‘‘2014 అలాంటి ఇలాంటి సంవత్సరం కాదాయె మరి! రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరి భవిష్యత్తుతో ముడిపడి వున్నదాయె! సార్వత్రిక ఎన్నికలతో దేశం ఎవరి పరిపాలనాధికారాలలోనికి వెళ్ళబోతోందో? ఏం కాబోతోందో? అని ఒక వంకా, తెలుగువాళ్ళు రాజకీయంగా రెండురాష్ట్రాలుగా విడిపోతే, వారిమధ్య ఐక్యతాభావాలు ఎలా వుంటాయి, ఏ కొత్త సమస్యలతో పరస్పరం సతమతమవుతారు అన్న దిగులు మరోవంకా, కలగడం సహజం. అలాగని 2014కు స్వాగతం పలకకుండా వుండలేం కదా!
మనం ఆహ్వానించినా, ఆహ్వానించకపోయినా, రానున్న కాలం రాకమానదు. దిగులు పడీ, భయపడీ కాదు, దిటవుతోనూ, ఆశతోనూ పరిణామాలను స్వాగతించాలి. రాత్రికి రాత్రి మార్పులేమీ జరగవు! పాత అంతా ఊడ్చిపెట్టుకుపోయి- కొత్తదే అంతా ఆవిర్భవమూ కాదు’’ అన్నాడు రాంబాబు.
‘‘నువ్వు ‘ఊడ్చడం’ అంటే గుర్తొచ్చింది. ఢిల్లీలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడడం- మన దేశ రాజకీయాలలోనే మునుపెన్నడూ ఎరుగని పెనుమార్పు. ‘ఆమ్‌ఆద్మీ పార్టీ’ అనేది మొదటిసారిగా ఎన్నికల బరిలోదిగి, ఢిల్లీ అసెంబ్లీకి 28 స్థానాలు కైవసం చేసుకుని విజయం సాధించడమే అనూహ్యం అనుకుంటే, ప్రజాభిప్రాయం మేరకే- ఏ పాతుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద ధ్వజమెత్తిందో, ఆ పార్టీ మద్దతుతోనే పాలనాధికారం చేపట్టడం- విడ్డూరంగానూ, విమర్శనాత్మకంగానూ అనిపించినా ‘పంకంలోంచే పువ్వు’ వికసించేట్లుగా- ‘చెత్తలోంచే కొత్త’కు ప్రాతిపదికలు దొరకవచ్చు. ప్రజలను మరోమారు ఎన్నికలంటూ భారం మోపకూడదనే- కేజ్రీవాల్, ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు అంగీకరించారు. అంతమాత్రాన తమ ప్రభుత్వం నిలబెట్టుకోవడంకోసం, కాంగ్రెస్ షరతులన్నింటికీ ‘తందానతాన’ అనబోవడం లేదు!
ఢిల్లీలో ప్రభుత్వం పడిపోతే- ఆ తప్పిదం కాంగ్రెస్‌దేనని ప్రజలకు అనిపించేలా, ఉన్నన్నాళ్ళూ- ‘ఉన్నంతలో మంచి’గా పరిపాలించి చూపించడం ఇప్పు డు ‘ఆమ్‌ఆద్మీ’పార్టీ ముందున్న కర్తవ్యం. ‘చీపురు’ అయినా తనంతట తాను ఊడ్వదుకదా! చెయ్యి పట్టుకుని ఊడ్వవలసిందే కనుక, ఆ చేతి ఆసరా అంగీకరించడంలో తప్పులేదు. అయితే చెత్త ఊడ్వడం అనేది చేత్తోకాక చీపురుతో జరగాల్సిన పనే! చేతికి ఇప్పటికే ‘మసి’అంటుకుంది. మసిచేత్తో చీపురు పట్టుకున్నప్పుడు, చీపురుకు ‘మసి’అంటినా, అందుకు కారణం- చెయ్యి అవుతుంది కానీ, చీపురు కాదు. చీపురుకు మసి అంటినా, తాను ఊడ్వదలచిన చెత్తను ఊడ్వడానికి అదేమీ దానికి అవరోధం కాజాలదు. చేతికి అంటిన బూజునైనా చీపురుతో దులిపేయచ్చు. బూజు అంటిన ఓ చేతిని శుభ్రపరచడానికీ, చీపురున్న చెయ్యి దోహదపడగల్గుతుంది. రెండుచేతులా చీపురుపట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక చెయ్యి ఆసరావుంటే చాలు.’’ అన్నాడు సుందరయ్య.
‘‘నువ్వన్నది బానే వుంది! కానీ చీపురుకు సత్తా వుండాలంటే- దాని పుల్లలన్నీ ఒకచోట గట్టి ‘కట్టుబాటు’లో వుండాలి. ‘కట్టు’ తెగితే పుల్లలన్నీ విడివడిపోయి, దాని క్షాళనాశక్తి నశిస్తుంది. చీపురుపట్టిన చెయ్యి ఆ ‘కట్టు’ను ‘పట్టుకునే తీరు’లో ఆ ‘కట్టుబాటు’ నిలుస్తుంది. చెయ్యే తాడును తెంపితే, చీపురును కాదు చేతివాటానే్న తిట్టుకుంటారు. అయితే పుల్లలన్నీ బలమైనవి కావాలి. బలహీనమైనవయితే జారిపోతూంటాయి. మంత్రి పదవి ఇవ్వలేదని అప్పుడే కట్టలోని ‘బన్నీ’ అలిగాడట! ఆ బన్నీ-చేతి నుంచి చీపురులోకి గుచ్చబడిన పుల్లే నిజానికి. ఆ పుల్ల ఉండి తీరాలని చెయ్యి అని, అప్పుడే మద్దతు ఇస్తామని ఏమీ అనలేదు. అంచేత ఆ పుల్లలేకుండానే చీపురు పనిలోకి దిగింది.
మన రాష్ట్రంలో లోక్‌సత్తాది కూడా చీపురు ఆదర్శం వంటిదే కానీ, కొబ్బరి చీపురుకీ, మామూలు చీపురుకీ తేడా వుంది. ఇప్పుడు చీపుళ్ళలో కూడా బోలెడు రకాలు. మామూలు చీపురుకు తడి తగలడానికీ, కొబ్బరి చీపురుకు తగలడానికీ తేడా వుంది! నైలాన్ తాళ్ళతో, పురికొస దారాలతో తయారయ్యే చీపురులూ వున్నాయి. బూజుకర్రలూ వున్నాయి. ఆర్థికంగా హోదాలబట్టి చీపురు వాడకాలూ వుంటాయి. ఇంటి ప్రక్షాళనకు యంత్రాలు వాడడమూ- ‘వాక్యూం క్లీనర్లూ’వున్నాయి. చెత్తను పోగేయడానికి ‘డస్ట్‌బిన్స్’, ‘గార్బేజి బ్యాగ్’లు వున్నాయి.
ఇంతకీ ‘చెత్త’-ఊడ్వడంతో సరిపోదు. ఆ ఊడ్చిన చెత్తను ఏంచేస్తున్నామన్నది ప్రశ్న. పక్కవాడి ఇంటిముందు ఊడ్చిన చెత్తను పోసేవారూ, మేడమీద నుంచి చెత్తబుట్లు బోర్లించి, కింద వెడుతున్న వారినెత్తిన పోసేవారూ వున్నారు! చెత్త అనివార్యం! క్షాళనా అనివార్యం!! చెత్తను ‘రీసైక్లింగ్’చేసి, ప్రయోజనవంతంగా మలచడంలో వుంటుంది అసలు ప్రశ్న. ‘ఇరులు’ అనగా చీకట్లు, ‘పురులు’ అనగా ముడులు-వుంటాయి తప్పదు ఇరులను చీల్చే కిరణాలూ చీపురు పుల్లలే! సూర్యుడే ఓ పెద్ద చీపురు.
ప్రతిక్షాళనా, ప్రతిమార్పూ స్యూరుడిగానే ఉదయిస్తుంది. రేపటి సూర్యుడు ఎప్పుడూ ఆశావహమే! ప్రతి కొత్త ప్రభాతంలోని కిరణాలనూ-
1 comments:
బాగుంది సుధామ గారూ!చెయ్యీ చీపురు కలిసొస్తున్నాయని ఢిల్లీ పరిపాలకులు పాత పైళ్ళని చించి కుప్పలుగా పోస్తున్నారుట.సంవత్సరారంభంలోనే పనెక్కుగా యుంటుందేమో?-గంటి
Post a Comment