‘తల నిటారుగా నిలపలేకపోతున్నా! మెడ వాలిపోతోంది. చెయ్యి విపరీతంగా లాగేస్తోంది’’ అన్నాడు సన్యాసి.
‘‘ఎక్స్‌రే తీయించావా’’ అడిగాడు ప్రసాదు.
‘‘నువ్వు కాంగ్రెస్ వాడివి కాదుకదా! కాంగ్రెస్ పరిస్థితి చెబుతున్నావేంటి’’ నవ్వుతూ అన్నాడు రాంబాబు.
‘‘నీకు నవ్వులాటగా వుందేం?’’ అన్నాడు సన్యాసి.
‘‘ఎన్నికల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక, మహాఘనత వహించినదిగా ఇనే్నళ్ళుగా చెప్పకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నువ్వన్నట్లే- తలెత్తుకోలేనిదిగా, అవమానభారంతో మెడ వాలిపోయేలానే వుంది. ఎక్కడా ‘చెయ్యి’ పైకి లేవలేని స్థితే! అంతటా విపరీతంగా లాగేస్తోంది. ఎన్నికల ఫలితాల ఎక్స్‌రే తీయించాక కూడా అనారోగ్యానికి హేతువేమిటో అంతుబట్టడం లేదు మరి.’’ అన్నాడు రాంబాబు.
‘‘నాది స్పాండిలైటిస్ కాబోలు’’ అన్నాడు సన్యాసి.
‘‘కాంగ్రెస్ ది ఇక ‘స్పాంటేనియటీ’ ఏమీ లేదు. ఓటమిని ‘లైట్’గా తీసుకోవడం మినహా, ఆశల ‘లైట్లేమీ’ పార్టీలో వెలిగేలాలేవు! అమ్మా, కొడుకూ ఏదో గెలిచి గట్టెక్కేరే గానీ, హేమాహేమీల పరాజయాలతో వ్యవస్థే కునారిల్లుతోంది. గెలిచిన తావుల్లో కంటి తుడుపులే ఓటమి పాలయినచోటా పరస్పర నిందారోపణలు తప్ప సరియైన చికిత్సకు ఉపక్రమణలు కన్పించడం లేదు. రోగం వచ్చాక క్రుంగిపోయి ఏం లాభం? సరియైన చికిత్సకోసం ప్రయత్నించాలి. అనుభవజ్ఞులైన వారిని సంప్రదించాలి. కోలుకోవాలి కదా! మునుపటి జవసత్త్వాలు లేకపోయినా మనుగడ నిలవాలిగా’’ అన్నాడు రాంబాబు.
‘‘ఎక్స్‌రేలు గట్రా తీయించినప్పుడు కొన్ని మూల కారణాలు తెలుస్తాయి. ‘ఇబ్బంది’ వచ్చినపుడే ‘సిబ్బంది’ ఏకత్రితం కాగలగాలి. చెయ్యి లాగేస్తోంది అంటే తినడానికి నోటి దాకా తీసుకెళ్ళడమూ సాధ్యంకాదు బిట్వీన్ కప్ అండ్ లిప్ అంటారు చూశావ్! అలా పాపం కాంగ్రెస్‌వాళ్ళు ప్రత్యేక తెలంగాణ ఇచ్చినా అధికారం వారికి అందలేదు. ఆశగా నోటిదాకా వస్తుందనుకున్న కూడు చేజేతులా నేలపాలయింది. ఎంతమంది ఎలా ‘కూడుకున్నా’, ఎన్ని కూడికలూ, తీసివేతలూ చేసినా ఇంతలా తిరగబెడుతుందనీ, తిరగబడుతుందనీ అనుకోలేదు. ఉన్నదీ పోయింది, ఉంచుకున్నదీ పోయింది చందాన ప్రకటించిన కొత్త రాష్ట్రం అధికార పగ్గాలు అందుకోవడం కాదుకదా అధికారం వున్నదనుకున్న చోటల్లా పరాజయం పాలవ్వాల్సి వచ్చింది. తెలుగులకు చేసిన ద్రోహానికే కాంగ్రెస్ కనీస వెలుగులకు నోచుకోని, చీకట్లపాలయ్యింది మరి’’ అన్నాడు ప్రసాద్.
‘‘నా పరిస్థితిని కాంగ్రెస్ పరిస్థితితో పోల్చకండొరేయ్! నేనంత అధ్వాన్నంగా ఏమీలేను. కనీసం నన్నూ, నా స్థితినీ గుర్తించినా మీరు నాకు విలువ ఇస్తున్నారు. ననే్నమీ మీరు కానివాడిననుకోవడం లేదు. కానీ కాంగ్రెస్ పరిస్థితి అలా లేదు కదా! జూన్ రెండున ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావ సందర్భంలో తెలంగాణ ఇచ్చింది, ఇవ్వడానికి హేతువయ్యిందీ కనీసం కాంగ్రెస్ అని ఒక్కరంటే ఒక్కరు కృతజ్ఞతా పూర్వక ప్రస్తావన చేసారా? లేదే! తెలంగాణ సాధించుకున్న ఘనత, ఉద్యమ సారథ్యంతో తెరాసను తెలంగాణ అధికార పార్టీగా చేసుకున్న ఘనత, తెలంగాణ జాతిపితగా నేత కె.సి.ఆర్. నీరాజనాలందుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాననీ మాట తప్పడం తన డిక్షనరీలోనే లేదనీ మాటకోసం అవసరమైతే తల నరుక్కుంటాననీ తెగ కబుర్లుచెప్పిన మహానుభావుడు మాట తప్పి మొత్తానికి కాంగ్రెస్ పుణ్యమా అని తను రాష్ట్రానికి ఆధిపత్యం సాధించినా కనీసం కాంగ్రెస్‌కు గానీ సోనియా, రాహుల్, దిగ్విజయ్‌సింగ్, వీరప్పమొయిలీ, చిదంబరం, షిండే వంటి విభజన కారణభూతులకు గానీ కనీస కృతజ్ఞత ప్రకటించాడా చెప్పండి!’’ వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు వ్రతమూ చెడింది. ఫలితమూ చెడింది. అంత దారుణం మరొకటుందా చెప్పు.’’ అన్నాడు సన్యాసి.
‘‘గెలుపు ఓటములు సహజం. కాదనలేం! ఓడలు బండ్లు కావడమూ, బండ్లు ఓడలు కావడమూ మామూలే కావచ్చు. ‘దానేదానేమే లిఖాహువాహై ఖానేవాలేకా నామ్’ అని, తినే ప్రతి గింజ మీదా తినబోయేవాడి పేరు రాసి వుంటుందంటారు గానీ, గింజ ఉడకబెట్టేసరికి పేరే మాయమవడం అంటే ఇదే! నిజమే! ఏదయినా చేతికి అందివచ్చేదాకానే కాదు, నోటికి అందివచ్చేదాకా కూడా మనదే అని నమ్మలేం! అంతెందుకు? మొట్టమొదటిసారిగా కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవి చేపట్టిన ఆనందం వారమైనా లేకుండానే, లోక్‌సభలో సభ్యునిగా ప్రమాణమైనా చేయకుండానే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి గోపీనాథ్ ముండే కారు ప్రమాదంలో మరణించడం వైపరీత్యం కాక మరేమిటి? ప్రమాదంలో కాదు, ప్రమాదం షాక్‌తో గుండెపోటు వచ్చి మరణించాడట! ‘ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ...’ అంటే ఇదేకదా! అంచేతే ‘ఎదిగినా ఒదిగి వుండా’లంటారు పెద్దలు. నూట పాతికేళ్ళ పార్టీ తమదనీ, తాము ఏం చేసినా చెల్లుతుందనీ సోనియాగాంధీ- అతి విశ్వాసంతో, అహంకారంతో, మొండితనంతో తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా నెహ్రూ ఏర్పరచిన ఆంధ్రప్రదేశ్‌ను, అత్త ఇందిరాగాంధీ కలిపే వుంచిన రాష్ట్రాన్ని తన స్వార్థప్రయోజనాలకోసమన్నట్లుగా పూనుకుని విడగొట్టడం అహంకారం కాక మరేమిటి? అందువల్ల సాధించింది ఏముంది చెప్పు? తెలుగు వారయినా తెలంగాణావారే ఆమెకు కృతజ్ఞతలు ప్రకటించని సంబురాలు చేసుకున్నారు. తెలుగుతల్లికి అన్నదమ్ములను విడగొట్టి కడుపుకోత కలిగించిందని సీమాంధ్రులు ఆర్తితో ఆవేశపడ్డారు. ఇంతచేసీ ఆవిడ బావుకున్నదేమిటి?’’ అన్నాడు ప్రసాదు.
‘‘తల నిటారుగా నిలపలేదు. మెడ వంచుకోక తప్పడంలేదు. ‘చెయ్యి’ ఆసాంతం లాగేస్తోంది. క్యాన్సరే అనుకుంటే ఈ స్థితి అంతకన్నా కృంగదీసేస్తోంది. ఐ పిటీ హర్, అండ్ హర్ పార్టీ! ఈ క్షోభ పగవాడికి కూడా వద్దు’’ అన్నాడు రాంబాబు లేస్తూ.
6 comments:
తాము ఏం చేసినా చెల్లుతుందనీ సోనియాగాంధీ- అతి విశ్వాసంతో, అహంకారంతో, మొండితనంతో తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా నెహ్రూ ఏర్పరచిన ఆంధ్రప్రదేశ్‌ను, అత్త ఇందిరాగాంధీ కలిపే వుంచిన రాష్ట్రాన్ని తన స్వార్థప్రయోజనాలకోసమన్నట్లుగా పూనుకుని విడగొట్టడం అహంకారం కాక మరేమిటి? అందువల్ల సాధించింది ఏముంది చెప్పు?
నిక్కము
మీ స్పందనకు ధన్యుడిని అనిల్ గారూ!
ఉన్నదీ పోయింది, ఉంచుకున్నదీ పోయింది
>>
శివ శివా! అశ్లీలం అశ్లీలం? యేమిటీ దుస్థితి?!
సామెత సామెతే మరి హరిబాబు గారూ!
ఈ మధ్యనే సొంత వూరు వెళ్ళా.పక్క వూళ్ళో మా మామయ్య ఒకాయన వున్నారు.ఆయన యెంత కాంగ్రెసు ద్వేషి అంటే జలగం వెంగల రావుని గెలిపిస్తున్నారని ఖామ్మం జిల్లాని ఖర్మం జిల్లా అంటుంటారు.మాటల మధ్యన చాలా కసితో ఆణిముత్యం లాంటి ఒక సుభాషితం చెప్పారు.ఆ బోగం రాజు కాంగ్రెసు చరిత్ర సగమే రాసాడు.త్వరలోనే పూర్తవుతుంది."అఖిల భారత జాతీయ కాంగ్రెసుకి మొదటి, ఆఖరి అధ్యక్షులు విదేశీయులే" అనే ఆఖరి వాక్యం తో దాని చరిత్ర ముగుస్తుంది - అని!
మీ మామయ్య అన్న మాట యదార్థమయ్యే పరిస్థితులే కానవస్తున్నాయి హరిబాబు గారూ!
Post a Comment