ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, March 30, 2013

సందేశాల సారం



తెలుగు కథానిక వికాసం కోసం అవిశ్రాంత కృషి సల్పే వేదగిరి రాంబాబు వౌలికంగా సృజనశీలి. కథల కార్యకర్తగా గురజాడకు, శ్రీపాదకూ ఈతరంలో నిజమైన నివాళిని కార్యరూపంలో ప్రస్ఫుటీకరించినవాడు. ఈ పనుల్లో పడి తన గురించి, తన సృజన గురించి అశ్రద్ధ పెడుతున్నాడని శ్రేయోభిలాషులకు అన్పించినమాట నిజం. ఎలాగయితేనేం, మొత్తానికి షష్టిపూర్తి సమారోహవేళకు తన కొత్త కథల సంపుటి తీసుకువచ్చాడు. ఇందులో ఇరవై కథలున్నాయి. కాదు కాదు.. కథానికలున్నాయి. అంటే చిన్నకథలనే కాదు, వస్తు శిల్పాలలో వైవిధ్యం సంతరించుకున్నవి ఈ రచనలు.


రాంబాబుకు ఉత్తమ పురుషలో కథ రాయడం ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది. నిజానికి రచయిత ప్రత్యక్షంగా సన్నివేశంలో వుంటూ రచన చేయడం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే అందులోని మంచి చెడులకు మిగతా పాత్రల అస్తిత్వానికి బాధ్యత వహించవలసి వుంటుంది. సమాజంలోని, మనుషుల్లోని ఒక కోణాన్నో, సత్యాన్నో చూపుతూ ఆలోచనాత్మకంగా చెప్పడం తన కలం విన్నాణం.

గ్లోబల్ హాస్పిటల్‌లో వృత్తిరీత్యా అతనికి వైద్యరంగంతో గాఢమైన సంబంధం ఏర్పడింది. అదెంతటిదంటే వైద్యులకుండే ఆయా అంశాలమీద అవగాహన రాంబాబుకూ ఏర్పడేటంత. డాక్టర్ వేదగిరి రాంబాబు అంటే- ఆ డాక్టరేట్ సాహిత్యంలో పరిశోధన ద్వారా వచ్చింది కానీ వైద్యుడు కాదాయన. కానీ, ఎవరూ అలా అనుకోరు. అలా అనుకోకపోవడానికి మెడికల్ ఫీల్డ్‌తో అతని మమేకత్వం కూడా హేతువే మరి.

అవయవ దానంపై ఇందులోని ‘తల్లి’ కథ గొప్ప స్ఫూర్తిమంతమైన రచన. స్కూటర్ ప్రమాదంలో కొడుకు ప్రాణాపాయంలో పడినప్పుడు అతడి శరీరావయవాలను తొమ్మిదిమందికి దానం చేయడానికి సిద్ధపడిన రమ- ‘యాక్సిడెంట్ చేసి ఒక్కగానొక్క కొడుకును నీకు లేకుండా చేసాను. నన్ను క్షమించు‘ అన్న భర్తతో ‘‘నాకు పిల్లలు లేకపోవడమేమిటి? మా వాడి అవయవాలున్నవాళ్ళందరూ నా పిల్లలు కారా? నాకు తొమ్మిదిమంది పిల్లలు ఇప్పుడు’’ అనడం నిజంగా మానవీయతకు ఎత్తిన కారుణ్య కేతనం.

అలాగే, ‘గొప్పదానం’ కథలో ఏ గుండె మార్పిడియో అవసరమైనప్పుడు, మూత్రపిండమో మార్చవలసిన అగత్యం కలిగినప్పుడు డబ్బు దొరికితే చాలు, మార్పిడి శస్త్ర చికిత్స జరిగిపోతుందని చాలామంది భావిస్తూంటారు. కానీ, డబ్బు కన్నా అవయవం దొరకడం కష్టం అని చెబుతూ పేదరికం వెనుక దాగిన నిజాయితీని రాజయ్య పాత్ర ద్వారా చిత్రించాడు.

అలాగే, ‘అర్ధాంగి’ అంటే భర్తలో సగం అని. భార్యను ‘అర్ధాంగి’ అంటాం. సుకన్య భర్త ప్రభాకరం డయాబిటిస్, లివర్ ట్రబుల్‌తో సతమతమవుతూంటే భర్తకు ‘ఇన్సులిన్’ చేయడం నేర్చుకోవడం మటుకే కాదు అతనికి కాలేయం, మూత్రపిండాల మార్పిడి అనివార్యం కాగా తన కాలేయంలోని కొంత భాగం, తనదొక మూత్రపిండం ఇచ్చి అతడిన బతికించుకుని నిజంగా సగం శరీరావయవాలు భర్తకు దానం చేసి ‘‘అర్ధాంగి’’ అయింది.

ఇలా వైద్యపరమైన సమాజోపయోగమైన సందేశాలను కథలుగా మలచి మెప్పించాడు రాంబాబు.

తండ్రీ కొడుకుల మధ్య అనుబంధ రేఖని ‘తేడా’ కథలో చూపుతూ తండ్రి చెప్పించకపోయినా తనంత తాను (సాహిత్య పరిశోధనలో) డాక్టర్ అయ్యానన్నది కొడుకు అహంకారమైతే, తాను చెప్పించలేకపోయినా వైద్య శాస్త్రంలో కాకున్నా మొత్తానికి తన కొడుకు డాక్టరయ్యాడన్న ఆ నందం తండ్రిది.

మంచి ఆరోగ్యం కోసం శరీరావయవాలను కాపాడుకోవాలని చెప్పదలచి కథకుడు రాసిన కథ- డబ్బు కోసం అవయవాన్ని అమ్ముకోవచ్చన్న సందేశం ఇచ్చినట్లవడంతో పాఠకుడి ద్వారానే కనువిప్పు కలిగి ఇకముందు ‘అస్పష్ట ప్రతిబింబాల్ని’ రచనలుగా అందించనని రచయిత నిశ్చయించుకున్న కథ నిజంగా కథకులందరికీ కనువిప్పు వంటిదే.

కొడుకు మృత్యువు గురించిన భయమే తండ్రి ప్రాణం తీసిన కథ ‘్భయం.'

' ఎంతెంతదూరం’ కథలో చిన్నప్పుడు దాగుడుమూతలాటలనాటి జతగాడినీ గుర్తుంచుకుని ఢిల్లీ నుంచి పల్లెకు వచ్చినపుడు అతడు, అతడి భార్య దివిసీమ ఉప్పెనలో మరణించారనీ వాళ్ల పసిపాప శాంత అనాథ అయిందనీ తెలిసి శారీరకంగా సంతాన యోగ్యత లేని భవాని ఆ పాపను పెంచుకోవడమనే ఉదాత్తతను చిత్రించారు.

ఇతరులను అప్రతిష్ఠపాలు చేయాలని అసూయద్వేషాలతో రగిలే మనస్తత్వం గలవాడు చివరకు ఎలా భంగపడతాతో చెప్పే కథ ‘వీక్‌పాయింట్’. అమెరికాలో వున్న కొడుకు వచ్చేవరకు భర్త మృతదేహాన్ని భద్రపరిచే సమయం కూడా దొరక్క అసలు పెద్దకొడుకూ పోయాడని తెలీక సీతమ్మ పడిన కష్టాలు ‘రెండు ఒకటైన వేళ’ కథలో గుండెలను పిండేస్తుంది.

ఇందులోని ‘అనగనగా’ కథ ఒక్కటే కాస్త సరదాగా సాగే కథ మిగతావన్నీ ఒక విధంగా బరువైన కథలే. వర్ణనలు, అనసరపు ఆర్భాటాలు, ప్రయోగశిల్పం పేరిట ఆరాటాలు లేకుండా సూటిగా గుండెలకు తాకేలా, దీటుగా తన సరికొత్త కథా సంకలనం అందించిన వేదగిరి రాంబాబుకు అభినందనలు.

‘మొ నాటనీ’ లేని, వైవిధ్యభరితమైన ఇలాంటి కథలు ఇంకా రావాలి. -సుధామ

వేదగిరి రాంబాబు కథానికలు
శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ బ్లాక్-6, ఫ్లాట్- 10,
హెచ్‌ఐజి 1, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్ - 44.
వెల:60 రూ/-


('అక్షర ':ఆంధ్రభూమి(దినపత్రిక)-శనివారం:30.3.2013)

 

0 comments: