ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, December 21, 2013

హాస్యంలో తొణికిసలాడిన మధ్యతరగతి మనస్తత్వం


మనకున్న సీనియర్ కథారచయితల్లో ‘ఆదివిష్ణు’ గారొకరు.
‘బందరు’కు పేరు తెచ్చిన‘కొందరు’లో ఆయనొకరు.
ఆ రోజుల్లో కథకునిగాఆయనకు మంచిఫాలోయింగ్ ఉండేది.
ఎన్నో గొప్ప కథలురాసినా ప్రముఖంగా ఆయనకు 
హాస్యరచయితముద్రపడిపోయింది.
‘స్టోరీటెల్లింగ్’ బాగా, హాయిగావొంటబట్టిన శైలి ఆయనది. 
దానికి చిన్నప్పుడు తండ్రి పక్కలో పడుకునివిన్న కథలే కారణమంటాడాయన. తోటి ఇరుగు పొరుగుపిల్లలకూ, టౌను స్కూల్లో
ఆరో తరగతి తర్వాత చదవడానికి నలుగురు వెంకటేశ్వర్రావులతో నడచివెడుతూ వారికీకథలు చెప్పడం ఆనాడే అలవాటయ్యింది.

కాలేజీలో చేరాక నడుస్తూచెప్పడం తగ్గించి రాస్తూపంపడం మొదలై,
ఆయన ఫైనలియర్లోఉండగా ‘ఆంధ్ర సచిత్రవారపత్రిక’లో ‘అగ్గిబరాటా’అని రాసిన కథసెంటర్‌స్ప్రెడ్ స్టోరీగా బాపు బొమ్మతో అచ్చయింది.అంతే!
ఆ రోజుల్లో కనుక ఈ రచయిత ‘హీరో’అయిపోయారు. తానురచయిత కావడంవల్లేవిజయవాడలో ఉద్యోగం దొరికిందని ఆయన
ఉవాచ. అప్పుడే‘మనిషి-మిథ్య’ అనే నవలకు ప్రథమ బహుమతి కొట్టేసారు.రెండో బహుమతి రంగనాయకమ్మగారిది.

బహుశా వినాయక చవితి నాడు (1940)పుట్టినందువల్లనేమో హాస్యానికి చిరునామా అయిపోయాడు. 1959 నుంచి 
కథలూ, నవలలూ,నాటకాలు ఆ తర్వాత సినిమాల్లో దాదాపు నలభై సినిమాలకు రాసారు. ఆర్టీసీలో ప్రజా సంబంధాల శాఖ
ప్రధానాధికారిగా పనిచేస్తూ 1998 సెప్టెంబర్‌లో రిటైరై ఆతర్వాత రెండేళ్లు ‘ఉషాకిరణ్ మూవీస్’ సినీ కథావిభాగంలో పనిచేసి
ఇంకహాయిగా ఇం ట్లోమనమ లూమనుమరాళ్లతో ఆడుకుందామని డిసైడైపోయారు.

ఆదివిష్ణుగారు రేడియోలోప్రాయోజిత కార్యక్రమాల రచనకూ పేరు పొందారు.‘ప్రియాపచ్చళ్ళు’ప్రమోషన్ కోసం ఆయన
కూర్చిన కార్యక్రమాలకు భలే ప్రాచుర్యం ఉండేది. ఆదివిష్ణుని గురుతుల్యునిగా భావించే వేదగిరి రాంబాబు 
శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ పక్షాన ఆయన కథల బృహత్సంపుటిని 
తాజాగా వెలువరించడం ఎంతో బాగుంది. ఇందులోని
ఇరవై తొమ్మిది కథలూ ఆదివిష్ణు కథా రచయితగా ఎంత విలక్షణుడూ, విశిష్టుడో తెలిపేవే.

ఇందులోని మొదటి కథ ‘సిద్థార్థ’ 1973లో జ్యోతి దీపావళి ప్రత్యేక 
సంచికలో వెలువడి ఎక్కువ సంఖ్యలో పాఠకుల
బ్యాలెట్లు సంపాదించి ‘బంగారు ఉంగరం’ బహుమతిని ఆదివిష్ణు గెలుచుకునేలా చేసింది. చిత్రంగా ఇప్పుడీ గ్రంథ
సమీక్ష చేస్తున్న సుధామ జ్యోతి దీపావళి సంచికలో నిర్వహించిన 
‘ఉత్తమ కథా సమీక్ష’ బహుమతిని ఆ కథపైనే చేసి గెలుచుకోవడం 
జరిగింది. ఇప్పటికీ ఆ కథ తాజాదనంతో వుంది. ఈ కథ ఎప్పటికీ పూర్తికాదంటాడు రచయిత. నిజమే!
పూర్తికాని కథ ఎప్పుడూ నిలిచివుండే కథే! డబ్బున్నవాళ్ళమీద, డబ్బులేనివాళ్ళమీద, ఉన్నవాళ్ళమీద లేనివాళ్ళ
లేనివాళ్ళ మీద ఉన్నవాళ్ళ కథలెన్నోవచ్చాయి. కానీ ఇది 
విలక్షణమైన కథ.

చెన్నయ్య లేనివాడు. అయితే అతనికి ఉన్నవాళ్ళమీద కోపం అందరి లేనివాళ్ళకు వలే కాదు. అతని అసలు
రంగు కథ చివర తేలింది. అంటే అసలు అతని కథ మొదలైందనే. యజమానికున్న మేడా,కార్లూ, నగరంలో ఆయన
వ్యాపారం. ఆ వ్యాపారంలో అన్యాయం- అక్రమాలు తద్వారా పెరిగే 
ధనార్జనా ఆపైన అతని హోదా- ఇవన్నీ కూడా
చెన్నయ్యకి కోపకారణాలే. ఎందుకు? తనకు లేనందుకే! అదే 
తేల్చాడు. అతను సమానత్వంకోరాడు. సమ సమాజం
కోరాడు. దేనికోసం? తన కోసం. తను ఉన్నవాళ్ళతో సమమైతే
తాను కోరిన సమసమాజం సిద్ధించిట్లే అతనికి. 
ఇలాంటి మనుషులు ఈ వ్యవస్థలో నేటికీ వున్నారు.

ఆంధ్రజ్యోతి వారపత్రిక ప్రారంభసంచికలో వచ్చిన ‘జాలికథ’లో కూడా నరసరాజు మనస్తత్వాన్ని చాలా సహజంగా
చిత్రించారు ఆదివిష్ణు. సంఘంలో మంచి పరపతి, డబ్బూ వున్న 
కట్టుబాట్ల పేరుతో చెలామణీ అయ్యే కుహనా
‘జాలి’ని సీతపట్ల వ్యక్తీకరించడం సమాజపు తీరుతెన్నులకు ఒక ప్రతిబింబమే.

ఆ రోజుల్లో ‘’భారతి" మాసపత్రికలో కథ వచ్చిందంటే కథకునికి అదో 
గొప్ప యోగ్యతాపత్రమే. ‘రేపటి
మనిషి’ 1967లో భారతిలో వచ్చిన కథే! ఇందులో ‘ భగవంతం’ 
పాత్ర కూడా అలాంటిది ‘విధవా వివాహం’ అనే 
ఆదర్శం ముసుగులో డబ్బుకోసమే అతనలా మారాడని 
గ్రహించినప్పుడు, కానీఅతని వెనుక కుటుంబపు
వ్యథాభరిత స్థితి గమనించినప్పుడు కథకుడిలానే పాఠకుడూ 
కదిలిపోయి క్షమించేస్తాడా?

మంచి కథకు పుట్టినిల్లు అనిపించే అలనాటి ఆంధ్రపత్రిక, జ్యోతి, 
ఆంధ్రజ్యోతి, లత వంటి పలు పత్రికల్లోవచ్చిన
ఆదివిష్ణు మంచి కథల సంకలనం ఇది. హాస్యరచయిత అనుకునే ఆదివిష్ణులోని సామాజిక నైపుణిని, మనస్తత్వ
విశే్లషణా దక్షతను ఇందులోని కథలు వ్యక్తీకరిస్తాయి. బాధితులు, సుఖంలేని మనిషి ది గ్రేట్, శ్రేయోభిలాషులు,
తప్పు, మనిషి-పగ, బ్రతకనివ్వండి వంటి కథలన్నీ అలరించి ఆలోచింపజేస్తాయి. చాలా సాదా సీదా అయిన
శైలిలో, పఠనయోగ్యంగా సాగే ఈ కథలు అనేకం 
మధ్య తరగతి మనస్తత్వం మూలకందంగా రూపొందినవి 
కావడంవల్లే నేటి సాహిత్య ధోరణులననుసరించి మంచి కథలుగా సంపుటాలకెక్కే సందర్భాలను నోచుకోకపోతున్నా
యని పిస్తుంది. ఆకలి, దరిద్రాన్ని కూడా చూసే దృక్పథం 
మారిపోయింది మరి! 

ఏమయినా మంచి కథలనందించిన ఆదివిష్ణుకు, సంకలించిన
రాంబాబుకు అభినందనలు.



4 comments:

Unknown said...

Baaga raasaaru sir

సి.ఉమాదేవి said...

మంచి కథల చిరునామాకు చక్కని సమీక్షా రహదారి వేసారు సుధామ గారు.

సుధామ said...

ధన్యవాదాలు ఉమాదేవి గారూ,కళాధర్ గారూ!

Unknown said...

నా చిన్నప్పటి అభిమాన హాస్య రచయిత " ఆదివిష్ణు" గారి పుస్తక సమీక్ష తో పాటు వారిని గురించిన మంచి సమాచారం అందించారు సుధామ గారు. ఆదివిష్ణు గారి హాస్యంలోని ఒకింత అతిశయోక్తి నాకు బాగా నచ్చేది. నా పై కూడా వారి రచనల ప్రభావం ఉంది.