ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, April 18, 2014

‘ఒంటరి’పాలన



 



రామరాజ్యం స్థాపిస్తాను’, ‘రామరాజ్యం స్థాపిస్తాను’ అని అధినేతలు అంటూంటారు గానీ, రాముడు సింహాసనం అధిష్ఠించాక, ధర్మం పేరుతో సీతను అడవులపాలు చేశాకే; ఎక్కువ కాలం రాజ్యపాలన చేశాడనుకుంటాను! అధికారంలో వున్నప్పుడు భార్య (ప్రమేయం) లేకపోతేనే, పాలన బాగా సాగుతుందేమో! భార్య సహితంగా పరిపాలన చేయడానికీ, ఒంటరిగా పరిపాలన చేయడానికీ బోలెడు తేడా వుంటుంది కామోసు! అన్న ఎన్టీఆర్‌గారు లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవడానికి ముందు- భార్య లేని ముఖ్యమంత్రే! ఆవిడని పెళ్లాడాకే, ‘పాలనాదక్షత’ మారిపోయింది. ఇప్పుడు ప్రధాని కాబోతారనుకుంటున్న నరేంద్రమోదీ వివాహ విషయమూ ఓ చర్చ అయి కూర్చుంది. ఆయన వివాహితుడే గానీ, భార్యా సహితుడై లేడు. సరే! రాహుల్‌గాంధీయే ప్రధాని అయ్యేట్లయితే, అసలాయన ఇంకా బ్రహ్మచారే! సరే! ప్రస్తుతం ప్రధానిగా వున్న మన్మోహన్‌సింగ్ ఎలాగూ ప్రధానిగానే- ఓ ‘మరబొమ్మ’ అని ముద్రపడ్డాక, పాపం! ఆయన భార్య ప్రమేయం మాటెక్కడిది? ప్రధాని మన్మోహన్‌గారి భార్య- ‘గురుశరణ్ కౌర్’ సిక్కుల కూటమిలో మంచి కీర్తనలు ఆలపించే గాయనిగా ప్రసిద్ధురాలు. జలంధర్ రేడియో ఆర్టిస్టు కూడాను. 1958లో వారికి వివాహం జరిగింది. మన్మోహన్‌సింగ్‌కు నలుగురు మరదళ్ళు, ఓ బావమరిది వున్నారు. మన్మోహన్‌సింగ్ గారికి ఎన్నికల్లో పోటీచేసేంత ‘సీన్’ఏమీలేదు! అంచేత ఆయనదంతా ‘షాడో పాలన’ గానే ఇక అదృశ్యమవుతుందనుకోవాలి’’ అన్నాడు రాంబాబు పేపర్ మడిచి టేబుల్‌మీద పెడుతూ.

‘‘మన దేశానికి ప్రధానమంత్రులుగా పనిచేసినవారి వైవాహిక జీవితాల ప్రస్తావన ఆలోచించదగిందిగా, ఇలా ముం దుకు తీసుకువస్తున్నావన్నమాట! రాంబాబూ! అసలు దేశానికి తొలి ప్రధాని అయిన జవహర్‌లాల్ నెహ్రూగారే- స్వాతంత్య్ర సమరంలో, అందునా సహాయ నిరాకరణ ఉద్యమంలో, స్ర్తిలను సమాయత్తంచేస్తూ పాల్గొని, మద్యానికీ, విదేశీ వస్త్రాలకు వ్యతిరేకంగా పనిచేసి, రెండుసార్లు అరెస్టయిన తన భార్య కమలానెహ్రూనే- ‘‘నేను దాదాపు ఆమెను పట్టించుకోలేదు’’అని ఆత్మకథలోనే పేర్కొన్నారు. 17 సంవత్సరాల ప్రాయంలోనే ఆమెకు వివాహం అయింది. 1917లో నెహ్రూ, కమల దంపతులకు ‘ఇందిరాప్రియదర్శిని’ పుట్టింది. కమలానెహ్రూ 1936 ఫిబ్రవరి 28న స్విట్జెర్లెండ్‌లో టీ.బీ.వల్ల మృతి చెందారు. అప్పుడు ఆమె వెంట కూతురు, అత్తగారు వున్నారు గానీ- నెహ్రూ లేరు. ఇందిరతో ఫిరోజ్‌గాంధీ వివా హ ప్రస్తావన 1933లోనే వచ్చిందట గానీ, అప్పుడు ఇందిర, ఆమె తల్లి కమలయే తిరస్కరించారట! అయితే ‘్ఫరోజ్‌గాంధీ’ ఆ తరువాత- కమలానెహ్రూ అనారోగ్య సమయంలో ఎంతో సహాయంచేశాడు. ఆమె పోయినప్పుడు అతనూ అక్కడే వున్నాడు. చివరకు 1942 
మార్చి26 న ఇందిరతో వివాహం జరిగింది. అది నెహ్రూకి ఇష్టంలేదంటారు. గాంధీగారే సర్దిచెప్పారట! మామగారు స్థాపించిన.. ‘ది నేషనల్ హెరాల్డ్’పత్రిక మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తొలి ఛైర్మన్‌గా, ‘్ఫరోజ్ జహంగీర్‌గాంధీ’ అల్హాబాద్‌లో వుంటూ- రాయ్‌బరేలీ నుంచి పార్లమెంట్ మెంబర్‌గా మే 1952నుండి ఆగస్టు 1960వరకూ వున్నారు. 1958లో ఫిరోజ్‌కు మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు- ఇందిరాగాంధీ తండ్రితో, విడిగా దూరంగానే వుంది. 1960 సెప్టెంబర్ 8న గుండెపోటుతోనే ఫిరోజ్ మరణించాడు. ఇంతకీ చెప్పవచ్చేదేమిటంటే- జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా చేసినప్పుడూ, ఆయన కూతురు ఇందిరాగాంధీ ప్రధానిగా చేసినప్పుడూ వారు ‘జీవిత భాగస్వాములు’లేనివారే! అంటే- ఒంటరిగాళ్ళే! నెహ్రూగారు పదహారేళ్ళ రెండువందల ఎనభై ఆరు రోజులూ, ఇందిరాగాంధీ మొత్తం రెండు పర్యాయాలూ పదిహేను సంవత్సరాల మూడువందల యాభై రోజులూ ప్రధానిగా పరిపాలన సాగించారు. మరి మిగతా ప్రధానుల సంగతి నువ్వే చెప్పాలి’’ అన్నాడు ప్రసాదు.

‘‘ప్రధానిగా పనిచేసిన మన పి.వి.నరసింహారావుగారు కూడా తన భార్య ‘సత్యమ్మారావుగారిని 1970ల్లోనే కోల్పోయారు. ముగ్గురు కొడుకులు, అయిదుగురు కూతుళ్ళను ఆవిడ ఆయనకు ప్రసాదించింది గానీ- ఒక్క పి.వి.రంగారావు, రాజేశ్వరరావు తప్ప మిగతావారు ‘రాజకీయం’ అంటనివారే! నెహ్రూగారు పోయినప్పుడూ, లాల్‌బహదూర్‌శాస్ర్తీ పోయినప్పుడూ రెండు పర్యాయాలు, ‘పక్షం’ రోజులకు మించిన తాత్కాలిక ప్రధానిగా చేసిన- గుల్జారీలాల్‌నందా భార్య పేరు- లక్ష్మీనందా. పంజాబీ హిందూ. వారికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. తన నూరవ ఏట- కూతురు దగ్గరే- 1998లో మరణించిన నందాగారికి, ప్రభుత్వం ‘భరతరత్న’ ప్రకటించిన విషయం కూడా చాలామందికి తెలీదు! లాల్‌బహదూర్ శాస్ర్తీ మాత్రమే భార్యాసహితునిగా ప్రధాని పదవిని ఏడాది 216 రోజులు నిర్వహించగా, చనిపోయేనాటికి ఆస్తులంటూ ఏమీ కూడబెట్టలేదు. ఆయన పోయాక ‘లలితాశాస్ర్తీ’గారు ఒంటరిగా నిరాడంబర జీవనమే గడిపారు. అలాగే మొదటి కాంగ్రెసేతర ప్రధాని ‘మొరార్జీదేశాయ్’ నూరేళ్ళ ప్రాయంవరకూ వున్నారు. ఆయనకు ఆరుగురు సంతానం అంటారుగానీ, ఆయన భార్య వివరాలు తెలియనే తెలియవు. భార్యా సహితుడైన ప్రధాని అంటే రాజీవ్‌గాంధీ! అయిదేళ్ళ ముప్ఫైరెండు రోజుల ఆయన పాలనలో, నిజానికి కుటుంబం వెన్నంటి వుంది గానీ, ఆయన మరణంతోనే ‘సోనియా’ రాజకీయరంగ ప్రవేశం చేశారు. తన మామగారయిన ఫిరోజ్‌గాంధీ నియోజకవర్గం ‘రాయ్‌బరేలీ’నుంచి, 2004, 2009ల్లో ఆవిడ పార్లమెంట్‌కు ఎన్నికవడం విశేషం! కానీ ప్రధాని పదవిని త్యాగంచేసి, మన్మోహన్‌ను అడ్డంపెట్టుకు పాలన చేసిందావిడేగా! ఐ.కె.గుజ్రాల్ భార్య షీలాగుజ్రాల్, చంద్రశేఖర్ భార్య దూజాదేవి, దేవగౌడగారి భార్య చెన్నమ్మ, వి.పి.సింగ్‌గారి భార్య సీతాకుమారి. భార్యాసహితులుగా వీరి ప్రధాని పదవీకాలం అత్యంత తక్కువకాలం-అంటే ఏడాదిలోపే మరి అందరిదీను! బి.జె.పి. ప్రధాని వాజ్‌పేయ్‌గారు మళ్ళీ- ‘బ్రహ్మచారి’గా ఒకసారి పదహారురోజుల ప్రధానిగా వున్న, ఆ తరువాత ఆరేళ్ళ అరవై నాలుగు రోజులు సమర్థపాలన ఇచ్చిన ప్రధానిగానే పేరొందారు.’’ అన్నాడు రాంబాబు.


‘‘ పాలనలో భాగస్వామి ప్రమేయం, అస్తిత్వముద్ర లేనప్పుడే- నిర్ణయాలు తీసుకోవడంలో, పరిపాలించడంలో స్వయం సమృద్ధి, స్వయంశక్తి ఉంటాయని ఋజువైన చరిత్రగా భావించే వాళ్ళున్నారు. మరి మున్ముందు సంగతి అంటావా? నందోరాజా భవిష్యతి యే!’’ అని నవ్వుతూ లేచాడు ప్రసాదు.


0 comments: