ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, February 28, 2014

కలిసిపో(దాం)రా!?



‘రాష్ట్ర విభజన గురించి ఇంత హడావుడీ, పార్లమెంట్‌లో డ్రామా, నాటకీయ పరిణామాల నడుమ నిర్ణయం,... ఇదంతా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కదా! అటు కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బి.జె.పి, భవిష్యత్తులో అధికారం చేజిక్కించుకోవాలనే ఎత్తుగడల ఆత్రంలోనే, తెలుగువారి భవిష్యత్తుకు ఉమ్మడి తీర్పునిచ్చి, వేర్పాటుకు ‘ఏర్పాట్లు’ చేశాయి. లోక్‌సభ ఎన్నికలతోబాటు ఇప్పుడు ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతాయా, లేక విభజింపబడ్డాక రెండు రాష్ట్రాలకూ- అసెంబ్లీ ఎన్నికలు అనంతరం జరుగుతాయా, అనే సందిగ్ధం నెలకొంది. ఎలా జరిగితే ప్రయోజనమా? అని మల్లగుల్లాలు పడుతున్నారు’’ అన్నాడు శంకరం పేపర్ మడిచి టేబిల్‌మీద పెడుతూ.

‘‘కాంగ్రెస్ తన లబ్దికోసం, రాహుల్ ప్రధాని కావడమనే ఉప లబ్దికోసం, విభజన చేసిందన్నది అందరూ అనుకుంటున్నదే! తెలంగాణలో ‘కాంగ్రెస్ వెలిగిపోవడం ఖాయం’ అన్న విశ్వాసం ఏర్పడ్డాక, టి.ఆర్.ఎస్ తమలో విలీనం అవుతానని అన్నమాట నిలబెట్టుకోకపోయినా, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసేననీ, సోనియాయే తెలంగాణ దేవత అనీ, రూఢిగా జనంలోకి సంకేతాలు వెళ్లాయి కనుక, తమ గెలుపుకు ఢోకాలేదని కాంగ్రెస్ దిలాసా! తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని అన్న టి.ఆర్.ఎస్ చంద్రశేఖర్‌రావే- ఇప్పుడు అలాచేస్తే ఇనే్నళ్ళ తన ‘అస్తిత్వం’ గురించి పునరాలోచనలోపడి, విలీనం కాక కేవలం పొత్తు పెట్టుకుంటేనే నయం అనుకుంటూండవచ్చు. కాంగ్రెస్‌లో విలీనం అయిపోతే- తెలంగాణ పి.సి.సి. అధ్యక్షుడిగానో, కాబోయే ముఖ్యమంత్రిగానో కె.సి.ఆర్‌కు బలమైన అవకాశాలు వున్నాయనుకునే మాట నిజమే అయినా, కాంగ్రెస్‌లోని తెలంగాణ ప్రముఖులతో కొంత పోటీ అనివార్యం కాక తప్పదు. జయపాల్‌రెడ్డి వంటి వారినీ, హనుమంతరావు వంటి వారినీ తగ్గించి, కాంగ్రెస్‌లో కలసిపోయిన కె.సి.ఆర్‌కు అధిష్ఠానం ఎంత ప్రాముఖ్యం ఇస్తుందనేది ఇప్పుడు నిర్ధారణగా చెప్పడం కష్టమే! మరోప్రక్క సీమాంధ్ర పి.సి.సిగా నియామకం చేయబోయే వ్యక్తి- అక్కడ కాంగ్రెస్ చావుదెబ్బ తినకుండా రక్షించగల వాడై వుండాలి కూడాను’’ అన్నాడు ప్రసాదు.


‘‘అందుకేగా! ప్రస్తుతం ఇంకా విడివడని ఆంధ్రప్రదేశ్‌లో, రాష్టప్రతి పాలన పెట్టడం కాకుండా, కొత్త ముఖ్యమంత్రిని నియమించాలన్న ఆలోచనలో కేంద్ర అధిష్ఠానం ఆలోచిస్తోందన్న సంకేతాలు బలంగా వున్నది! సినిమా గ్లామర్‌తో వున్న చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా అవకాశాలున్నాయన్న మాట వినవస్తోంది. కానీ దానికి తెలంగాణావారు ఒప్పుకోవాలి కదా! అలాకాక ఇప్పుడే రెండు ప్రాంతాలకూ ఇద్దరు ముఖ్యమంత్రులను నియమించడం, ఇద్దరు పి.సి.సి అధ్యక్షులను పెట్టడం, విభజన ప్రక్రియ పూర్తికాకుండా ఎలా కుదురుతుంది? అలాకాక- ‘రాష్టప్రతి పాలన’ విధించి, జమిలి ఎన్నికలు నిర్వహించడమే నిజానికి న్యాయం! ‘కానీ అందువల్ల పార్టీల ప్రయోజనాలు నెరవేరడం ఇబ్బంది కావచ్చు. తమకు అనుకూలంగా ఇరుప్రాంతాల ఓట్లూ సాధించుకోవాలనేదే కాంగ్రెస్ సంకల్పం. బి.జె.పి కూడా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా- కొంత సానుకూలత ప్రజలనుండి సాధించుకున్నాననీ, సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలంటూ మేమే పట్టుబట్టాం కనుక, ఎన్నికల వేళ సీమాంధ్రులూ తమను ఆదరించకపోతారా అనే ఆశతో వుంది. ‘‘సందేహాలు, శషభిషలు ఏమీ అక్కర్లేదు. రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రి నియామకం జరిగినా, లేక రాష్టప్రతి పాలన విధించినా, లేక రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తిచేసి ఇద్దరు ముఖ్యమంత్రులను నియమించినా, ఎన్నికలు మాత్రం లోక్‌సభతోపాటే, అసెంబ్లీకీ జరుగుతాయని ఎన్నికల కమిషన్ అధికారులు అంటున్నారట! మార్చి మొదటివారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందంటున్నారు. రెండు రాష్ట్రాలూ ఎన్నికలకు ముందే ఏర్పడితే, ఎస్సీ, ఎస్టీ సీట్లు మారుతాయనీ, నియోజకవర్గాలలో, సీట్ల సంఖ్యలో మార్పులువస్తాయనీ జరుగుతున్న ఊహాగానాల్లో నిజంలేదంటున్నారు. ఎందుకంటే- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 15(2) ప్రకారం... 2008నాటి నియోజకవర్గాల పునర్విభజన చట్టానే్న 2026 వరకూ, 2001 జనాభా లెక్కల పరిగణనతో అమలుచేయవలసి వుందంటున్నారు.’’ అన్నాడు సన్యాసి తను పేపర్లో చదివిన విషయాన్ని విశే్లషిస్తున్నానంటూ.


‘‘తెలంగాణ పునర్నిర్మాణంలో ‘టి.ఆర్.ఎస్’ పార్టీ అస్తిత్వం వుండాలంటే, అది కాంగ్రెస్‌లో విలీనం కాకూడదు. సోనియా ఏరోజు రాష్ట్రం ఇస్తే ఆరోజే తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని గతంలో కె.సి.ఆర్. ప్రకటించారు. తెలంగాణ ఇస్తామన్న మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుంది కనుక, కె.సి.ఆర్ కూడా మాట నిలబెట్టుకోవాలని కొందరంటున్నారు. టి.ఆర్.ఎస్‌కు తెలంగాణ వాదంవల్లే గతంలో సీట్లు వచ్చాయిగానీ, అది కేవలం కె.సి.ఆర్. ప్రతిభ కాదనీ, ఇప్పుడు తెలంగాణ వాదాన్ని గెలిపించింది సోనియాయేననీ, ఎంత క్లిష్టపరిస్థితుల్లో ఆమె బిల్లును ఆమోదింపచేసిందో ప్రజలందరికీ తెలుసుననీ, అందువల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీలోనే వుంటారనీ, కాంగ్రెస్ మంత్రి డి.కె.అరుణ వ్యాఖ్యానించారంటే- తెలంగాణ కాంగ్రెస్ వర్గీయులు టి.ఆర్.ఎస్‌ను- విలీనం లేకపోయినా, ఎన్నికల్లో తాము అధిగమించగలమన్న ధీమాతో వున్నారన్న విషయం తెలుస్తోంది. ఏమయినా విలీన వివాదం, విభజన పథం ఎలా మున్ముందు రూపాంతరం చెందుతాయో చూడాలి! రాబోయే ఎన్నికలు కాంగ్రెస్‌కే కాదు, అన్ని పార్టీలకూ ఈ దేశంలో తెలుగువారిచ్చే తీర్పుననుసరించే దిశానిర్దేశం చేస్తాయన్నది నిర్వివాదాంశం’’ అంటూ లేచాడు శంకరం.




0 comments: