ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, December 29, 2013

మరో ఏడాది...!







అనాలని వున్నా 
ఊరికే ఎవరూ ఏదీ అనరు-

ఏడు మారినా
ఈడు ముదిరినా 
ఏమి మారినది 
ఈ లోకంలో 

అంటాడు కవి కాళోజీ ‘నా గొడవ’లో. 

పైకి నైరాశ్యంగా కనబడవచ్చుగానీ సార్వకాలిక సత్యమే అది. మార్పు లేదని అనలేంగానీ, ఆ మార్పు నిశితంగా బలీయంగా కనపడాలి మరి. ఇలా ఒక ఆశ చిగురించడం, తీరా అది పూర్తిగా వికసించకపోవడం కూడా జీవన గమనంలో భాగమే! 

’అస్తిత్వం’ అంటూ ఒకటుంటుంది. నిజమే! కానీ అది -‘ఏదో ఉంది అంటే ఉంది’ అన్నట్లుగా వుంటే ఏం ప్రయోజనం? 

మనిషి ఆశాజీవి కనుక - కాలచక్రంలో ఒక ఏడాది పోయి ఇంకో ఏడు వస్తూంటే- రాబోయే కాలంపట్ల ఉత్సుకతతో ఉంటాడు. గతించిన కాలంలోని మంచి చెడులను స్మరించుకున్నా, ఈ ఏటిలోని విషాద రేఖలు రానున్న సంవత్సరంలోకి ప్రసరించకూడదని కోరుకుంటాడు. అదీ నిజమే!

కాళోజీ మహాశయుడన్న మాటనే ఇంకోసారి అంటే తప్పేం లేదు-

ఉదయం కానే కాదనుకోవడం నిరాశ 
ఉదయించి అలానే ఉంటుందనుకోవడం దురాశ 

ఇప్పుడు వెళిపోతున్న 2013 సంవత్సరం ప్రవేశిస్తున్నప్పుడు - కొత్త శతాబ్దంలో పుష్కర కాలం గడిచిపోయిం దనీ, నిజంగానే శతాబ్ది సూరీడు మునుపెన్నడూ లేని కొత్త కాంతులతో విహరిస్తున్నాడనీ సంభావించాము. 

సాంకేతికాభివృద్ధి ఎంతలా పెరిగిపోయిందంటే - మనిషి ఊహించజాలనంత! యాభైలు, అరవైలు వయసు దాటిన వారు ఈ మారుతున్న పరిణామాలను తమ బాల్యపు రోజులతో బేరీజు వేసుకుని నివ్వెరపోవడం, నిశ్చేష్టులవడం జరుగుతూండటమే కాదు, అందుకోవడానికి ఆత్రపడడం, కొందరికి చాతకాక చతికిల పడడమూ అనుభవంలోని విషయాలే! 

అసలు ‘పదమూడు’ అనే సంఖ్య అంత అదృష్టమైనదిగా భావించరు. చాలా దురదృష్టకరమైనదిగా భావించే దేశాలున్నాయి. అమెరికా, కెనడా, ఇండియాల్లో దురదృష్టకరమైన సంఖ్యగా పదమూడుని తలపోసేవారున్నారు. హోటల్స్‌లో పదమూడవ నెంబర్ గది వుండనే ఉండదు కొన్నిచోట్ల. 

కానీ, మనకు నచ్చదని ఓ సంఖ్య రాకుండా ఉండదు కదా! పన్నెండు తరువాతా, పధ్నాలుగుకు ముందూ అనివార్యంగా వస్తుంది పదమూడు. 2012 సంవత్సరం తరువాత - తేదీ, నెల, సంవత్సరం రాసేటప్పుడు సంవత్సరం దగ్గర ‘పదమూడు’ అని సంఖ్య వేయక తప్పలేదు ఈ పన్నెండు నెలలూ. 

కొత్త శతాబ్దపు 13వ సంవత్సరం ఇవాళ తరువాత, ఇంకో రెండు రోజుల్లో ముగుస్తోంది. మహాభారతంలో ధర్మవర్తనులైన పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం, ఓ ఏడాది అజ్ఞాతవాసం ముగించుకున్నాక కానీ - కష్టాల కడలి నుండి బయటపడలేదు. యుద్ధం చేయక తప్పలేదు. 

నేటి మన భారతం పరిస్థితీ అలానే ఉంది. అయితే- 

ఏది ధర్మం? ఏది అధర్మం? 
ఏది నీతి? ఏది అవినీతి? 

అన్న విచికిత్స ఎక్కువై పోయింది. 

ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఒరిగేదేమిటో తెలీడం లేదు. అవినీతి కుంభకోణాలు పెరిగిపోయాయి. రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి. దేశం నేతృత్వ దరిద్రమవుతోంది. అయినా ఆశాకిరణాలూ పొడచూపాయి. ‘అన్నాహజారే’ అవినీతిపై ఎత్తిన ధ్వజం - ఆయన ఆశీస్సులుగల కేజ్రీవాల్ ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ ఢిల్లీ పీఠాన్ని ఎన్నికల్లో కదిలించడం అచ్చెరువునే కలిగించింది. అయితేనేం! ప్రభుత నేర్పరచగల స్థాయి సంఖ్య దక్కలేదు. పొత్తులు అన్నీ జిత్తులమారివిగానే కనబడుతున్నప్పుడు, మెజారిటీ లేకుండా సాహసించడం ఎలా? అన్నది ప్రశ్నే

2013 తెలుగుల బ్రతుకులను మరీ అస్థిరం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విడగొట్టడం తథ్యం అన్న సంకేతాలతో - కళవళ పడుతున్న వారూ వున్నారు, కళకళలాడుతున్న వారూ ఉన్నారు. 

సరే! రాష్ట్రం, దేశం, అంతర్జాతీయం ,యావత్ ప్రపంచం అంతటా ప్రకృతి ఉత్పాతాలు ఈ ఏడాదీ చోటు చేసుకున్నాయి. తనువు చాలించి తరలి వెళ్లిపోయిన వారెందరో ఉన్నారు. అన్ని రంగాలలోనూ విజయగాథల కన్నా వైఫల్య పార్శ్యాలూ పెరిగాయి. చితులూ, చింతలూ వంతలు పాడాయి. సౌశీల్యం, సౌజన్యం గంతలు కట్టుకున్నాయి. 

రెండువేల పదమూడు అనే కాలశకటం పన్నెండు బోగీలతో వర్తమానం దాటి, గతం గమ్యస్థానంలోకి వెళ్లిపోతోంది. ఒక్కో నెలా చెప్పే కొన్ని కబుర్లు విని విశ్లేషించుకుని ఆగామికి స్వాగతం పలకవలసింది మనమే! 

కొంత రొటీన్‌కు భిన్నంగానే ఈ అంశాల నమోదు సుమండీ! 

జనవరి: 

ఐక్యరాజ్యసమితి హ్యూమన్ రైట్స్ అధినేత భారతదేశంలో ‘రేప్’ అనేది జాతీయ సమస్యగా ఉందని 2013 సంవత్సరం ప్రవేశించిన మరునాడే వాక్రుచ్చాడు. ఏడాది పొడుగూతా దేశంలో అనేక వార్తాకథనాలతో నిజంగానే ‘స్త్రీలకు  రక్షణ’ అనే అంశం, ఒక సవాలుగా రూపెత్తింది. * పశ్చిమ ఆస్ట్రేలియా సైంటిస్టులు మూడున్నర బిలియన్ సంవత్సరాల క్రితం హ్యూమన్ బాక్టీరియాను కనుగొన్నామని ప్రకటించారు. ఢిల్లీలో రేప్ కేసుల విచారణలకు మొట్టమొదటి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటయింది. * ప్రపంచంలోకెల్లా అధిక సంపన్నులలో పద్దెనిమిదవ వాడిగా మన దేశపు రిలయన్స్ ఎం.డి. ముఖేష్ అంబానీని ది ఎకనమిస్ట్ సర్వే తేల్చింది. * ‘కౌన్ బనేగా కరోడ్‌పతి ‘గేమ్ షో’లో అయిదు కోట్ల రూపాయలు గెలుచుకున్న మొట్టమొదటి  స్త్రీ పంజాబ్‌కు చెందిన సున్‌మీత్ కౌర్ షహానీ అనే గృహిణి. * పవన్‌కుమార్ బన్సాలీ అను మన రైల్వే మంత్రిగారు ఛార్జీలు పెంచేసింది ఈ నెల్లోనే. * అన్నట్లు మరీ ముఖ్యమైన సంగతి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే మన దేశపు అధికార పార్టీకి కొత్త ఉపాధ్యక్షునిగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అక్కున చేర్చుకుంది. * అక్కడ అమెరికాలో ఒబామా అమెరికా అధ్యక్షునిగా రెండవ పర్యాయానికి ప్రమాణ స్వీకారం చేశారు. * శివసేన అధ్యక్షునిగా ముంబయ్ దాదర్ కార్యాలయంలో ఉద్ధవ్ థాక్రే పీఠమెక్కాడు. * భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా నితిన్ గడ్కారీ రాజీనామా చేయగా రాజ్‌నాథ్ సింగ్ పగ్గాలు చేపట్టాడు. * జార్ఖండ్‌లో రాష్టప్రతి పాలన వచ్చింది. * యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంగారకుని మీద 3.5 బిలియన్ సంవత్సరాల క్రితపు నదీ ప్రవాహపు జాడల ఫొటోలను విడుదల చేసింది. * స్వామి వివేకానంద 150వ జయంతి వేడుకలు మొదలయ్యాయి. * వయొలిన్ విద్వాంసులు ఎమ్మెస్ గోపాలకృష్ణన్ జనవరి మూడున అస్తమించారు. 

ఫిబ్రవరి: 

స్త్రీల రక్షణకై మొబైల్ ఫోన్లలో ఒడిస్సా, బెంగాల్, కలకత్తాలలో భారతీ ఎయిర్‌టెల్ ఎమర్జెన్సీ అలర్ట్ సర్వీస్‌ను ఏర్పాటు చేసింది. * కావేరీ జలాల్లో 2.44 టిఎంసిలను తమిళనాడుకు ఇవ్వాలని కర్ణాటకను సుప్రీంకోర్టు ఆదేశించింది. * తీహార్ జైల్లో అఫ్జల్‌గురును ఆపరేషన్ త్రీస్టార్ పేర రహస్యంగా ఉరి తీశారు. * విద్యుత్ చార్జీలు పెంచిన కారణంతో జరిగిన ప్రజాందోళనతోనే బల్గేరియా ప్రభుత్వం పడిపోయింది. * కేరళ ప్రభుత్వం మద్యం అమ్మకం కొనుగోళ్లకు కనీస వయసు 18 నుండి 21కి పెంచింది. * జపనీస్ కార్టూన్ షో ‘డోరేమాన్’ను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించింది. * చేతితో చేసే పాకీ పనిని పూర్తిగా నిషేధించిన తొలి నగరంగా ఢిల్లీ నిలిచింది. * యాహూ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా మే 2009లో చేరిన అరుణ్ తాటంకి కంపెనీని వదిలేశాడు. * పాలపుంతలో డబ్ల్యు496 అనే వెయ్యేళ్ల క్రితపు బ్లాక్ హోల్‌ని గుర్తించారు. * పార్లే జి. బిస్కట్ల అమ్మకం అయిదువేల కోట్ల రూపాయలు దాటింది. * 1415లో గ్రెగరీ తినిని తరువాత ‘పోప్’గా తన వయోభారం వల్ల రాజీనామా చేసింది పోప్ బెరిడిక్ట్ తిని . * హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో రద్దీ ప్రాంతంలో బాంబు పేలుళ్లు జరిగి పలువురు మరణించారు. * హైదరాబాద్ మెట్రో పనులు మొదలయ్యాయి. 

మార్చి: 

ఇండియాలో వ్యాపార సరళికై మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 వెర్షన్ మొదలైంది. * మేఘాలయ ముఖ్యమంత్రిగా ఎం.ఎం.సంగ్మా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. * రిజర్వ్ బ్యాంక్ అయిదు నగరాల్లో చెలామణికై ఒక బిలియన్ పది రూపాయల ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం చుట్టింది. * పాకిస్తాన్‌లో ప్రజాస్వామిక పార్లమెంట్ మొదటిసారిగా అయిదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకుంది. * గోవా, కర్ణాటక అసెంబ్లీల స్వర్ణోత్సవాలు జరిగాయి. * ఆహార భద్రత బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. * పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రచయితలకు, సాహితీవేత్తలకు నెలసరి స్ట్ఫైండ్‌లు ప్రకటించింది. * దుబాయ్‌లో నాలుగేళ్లు ప్రవాస జీవితం గడిపి పాక్ అధ్యక్షునిగా చేసిన ముషార్రఫ్ తిరిగి పాకిస్తాన్ చేరుకున్నాడు. * లండన్ ఒలింపిక్ పార్క్ పునః ప్రారంభమైంది. తొలిరోజే ఇరవై వేల సందర్శక టిక్కెట్లు అమ్ముడయ్యాయి. * సంగీతజ్ఞుడు పినాకపాణి అస్తమయం. * అలాగే హైదరాబాద్ రెడ్డి ల్యాబ్స్ స్థాపకుడు కె.అంజిరెడ్డి మరణించారు. 

ఏప్రిల్: 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ‘అమ్మ హస్తం’ పథకం మొదలెట్టారు. * శరద్ యాదవ్ జనతాదళ్ జాతీయ అధ్యక్షునిగా మూడోసారి ఎన్నికయ్యారు. * బంగారం ధరలు బాగా పడిపోయాయి. అంతకు ముందు పదిహేను నెలల్లో ఎప్పుడూ లేనంత తక్కువకు పడిపోయాయి. దాంతో బోలెడు జోకులు వచ్చాయి. * కర్ణాటకలో 49 మైనింగ్స్‌కు సుప్రీంకోర్టు లీజ్‌ను రద్దు చేసింది. * తెలుగు సాహితీవేత్త డా.రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ్ అవార్డు ప్రకటించబడింది. * 1249 రూపాయలకే మొబైల్ ఫోన్ అందిస్తూ ‘నోకియా 105’ విడులైంది. * మే 1 నుండి అమలు జరిగేలా భారతీయ రైల్వే అడ్వాన్స్ బుకింగ్ కాలపరిమితిని అరవై రోజులకు తగ్గించేసింది. * పద్మా అవార్డుల పంపిణీ జరిగింది. * ఆంధ్రప్రదేశ్ 1979 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన అరుణ బహుగుణ సిఆర్‌పిఎఫ్ కు మొట్టమొదటి మహిళా స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. * స్పెయిన్‌లో నిరుద్యోగుల శాతం 27.2 కు పెరిగిపోయిందట. * గణిత మేధావి శకుంతలా దేవి, ప్రముఖ గాయని షంషాద్ బేగం, తెలుగు సినీ గాయకుడు పి.బి.శ్రీనివాస్, లాల్‌గుడి జయరామన్ అస్తమించారు. * మాజీ బ్రిటీష్ ప్రధాని మార్గరెట్ థాచర్, భారత పారిశ్రామిక వేత్త ఆర్.పి.గోయంకా, మాజీ గవర్నర్, రచయిత్రి వి.ఎస్.రమాదేవి మృతి చెందారు. 

మే: 

ఢిల్లీలో ఆటో రేట్లు ఇరవై అయిదు శాతం పెరిగాయి. * పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు ఎన్.టి.రామారావు విగ్రహం ప్రతిష్టించారు. * కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పదవి చేపట్టారు. * జగన్ అక్రమాస్తుల కేసులో రాష్ట్ర మంత్రులు పి.సబితారెడ్డి, డి.ప్రసాదరావు నమోదయ్యారు. * చైనా రానున్న 2014ను భారత చైనా మైత్రీ సంవత్సరంగా ప్రకటించింది. * రూపాయి విలువ డాలర్‌కు ఆరు నెలల్లో ఎప్పుడూ లేనంతగా 55.83కు పడిపోయింది. * కొత్త రకం మామిడిపండుకు ఢిల్లీలో అత్యాచార బాధితురాలు ‘నిర్భయ’ పేరు పెట్టారు. * మలయాళం క్లాసికల్ లాంగ్వేజ్‌గా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. * ట్వంటీ ట్వంటీ క్రికెట్‌కు సచిన్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. * బిజెపి లాయర్ రామ్‌జెఠ్మలానీని ఆరేళ్ల పాటు ప్రాథమిక సభ్యత్వం నుండి కూడా బహిష్కరించింది. * హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ స్వర్ణోత్సవాలు జరిగాయి. * గాయకుడు హరిహరన్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం లతామంగేష్కర్ అవార్డునిచ్చింది. * బెంగాలీ సినీ దర్శకుడు రితుపర్ణ ఘోష్ అస్తమయం * తమిళ గాయకుడు, సంగీత దర్శకుడు టి.ఎం.సౌందర్యరాజన్ మృతి చెందారు. 

జూన్: 

పాకిస్తాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం * అన్ని ప్రధాన పదవుల నుండీ బిజెపిలో ఎల్.కె.అద్వానీ వైదొలగారు. * అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా ప్రధాని మన్మోహన్ సింగ్ అయిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. * కేంద్ర కేబినెట్‌లో 8 మంది కొత్త మంత్రులు చేరారు. * వరద తాకిడికి గురై తీవ్రంగా నష్టపోయినందుకు కేదార్‌నాథ్ ఆలయాన్ని ఏడాదిపాటు మూసివేస్తున్నట్లు ఉత్తరాఖండ్ సి.ఎం. ప్రకటించారు. * స్విస్ నేషనల్ బ్యాంకుల్లో భారతీయ నిధులు దాచుకోవడం తగ్గిపోయి, తొమ్మిదివేల కోట్ల రూపాయలకు పడిపోయిందట. * ప్రపంచంలో అతి ఖరీదైన మార్కెట్ ప్లేస్‌ల్లో అయిదవదిగా ఢిల్లీ కన్నాట్ ప్లేస్ గుర్తించబడింది. * ఇండియాలో ఇంటర్నెట్ వినియోగం 2016కు మూడు వందల ముప్పై బిలియన్లకు చేరుతుందిట. * కాస్మోటిక్ ఉత్పత్తులను జంతువులపై ప్రయోగించి పరీక్షించడం నిషేధించిన సౌత్ ఆసియాలోని తొలి దేశం భారతదేశమే * తెలుగు సినీ గాయకుడు, సంగీత దర్శకుడు జె.వి.రాఘవులు అస్తమయం. * ఒకప్పటి కేంద్ర మంత్రి వి.సి.శుక్లా ఛత్తీస్‌గడ్‌లో అస్తమించారు. 

జూలై: 

దేశంలో టెలిగ్రాం సర్వీసులకు 15వ తేదీ చరమాంకం అయ్యింది. * ఉత్తరప్రదేశ్‌లో ‘అమేథీ’ని కొత్త జిల్లాగా ప్రకటించారు. * దలైలామా 78వ జయంతి జరిగిన ఏడవ తేదీనే బోధగయ బీహార్‌లో తొమ్మిది బాంబు పేలుళ్లు జరిగాయి. * పాశ్చాత్య సంగీత నిర్దేశకుడు జుబిన్ మెహతాకు టాగూర్ కల్చరల్ హార్మనీ అవార్డు నిచ్చారు. * సత్యం కంపెనీ టెక్‌మహేంద్రాలో విలీనమైంది. * ఉత్తరాఖండ్ ప్రకృతి విపత్తుల నివారణలో విఫలమైందని సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. * బీహార్‌లో పాఠశాల విద్యార్థుల మృతికి కారణమైన మధ్యాహ్న భోజనం బ్యాగ్‌ల ఎరువును నిషేధించమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆదేశించింది. * అండమాన్ జైల్లో వీరసావర్కర్ రాసిన రెండు ఉర్దూ గజల్స్ ఉన్న నోట్స్ పుస్తకం దొరికింది. * సరోద్ మాస్టర్ అమ్జద్ అలీఖాన్‌కు రాజీవ్‌గాంధీ సద్భావనా అవార్డు నిచ్చారు. * కంప్యూటర్ వౌస్ కనుగొన్న డగ్లస్ ఎంగెల్‌బర్ట్, మధుబని చిత్రకళాకారిణి మహాసుందరీ దేవి, ఒకప్పటి కేంద్ర మంత్రి ఖుర్షీద్ ఆలంఖాన్, రాజీవ్‌గాంధీ సహచరుడిగా వుండిన నాటి కేంద్ర మంత్రి అరుణ్ నెహ్రూ, తెలుగు కన్నడ సినీ నటి మంజుల, బాలీవుడ్ విలన్ ప్రాణ్, తమిళ సినీ కవి వాలి, బాలీవుడ్ చిత్ర నిర్మాత సుధాకర్ బొకాడే అస్తమించారు. * కాంగ్రెస్ యుపిఎ ప్రభుత్వం 29వ రాష్ట్రంగా తెలంగాణ ఇవ్వడానికి నిశ్చయించింది.

ఆగస్టు: 

జనతా పార్టీ భారతీయ జనతాపార్టీలో విలీనమైంది. * ఆహార భద్రతా బిల్లు వచ్చింది. * రఘురామ్ గోవిందరాజన్ 23వ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా నియమితులయ్యారు. * జగన్ ఎం.పిగా రాజీనామా చేశారు. * పశ్చిమబెంగాల్ కలకత్తాల్లో ‘చనుబాల’ బ్యాంక్ ఏర్పాటయింది. * ప్రపంచపు అతిపెద్ద సోలార్ పార్క్‌కు రాజస్థాన్ జోధ్‌పూర్ జిల్లా భాడ్లాలో శంకుస్థాపన జరిగింది. * జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సొరేన్ మంత్రివర్గం ఏర్పరచారు. * దాద్రా అండ్ నగర్ హవేలీ పోర్చుగీస్ విముక్తి 60వ వార్షికోత్సవం జరుపుకుంది. 8 ఢిల్లీలో నేషనల్ మీడియా సెంటర్‌ను ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ ప్రారంభించారు. * ఇరవై రెండు సంవత్సరాల విరామం తర్వాత ఎయిర్ ఇండియా ఆస్ట్రేలియాకు నేరుగా విమాన సర్వీసులు మొదలెట్టింది. * స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ఢిల్లీలో సోనియాగాంధీ అహింసా మెసేజెస్ ప్రోగ్రాంను ప్రారంభించారు. * నోబెల్ ఐరిష్ రచయిత సీమస్‌హెనే, క్లాసికల్ గాయకుడు పండిట్ రఘునాథ్ పాణిగ్రాహి అస్తమించారు. * తెలుగు రచయిత్రి మాలతీ చందూర్ మరణించారు. 

సెప్టెంబర్: 

ఢిల్లీ గ్యాంగ్‌రేప్ కేస్ నిందితులకు ఢిల్లీ సాకేత్ కోర్టు మరణశిక్ష విధించింది. * 158 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను గిరిజన ప్రాంతాలలో నెలకొల్పడానికి ప్రభుత్వం మంజూరు చేసింది. * నోట్లతో దండలు చేయవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి జారీ చేసింది. * పశువుల దాణా కేసులో లాలూప్రసాద్ యాదవ్ అరెస్టయ్యారు. జైలుకెళ్లారు. * బిజెపి పార్లమెంటరీ బోర్డు తమ ప్రధాని అభ్యర్థిగా 2014 ఎన్నికలకు నరేంద్ర మోడీని ప్రతిపాదించింది. * రష్యా అధ్యక్షతన సెంట్ పీటర్స్‌బర్గ్‌లో జి.20 నేతల సదస్సు జరిగింది. * ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందడానికి ఆధార్ కార్డు విధాయకం కాదని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. * ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులెవరూ అర్హులు కారని తిరస్కరించే హక్కు పౌరులకు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. * ఆడియో రికార్డింగ్‌లో శబ్ద కాలుష్యం తొలగించే వాయిస్ రిడక్షన్ కనుగొన్న ఇంజనీర్ రేడోల్‌బై, స్వాతంత్య్ర సమరయోధుడు రంజిత్ సింగ్, రవీంద్ర ఆర్ట్ ఫిలింస్ నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి మృతి చెందారు. 

అక్టోబర్:

‘వయోశ్రేష్ఠ’ పేర తొలి జాతీయ వయోధికుల అవార్డులను రాష్టప్రతి ఢిల్లీలో ప్రదానం చేశారు. * కేంద్ర మంత్రిమండలి తెలంగాణ ఏర్పాటుకు తీర్మానించింది. * పృథ్వీ-2 విజయవంతంగా ప్రయోగించబడింది. * సామ్‌సంగ్ కంపెనీ తొలి కర్వ్‌డ్ స్క్రీన్ స్మార్ట్ఫోన్ ప్రవేశపెట్టింది. * ‘ఫైలిన్’ తుపాను అండమాన్ నికోబార్ తీరాన్ని తాకింది. * సచిన్ టెండూల్కర్ టెస్ట్ క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ ప్రకటించాడు. * సమాచార హక్కు చట్టం కింద సహకార సంఘాలు రావని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. * ‘యాహూ’ ఈజిప్ట్, కైరోలోని తమ కార్యాలయం మూసేసింది. * ఇంటర్నెట్, సోషల్ మీడియాలను వాడుకునే విషయంలో రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసింది. * 182 మీటర్ల ఎత్తయిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ పటేల్ విగ్రహ స్థాపనకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. * పెట్రోల్ బంకుల్లో సబ్సిడీలేని అయిదు కేజీల ఎల్.పి.జి. సిలిండర్ల అమ్మకానికి కేంద్ర సంకల్పించింది. * నూరేళ్ల సినిమా పండుగను పురస్కరించుకొని కేంద్ర సమాచార ప్రసార శాఖ నెలకొల్పిన సెంటినరీ అవార్డును బాలీవుడ్ నటి వహీదా రెహ్మాన్‌కు ప్రకటించారు. * జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.రావూరి భరద్వాజ, మలయాళ సంగీత దర్శకుడు కె.రాఘవన్, మరాఠీ నాటక రచయిత గోమఠ్ పి.దేశ్‌పాండే, నటులు శ్రీహరి, హిందీ సినీ గాయకుడు మన్నాడే, మాజీ కేంద్ర మంత్రి మోహన్ థారియా అస్తమించారు. 

నవంబర్: 

సచిన్ టెండూల్కర్, శాస్తవ్రేత్త ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్. రావులకు భారత రత్న ప్రదానం. * ఇస్రో మార్స్ ఆర్బిటర్ భూమికి హెలెన్ తుఫాను తొలి చిత్రాలను పంపించింది. * హెలెన్ తుఫాన్ మచిలీపట్నం తీరాన్ని తాకింది. భారీ నష్టం. * వోలోకాప్టర్ పేర ప్రపంచపు తొలి గ్రీన్ హెలికాప్టర్‌ను జర్మనీ పరీక్షించింది. * పాక్‌లో అతి పెద్ద న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ శంకుస్థాపన చేశారు. * ఆంధ్రప్రదేశ్‌ను ‘లెహర్’ తుపాను తాకింది. * హర్యానా పాని పట్టులో తొలి సింథటిక్ రబ్బర్ ప్లాంట్‌ను కేంద్ర పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ ప్రారంభించారు. * పాకిస్తానీ జానపద గాయని రేష్మా, జగద్గురు కృపాల్‌జీ మహరాజ్, తెలుగు హాస్య నటుడు ఏ.వీ.ఎస్ అస్తమించారు. 

డిసెంబర్: 

పది జిల్లాలతో కూడిన తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రవేసింది. * నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. * ఢిల్లీలో 28 సీట్లు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీని స్టేట్ పార్టీగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. * దేశంలో 22 సిబిఐ కోర్టులు ఉండాలని సుప్రీంకోర్టు, నాలుగు నెలల్లోగా అవి పని చేయనారంభించాలని ఆదేశించింది. * హోమో సెక్సువాలిటీ నేరం అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గే సెక్స్‌కు సరేనన్న ఢిల్లీ కోర్టు తీర్పును తిరస్కరించింది. * ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా రామన్‌సింగ్, మధ్యప్రదేశ్ సి.ఎం.గా శివరాజ్ సింగ్ చౌహాన్, మిజోరం సి.ఎం.గా లాల్ తన్వావాలా (కాంగ్రెస్) ప్రమాణం చేశారు. * మత హింస నిరోధక బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. * తెలంగాణ బిల్లును రాష్టప్రతి రాష్ట్ర అసెంబ్లీకి పంపించారు. పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీ జనవరి 3కు వాయిదా పడింది. * నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మైసూర్ రాజ కుటుంబపు ఆఖరి రాజు శ్రీకంఠదత్త నరసింహరాజు వొడియార్ అస్తమించారు. 


ఇవీ ఇంతవరకూ నెలవారీ 2013లోని కొన్ని ప్రత్యేక అంశాలు. 

2013లో డిసెంబర్ నెలే - ప్రపంచ నేత నెల్సన్ మండేలా 95వ ఏట మృతి చెందారు. ఈ ఏడాది చైనా మూన్ రోవర్‌తో చందమామపై అడుగిడింది. 
అర్జెంటీనా, ఈస్ట్రన్ ఆస్ట్రేలియా, సెంట్రల్ యూరప్, జర్మనీ, జెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, పోలండ్, హంగేరీ, సెర్రియా ఈ ఏడాది కనీవినీ ఎరుగని వర్ష బీభత్సాలను మన దేశంతో బాటు ఎదుర్కొన్నాయి. 2020 ఒలింపిక్స్‌ను టోక్యోలో నిర్వహించే అవకాశం జపాన్ చేజిక్కించుకుంది. ఈజిప్ట్ ఆర్మీ అధ్యక్షుడు ముర్గీని త్రొలగదోసింది. శాస్తజ్ఞ్రులు మనిషి స్టెమ్‌సెల్స్‌ను క్లోనింగ్ చేశారు. అంగారకునిపై నీటి జాడలు బయల్వెడలాయి. 

భారత ప్రధాని ఏం చేసినా చేయకున్నా రష్యా, చైనా, జపాన్, జర్మనీ దేశాలు అధికారికంగా చుట్టబెట్టి వచ్చారు. 

తొలి మహిళా బ్యాంకు, మహిళా పోలీస్‌స్టేషన్, బిఎస్‌ఎప్‌లో మహిళా అధికారులు.. ఇలా మహిళా ప్రాధాన్యంగా ప్రత్యేకతలు సంతరించబడినా ఈ ఏడాది మహిళలపై జరిగిన అత్యాచార సంఘటనలు సభ్య సమాజం తలదించుకునేవిగా ఉన్నాయి. పసిపిల్లల నుండి వృద్ధ మహిళల వరకు నడిచే బస్సుల్లో నుండి ఏటీఎం సెంటర్లలో వరకూ అభద్రతతో పరివ్యాప్తమయ్యింది. 

కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో విశ్వాసం పూర్తిగా సన్నగిల్లుతోందన్న పరిణామాలు జరిగాయి. తెలుగువారి భవితవ్యం పెద్ద ప్రశ్నార్థకంగా నిలిచింది. 2014 ఎన్నికలకు రాజకీయ పార్టీలన్నీ తమదైన ఎత్తుగడలతో సంసిద్ధమవుతున్నాయి. అమెరికా రష్యాల అగ్రరాజ్యాధిపత్యానికి కూడా బీటలు తొంగి చూస్తున్నాయి. 

మానవీయ విలువల విషయంలో పతనం అంచులే ముందుకు వస్తున్న ఆర్తి కలుగుతోంది. దేశభక్తి మాట ఎలా ఉన్నా దైవభక్తి కొత్త పుంతలు తొక్కుతోంది. పాపాలు పెరుగుతున్న కొద్దీ ప్రక్షాళనలూ పెరుగుతాయంటున్న వారున్నారు. 

‘మేం గొప్పగా వున్నాం. ఆనందంగా ఉన్నాం. మాకేమీ సమస్యలు లేవు. సుఖశాంతులు మా సొంతం’ అన్న ధీమా, తృప్తి మాత్రం ఎవరిలోనూ నిండుగా ద్యోతకం కావడం లేదు. 

ఈ అసంతృప్తుల నుండి, అశాంతుల నుండి, లోలోన గుడుసుళ్లు తిరుగుతున్న 'ఇదియదియంచు తేల్చి వచియింపగరాని విషాదమేదియో ఎదలు కదిలిస్తున్న' ఏడ్పుల నుండి ఇక పాత ఏడు(పు)కి వీడ్కోలు పల్కుతూ, కొత్త సంవత్సరానికి ప్రతీక్షిస్తూ మానవాళి నిలబడి ఉంది. 

‘బిలీఫ్ ఈజ్ యువర్ గాడ్’ అంటాడు టాల్‌స్టాయ్. పొడుగాటి ఆ ఆశావహ దృక్పథంతోనే 2013కు వీడ్కోలు చెబుద్దాం. 
2014కు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ స్వాగతం పలుకుదాం!
బీ రెడీ! *

-సుధామ 



0 comments: