ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, November 25, 2011

హృదయ విద్య''స్వీయ లోపమెరుగుట పెద్ద విద్య
లోపమెరిగిన వాడె పూర్ణుడగునరుడు’’


అన్నాడు గాలిబ్. అందునా అరవై ఏళ్లు దాటాయంటే, జీవితానుభవం మరింత వివేకాన్ని ఇవ్వాలి! ఈ లెక్కన మన నేతలెందరో ఆ వయసుదాటీ- ‘సుఖరాము’లై, లోపా‘ముద్ర’లుగానే వుంటున్నారంటే- ఒక రకంగా విద్యా విహీనులనే చెప్పాలేమో!’’ అన్నాడు నవ్వుతూ రాంబాబు, పేపర్ టేబుల్ మీద పెడుతూ.


‘‘అలా అనకు! వారి లోపాలు, వారి వారికి తెలియక కాదు. లోపాలు ఎరిగినంత మాత్రాన చాలదుకదా! వాటిని అధిగమించగలగాలి. తన తప్పు తాను తెలుసుకుంటే సరిదిద్దుకుంటాడని- మనిషి గురించి భావించాడు కాబట్టే గాలిబ్ ‘‘లోపమెరిగినవాడె పూర్ణుడగునరుడు’’ అన్నాడు పాపం! కానీ- తెలిసి తెలిసీ, దానిని అధిగమించలేక తప్పులే చేస్తూ, ‘ఒప్పులకుప్ప’ల మనుకోవడం- ఇవాళ మామూలైపోయింది. ‘‘ఆఫ్టర్ ఫార్టీస్ ఎవ్విరీబడీ ఈజ్ ఎ ఫూల్’’ అని బెర్నార్డ్ షా కాబోలు అన్నాడు! అంచేత- ‘ఫూల్స్’ అందరూ ఒకచోట ‘పూల్’కావడంవల్లే, రాజకీయాలు భ్రష్టుపట్టి, అన్నిటికీ ఆ రాజకీయాలే మూలం కనుక- అన్ని రంగాలలోనూ ‘భ్రష్టత్వం’పాదుకుంటోంది. ‘యువరక్తం’, ‘యువ రక్తం’ అంటారు గానీ, ఆ ‘రక్తం’మటుకు రాజకీయాలకు ఎక్కించడం ఎందుకో సాధ్యంకావడం లేదు. ‘ఎందుకూ పనికిరానివాడు రాజకీయాలకు మాత్రమే పనికి వస్తాడు’ అన్న చందంగా- పరిస్థితులు నెలకొంటున్నాయి మరి’’ అన్నాడు శంకరం.


‘‘నిజమే! ‘యువశక్తి’మాత్రమే మార్పును తేగలుగుతుంది. నిజానికి యువశక్తిని అలా తీర్చిదిద్దవలసిన పెంపకం- అనుభవజ్ఞత పెద్దలది. కానీ ‘వృద్ధుల బుద్ధులు మందగించవే’ అన్నట్లుగా- తనకేకాక, తన పిల్లలకూ, తన పిల్లల పిల్లలకూ కూడా కూర్చుని తిన్నా తరగని ఆస్తి తానే సంపాదించి పెట్టాలన్న ‘ఆబ’-ఎప్పుడైతే ప్రవేశించిందో, అప్పుడే విలువల పతనం విస్తరించింది. ‘ఉద్దండ పండితులే గానీ- ఉండవలసిన బుద్ధులు మాత్రం లేవు’ అన్నట్లు, దిశానిర్దేశం చేయగల తరంలో ఒకవైపు నిజమైన మేధావులూ, విలువల ఆరాటపరులూ మటుమాయం అవుతూంటే, ‘పాపీ చిరాయువు’ అన్నట్లు, ప్రజలకు సందేశం సంకలించగల పెద్దల్లోని చాలామంది బుద్ధులే ‘పెడత్రోవలు’పట్టి, వారి అనుయాయుత్వమూ, వారసత్వమే విశృంఖలమవుతోంది! అటువంటప్పుడు ‘వివేకమైన విద్య’ గురించీ, ఆ విద్యవల్ల సంభవించగల సంస్కారం గురించీ ఆ సంస్కారం వల్ల బాగుపడగల సమాజం గురించీ, ఏం ఆశపెట్టుకోగలం?’’ అన్నాడు ప్రసాద్.


‘‘ఇదంతా వట్టి ట్రాష్! ఇప్పుడు అసలు విలువలూ సంస్కారమూ అంటూ మాట్లాడటమే ఒక వెర్రితనం’’ చేతకానివాడి కబుర్లు. ‘మంచితనం’ అంటే మందబుద్ధి అనీ, ‘నీతి’, ‘నిజాయితీ’ అంటే అసమర్థత, అమాయకత్వమనీ నేటి చెల్లుబడి! కాలానికనుగుణంగా కరకుదేలకపోతే వెనుకబడక తప్పదు. మార్పు అనేది కాలధర్మం. మీరే అంటారుగా ఇది ‘కలికాలం’ అని. కలికాలంలో మరి ఎప్పటివో త్రేతాయుగం మాటలూ, ధర్మపన్నాలు వల్లిస్తే ఏంలాభం? కొన్ని వినడానికీ, అనుకోవడానికి బాగుంటాయి కానీ, ఇవాళ ‘అనుష్ఠించడానికి’ వీలుకావు. కొన్ని కుదరవు, కొన్ని పనికిరావు. ఆ విషయం మరచిపోకండి! ఎప్పుడో అలా జరిగిందనీ, అదే మంచిదని’, ఇప్పుడూ అలాగే జరగాలనీ అనుకోవడం ఎంత కాదనుకున్నా అవివేకమే! ‘ఎంత చక్కనిదయినా గతమంతా ఒక స్వగతమే’ననీ, ‘మంచి గతమున కొంచెమేనోయ్’ అనీ గ్రహించాలి గానీ, ‘గత కాలము మేలు వచ్చు కాలముకంటెన్’అన్న ‘నాస్టాలిజీ’లో పడి, గతానుగతికంగా జీవించకూడదు. బావిలో కప్ప అదే ప్రపంచం అనుకున్నట్లవుతుంది’’ అన్నాడు సుందరయ్య.

‘‘మీరు చెబుతున్నది ‘బాగు’ అని; మీరే ‘బాగా’ అనుకుంటున్నారు గానీ, అది ‘బాగు’అని ఈ తరానికి నప్పడం లేదంటే- అలా భావించడంలోనూ ‘స్వీయలోపం’ వుందని గ్రహించగలిగితే అదే పెద్ద విద్య’’ అని కూడా అన్నాడు.


‘‘కావచ్చు సుందరయ్యా! కానీ కాలానుగుణంగా మారిపోవడం కూడా సాధ్యమయ్యే సంగతి కాదు! ‘గాలివాటుగా’, ‘ఏ ఎండకు ఆ గొడుగుగా’ బ్రతికేవారు బాగా సుఖపడితే పడవచ్చు. కానీ తనకంటూ ఒక నియమాన్నీ, జీవన గమనాన్నీ నిర్దేశించుకున్నవారికి తాము అనుకున్న విధంగా జీవించడంలోనే ఆత్మతృప్తి వుంటుంది. ఎంతకాదనుకున్నా ఎవడయినా తనకు నచ్చినట్లే బ్రతకాలనుకుంటాడు. అయితే తన ఆ బ్రతుకుతీరు అవతలివారికి బాధాహేతువూ, అనర్ధదాయకమూ అయితే ప్రతిఘటనలు ఎదుర్కోక తప్పదు. అందుకే ఏది నీతి? ఏది అవినీతి? ఏది ధర్మం? ఏది అధర్మం? ఏది మంచి? ఏది చెడు అన్నవి- ఎప్పుడూ సాపేక్షికాలే! అయితే సంఘజీవులం కావడంవలన, సామాజిక సూత్రాలు- సామాజిక న్యాయాలూ అంటూ కొన్ని వుంటాయి. ఇవాళ వాటికి ఎక్కువ విఘాతాలు కలుగుతున్నాయి అంటే, మనిషి నియమబద్ధ జీవితాలు ఎంత అతలాకుతలం అవుతున్నాయో స్పష్టమే! ఇప్పటికీ ఈ వైయక్తిక స్వార్థ వ్యవహారాలకూ, ప్రచారార్భటులకూ, కీర్తికండూతులకూ దూరంగా- తమదైన జీవన సరళిని సాగిస్తూ, ప్రశాంతంగా, హాయిగా, తమ మానాన తాము బ్రతుకుతున్న వాళ్లున్నారు. వచ్చిన దానితో తృప్తి పడి, ఇవ్వగలిగినది ఇచ్చుకుంటూ, తృప్తినీ ఆనందాన్నీ పుచ్చుకుంటూ, ‘షష్టిపూర్తి’ దాటినా ‘ఇష్టపూర్తి’గా జీవించగలగడం వారికి ఆనంద సంధాయకమే! అటువంటి వ్యక్తుల సమూహానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేయడమూ ఎద పూర్ణతే! హృదయవిద్యే’’ అన్నాడు రాంబాబు అర్థనిమీలిత నేత్రాలతో.

0 comments: