ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, March 29, 2014

ఒంటరి(గా)పోరు!

‘‘ ‘మాకు తగిన బలం వుంది. ఒంటరి పోరుకు మేం సిద్ధం’ అంటూనే ప్రతి పార్టీ, పొత్తులకోసం ఎందుకు వెంపర్లాడుతుందంటావ్? పైగా ‘మాతో ఎవరైనా పొత్తుకు వస్తే అభ్యంతరం లేదు మేం మాత్రం అడగం’ అన్నట్లు ఫోజు ఒకటి!’’ అన్నాడు ముఖం చిట్లిస్తూ ప్రసాదు.

‘‘అదే మరి రాజకీయం! దీనినే ‘ఎత్తుగడ’ అంటారు. అన్ని స్థానాల్లో తాము గెలవలేమన్న సంగతి పార్టీలకన్నింటికీ తెలుసు. తాము గెలవగల తావుల పట్ల అవగాహన కొంత, గెలవాలనుకుంటున్న చోటు పట్ల ఆశా వుంటాయి. తమకు అక్కడ పోటీకి సీటు వదిలిపెట్టి, ‘పొత్తు పార్టీ’ వారు తమ విజయానికి ప్రచారం చేస్తే తప్ప సునాయాసంగా గెలవడం సాధ్యంకాదన్న సందేహం వుంటుంది. తాము గెలిచే అవకాశం వున్నచోట పొత్తు పార్టీ అభ్యర్థికి ప్రచారంచేసి గెలిపించడం, తనకు విజయావకాశాలు అంతగా లేని స్థానంనుంచి పొత్తుల కారణంగా పోటీ చేయాల్సిరావడం ఎందుకు ఇష్టంగా వుంటుంది? అందువల్ల పొత్తులు ఏర్పడడానికి ప్రధాన సూత్రం ‘సీట్ల సంఖ్య’, ‘సీట్ల సర్దుబాటు’ అవుతోందే కానీ పార్టీల ఆదర్శాల మధ్య ఏకతాధోరణి కాదు. సరే! ఏ పార్టీ మానిఫెస్టో అయినా ప్రజాసంక్షేమం అనే ఊదరగొడుతుంది. చేసే వాగ్దానాలలో, గుప్పించే హామీలలో ఏకత్వం పెద్ద విశేషం కాదు. ఇంతకీ పొత్తు అంటే పరస్పరం సీట్లసర్దుబాటు అక్కడ గెలుపుకు పరస్పరం ప్రచారం చేసుకు సహకరించుకోవడం అంతే! అందువల్ల ఎవరికి ఎవరితోనైనా పొత్తుకుదరవచ్చు. ఏ పార్టీకూడా ఎవరికీ శాశ్వత శత్రువు కాదు. మిత్రమూ కాదు.’’ అన్నాడు శంకరం.


‘‘అంతేనయ్యా! కాంగ్రెస్, బి.జె.పి. ప్రధాన ప్రత్యర్థి పార్టీలు అనుకుంటాం. అలాంటప్పుడు ఏండ్లుగా కాంగ్రెస్‌లో వున్న వాళ్లు ఆ పార్టీ సిద్ధాంతాలు ఒంటబట్టించుకుని ఎట్టి పరిస్థితులలోనూ బి.జె.పి.లోకి వెళ్ళాలనుకుంటే పొరపాటే మరి. ‘మోడీ’ మాహాత్మ్యం ఏమోగానీ ఇప్పుడు మొన్నటిదాకా రాష్ట్రంలో మూడునాలుగు సీట్లు తప్ప అతీగతీ లేని బి.జె.పి. ఒక బలమైన శక్తిగా భ్రమకొల్పుతోంది. పురందేశ్వరి వంటివారు కాంగ్రెస్‌నుండి అందులోకి వలసపోయారు. వెంకయ్యనాయుడికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి సీమాంధ్ర నుంచి బి.జె.పి. ఒంటరిపోరు చేయగలనన్న గొప్ప ధీమా వ్యక్తీకరించగలననుకుంటోంది. తెలంగాణా సాకారం కావడానికి పార్లమెంట్‌లో తమ మద్దతు హేతువనీ అందువల్ల తెలంగాణలో కూడా ఒంటరి పోరుకి సిద్ధంకాగలననీ తలపోస్తోంది. కానైతే సీమాంధ్రలో టి.డి.పి తెలంగాణలో టి.ఆర్.ఎస్. పొత్తులవల్ల తాను లాభపడగలనని తెలిసీ తమతో పొత్తు పెట్టుకుంటే అవి లాభపడతాయని ఊరిస్తోంది. పొత్తు అంటే పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం. పొత్తు అంటే పరస్పర సామరస్య అవాహన. పొత్తు అంటే పరస్పర సహకారం. పొత్తు అంటే గెలుపుని షేర్ చేసుకోవడం.. పొత్తు అంటే కలిసి పనిచేయడం. పొత్తు అంటే విలీనం కాదు. బయటినుంచి మద్దతూ కావచ్చు. ఎటొచ్చీ ముందు కలిసి ప్రభుత్వం ఏర్పరచగల స్థాయి తెచ్చుకోవడం. అయితే తమాషాగా ఈ పొత్తులోకూడా సమానతకంటే ఒకరి ఆధిక్యమే ద్యోతకమవుతూంటుంది. ‘నువ్వు దంచుతూ వుండు. నేను భుజాలెగరేస్తాను’అన్న చందాన పొత్తుల్లో ఒకరు పనిచేసేవారుగా ప్రధానంగా వుండగా ఇంకొకరు పెత్తనంగా కాకున్నా స్పెక్టేటర్ అంటే సాక్షీభూతంగా నిలుస్తూంటారు. తాము చెప్పినట్లు వినేవారితో పొత్తు అని ఒక పార్టీ అంటే తాము అడిగింది ఇచ్చే వారితోనే పొత్తు అని ఇంకో పార్టీ అంటుంది. పొత్తులు కుదరడం కూడా ఆషామాషీ వ్యవహారం కాదు. ‘‘రెండు మొక్కజొన్న పొత్తులున్నయ్ తిందువా!’’అని పాడుకున్నంత సునాయాసం కాదు అన్నాడు సన్యాసి కూడా సంభాషణలో తలదూరుస్తూ.


‘‘అది కాదర్రా! ఎప్పటినుంచో రాజకీయ రంగంలో వున్న పార్టీలు పొత్తుల విషయంలో వ్యవహరించే వైఖరి సరే! అట్టహాసంగా గొప్ప మార్పు తెచ్చేస్తామనీ, ప్రజాచైతన్యంతో నూతన వ్యవస్థను నెలకొల్పుతామనీ కొత్త పార్టీలు ప్రకటించే మహానుభావులు మరి ఎవరిమీదా ఆధారపడక గొప్ప మార్పు తమదైన ఆలోచనా విధానంతో తేగలగాలి కదా! చిత్రంగా రాష్ట్రంలో ఏర్పడుతున్న కొత్త పార్టీలన్నీ ఈసరికే వున్న పార్టీలకు వేటికో పొత్తు పార్టీలుగా (కొండొకచో ‘తొత్తు’పార్టీలుగా కూడా) ప్రజలలో భావన నెలకొంటూందంటే, ఆ రీతిగా ఆ పార్టీ స్థాపకమ్మన్యులు వ్యవహరిస్తున్నారంటే ఏమనుకోవాలి? ‘జనసేన’అన్న పవన్ వెళ్ళి మోడీని కలుస్తాడు. ఏమీ అనని ‘నాగార్జున’ వెళ్ళి మోడీని కలుస్తాడు. టి.డి.పి, బి.జె.పి, జనసేన, లోక్‌సత్తా కలిసి ఇక్కడి ఎన్నికల్లో ఓ పొత్తు కూటమి అన్న భావన ఓ వంక కలిగిస్తూంటాయి. తెలంగాణలో టి.ఆర్.ఎస్, కాంగ్రెస్ ఎలాగూ విలీనం కాలేదు, పొత్తూలేదు కాబట్టి తాము ఏకమై ఆ రెంటినీ ఓడించి కొత్త రాష్ట్ర పునర్నిర్మాణం తామే చేయగలమని అని నిరూపిస్తాయా? అంతలా పొత్తు పెట్టుకుంటాయా అంటే మాత్రం మళ్ళీ అనుమానమే! పాలమూరు సభలో చంద్రబాబుగారు అసలు తెలంగాణను అభివృద్ధి చేసిందే తాననీ, హైదరాబాద్‌ని ప్రపంచ పటంలో నిలబెట్టిందే తననీ చెబుతూ జైసమైక్యాంధ్ర అనేసి నాలుక్కరుచుకుని జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్ అన్నారట! ఏమయినా ‘కడుపులో లేనిది కావలించుకుంటే వస్తుందా’ అన్నట్లు పొత్తు భావనలు అంతరంగంనుండి రావాలి. అంతఃకరణ శుద్ధితో మైత్రీ ఆలోచనలు సాగాలి. ‘పొత్తు’అంటే ‘అవకాశవాదం’అన్న భావనే ప్రజలలో కలుగుతోంది కానీ, ఇరువురి మధ్య సామరస్య, సమష్టి కృషి, సమన్వయసేవా దృక్పథం అన్న భావన కలగడం లేదు. ఒంటరిగా పోరు, పోలేరు కనుక పొత్తు అనికాక, నిజంగా ప్రజాసంక్షేమంకోసం కలసికట్టుగా రెండు పార్టీలు కలిసిపనిచేయడం సాధ్యమైనప్పుడే ఆచరణలో ఆ పొత్తులు విత్తులు మొలచి పంటగా పండి ప్రజలకు అందినప్పుడే సార్థకత. ఆ దశగా, దిశగా నిజమైన పొత్తుల నిర్దేశనం జరగాలి మరి’’అంటూ లేచాడు ప్రసాదు.0 comments: