ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, May 23, 2014

సమీక్షా కాలం



‘‘ ‘ఓడిపోయినవాడు బాహాటంగా ఏడిస్తే- గెలిచినవాడు ఇంటికెళ్ళి ఏడ్చాడని’ ఓ సామెత! సరే నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయన్నది వాస్తవం. తమ ఓటమికి కారణాలేమిటని ఓ పక్క సమీక్షా సమావేశాలయితే మరోపక్క ఎవరూ ఏడ్చిపోకుండా ప్రభుత్వం ఏర్పరచడం ఎలా అని గెలిచిన పార్టీ అధినేతల కసరత్తు మొత్తానికి ఓ రకంగా ఇది ‘సమీక్షా కాలం’’ అన్నాడు శంకరం.

‘‘గెలుపులో కూడా ఉద్వేగం ఉంటుందోయ్! అందునా అనూహ్య విజయం అయినప్పుడు మరీను! ‘మోడీగాలి’ వుందని అనుకున్నమాట నిజమేగానీ, ఎవరి మద్దతు అవసరం లేకుండా స్వయంగా ప్రభుత్వం ఏర్పరచగల సత్తా తమకు లభిస్తుందని బి.జె.పి.యే ఊహించలేదు కదా! ‘మోడీ కృప’ అని అద్వానీ అంటే అందుకు మోడీ అలా అనవద్దని తనకు పార్టీ కూడా భారతమాత లాగా తల్లిలాంటిదనీ అంటూ ఉద్వేగానికి గురిఅయ్యారు. తొలిసారి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లోకి ప్రవేశించేముందు అక్కడి మెట్లకు మోడీ తలవంచి నమస్కరించడం ఎందరినో కదిలించివేసింది. విజయానికి అహంకరించకుండా కేవలం బి.జె.పి.తో కాక ఎన్.డి.ఏ. మిత్రపక్షాల సహకారంతోనే క్యాబినెట్ ఏర్పరచి ప్రభుత్వం నెరపాలన్న ఆయన వివేక వినయాలు విజ్ఞతతో కూడుకున్నవే మరి.’’ అన్నాడు ప్రసాదు.


గెలుపు ఓటములనేవి సహజం. అయితే ఓటమికి కారణాలను విశే్లషించుకోవడం మంచిదే. అయితే ఓటమికి ప్రత్యేకించి నువ్వు కారణం అంటే నువ్వని నిందించుకునే ఆవేశాలకు గురికావడం సరికాదు. కానీ తెలంగాణ, సీమాంధ్రలలో పార్టీ ఓటమి కారణాల కాంగ్రెస్ సమీక్షా సమావేశం మొన్నటికి మొన్న గాంధీభవన్‌లో జరిగినప్పుడు ఓటమికి పై స్థాయి నాయకులు వాస్తవాలు చెప్పడం లేదంటూ కార్యకర్తలు మండిపడి చెలరేగిపోవడం చూశాం. ఏళ్ళతరబడి కార్యకర్తలకు అన్యాయం చేశారంటూ కొందరు పొన్నాల, రాజనర్సింహ, ఉత్తమకుమార్‌లపై ముప్పేట దాడి చేశారు కూడాను. పి.సి.సి ఛీఫ్ పదవిలో వుండి పొన్నాల, ప్రచార కమిటీ ఛైర్మన్‌గా వుండి రాజనర్సింహ ఓడిపోవడం సిగ్గుచేటని దుర్భాషలాడారు. సోనియా, రాహుల్‌ని ఏమీ అనలేరు కదా! ఎలాగయితేనేం వారిద్దరూ కనీసం గెలిచారు. రాష్ట్ర విభజన విషయంలో నానా హడావుడి చేసి అప్పుడు ప్రముఖంగా కనబడిన గులాంనబీ అజాద్, సుశీల్‌కుమార్ షిండే, దిగ్విజయ్‌సింగ్ వంటివారు పోటీచేసిన చోట ఘోర పరాజయం పాలు కావడానికి తెలుగువారిని విభజిస్తూ వారు చేసిన అన్యాయమే కారణమనీ, ఆ పాపమే వారిని పట్టి కుదిపిందనీ బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్న వారున్నారు. నిజానికి ఈ సమీక్ష ఆత్మవిమర్శకు దారితీయగలగాలి. తాము ఏం చేసినా చెల్లుతుందనే అహంకార పూరిత వైఖరే కాంగ్రెస్ అధిష్ఠానాన్ని దెబ్బకొట్టి దేశంలో పార్టీకి పుట్టగతులు లేని స్థాయిని తెచ్చి పెట్టాయి అని గుర్తించాలి. అసలు తె.రా.స తన అస్తిత్వం వదులుకుని కాంగ్రెస్‌లో విలీనమై గెలుపును వెండిపళ్లెంలో పెట్టి తమకు అప్పగిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎలా అనుకుందో అనూహ్యం కదా! తెలంగాణ తెచ్చిన ఘనతను వదులుకుని, ఇచ్చిన పార్టీకి విలీనం పేర పూర్తిగా లొంగిపోతుందని తె.రా.స. గురించి కాంగ్రెస్ పార్టీ భావించడమంత బుద్ధితక్కువ పనే వేరొకటి లేదు. ఆ తప్పుడు ఊహలతోనే బోర్లపడి మళ్ళీ లేవలేనంత దెబ్బతింది కాంగ్రస్ అన్నది సత్యం. అన్నాడు శంకరం.


‘‘తెలంగాణలో కూడా టి.డి.పి. కాంగ్రెస్‌కు దగ్గరగా ఇరవై సీట్లు గెలుచుకోవడం సామాన్యమైన సంగతేమీ కాదు. మరో రెండు సీట్లు అదనంగా వచ్చి వుంటే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం టి.డి.పి. అయ్యేది. అయితే విచిత్రంగా- తెలంగాణ సాధించుకున్న తె.రా.స. ప్రభుత్వపు కొలువు కూటమిలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం కావడం జరుగుతోంది. విలీనం చేయడం పోయి, తమ చిరకాల వాంఛనీడేర్చిన పార్టీనే ప్రధాన ప్రతిపక్షంగా నిలుపుకోవడం తె.రా.సకు ఏం మేలు చేకూరుస్తుందో తెలీదు. రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ సీమాంధ్రలో ముఖ్యమంత్రి హోదాకి గెలిచి, తెలంగాణలో ఇరవై సీట్లదాకా సాధించిన చంద్రబాబు తెలుగుదేశం 2019 నాటికి తెలంగాణలో తమదే ప్రభుత్వం అంటూ తెలంగాణ పునర్నిర్మాణానికి తాము కట్టుబడి వున్నామనడం చూస్తే సీమాంధ్రలో ఒక్క సీటూ రాక చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం స్థాయికి వచ్చీ చేసేదేముంది అనిపిస్తోంది! కేంద్రంలో ఎలాగూ కాంగ్రెస్ చావుదెబ్బతింది. తె.రా.స. చంద్రశేఖర్‌రావు అయినా ముఖ్యమంత్రిగా ఇప్పుడు కేంద్రంలో ప్రధాని మోడీతో సయోధ్యతో ఉండి తీరవలసిందే. 


అయితే ఇప్పుడు రెండుగా విడిన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఆ ముఖ్యమంత్రులు, కె.సి.ఆర్, చంద్రబాబుల మధ్య తమతమ రాష్ట్రాల అభివృద్ధిలో ఓ పోటీతత్వం అనివార్యంగా వుండే పరిస్థితి! నిజంగా చంద్రబాబు తన ప్రణాళికలతో సీమాంధ్రను త్వరితగతిన అభివృద్ధి పరుస్తూంటే దానితో పోల్చుకుని తెలంగాణలో కె.సి.ఆర్ కూడా ప్రగతిని వేగవంతం చేయాల్సిందే. లేకపోతే ప్రజలు మళ్ళీ నైరాశ్యానికి గురిఅవుతారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల సత్వర పురోభివృద్ధి త్వరితగతిన జరగడం ముఖ్యం. చంద్రబాబు, కె.సి.ఆర్‌ల మధ్య కూడా పరస్పర సయోధ్య వుండాలి. ముఖ్యమంత్రులుగా తమతమ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతూనే, మొత్తం తెలుగువారినీ, తెలుగుజాతిని పురోగమింపచేయవలసిన బాధ్యత ఇరువురి మీదా వుంది. వైషమ్యాలు, కక్షలు, కార్పణ్యాలు లేక తెలుగువారంతా ఏ రాష్ట్రంలో వున్నా మానసికంగా ఒక్కటే అన్న భావన ప్రబలంగా పెరగాలి. ‘‘అవతలివాడు త్వరగా బాగుపడిపోతున్నాడు తన స్థితి ఇంకా బాగులేదు’’ అన్న ఊహ ఏ ప్రాంతపు తెలుగువాడిలోనూ కలగకూడదు. అది ముఖ్యం. ఈ సమీక్షా కాలంలో జరగవలసింది- సంయమనంతో కూడిన సహకార ప్రాతిపదికపు అభివృద్ధి అన్నది గెలిచిన పార్టీలూ, ఓటమికి క్రుంగని స్థిరచిత్తంతో క్రియాశీలక ప్రతిపక్ష పాత్ర పోషించాలని విపక్షాలూ గుర్తించాలి. అదీ అవసరం’’అంటూ లేచాడు రాంబాబు.


2 comments:

kaartoon.wordpress.com said...

మిత్రులు శ్రీ సుధామగారు చాలా చక్కగా విపులంగా చెప్పారు. ధన్యవాదాలు

సుధామ said...

నా బ్లాగ్ లో మీరు వ్యాఖ్య రాయడం చాలా ఆనందం కలిగించింది అప్పారావ్ గారూ! చాలా చాలా ధన్యవాదాలు