ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, September 14, 2012

గీతకు ‘అసీం’టా!...
‘‘హాస్యంబునకు దేశ కాల పాత్రంబులు లేవా? అని తిరుపతి వెంకట కవులు ఊరికే అనలేదు. ఎగతాళి చేయడానికిగానీ, అధిక్షేపించడానికిగానీ, కొన్ని పరిమితులుంటాయి. తన స్థాయిని తాను గుర్తెరిగి ప్రవర్తించడం మంచిది! నోరుంది కదాని- పెద్దలనూ, గురువులనూ నిందించడం, కలం, కుంచె వున్నాయని రచయితలూ, చిత్రకారులూ విశృంఖలంగా చెలరేపోవడం సంస్కారం కాదు. అందునా- ‘దేశభక్తి’ లేకుండా జాతి నేతలయిన మహనీయులనూ, జాతి చిహ్నాలనూ అధిక్షేపించడం భావ్యం కాదు! జాతీయ జెండాను, జాతీయ చిహ్నాలను గౌరవించడం పౌరుడిగా నీ ప్రథమ కర్తవ్యం. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరునయినా.. వాటిని కించపరచడం, అవహేళన చేయడం క్షమార్హం కాని నేరం’’ అన్నాడు ప్రవేశిస్తూనే ఆవేశంగా రాంబాబు.


‘‘అట్టే.. అట్టే!... ఆ దూకుడే వద్దు! మానవీయ విలువలకన్నా, సమాజ శ్రేయస్సు కన్నా పతాకాలు, చిహ్నాలు గొప్పవేం కావు. వాటిని ఏర్పరచుకున్నది మనమే. అవి ప్రతిబింబించే జాతీయ విలువలే పతనమవుతున్నప్పుడు, ఆ జెండా నీడనే, ఆ చిహ్నాల మాటునే- దేశంలో అవినీతీ, భ్రష్టత్వం పేట్రేగిపోతున్నప్పుడు, అందుకు కారణమైన పరిస్థితులను వేలెత్తిచూపి, జనంలో చైతన్యం తేవడం కోసం ఆ ధ్వజాలనే ఆ గుర్తులనే ప్రయుక్తం చేసి, సంచలనం కలిగించడం తప్పెలా అవుతుంది? రాజకీయ, సామాజిక స్థితిగతులపై వ్యంగ్యంగా, అధిక్షేపంగా, ఆలోచనాత్మకమూ జనరంజకమూ అయిన రచనలు చేసే రచయితలుగానీ, వ్యంగ్య చిత్రాలు గీసే కార్టూనిస్టులుగానీ, తమ బాధ్యతను సృజనకారులిగా సజావుగా నిర్వర్తిస్తున్న వారే! అలాంటివారిని రాజద్రోహులుగా పరిగణించడం గురివింద సామెతే అవుతుంది’’అన్నాడు అంత తీవ్రంగానూ శంకరం.


‘‘అర్థమైంది. మహారాష్టక్రు చెందిన కార్టూనిస్టు ‘అసీం త్రివేది’ అవినీతికి వ్యతిరేకంగా వేసిన కార్టూన్ల గురించీ, వాటిని రాజద్రోహ నేరంగా పరిగణించి ఆ ప్రభుత్వం పెట్టిన కేసును గురించీ కదూ మీరు మాటాడుతున్నది! నిజానికి మన శాసనసభలు, లోక్‌సభలు తమ పరువును ప్రజలే ఎన్నుకున్న నేతల నిర్వాకాలవల్ల ఏనాడో కోల్పో యాం. అవి ‘హస్కు’ క్లబ్బులుగా, చట్టసభలు ‘పందుల దొడ్లు’గా- తరిమెల నాగిరెడ్డి వంటి నక్సలైట్ నాయకులు గతంలోనే తూర్పారబట్టారు. ‘నోటుకి ఓటు’ వ్యవహారాలతో, ‘ప్రశ్నించడానికీ సొమ్ము’ విధానాలతో, ‘స్కామ్’పై చర్చా ధోరణులతో పార్లమెంట్ సమావేశాలు తమ ప్రతిష్ఠను కోల్పోనే కోల్పోయాయి. కార్టూనిస్టు అసీం తన రాజకీయ వ్యంగ్య చిత్రాలలో నిర్భయంగా పార్లమెంట్‌ను పాయిఖానాగా, నాలుగు సింహాల మన జాతీయ చిహ్నంలోని ప్రతీకాత్మకమైన శక్తి, ధైర్యం, ఆత్మగౌరవం, విశ్వాసం మన నేతల స్వార్థపూరిత అప్రజాస్వామిక అవినీతి చర్యలతో భ్రష్టమై, తోడేళ్లుగా పరిణమించాయని చిత్రించడం- దేశభక్తిగల వారెవరయినా నొచ్చుకుని ముక్కున వేలేసుకునేవిగానే వున్నాయన్న మాట వాస్తవం! కానీ ‘వ్యంగ్య చిత్రం’ అంటేనే ఒక చురక, ఒక వాత, ఒక కొరడా దెబ్బ. సున్నితంగా, గిలిగింతలు పెట్టేదిగానే వుంటే- ఓ చిర్నవ్వు నవ్వి ఉదాసీనంతో ఉపేక్షించే ‘మందపు చర్మం’ లక్షణాలు మనల్ని ఆక్రమించినప్పుడు, ఘాటైన వ్యంగ్యం, అధిక్షేపం తప్పేమీ కాదు! అసీం కార్టూన్లవల్ల పార్లమెంటుకూ, జాతి చిహ్నానికీ అవమానం జరిగిపోయిందని గుండెలు బాదుకోనక్కరలేదు. దానివెనుక గల స్ఫూర్తిలో- దేశ స్వాతంత్య్ర సంరక్షణ గురించిన ఆర్తినీ, అవినీతి ప్రక్షాళన గురించిన కర్తవ్యతా సందేశదీక్షనూ గ్రహించగలగడం ముఖ్యం’’ అన్నాడు ప్రసాదు కూడాను.
‘‘మంచిని బోధించే మార్గం కూడా మంచిగానే వుండాలి. అంతేగానీ- కశ్మలాన్ని శుభ్రపరచడానికి, మరింత కశ్మలం అంటించకూడదు కదా! ఇప్పటికే దేశప్రతిష్ఠ విదేశాలలో మంట గలుస్తూంది అనుకుంటున్నప్పుడు- మనమే మన దేశాన్ని అప్రతిష్ఠపాలు చేసుకోవడం దోషం కాదా? మన జెండాపై, మన జాతీయ చిహ్నాలపై, మన సంస్కృతిపై, మన దేవీ దేవతలపై మనకే గౌరవం లేకపోతే- విదేశాల్లో టాయిలెట్ మూతలమీదా, పాదరక్షలమీదా మన దేవుళ్ల బొమ్మలూ, మన జాతి చిహ్నాలూ ముద్రించబడడంలో ఆశ్చర్యం ఏముంది? ఆ కుసంస్కారాన్ని ప్రతిఘటించవలసిందిపోయి, మనల్ని మనమే కించపరచుకోవడం, అవహేళన చేసుకోవడం జాతి ద్రోహం కాదా?’’ అన్నాడు రాంబాబు.


‘‘రచయితలకూ, కార్టూనిస్టులకూ సంయమనం, స్వీయనియంత్రణ వుండాలి. కాదనను! కానీ ఏ విలువలకోసం రాజకీయ నేతలు, మన పార్లమెంట్, మన న్యాయస్థానాలు పాటుపడి, ప్రజాస్వామ్యాన్ని, మన స్వాతంత్య్రాన్ని పరిరక్షించాలో- వాటికే తిలోదకాలిస్తూ, అవినీతి పంకంలో దేశం కుత్తుక ఒంటిగా కూరుకుపోతున్నప్పుడు, ‘ఓటు’ అనే ఆయుధాన్ని పౌరులు నిర్భయంగా, నిజాయితీగా ప్రయోగించే చైతన్యం తేవడం కోసం తమ కళతో మానసిక పరివర్తన తేగల చేవగల కళాకారులు- కొంత తీవ్రంగా స్పందించి, తమ భావ ప్రకటనా స్వేచ్ఛను, దేశ ప్రయోజనాల నిమిత్తమే వ్యక్తీకరించినప్పుడు- సమాజమూ, ప్రభుత్వమూ, ఉద్యమాలు, నేతృత్వం వహిస్తున్న పెద్దలూ కూడా దానిని అర్థం చేసుకోగల సహనాన్నీ, హాస్యస్ఫూర్తినీ అలవరచుకోవడం ముఖ్యం! ‘దేశభక్తి’కి అది ఒక పరాకాష్ఠయే గానీ, దేశంపట్ల గౌరవాదరాలు లేకపోవడం కాదు. కార్టూనిస్టు అనంతమైన విషయాన్ని అయినా- కొన్ని గీతలతో- సూటిగా, వ్యంగ్యం గా, సంక్షిప్తంగా అందించగల ప్రజ్ఞాశాలి. ఫ్రెంచి కార్టూనిస్టు డామియర్, బ్రిటీష్ వ్యంగ్య చిత్రకారుడు డేవిడ్, మలేషియన్ కార్టూనిస్ట్ జునార్ తమ సృజనతో ప్రాణాలమీదకు తెచ్చుకున్నవారే! తమ రచనలతో జైలు పాలయిన పత్రికా సంపాదకులూ వున్నారు. నిజానికి సృజనకారుల ఈ భావతీవ్రతను గుర్తించి, అందుకు హేతువైన సమాజ పరిణామాలు పునరావృతం కాకుండా సంస్కరించుకోవాలే కానీ, ఆయుధాన్ని శిక్షిస్తే లాభం లేదు! ఆయుధం ధరించాల్సిన అవసరం లేని ‘్ధర్మ సంస్థాపనం’ వ్యవస్థీకృతం కావాలి. ‘కళాయి’ కారులు కాని కళాకారులెప్పుడూ అభినందనీయులే!’’ అన్నాడు సుందరయ్య భుజం తట్టి లేస్తూ.

2 comments:

మాగంటి వంశీ మోహన్ said...

ఎప్పట్లానే చాలా బావుంది సార్!

మాంఛి చురకలు, దానితో పాటు చెయ్యాల్సిందేమిటో కూడా చక్కగా చెప్పారు.....

ఒక సంగతి చెప్పాలనిపించి - కామెంటు నచ్చకపోతే నిరభ్యంతరంగా డిలీట్ చేసెయ్యండి....:)

మీరు జనరల్ గా రాసినా - అందులో ఒక చురక నాకూ చర్రున తగిలి భుజం తడిమేసుకున్నా.....

తప్పైనా ఒప్పైనా భయం లేకుండా ఒప్పుకోటానికి ఎప్పుడూ ముందే కాబట్టి, ఫరవాలేదనుకోండి - ఆ మాత్రం ధైర్యం ఉన్నది....!

ఎప్పటినుంచో ఆ వీకు పాయింటు వద్ద మారాలని చూస్తున్నా, ఆ సమయం వచ్చేప్పటికి బుర్రలో "అది" విశృంఖలంగా విజృంభించేస్తూ ఉంటుంది....

ఎప్పుడో ఒకప్పటికి దాన్ని దాటగలను అన్న చిన్నపాటి నమ్మకమైతే ఉన్నది...:)

. said...

సుధామగారూ....మీరు కత్తికి కలానికి దొరక్కుండా బాగా విశ్లేషించారు..సరే అసీం కళాకారుడా లేక కళాయికారుడా? ... :)