ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, April 5, 2013

అచ్చులో అవయవాలు- ముద్రణలో మనుషులు




‘‘అచ్చు’ గుద్దినట్లున్నాడు సుమా!’’ అని ఒక్కోసారి ఓ మనిషి గురించే మాటాడుకుంటూంటాం. ‘అచ్చు’అంటే ‘ముద్రణ’. ఒక పుస్తకం కొన్ని వేల ప్రతులు ముద్రించినా, ఒక్కలానే వుంటుంది. కానీ తమాషా!- బ్రహ్మగారు ఎందరు మనుషులను సృష్టించినా, ఆ మనిషి అనే ‘ప్రతి’, ప్రతి మనిషికీ తేడానే! లోకంలో ఒక్క పోలిక నుండేవారు ఓ ఏడుగురు మహా అయితే వుంటారంటూంటారు. ఇంతకీ బ్రహ్మగారు మనుషుల్ని ఏ ప్రింటింగ్ ప్రెస్‌లోనో ముద్రించలేదు. కళ్లూ, ముక్కూ, చెవులూ మానవ అవయవాలన్నీ సమానమే అయినా, మళ్ళీ ఎవరివి వారివే! కనుముక్కు తీరు చూసి ఎవరు ఎవరో గుర్తుపట్టేంత వైవిధ్యం వుంది. అంచేత కోట్ల కోట్ల కోట్ల మనుషులున్నా- ఏ మనిషి ప్రత్యేకత వాడిదే. ఎవడి శరీర ఉపాధి వాడిదే. అంతుబట్టని ఈ సృష్టి వైవిధ్య రహస్యం- అందుకే ‘బ్రహ్మపదార్థం’ అంటు న్నాం! ప్రతి మనిషీ బ్రహ్మపదార్థమే! కానీ ఏ పదార్థం రుచి దానిది.’’ అన్నాడు చిన్మయముద్ర ధరించినట్లుగా సుందరయ్య.

‘‘నాయనా సుందరయ్యా! ఈ చైతన్యస్వామి భావనలేమిటి నాయనా హఠాత్తుగానూ! ఎందరు మానవులున్నా- ఏ మానవుడి ఉనికి, అస్తిత్వం, వర్తనం, ఉద్దీపనం వాడిదే అన్నమాట నిజం! ఒకడికి మరొకడు నిజానికి అన్నీను. కానీ నిజానికి ఏమీకాడు కూడాను. ఎవడికి వాడే? ఎంత సంఘజీవి అన్నా- ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక? ఏ దారెటుపోతుందో ఎవరినీ అడగకా?’ అన్న మాటే యథార్థం. అంతేకాదు! నిజంగా ఒక్కోసారి- ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం- ఆత్మతృప్తికొరకు మనిషి ఆడుకునే నాటకం’ అన్న కవి పలుకూ వాస్తవమే అన్పిస్తుంది! నిజానికి ఒకరివల్ల మరొకరికి జరగగల మహోపకారానికి కూడా, ఎందరు సిద్ధంగా వుంటున్నారు చెప్పు’’ అన్నాడు ప్రసాదు.

‘‘అదేమన్న మాట? మనుషులు కాకపోతే ఒకరికొకరు ఎవరు సాయపడతారు? ఎదుటివాడితో తనకు అవసరం వుండదు, పడదు అనుకోవడం సరికాదు. ఎవరితో ఎప్పుడు ఏం పని పడుతుందో చెప్పలేం? పరస్పరం ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం మానవీయం కదా!’’ అన్నా డు శంకరం.

‘‘కానీ ఆ స్పృహ ఎందరిలో వుంటోంది? అంతెందుకు? రక్తదానం, నేత్రదానం, అవయవదానం అనే మహత్తరమైన- సాటి మనిషికి ఉపకరించే సామర్థ్యం, సంపదా ప్రతి మనిషికీ వున్నాయ్! అంతెందుకు? ఒకరు ప్రమాదకారణంగానో, సహజంగానో, మృతి చెందినా- నిజానికి ఆ మనిషి కనులు, కాలేయం, మూత్ర పిండాలు, గుండె వంటి వాటిని సకాలంలో తొలగించి భద్రపరచి, అవసరమైన వేరొక మనిషికి- ఆ మనిషిని తత్సంబంధిత అనారోగ్యం నుండి రక్షించి ప్రాణదానం చేయడానికీ, పునరుజ్జీవింపచేయడానికీ, పనికివచ్చేలా వాడుకోవచ్చు! అలా అవయవదానం చేయగల అవకాశం వుండీ, బంధువులు, మిత్రులు సహకరించక, ఆ మృతజీవిని అలా సర్వావయవ సమన్వితంగానే దహనం చేయడమో, ఖననం చేయడమో చేస్తారేగానీ, మరణానంతరం ఉపయుక్తమయ్యే విధంగా, సదరు శరీరాన్ని వైద్యపరం చేయగల జాగృతి ఎందరిలో వుంది? నిజంగా గుండె మార్పిడి, మూత్ర పిండాల మార్పిడి, కాలేయ మార్పిడి, బోన్ మారో మార్పిడి వంటివి అవసరమైన రోగులు ఎందరో వున్నారు. వారికి ఆ అవయవాలు దానంగా లభిస్తే పునరుజ్జీవనం పొందగలిగేవారున్నారు!’’ అన్నాడు ప్రసాదు.

‘‘అక్కడికే వస్తున్నా! ఇప్పుడు కావలసిన అలాంటి అవయవాలు ‘ముద్రించి’ అమర్చే, వైద్య విజ్ఞానం వచ్చింది. కొనే్నళ్లుపోతే-‘‘గుండె, కాలేయం, మూత్రపిండాలు కావా లా? కొంటారా?’’ అటూ అలాంటి ముద్రిత అవయవాలు అమ్మే రోజులు కూడా వచ్చేస్తాయేమో! కృత్రిమ ముఖానే్న ముద్రించి అమర్చడంలో వైద్యులు విజయం సాధిస్తున్నారు. లండన్‌లో నాలుగేళ్ళ క్రితం - కేన్సర్ వల్ల కన్ను, దవడతో సహా ముఖంలో ఎడమ భాగాన్ని కోల్పోయిన ‘ఎరిక్‌మోగర్’ అనే అరవై ఏళ్ళ వ్యక్తికి, బ్రిటన్ వైద్యులు త్రీడీ ప్రింటింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త ముఖాన్ని ‘అచ్చు’వేసి, శస్తచ్రికిత్స ద్వారా అతికారు. ఎరిక్‌మోగర్ ఎడమ భాగంలో ఒక కణితి ఏర్పడి, అది కేన్సర్ కణితిగా గుర్తించి, అత్యవసర శస్తచ్రికిత్స ద్వారా తొలగించినప్పుడు, అతని ఎడమ కన్ను, దవడ ఎముక తీసేయవలసి వచ్చింది. దాంతో ముఖం భయంకరంగా కనబడసాగింది. ఇటీవలి కాలంలో కొత్త పుంతలతో అందుబాటులోకి వచ్చిన - ‘అవయవాల త్రీడీ ముద్రణ పరిజ్ఞానంతో’, స్కానింగ్ ద్వారా అతడి పుర్రె కొలతలు తీసుకుని, కంప్యూటర్ మోడలింగ్ ద్వారా, ఈ వయసులో సహజంగా అతని ముఖం ఎలా వుంటుందో సృష్టించి, దాన్ని త్రీడీ ప్రింటింగ్ యంత్రానికి అనుసంధానం చేసి, నైలాన్ ప్లాస్టిక్‌తో కృత్రిమ ముఖాన్ని పొరలుపొరలుగా ముద్రించి దాన్ని అతనికి అమర్చారు. అలా ప్రింట్‌చేసిన ‘అచ్చుముఖం’ అమర్చుకున్నాక- మునుపటిలా ఏదైనా తాగితే బయటకు వచ్చేయడం, ఎవరితోనైనా మాట్లాడితే ఎడమ చేతిని దన్నుగా పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం లేకుండా, మంచినీళ్ళు త్రాగినా బయటకు రాకుండానూ, హాయిగా మునుపటిలా మాట్లాడటానికీ వీలు చిక్కిందిట. ఇలా ముద్రిత ముఖమే కాదు, మున్ముందు- ఎవరి శరీరంనుండి వారికే కావలసిన ఏ అవయవాన్నయినా, త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో ముద్రించి వినియోగించే అవకాశం ఆరోగ్య వైద్య విధాన రంగంలో అందుబాటులోకి వస్తోంది! అంచేత ‘అచ్చుమచ్చు మనుషులు’ భవిష్యత్తులో బోలెడు మంది తారసపడవచ్చు’ అన్నాడు సుందరయ్య.

3 comments:

rammohan thummuri said...

It is nice

సుధామ said...

Thank you rammohan thummuri garu.

సుధామ said...

Naa Kritajnataarpita padmaarpita garu!