ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, November 15, 2014

మానవీయతకు సన్మానం

హాస్య కథారచయిత్రిగా ‘లేబుల్’ పడిన పొత్తూరి విజయలక్ష్మి ‘డబుల్’ ధమాకా కథల సంపుటి ‘సన్మానం’. హాస్యానే్న కాదు, కరుణను కూడా పండించగల రచయిత్రి అని ‘్ఫబుల్’ గా కాక, గట్టిగా భజాయించి చెప్పగల కథలున్నాయి ఈ సంపుటిలో. తొలి కథే అందుకు ప్రబల సాక్ష్యం. 

పెద్ద వయసు, దానిపైని నిస్సహాయత నడచివచ్చిన బ్రతుకు బాటలో విడచిపెట్టని ఆత్మాభిమానం కల పెద్దవారిని పరాయిగా కాక తనగా భావించి గౌరవించడం యువతకు ఒనగూడాల్సిన లక్షణంగా ప్రబోధించి దృష్టాంతంగా చూపే మంచి కథ ‘సన్మానం’. 

అలాగే ‘ఏలినవారి దివ్యసముఖమునకు’ కథ వ్యంగ్యంగా ప్రభుత్వ మద్యపాన నిషేధ పాలసీ మీద ఎక్కుపెట్టిన సహజోక్తి కథ. కల్తీసారాతో ప్రజల ప్రాణాలుతీసి మద్యం అమ్మకాల ఆదాయంపై మనుగడ సాగించే ప్రభుత్వ సంవిధానాలకు చెంపపెట్టు లాంటి రచన.

‘తొలి ఆపద’ కథ కొత్తతరం యువతికి ప్రతీక అయిన కథ. డ్రెస్‌లు వేసుకోవడం తప్ప చీర కట్టుకోవడం రాని అమ్మాయిలున్నారనడంలో అతిశయోక్తి ఏమీలేదనడానికి ఈ కథే నిదర్శనం. 

అలాగే ‘నగల గోవిందం’ల కలల కమనీయ కబుర్ల భిత్తికపై రూపొందింది. ‘కుశాగ్రబుద్ధి’ కథ అపరకర్మలు చేయించే బ్రాహ్మణ బాలుడి కథే అయినా చేసే పని ఏదయినా తపస్సులా చేయాలనీ, దేవుడిచ్చిన పాత్రలోనే ధైర్యంగా జీవించేయాలనీ చాటిచెబుతుంది. 

‘ఝమ్రూ!’ కథ ఓ కళాకారిణి బ్రతుకు దైన్యాన్ని రాజస్థాన్ జైసల్మేర్ ప్రాంత నేపథ్యంలో చెప్పింది. ‘మర్యాదలు వచ్చేస్తున్నాయి జాగ్రత్త’ కథ నేటి వివాహ వేడుకల నిర్వహణా తీరుతెన్నులను, ఈవెంట్ మేనేజ్‌మెంట్స్ పేరిట తతంగాలను పరిహాసంగా చెప్పే నేటి రీతి కథ.

సంతాలీ తెగలోని ‘దండువా’ పద్ధతిని ఆధారం చేసుకుని వైవాహిక బంధ పటిష్టతను ప్రబోధించే కథ- ‘దండువా’. చిన్నచిన్న విషయాలకే రాద్ధాం తం చేసుకుని, కాపురాలు కూల్చుకోకుండా, వారిని మందలించి, గొడవ పడుతున్న వారిమధ్య సయో ధ్య కుదిర్చే వైఖరి అవసరమని చెబుతుందీ కథ. 

ఇలా సన్మానం సంపుటిలోని కథలు మానవ సంబంధాల పొత్తూరి, ఉదాత్త విలువల విజయం లక్ష్యించిన మంచి కథలు.

  • -సుధామ

సన్మానం (కథల సంపుటి)
- పొత్తూరి విజయలక్ష్మి
వెల: 150 రూ/-
- శ్రీరిషిక పబ్లికేషన్స్
101, వికాసిని అపార్ట్‌మెంట్స్,
న్యూనల్లకుంట, హైద్రాబాద్- 44;

0 comments: