ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, April 13, 2013

చక్కని చమత్కారం







తిరుపతి వాసిగా, సాక్షిలో న్యూస్ ఎడిటర్ వృత్తి కళా పిపాసిగా వుంటున్న జి.ఆర్.మహర్షి సాక్షి సండేకాలమ్‌గా 2008-2010 మధ్య రాసిన నూటొక్క ఫన్‌డే వ్యాసాల సంపుటి నో ప్రాబ్లమ్.

హాస్యంగా కాలమ్ నడపడం తమాషా కాదు. వారం వారం సీరియస్‌గా పనిగట్టుకుని హాస్యం పండించడం నిజంగా తపస్సే. మహర్షి ఆ తపస్సే ఫలప్రదంగా చేసి పాఠకులకు హాస్యరసానందాన్ని పంచిపెట్టారు. ‘కాలమిస్ట్’కు సమాజగత ఏ అంశమైనా అవరోధం కాదు. కొబ్బరికాయ దొరికినట్టు దేనితోనైనా ఘనాన్ని ద్రవాన్నీ పీచుని (పీస్ అనగా శాంతిని కూడా) పంచిపెట్టగలడు. అయితే అందుకు వచనంలో ఎలాంటి ‘గంతులు’ వేసి నవ్విస్తున్నాడన్నది ప్రధానం. సంఘటనల్ని, సందర్భాల్ని ఎలాంటి సమస్యా లేకుండా హాయిగా హాస్యంతో జతకట్టి, మంచిగా వడకట్టి అందించడం గొప్ప ప్రజ్ఞ.

ఈ ‘కాలమ్’ వ్యాసాల్లో సాహిత్య, సాంస్కృతిక ,రాజకీయ, ఆధ్యాత్మిక ఒకటేమిటీ అనేకానేక రంగాల హంగుపొంగులున్నాయి. ఈ వ్యాసాల్లో కట్‌చేస్తే బాపతుగా సీన్లు, చివర్లో ఉపసంహారాలు అలాగే వ్యాఖ్యానాలు, ఉపాఖ్యానాలు కనబడతాయి. హాస్యం, వ్యంగ్యం, అధిక్షేపం, చమత్కారం పాళ్లకులోటే లేదు.
‘‘చిత్తూరు జిల్లాకు చెందిన ఒక అగ్రనాయకుడికి ఈ మధ్య భాష సమస్య పట్టుకుంది. వెనకటికి హైటెక్, కంప్యూటర్, నెట్, వౌజ్ అన్నారు. ఇప్పుడు కల్చర్, అగ్రికల్చర్, ఫార్మర్, పెస్టిసైడ్స్ అంటున్నారు. ఆయన చివరికి అటు కంప్యూటర్లకీ కాకుండా ఇటు రైతులకీ కాకుండా పోయారు. సభల్లో అది ఇదీ కలిపేసి ఆయన మాట్లాడుతున్నారు.


‘‘నా ప్రియమైన రైతులారా వౌజ్‌లు పట్టుకోవాలంటే తప్పనిసరిగా నెట్ వాడాలి. సాఫ్ట్‌వేర్‌కీ, వేరుశెనక్కాయలకీ దగ్గర సంబంధం ఉంది. హైటెక్ వ్యవసాయానికి ప్రోగ్రామింగ్ అవసరం. ఈ రకంగా మనం ముందుకు పోవాలి’’-ఇదీ ధోరణి.

పేరు చెప్పకపోయిన రాసిన రీతి నేత ఎవరో చెప్పకనే చెబుతుంది కదా! అదీ ఫణితి (ఒక బాధ కాదు)

తల పగలగొట్టుకోవడానికి టీవీ అయినా రేడియో అయినా ఒకటే అనే నీతిని అందించిన ‘రేడియో బర్ఫీ’ రచనలో ప్రైవేట్ ఎఫ్‌ఎం రేడియోల్లో జాకీల వాగుడుమీద మంచి సెటైర్‌తో రచన చేశారు. రేడియోవల్ల సౌలభ్యమేమంటే చిత్రమైన భాషను నేర్చుకోవచ్చు, వినచ్చు అని తీర్మానించి చూపారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్లు వేళ్లకి రాళ్లతో కూడిన అదృష్ట ఉంగరాలు పెడతారట. కొన్ని రాళ్లవల్ల డబ్బులు, మరి కొన్నింటివల్ల భూమి లభిస్తుందని నమ్మకం. బూమ్ పడిపోతే ఆ ఉంగరాలు అమ్ముకోవాల్సిందే. ఏతావాతా చివరికి రాళ్ల వ్యాపారం చేసేవారికి మాత్రమే నాలుగు రాళ్లు మిగులుతున్నాయి అంటారు ‘్ఫలాసఫర్స్ స్టోన్’లో.

‘డాగ్స్‌మాన్’లో కుక్కంకుల్‌తో టీవీ రిపోర్టర్ భాషణం మంచి సెటైర్. అలాగే నియంతృత్వం నిద్రలేస్తే ప్రజాస్వామ్యం పారిపోవాల్సిందే అని ‘జంగిల్ స్టోరీ’లో ఎన్నికల ‘బింగిల్’ ఊదారు. పంచతంత్రం కథల్లోలాగా జంతువుల్ని పాత్రలుగా సుతరించి ఈ కాలమ్స్‌లోని కొన్ని వ్యాసాల్లో మంచి హాస్యాన్ని పండించారు. 

‘టీవీ కమాండ్‌మెంట్స్’లో ‘జనాన్ని సులభంగా ఉతకాలంటే మీడియా సాయం తీసుకోవాలి. మీడియా వెంట మనమైనా పడాలి-మనవెంట మీడియా అయినా పడేలా చేసుకోవాలి. రెంటికీ మధ్యే మార్గం మనమే మీడియాగా మారిపోవడం’ అంటూ భలేగా చెప్పారు.

ఎప్పుడో రాసినవైనా చదువుతుంటే ఇప్పటికీ తాజాగా విరాజిల్లుతూ గిలిగింతలు పెట్టే కలం రేఖలివి. 'నో ప్రాబ్లమ్' హాయిగా చదివి ఎంజాయ్ చేయవచ్చు.


-సుధామ
13/04/2013

నో ప్రాబ్లమ్
(సాక్షి సండే కాలమ్ వ్యాసాలు)
-జి.ఆర్.మహర్షి
అబ్బూ పబ్లికేషన్స్,
వైష్ణవి టవర్స్-506,
కె.టి.రోడ్డు, తిరుపతి
వెల: రూ.200/-


2 comments:

కథా మంజరి said...

మీరు చేసిన పుస్తక పరిచయతోనూ , అట్ట మీది బొమ్మని చూసేక,
వెంటనే పుస్తకం చదవాలనిపిస్తోంది. లోగడ చదివినవే అయినా దాచుకుని మరీ మరీ చదివే వ్యంగ్య కథనాలు మహర్షివి. మీకూ, వారికీ కూడా అభినందనలు.

పతంజలి తరువాత అంత వాటంగా వ్యంగ్యాన్ని రాయడానికి ప్రయత్నించిన వారిలో మహర్షి గారు చాలా వరకూ కృతకృత్యులయ్యారనే చెప్పాలి.

సుధామ said...

మీ సహృదయ వ్యాఖ్యకు ధన్యవాదాలు జోగారావు గారూ!