ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, May 30, 2014

మారిన గుర్తింపు


"‘సమాజంలో ఒక అవసరం, ఒక సందర్భం సాహిత్య సృజనకు హేతువు కావచ్చు. సమకాలీన సామాజిక స్పృహ లేకుండా సార్వకాలిక విలువలకు కట్టుబడి రచనలు చేసేవాడే గొప్ప అని నేనూ అనడం లేదు. కానయితే ఆ అవసరం, ఆ సందర్భం తీరాక ఆ సృజనకారుడు తనను తాను సార్వకాలిక, సమష్టి విలువలవైపు మరల్చుకుని కలం సాగించలేకపోతే చరిత్రలో మహా అయితే ఆ ఒకప్పటి సమయ సందర్భాల ప్రసక్తి వచ్చినపుడు తలుచుకోబడతాడేమోగానీ లేకుంటే విస్మృతిలోకే జారిపోతాడు. అదీకాక తన సృజన కేవలం ఉద్యమ వేళలోనే అయితే అది సమగ్ర రచనా వ్యక్తిత్వం కాజాలదు. గత కాలపు కీర్తిబరువుతో ఎవరూ ఎం తోకాలం మనలేరు..’’ అన్నాడు రాంబాబు.

‘‘నువీ మాట ఎందుకంటున్నావో నాకర్థం అయింది. ప్రాంతీయ అస్తిత్వం పేరుతో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో కవులుగా పుట్టుకొచ్చిన వారున్నారు. ఉద్యమ ఆవేశంతో సాటి సోదరులనే తిడుతూ, అవహేళన చేస్తూ, నిజానికి వారి సాంగత్యం కారణంగా లాభపడిన అంశాలను తుంగలో త్రొక్కి అసూయతో, ఈర్ష్యతో, తమ అణచివేతకు హేతువన్న ఆక్రోశంతో రచనలు చేసినవారున్నారు. వారికి ప్రాంతీయతే ప్రధానం ఉద్యమ స్ఫూర్తే ప్రధానం. అందులో తప్పుపట్టడానికి ఏం వుందనుకోను. కానీ తెలంగాణ రాష్ట్రం సాధించాక కూడా తమ ప్రాంత పునర్నిర్మాణ ఆకాంక్షతో ప్రణాళికాబద్ధ కవిత్వం అల్లితే బాగుంటుంది కానీ ఇంకా ఆంధ్ర సోదరులను, కవులు రచయితలు సాహితీవేత్తలను నిరసిస్తూ తమ ప్రాంతం ప్రముఖుతో తులనాత్మకం చేసుకుంటూ అవతలివారి ఘనతను ఇప్పుడేదో తగ్గించాలని ఆత్రపడే సాహిత్య సృజన చేయడం అసమంజసం. తిక్కననూ, పోతననూ శ్రీశ్రీని కాళోజీని పరస్పరం బేరీజు వేస్తూ తమవాడే గొప్ప అన్నట్లు ప్రతిపాదించే రచన చేయడం అవసరమా? తమ విస్మృత కవుల గురించీ, రచయితల గురించీ ఒక ప్రాంత వైభవ ప్రాభవాల గురించి సంకలనాలు రావడం మంచిదే. అందువల్ల సాహిత్య చరిత్రకు సమగ్రత వస్తుంది. కానీ ద్వేషపూరిత వైఖరి, జరిగిపోయిన దానిని పదే పదే త్రవ్వుతూ ఇంకా రెచ్చగొట్టే ధోరణి సబబు కాదు. జూన్ రెండు నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడివిడిగా అస్తిత్వంలోకి వస్తున్నాయి. ఆ రాష్ట్రంలో వున్నదీ తెలుగువారే. ఈ రాష్ట్రంలో వున్నదీ తెలుగువారే. తెలంగాణ ఇచ్చానన్న పార్టీని కాక, తెచ్చామన్న తమ ఉద్యమ పార్టీనే గద్దెనెక్కించుకుని విజ్ఞత ప్రదర్శించినందుకు ఎంతయినా అభినందనీయం. ఇక స్వపరిపాలనను ఎలా సాగించుకు పురోభివృద్ధి సాధించాలో సామాజిక తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చుకోడానికి తాము కలసికట్టుగా ఏం చేయాలో తెలంగాణ కవులూ, రచయితలూ కూడా సృజన పథంలో సమాయత్తం కావాలి తప్ప ఇంకా ఆంధ్రప్రదేశ్‌పై విద్వేషం పెంపు చేసుకోవడం వివేకం కాదు’’ అన్నాడు ప్రసాదు.

‘‘అది నిజమే! ఇప్పుడు అన్నీ రెండుగా అవుతాయి. భాషా సాంస్కృతిక శాఖ కూడా ఎవరిది వారిదే. తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ కూడా రెండుగా చేస్తారేమో తెలియదు. ఇపుడు రవీంద్రభారతిలో ఆంధ్రుల కార్యక్రమాలు జరగకూడదనీ ఆంధ్ర సారస్వత పరిషత్తు బదులు తెలంగాణ సాహిత్య పరిషత్తు అవ్వాలని అంటున్నవారు బయలుదేరారు. ఇన్నాళ్లూ రాష్ట్రంలో, కేంద్రంలో సాహిత్య అవార్డులు, గుర్తింపుల పంపకంలో ప్రాంతీయం పేరుతో తెలంగాణకు ఒక విధిగా కేటాయింపు జరిగిన సందర్భాలున్నాయట. సరే! ఎవరి అకాడమీలు, పరిషత్తులు వారు విడివిడిగా ఏర్పరచుకుని తమ అకాడమీ బహుమతులు తమవారికే ఇచ్చుకోవడం ఒక పద్ధతి. అలాకాక సాహిత్య సృజనకు ప్రాంతీయతలు హద్దులు కావనీ, ప్రతిభ ఎక్కడవున్నా గౌరవించుకోవాలని అనుకునేట్లయితే తెలంగాణలో జరిగే పోటీల్లో బహుమతులకు ఆంధ్ర ప్రాంత కవులు రచయితలనూ, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పోటీల్లో బహుమతులకు తెలంగాణవారిని కూడా పరిశీలించి, ప్రతిభ ప్రాతిపదికగా ఎంపిక చేసి గౌరవించుకోవడం విజ్ఞత అవుతుంది. పత్రికలు కూడా తెలంగాణ పత్రికలు, ఆంధ్ర పత్రికలు అని విభజించుకుని ఆయా పత్రికల్లో ఆయా ప్రాంత రచయితల రచనలే ప్రచురిస్తారేమో తెలీదు. ఏమయినా ఒక సందిగ్ధ, సంక్షోభ అపసవ్య ధోరణులు సాహిత్య ప్రపంచంలోనూ తలలెత్తుతున్నాయన్నది విచారించదగిన విషయం. తెలంగాణ కవి, రచయిత అని ఒక ప్రతిభావంతుడిని నిరాదరించడం, ప్రతిభ లేకున్నా ఓ ఆంధ్ర ప్రాంత వ్యక్తిని తలకెత్తుకోవడం జరిగిందని అనుకోలేం. నిజమైన ప్రతిభావంతుడికి అడ్డులేదు. ‘గుర్తింపు’ అంటారా! అది ఎవరికి ఎలా వస్తుందో కొలమానాలు వుంటాయి మరి! ఈ ఎన్నికల్లో సాధించుకున్న ఓట్ల శాతంతో వై.ఎస్సార్.సి.పి ‘ఎలక్షన్ కమిషన్’ గుర్తింపు పొందింది. అలాగే ఇన్నాళ్లూ ప్రాంతీయ పార్టీగా వున్న తెలుగుదేశానికి ‘జాతీయ పార్టీ’ గుర్తింపు లభించింది’’ అన్నాడు శంకరం.

‘‘సిఫార్సులతో, పైరవీలతో పెద్ద పెద్ద గుర్తింపులు అవార్డులు పొందినవారున్నారు. అది జనానికి తెలుసు. ఎవరు ఎంత అరచి గీపెట్టి ప్రచారార్భటి చేసుకున్నా జనం వారికి తమ మనసులో ఎంత స్థానం ఇవ్వాలో ఎలా భావించాలో అలానే చేస్తారు. నిజమే! ఒక్కసారి ప్రతిభావంతులకు గుర్తింపు లేక పైరవీలతో, సిఫార్సులతో, ప్రాంతీయ ముద్రలతో, కులముద్రలతో ఉన్నత స్థానాలు అవార్డులు, గుర్తింపులు దక్కించుకున్నవారుండవచ్చు. దానికి ఈ శతక పద్యమే నాకు గుర్తొస్తోంది.

"పండితులైనవారు దిగువం దగ నుండగ నల్పుఁడొక్కఁడు
ద్ధండతఁ బీఠమెక్కిన బుధప్రకరంబుల కేమి యెగ్గగున్
కొండక కోతి చెట్టు కొన కొమ్మల నుండగఁ గ్రింద గండ భే
రుండ మదేభ సింహ నికురుంబము లుండవే చేరి భాస్కరా!’’
అంటూ లేచాడు ప్రసాదు.2 comments:

sarma said...

అసూయ ద్వేషాలు రాజ్యమేలినంత కాలం ఇంతే. కోపమున బుద్ధి కొంచమై యుండును

సుధామ said...

మీ స్పందనకు ధన్యవాదాలు భాస్కర శర్మగారూ!