ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, May 16, 2014

ఫలితాలకు ఫలితాలు'ఆలులేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడని ఒక సామెత. అలాగ పాపం! రాజకీయ పార్టీల అధినేతలు కొందరు తమదే గెలుపు అనీ, ప్రభుత్వం తామే స్థాపిస్తామనీ ఆశపడుతూ- అప్పుడే తాము ఏర్పరచబోయే మంత్రివర్గం గురించి ‘కేబినెట్ కసరత్తు’లు మొదలుపెట్టారట’’ అన్నాడు ఎగతాళిగా ప్రసాదు.

‘‘అందులో తప్పేముందోయ్! ముందస్తు ప్రణాళికలు మంచివేకదా! ఇవాళ సాయంత్రానికి ఫలితాలు మొత్తం తెలిసేదాకానే కదా ఎవరెంత ఆశల పల్లకీలో ఊరేగగలిగిందీనూ! అందులో భాగమేననుకో కేబినెట్ ఎలా ఎవరితో ఏర్పరచాలన్న ఆశలు కూడాను. గెలిస్తే వేసుకున్న ప్రణాళిక వుంటుంది కాబట్టి అమలు చేయడం సులభం అవుతుంది. అలాకాక ఆశలు నీరుగారుతూ ఓటమి పాలయ్యారనుకో కనీసం ఊహల్లోనయినా ఆనందం అందుకున్న క్షణాలు మిగులుతాయి కదా! పైగా ‘సర్వే’లని మొత్తానికే కొట్టిపారేయలేం కదా! కొంతలో కొంతయినా నిజం కావచ్చు. మొత్తం బోల్తాపడితే అది వేరు విషయం. కానీ, అంచనాలు కొంతమేరకయినా వాస్తవం రూపుదాల్చే వీలుంది. కేంద్రంలో ఎన్.డి.ఏ ప్రభుత్వం సీమాంధ్రలో టి.డి.పి, తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వాలు ఏర్పరచడం ఖాయం అన్నది సర్వేలు చాలామటుకు సూచిస్తున్న సంగతి. పూర్తి మెజారిటీతో స్వయంగా తామే ప్రభుత్వం ఏర్పరుస్తాయో, లేక ఎవరిదన్నుతోనయినా ఏర్పరుస్తాయో ఇప్పటికే కచ్చితంగా చెప్పలేకపోయినా ఈ పార్టీలకే పాలనావకాశాలు బాగా వున్నాయన్నది ఊహిస్తున్న సంగతి. కేంద్రంలో బి.జె.పి స్వయంగా పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పరచలేకపోయినా ఎన్.డి.ఏ కూటమి పాలన తథ్యం అనే అంతా అనుకుంటున్నారు. అంచేత అటు బి.జె.పి, ఇటు టి.డి.పి, టి.ఆర్.ఎస్. నేతలు తమ తమ ప్రభుత్వాల ‘కేబినెట్ కసరత్తులు’ మొదలుపెట్టడంలో తప్పు పట్టడానికిగానీ, పరిహసించడానికిగానీ ఏంలేదులే’’ అన్నాడు రాంబాబు.


‘ఇంకెంతసేపు? సాయంత్రానికల్లా అటో ఇటో ఎలాగూ తేలిపోతుంది. పూర్తి మెజారిటీలా లేక మద్దతు సమీకరణలా అన్నది స్పష్టమవుతుంది. ఎన్నికల వేడి చల్లారుతుంది. ఇక వాతావరణం మారుతుంది. నైరుతి ఋతుపవనాలు కూడా రేపటిల్లా అండమాన్‌లోకి అడుగుపెడతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు సాధారణంగా మేలో 20వ తేదీనాటికి అండమాన్‌కు, జూన్ ఒకటికి కేరళలోకి ప్రవేశిస్తుంటాయి. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనమో వాయుగుండమో ఏర్పడితే తప్ప అండమాన్‌కు వచ్చే ఋతుపవనాలు కోస్తాపై అంత త్వరగా ప్రభావం చూపబోవని వాతావరణ నిపుణులు చెప్పేమాట. అంచేత దేశవ్యాప్తంగా ఋతుపవనాల విస్తరణలో జాప్యం జరగవచ్చనీ, జూన్ నెల వరకు ఎండల ప్రభావం కొనసాగే అవకాశం ఉందనీ భావిస్తున్నారట కూడాను. రాజకీయ వాతావరణమూ అలాగే కన్పడుతోంది. జూన్ రెండున అధికారికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేర్పాటు ప్రభుత్వాలతో రెండుగా అవుతాయి. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల ఏర్పాటు జరిగి, క్యాబినెట్ ఏర్పడి పాలన ఓ గాడిన పడటానికి కొంత జాప్యం ఎలాగూ తప్పదు. వర్షాలు, హర్షాలు అప్పుడుగాని మొత్తంగా మొదలుకావు మరి!’’ అన్నాడు నవ్వుతూ శంకరం.


‘‘అది నిజమేలే! కానీ చూశావ్! అధికారం ఏ పార్టీలవారిదయినా ప్రభుత్వ యంత్రాంగం మటుకు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు లేకుండా నడవదు కదా! రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐ.ఏ.ఎస్‌ల విభజన కూడా అనివార్యమవుతోంది. వాళ్ళకి ‘ఆప్షన్’ ఇవ్వాలన్న విషయంలో భిన్నాభిప్రాయాలొచ్చాయి. ఐ.ఏ.ఎస్‌ల ‘ఆప్షన్’ గందరగోళంగా వుందిప్పుడు. అఖిల భారత సర్వీసు అధికారులకి ‘ఆప్షన్స్’ ఏమిటని వాదిస్తున్నవారున్నారు. ఆప్షన్లు అడిగినా ఆఫీసర్‌లు ఇవ్వడానికి రెడీగా కనిపించడం లేదుట! అధికారం ఏ పార్టీకో తేలేదాకా చూసి ఎక్కడ వుండేదీ ఆ తర్వాత చెబుదాం అనుకుంటూన్న వారున్నారు. చీఫ్ సెక్రటరీ మహంతి కూడా ఆ అధికారులతో ఇవాళ అంటే మే 16లోగా ఆప్షన్లు చెప్పండి అనీ, ఎటొచ్చీ అవి కచ్చితంగా పాటిస్తారని మాత్రం చెప్పలేరనీ ఒక సర్క్యులరే జారీ చేశారు. ‘‘అదెలా కుదురుతుంది. ఈ సాయంత్రంలోగా ఎలా చెబుతాం. ఫలితాలు మొత్తం వచ్చాక ఏ పార్టీ ఏ ప్రాంతంలో అధికారంలోకి వస్తుందో చూసుకుని అప్పుడు ఆప్షన్లు అడిగితే బాగుంటుంది. కొందరు అధికారులకు కొన్ని పార్టీలతో సమస్యలుండవచ్చు. అంచేత ఆప్షన్లు ఇప్పుడే ఇమ్మంటే ఇబ్బంది అని కొంత గడువును కోరేలా ఒత్తిడి తెచ్చేందుకు నిన్న అధికారులతా ఒక చోట సమావేశమయ్యారు కూడాను. అయితే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డివోపీటీ అఖిల భారత సర్వీసు అధికారులకు ‘ఆప్షన్లు’ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోందిట. కేవలం ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందినవారికి మాత్రమే అంటే ఈ రాష్ట్రంలో పుట్టిపెరిగి ఐ.ఏ.ఎస్‌కు ఎంపికై ఇదే రాష్ట్రంలో పనిచేస్తున్నవారికి మటుకే సీమాంధ్ర, తెలంగాణాల్లో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం కల్పిస్తూ ఇతర రాష్ట్రాలకు చెందిన ఐ.ఏ.ఎస్‌లకు మాత్రం ఈ ఆప్షన్ వర్తింపచేయరాదని భావిస్తోందిట! ఎవరికీ ఎలాంటి ఆప్షన్స్ ఇవ్వకుండా ‘రోస్టర్’ పద్ధతిన కేటాయింపులు జరపాలన్న ఆలోచనా వుందిట. అంటే ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లోని అత్యంత సీనియర్ అధికారిని ‘టాస్’ ద్వారా ముందు ఏదో ఒక రాష్ట్రం కేటాయిస్తారు. ఆయనకు తెలంగాణ వచ్చిందనుకోండి, తర్వాతి అధికారికి ఆంధ్రా కేటాయిస్తారు. ఇలా 13 :10 నిష్పత్తి కేటాయింపు చేస్తారు. అందువల్ల ఎవరికీ ఏ ఇబ్బందీ వుండదు కదా అనీ ఒక భావన వుందిట. అయితే ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదట’’ అన్నాడు ప్రసాదు.


‘‘నువ్వన్నట్లు కేబినెట్ కసరత్తులకన్నా ఈ అధికారుల కేటాయింపుల కసరత్తులు ముఖ్యమవుతాయోయ్ ప్రసాదూ! రాజకీయ అధికారం, ప్రభుత్వ యంత్రాంగం చెట్టపట్టాలేసుకుని ప్రజా సంక్షేమం కోసం కృషిచేసినప్పుడే నిజమైన ప్రభుత్వం నిఖార్సయిన పాలనా వుంటాయి! నేతలకూ, ప్రభుత్వ అధికారులకూ మధ్య ఘర్షణ పెరిగితే మధ్యలో నష్టపోయేది మాత్రం ప్రజలు. అంచేత ప్రజాస్వామ్య వ్యవస్థ సరైన దిశగా పురోగమించడానికి ప్రభుత్వ శకటానికి, రెండు చక్రాలూ పటిష్టంగా సమాన ధర్మంతో వుండాలి. అప్పుడే అసలైన ఫలితాలు. ఫలితాలకు ఫలితాలు’’ అన్నాడు రాంబాబూ లేస్తూ.

0 comments: