్నట్లు గ్రామీణ జీవితంలోని ‘ఆర్ద్రతను, మనుషుల్లోని ఉదారతను, మంచితనాన్నీ- అదే సమయంలో బ్రతుకుదౌష్ట్యాన్నీ విశదపరిచే కథలివి.
విషాదాంత కథలే అయినా- భవభూతి అన్నట్లు ‘ఏకోరసఃకరుణఏవ’ అన్నట్లుగా, బ్రతుకులో ‘కరుణ’ ప్రాధాన్యాన్ని కరతలామలకం చేసే కథలివి. ‘‘చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మదనము చూడలేవు. చెమ్మగిలని కనులు బ్రతుకుకమ్మదనము చాటలేవు’’ అని కాళోజీ అన్నట్లు గ్రామీణ జీవితంలోని ‘ఆర్ద్రతను, మనుషుల్లోని ఉదారతను, మంచితనాన్నీ- అదే సమయంలో బ్రతుకుదౌష్ట్యాన్నీ విశదపరిచే కథలివి.
‘గూడు చేరిన పిట్ట’, ‘తెలియని జవాబు’, ‘లక్ష రూపాయలు’ వంటి కథలన్నీ చదివిస్తాయి. ఇతర కథలలో తనకన్నా ఎక్కువ సంపాదించే శాంతిపై ‘మేల్‌ఛావనిజం’ చూపబోయిన నారాయణకు ఆమె ‘కనువిప్పు’ కలిగేలా ఏంచేసిందీ, ‘చితాభస్మం’ కథలో రాయుడు కోపమే నారాయణుడు కోరికను చివరికెలా తీర్చిందీ, ‘కూతుళ్లను కంటే తప్పులేదు. ఫలానికి వస్తూనే సమయం చూసి ఒక ఇంటిదాన్ని చేసేయాలి’ అన్న ‘రెడ్డప్ప తీర్పు’ కథ- రచయితలోని మారిన సమాజంలోని మా రని విలువలకు అద్దం పడుతూనే, చదివించే కథలుగా వున్నాయి.
ఇవన్నీ గొప్ప కథలు, ఈనాటితరం మెచ్చే కథలూ కాకపోవచ్చు. కానీ, తొలితరం చిత్తూరు జిల్లా కథకుడిగా రైతు వెతల్ని ఆనాడే కథనాగతం చేసిన కథా ’చిత్రభానుడు’ ఈ వేణు. తొమ్మిది పదుల వయసులోకి వెడుతూ తన కథలనిలా ‘నవ్విన ధాన్యరాశి’గా రాశిపోసినందుకు సీకల వేణుగోపాలరెడ్డిగారికి మనసా అభినందనలు.
-సుధామ
‘నవ్విన ధాన్యరాశి
(కథల సంపుటి)
- సి.వేణు,
వెల: రూ.116/-
స్వచ్ఛత ప్రచురణ
నెం.19, సీకలాస్,
గార్డెన్ లేఔట్, పరంగిపాల్య, హెచ్.ఎస్.ఆర్. లే అవుట్
రెండో సెక్టార్,
బెంగుళూరు- 560102.
(కథల సంపుటి)
- సి.వేణు,
వెల: రూ.116/-
స్వచ్ఛత ప్రచురణ
నెం.19, సీకలాస్,
గార్డెన్ లేఔట్, పరంగిపాల్య, హెచ్.ఎస్.ఆర్. లే అవుట్
రెండో సెక్టార్,
బెంగుళూరు- 560102.
27.12.2014 Saturday Akshara
0 comments:
Post a Comment