ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, February 17, 2012

చదువులెందుకో!‘‘ఈ చదువులు కాదు గానీ, విలువలు ‘చట్టుబండ’లవుతున్నాయి. ఆడుతూ పాడుతూ హాయిగా మానసిక వికాసంతో విజ్ఞానం సంపాదించవలసింది పోయి, ఈ ఒత్తిడులేమిటో తెలీడం లేదు! పరీక్ష ఫెయిలయితే ఆత్మహత్య. లేకపోతే పరీక్షలో ఫెయిల్ చేసిన టీచర్ హత్య. ఎటు పోతోందో ఈ విద్యావిధానం’’ అన్నాడు పేపర్ పక్కన పెడుతూ నుదురుకొట్టుకుంటూ రాంబాబు.


‘‘బావుందోయ్! రోజులు అలాంటివి. బయట ఎంత పోటీ ప్రపంచం వుంది. ఆ పోటీలో నెగ్గుకుని నిలబడాలంటే పిల్లలు కష్టపడకపోతే ఎలా? తమ పిల్లలు పైకి రావాలని కోరుకునే తల్లిదండ్రులు- వాళ్ల చదువుల గురించి ఆరాతీయకుండా ఎలా వుంటారు? తల్లితండ్రులిద్దరూ ఉద్యోగస్తులవడంతో, పిల్లల చదువులోని ఎదుగుదలకు విద్యాలయాల్లో టీచర్లకూ బాధ్యత పెరిగింది మరి. అదీకాక ఇవాళ పెద్ద చదువులు చదివిన వారికే తగిన ఉద్యోగాలు దొరకాలంటే- అక్కడపోటీనాయె!’’ అన్నాడు ప్రసాదు.

‘‘నాకు తెలియక అడుగుతాను అసలు చదువు ఎందుకర్రా!’’ అడిగాడు సుందరయ్య.

‘‘ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను. ఏ చదువువల్ల చేప పిల్లలీదగలిగెను... అని పాట ఎత్తుకుని, చదువురాని వాడవని దిగులు చెందకు’ అని అనేసేట్లున్నావు నువ్వు సుందరయ్యా! కానీ చదువు రాకపోతే- మనుగడే లేదు. ఉద్యోగాలు దొరక్క, అడుక్కుతినాల్సి వస్తుంది.’’ అన్నాడు ప్రసాదు.

‘‘నీ మాటల్లోనే చెబుతున్నావ్‌గా! నీలాగానే ఇవాళ నూటికి తొంభై శాతం మందికి- ‘చదువు’ అనేది ‘ఉద్యోగం’కోసం, ‘ఉపాధి’కోసమే. ఎంత పెద్ద చదువులు చదివితే- అంత పెద్ద ఉద్యోగాలు వస్తాయనే విశ్వాసం. కానీ- విద్య విజ్ఞానంకోసం, జీవన వికాసంకోసం అన్న విషయమే ఎవరూ తలవడం లేదు. ‘కెరీర్’తో ముడిపెట్టి తప్ప, చదువు గురించి తలపోయడం లేదు. విద్యావిధానం ఇంత ఒత్తిడుల మయం కావడానికి మరి అదే కారణం!’’ అన్నాడు సుందరయ్య.

‘‘అలాంటి ఇలాంటి ఒత్తిడి కాదు. మునుపు అయిదేళ్లు వస్తే గానీ పిల్లల్ని బడికే పంపేవారు కాదు. ఇవాళ ప్రీ స్కూల్స్, ప్లే స్కూల్స్ అంటూ ఏడాది వయసు నుండే బడులకు పంపేస్తున్నారు. ఏడవ తరగతి, పదవ తరగతి తొలి పెద్ద ‘టెన్షన్లు’. ఇక ఆ తరువాత ఇంటర్మీడియట్, ఎంసెట్ కోచింగ్‌లు అంటూ పిల్లలను ఊదరగొడుతున్నాం. తల్లితండ్రులు తమ పిల్లల్ని హాస్టల్లో చేర్పించయినా సరే, ర్యాంకులతో ఉత్తీర్ణుడవ్వాలని ఉబలాటపడుతున్నారు. మరి పిల్లల మీద ఒత్తిడులు పడకుండా ఎలా వుంటుంది’’ అన్నాడు రాంబాబు.

‘‘ ‘మునుపు ఇలా లేదు- ఇప్పుడే ఇలా వుంది’ అని అందరూ ఒప్పుకుంటున్నదే! కానీ దానికి హేతువు ఆలోచించావా? మునుపు నిజంగానే చదువు ‘విజ్ఞానం’కోసం, ‘వికాసం’కోసం. ఆ రోజుల్లో ‘భుక్తి’కోసం చదువు అనేది ప్రబల లేదు. మహిళలయితే ఇంట్లో రామాయణ, భారత, భాగవతాలు చదువుకున్న వారై వుండీ, పిల్లల్ని సంస్కారవంతులుగా పెంచారు. వ్యవసాయం చేసుకుంటూ... తన తదనంతరం పిల్లలూ అదే పనిచేస్తారనీ, చేసేలాగా రైతు ఆలోచిస్తే- ఇతర వృత్తులు కూడా వంశపారంపర్యంగా కొనసాగుతూ వచ్చేవి. ఆ వృత్తులమీద ఆధారపడే- వారి జీవిక సాగిపోతూండేది. అంచేత ‘కుల వృత్తులు’ నమ్ముకుని బ్రతికిన ఆ రోజుల్లో, ‘చదువు’ జ్ఞానం కోసమూ, తెలివితేటలు అభివృద్ధి చేసుకోవడం కోసం మాత్రమే ప్రధానంగా వుండేది. చరిత్ర చెప్పిన సత్యం ఏమిటంటే- బ్రిటిష్ పాలనలోనే ‘గుమస్తా’ చదువులు వచ్చి పడ్డాయి. ‘గుమస్తాగిరీ’ అంటే- దొరల దగ్గర పనిచేయడం అనేది, ఒక ‘గొప్పగా చెలామణిలోకి వచ్చింది! అదిగో! అది మొదలు తమతమ కుల వృత్తులతో సంబంధం లేకుండా, వాటికి అతీతంగా, ప్రభుత్వోద్యోగాల మోజుతో, విద్య ఉద్యోగంకోసం అనే సిద్ధాంతం పాదుకుంటూ వచ్చింది. కూలివాడి కొడుకు కూలివాడుగా వుండరాదనీ, కలెక్టర్ కొడుకు కలెక్టరే కావాలనీ రూల్ లేదనీ- విద్యావిధానం ఉద్యోగ సంవిధానానికే ప్రాతిపదికలు వేసింది. నిజానికి ఎవరి వృత్తులు వారు చేసుకుంటూ, సంఘ జీవనానికి దోహదంగా అందరూ వుంటూండిన ఆ రోజుల్లో ‘చదువు’గురించిన ఒత్తిడులు లేవు. అప్పుడు ‘చదువం’టే ఓ గొప్ప! ఓ హోదా! ఓ మోజు. గిరీశం వెంకటేశం ఇంగ్లీషులో మాట్లాడుకుంటే- అదేమిటో తెలియకపోయినా, వెంకటేశం తల్లి ‘కన్యాశుల్కం’ నాటకంలో సంబరపడిపోయినట్లు, తమ పిల్లలకు ‘నాలుగు అక్షరం ముక్కలు’ అబ్బాయంటే అదో సంతోషం! కలెక్టర్ ఆఫీసులో బంట్రోతు ఉద్యోగమయినా గొప్పే అన్న వాతావరణం బ్రిటిష్ విద్యావిధానంతో అంకురించిందే! కానీ ఇప్పుడు ప్రభుత్వోద్యోగాలకంటే ప్రైవేట్ ఉద్యోగాలు, అందునా కార్పొరేట్ ఉద్యోగాల మోజే ఎక్కువ! అందుకు సన్నద్ధం చేసేందుకే ఇవాళ చదువుల యుద్ధాలు... పోటాపోటీలు! ఒత్తిడులు!! ‘చదువుకీ ఉద్యోగానికీ సంబంధం లేదని అందరికీ తెలుసు వాస్తవంలో. చదివిన చదువు వేరు, నిజంగా చేసే ఉద్యోగంలో దాని అవసరం వేరు గానే నేటికీ అధిక శాతం కొలువులున్నాయి. ప్రతిభ, తెలివి తేటలు, వ్యక్తిత్వ వికాసం, పని సామర్థ్యం కేవలం చదువులతోనే ముడిపడి వుండవు. ఫస్ట్ ర్యాంక్‌లో డిస్టింక్ట్‌లో పాసయినవాడు- వ్యక్తిగా పిరికివాడు, చొరవలేని వాడు కావచ్చు. బిడియస్తుడుగానే వుండవచ్చు. డిగ్రీల కొలతల్లో, చదువుల్లో మామూలుగా పాసయినవాడు- పనిచేసే సామర్థ్యంలో, పట్టుదలలో, తెలివితేటల్లో, నిజాయితీలో, అధికుడై వుండచ్చు. అంచేత ముందు ‘మనిషి మనిషిగా’ ఎదగాలి!బ్రతుకు తీపిని ఆస్వాదించగల సమర్థుడిగా బతకాలి. ఒత్తిడులు, నిరాశలు అధిగమించి, ఉత్సాహంగా, కలివిడిగా తనకోసమే కాదు నలుగురి మేలుకోసం నిస్వార్థంగా, నిజాయితీగా, పనిచేసేవాడుగా వుండాలి. మానవీయ విలువలను పరిరక్షించలేని విద్యావిధానం ఎంత గొప్పదయినా దండగే! ‘‘నవీన విద్యాభ్యాసాలు వేళ్లకు బంగారు ఉంగరాలు తొడుగుతున్నాయేమోకానీ మణికట్టు దగ్గర నరాలనే బలహీనం చేసేస్తున్నాయి’’ అన్నమాట నిజం! మరి ఎప్పటికో మార్పు’’ అంటూ లేచాడు సుందరయ్య.

(17/02/2012 ఆంధ్రభూమి దినపత్రిక)


4 comments:

Unknown said...

Very good analysis on the present trends in Education and the job oriented mentality of parents
-Amballa Janardhan

శ్రీరామ్ said...

సుధామ గారు, చాలా బాగా విశ్లేషించారు.

jeedigunta said...

sudhamagaru,
chaduvula meeda mee vyasam chaalaa bagundi

Jeedigunta venkatarao

jeedigunta said...

sudhamagaru,

chaduvula meeda mee vyasam chaala bagundi

Jeedigunta