ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Monday, September 26, 2011

సరదా లోకం!చాలా సీరియస్‌గా సాహిత్య రచన చేసే రచయిత- వ్యక్తిగా, కుటుంబికునిగా అంత సీరియస్‌గానూ ఉండాలని నియమమేమీ లేదు. జనాన్ని నవ్వించే ఛార్లిచాప్లిన్ వెనుక విషాదరేఖ లుండడం ఎంత సహజమో అభ్యుదయ, విప్లవ పథగాములయిన సాహిత్యకారుల జీవితాల వెనుక అంత సరదా తనమూ, హాస్యప్రియత్వమూ వుంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.


కవిగా, రచయితగా అబ్బూరి వరదరాజేశ్వర రావు గారు సుప్రసిద్ధులు. శ్రీశ్రీ, ఆరుద్ర, వరదా కలిసి ‘మేమే’ అని కవిత్వాన్ని పలవరించినవారు కూడాను. వరద రాజేశ్వరరావు గారు స్వభావరీత్యా అభ్యుదయ కవి. గొప్ప తార్కిక సంపత్తి గలవారు. ఎం.ఎన్ రాయ్ ఫిలాసఫీ వంటబట్టించుకున్నవారు. ఒకజర్నలిస్టు, గొప్ప కాలమిస్టు కూడాను. అలాంటి వరదరాజేశ్వరరావు గారు వ్యక్తిగా, గొప్ప హాస్య, చమత్కార ప్రియుడు. ఆ విషయం ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారికి తెలుసుకానీ మిగతా వారికెలా తెలుస్తుంది.

వరదగారి శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు భర్త హాస్యప్రియత్వాన్ని రికార్డు చేయ సంకల్పించడం ఒక మంచి పూనిక. వరదలెత్తిన సరదాలకు పాఠక హృదయ క్షేత్రాలు రసప్లావితమయ్యేందుకు ఇలా గ్రంథరూపంగా ప్రాజెక్ట్ నిర్మించడం ఎంతో బాగుంది!

ఆయన హాస్య సుభాషణా చాతుర్యం ‘పన్‌డిట్’ వరదోక్తులు పేర ఛాయాదేవిగారు సంకలనం చేశారు.

వరద హాస్యోక్తులు ఛాయాదేవి గారికి ఇంటా బయటా కూడా బాగా తెలుసు. అలాగే వాసుదేవ దీక్షితులు, నగ్నముని, అబ్బూరి గోపాలకృష్ణ, భద్రిరాజు కృష్ణమూర్తి, నేరెళ్ళ వేణుమాధవ్ గారలు గుర్తు చేసిన వరద హాస్యోక్తులను కూడా ఛాయాదేవి గారు ఇందులో కూర్చారు.

ఎ జోక్ ఈజ్ ఎ జోక్ ఈజ్ ఎ జోక్ ఈజ్ ఎ జోక్ అన్నట్లు హాస్యోక్తులను యథాతథంగా అందుకుని నవ్వుకోవాల్సిందే గానీ వ్యాఖ్యానం చేస్తే జోక్ జోక్ కాకుండా పోయే డేంజరుంది.

పన్‌డిట్ వరదోక్తులులో ఛాయాదేవిగారు అందించిన మచ్చుకి కొన్ని

* దారిలో ఎవరో మిత్రుడు కలిసి ఎక్కడికి వెళ్తున్నారని ‘వరద’ని అడిగితే ‘సాని కొంపకి’ అన్నారు. అదేమిటని ఆయన నిర్ఘాంతపోతే ‘‘సాటి నియోగి కొంపకి’ అని ‘బూదరాజు రాధాకృష్ణ గారింటికి’ అని స్పష్టం చేశారు.

* ఎవరెవరు ఏ కారణంగా చనిపోయినదీ ఎవరో మిత్రుడు చెబుతుంటే ‘‘నిష్గారణంగా ఎవరూ చచ్చిపోరు!’’ అన్నారు.

* స్నేహితులతో మాట్లాడటానికి బోలెడు కబుర్లుంటాయి. మీకు నాతో మాట్లాడటానికేం కబుర్లు ఉండవా? అని నేను నిష్ఠూరంగా అన్నానొకసారి. ఆయన గంభీరంగా మొహo పెట్టి ‘‘ఆఁ అన్నట్లు కెనడీ ఏవంటున్నాడు?’’ అన్నారు ఇంక సంభాషణ మొదలుపెట్టమన్నట్లు.

* ఒకసారి రావిశాస్ర్తీ వరదని ఎవరిదో షష్ఠిపూర్తి కలెక్షన్ పూర్తయిందా అని అడిగితే ‘షష్టిపూర్తి అయిపోయింది గాని ముష్టిపూర్తి ఇంకా కాలేదు’’ అన్నారుట వరద.

* కవి సమ్మేళనం = కౌస్ గేదరింగ్
ఎక్స్‌టెన్షన్ లెక్చర్ = అధిక ప్రసంగం


* ఎన్.టి. రామారావు గారు ముఖ్యమంత్రి కాగానే ‘‘ఇక మనందరం సోదరసోదరీముణులారా అనడానికి బదులు ‘‘చౌదరి, చౌదరీ మణులారా అని సంబోధించాలి కాబోలు’’ అన్నారుట వరద.

నూటయాభై ఆరు పేజీల ఈ సంకలనం సరదాల లోకంలో మనల్ని విహరింపచేస్తుంది.

రకరకాల చేతి కర్రలు పోగు చేయడం హాబీ అయిన ఆయన ఒక సభకు చేతికర్రతో వెడితే ‘‘అప్పుడే కర్ర పట్టుకున్నారేమిటి?’’ అన్నారెవరో. వెంటనే వరద ‘‘కట్టెలే చుట్టాలు కదా’’ అన్నారు. సరదాల నుండి జీవన తాత్వికతను పిండగల సమర్థుడాయన. అ‘బ్బూరి’ల తట్ట ఈ పుస్తకం.

పన్‌డిట్ వరదోక్తులు
సంకలనం:
అబ్బూరి ఛాయాదేవి
వెల: రూ. 150/-
విశాలగ్రంధశాల, 3-4-376/5
లింగంపల్లి, హైదరాబాద్-37

(ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం 'అక్షర 'లో ప్రచురితం 25.9.2011)

2 comments:

Gomati Dittakavi said...

Chala bavundandi. Kadupubba navvukunnanu. Ninnane oka karyakramamlo abbori chayadevi garini kalise avakasam dorikindi. ivvalla mee balgulo vari hasyoktulu chaqdavadam naa adrishatam. Shastipurti satire, choudari choudari manulara chala bavunnayi. ivi nenu modati sari vinnanu. Dhanyavadalu sudhamagaru. ilant sudhamadhuralani maaku inkenno andimchalani korukuntu...
mee,
gomati

Prasad Cheruvu said...

అత్యంత మేధాసంపత్తి కలవారికే హాస్యాన్ని పుట్టిచగల సామర్ధ్యం వుంటుంది.శ్రీమతి అబ్బూరి ఛాయాదేవిగార్కి, వరదరాజేశ్వర రావు గార్కి నమస్కారములు.