ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, March 8, 2013

ఇల్లు






‘‘ఇల్లు అనే రెండక్షరాలలో గొప్ప ‘శాంతి’దాగుంది. ఇంట్లో వుంటే హాయిగా, ఆనందంగా, సుఖంగా వున్నట్లు. మొన్న దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్ళయినప్పుడు బోలెడు ఫోన్‌లొచ్చాయి’’ మీరు ఇంట్లోనే వున్నారుగా?’’ అంటూ క్షేమసమాచారం అడుగుతూ! బయటికెడితే భద్రత లేదనీ, రక్షణ గృహ సంబంధియేననీ మన ప్రబల విశ్వాసం’’ అన్నాడు సుందరయ్య.

‘‘నిజానికి మన భారతీయ వ్యవస్థలో గృహప్రాధాన్యం అమితం. ‘ఇల్లువదలి పారిపోవడం’, ‘గృహహింస’ లాంటివి నిజానికి ఇటీవలి కాలాల్లోనే పెరిగిపోతూ, ‘ఇల్లు’కూడా కొందరికి అభద్రతా భావానికి ఆలవాలమయ్యే దుస్థితులు దాపురిస్తున్నాయి. ‘పిల్ల’ మాట వినడం లేదని, తండ్రి కఠినాత్ముడై ఇంట్లోనే చీకటి గదిలో అమ్మాయిని బంధించడం, కన్నకూతురిపై కసాయి తండ్రి, ఇంట్లో భార్యలేని సమయంలో, అత్యాచారం చేయడం లాంటి వికృత సమాజ పరిణామాలు గృహ సంబంధులుగానే ఇవాళ వార్తలుగా కలచివేస్తూండే ఘటనలు జరుగుతున్నాయి. అయినా సరే! ‘ఇల్లు’అనే దానిలో- ‘విశ్వాసం’, ‘భద్రతా భావం’ వున్నాయి. ఓ సొం త ఇల్లు కావాలని కలకనడం మనిషికి అతి సహజమే’’ అన్నాడు శంకరం.

‘‘ఇంటిని చూసి ఇల్లాలిని చూడమని కూడా మన పెద్దలన్నారంటే, ఇంటికి ఎంత ప్రాముఖ్యమో వేరే చెప్పాలా? ఇంటిని ఎలా నిర్వహించుకుంటున్నాం? ఎంత అందంగా, ఎంత ఒబ్బిడిగా మనోరంజకంగా ఉంచుతున్నాం? అన్న దానికి- ఆ ప్రధాన నిర్వహణా బాధ్యత, ఆ నేర్పుతో కూడిన పనితనం, సహనం ఇల్లాలి వంతుగా తలపోస్తారు కనుకనే, ‘ఇంటిని చూసి ఇల్లాలిని చూడమ’నే మాట వచ్చింది. కానీ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులై వుండడం అనివార్యమైన ఈ రోజుల్లో, ఇంటి నిర్వహణా బాధ్యతలు కూడా ఇరువురీను. మునుపు ఆదివారాల్లో ఇంటాయనచేత ఇల్లాలు బూజులు దులిపించడాన్నే వింతగా, విడ్డూరంగా చెప్పుకునేవారు గానీ, ఇవాళ ‘హౌస్‌కీపింగ్’ అనేది ఒక విద్య. అది ఆడవారికే సొంతం కాదు. అసలు వినియోగదారులుగా జనం కొనే వస్తువుల్లో అనేకం గృహోపకరణాలు, గృహ సామగ్రి, గృహంలో ప్రధానమైన వంటింటి సామాన్లు, నిత్యావసర సరుకులేగా ప్రాధాన్యం వహిస్తూంటాయి. అభిరుచులు కూడా మారుతూంటాయి. కొన్నేళ్ళ క్రితం ‘స్టీలు సామాను’ పిచ్చి గురించి కార్టూన్లు, జోక్స్ బోలెడొచ్చేవి. పాత బట్టలకు వంటింటి స్టీలు సామగ్రి ఇవ్వడం అనే దాని మీద ఎంత హాస్యం సృష్టించబడిందో లెక్కేలేదు. ‘ఇల్లు’లో ‘వంటిల్లు’కు ముందు ప్రాధాన్యం! ఇప్పటికీ అది ఇల్లాలి అజమాయిషీ, అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా రూపుదిద్దుకునేదే! ‘బెడ్‌రూమ్’ దగ్గరకొచ్చేసరికి భార్యాభర్తల పరస్పర అవగాహన, అడ్జస్ట్‌మెంట్‌లు ముందుకొస్తాయి. మంచం మీద దుప్పటి జారుగా వేలాడుతూ వుండాలా? పరుపులోకి దోపి వుంచాలా? అనే దానిమీద కూడా, భిన్నాభిప్రాయాలు పొడచూపచ్చు! ఎవరి మాట నెగ్గుతుందో? లేక ఎవరి అభిరుచిననుసరించి మంచం మీద వారు పడుకునే వైపు ఆ దుప్పటి అమరిక జరుగుతుందో అనేది, వారే తేల్చుకోవాల్సిన విషయం’’ అన్నాడు నవ్వుతూ రాంబాబు.

‘‘దేనికయినా ‘ఇల్లు’ ప్రాతిపదిక. ఇల్లు ‘మూలాధార నాడి.’ ‘ఇంట గెలిచి రచ్చగెలువు’అని కూడా అన్నారు కదా! దివంగత కవి ఉత్పల సత్యనారాయణాచార్యగారిని ‘‘ఇల్లు కట్టారా?’’అని అడిగితే- ‘‘స్థలము కొన్నాడ రసికాంధ్రజనుల ఎడద, ఇల్లు కట్టుట యద్ది నావల్లకాదు’’అని చమత్కరించారట! ఇల్లు కట్టుకోవాలంటే ముందు ‘స్థలం’కొనాలి. ఈ రోజుల్లో ‘లిటిగేషన్లు’ లేని స్థలం దొరకడం కష్టం. తీరా కొన్నాక కూడా, ఆ స్థలంలో ఇల్లు కట్టే లోపలే ఎవరో ‘కబ్జా’చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి! ఇల్లు కట్టడం సులభసాధ్యం కాదు. ‘‘ఇల్లు కట్టి చూడు- పెళ్ళిచేసి చూడు’’ అన్నారనే కాదు; ఓ అపార్ట్‌మెంట్ కొనుక్కోవడానికీ, స్వయంగా ఇల్లు కట్టుకోడానికీ బోలెడు కష్టనిష్ఠురాలున్నాయి. మోజుపడి ‘ఇండిపెండెంట్ ఇల్లు’ కట్టుకున్నవారు కూడా, ఇవాళ దానిని ‘డెవలప్‌మెంట్’కు, అపార్ట్‌మెంట్ నిర్మాణాలకు ఇవ్వక తప్పని పరిస్థితులు సంభవిస్తూండడం కూడా విషాదమే! ‘హౌసిం గ్ లోన్’ తీసుకుని ఇల్లుకట్టి, ఆ లోన్ తీర్చడానికి ఇల్లు అమ్మేసాడట ఒకాయన! అంత దానికి అప్పుకోసం ఋణ భ్రమణాలెందుకు? దారుణ శారీరక మానసిక శ్రమ ఎందుకు? కట్టుకున్న ఇల్లు నిల్పుకోలేకపోయామన్న వేదనెందుకు’’ అన్నాడు సుందరయ్య.

‘‘అవివేకి ఇల్లు కడితే- వివేకి అందులో నివసిస్తాడని ఓ ఆంగ్ల సామెత! ‘‘కట్టుకున్నవాడికి ఒకటే ఇల్లు. అద్దెకున్న వాడికి సవాలక్ష’’. తనకు నచ్చకపోయినా, ఇంటి యజమానికి సరిపడకపోయినా అద్దె ఇల్లు ఖాళీ చేయాల్సిందే! ఏడాదికి నాలుగు అద్దె ఇళ్ళు మారిపోతూండేవారు తారసపడుతూంటారు. ‘మారెను సుమా మా చిరునామా’ అని ఎప్పటికప్పుడు కొత్త ఇంటి చిరునామాతో పలకరించేవారుంటూంటారు. ఇల్లు కదలకుండా, కడుపులో ‘చల్ల’కదలకుండా జీవించగల ‘సుఖం ’కూడా అందరి సొత్తూకాదు! ‘ఇల్లు’ అనేది తలుచుకుంటే- ఒకప్పటి రోజులకీ, నేటికీ బోలెడు తేడా కనబడుతోంది. ఇల్లుని ‘ఇల్’గా అంటే- ‘అస్వస్థత’గా, ‘జ్వరం’గా తలపోసే’ తరమూ రూపుకడుతోంది. కష్టించి సొంత ఇల్లు నిర్మించుకున్నా- ఆ దంపతులు పిల్లలకు రాసిచ్చేసి, ఆఖరికి తాము దయనీయంగా ఏ వృద్ధాశ్రమంలోనో బ్రతుకువెళ్ళమార్చవలసిన ‘దైన్య’ గాథలూ వుంటున్నాయి. ‘గృహమేకదా స్వర్గసీమ’ అన్న ఆనంద బంధం, ఇంటితో చిర సంబంధం, మానవీయ గంథం, వెలిగి వెలుగొందవలసిన కాలం
ఇది’ అన్నాడు శంకరం లేస్తూ.

3 comments:

కనకాంబరం said...

బాగుంది మీ సుధా మధురం లో 'ఇల్లు'.ఇల్లు నిర్వహణ బాగుంది మాష్టారూ సుధామ గారు.ఒక్క ఇల్లాలి భాధ్యతే కాదు .. నేడు చన్నీళ్ళకు వేన్నీళ్ళు ఆమె తెచ్చి పోస్తున్న తరుణమాయే . ఇరువురూ కలిసి చేసుకొంటేనే ఇల్లు శాంతి నిలయంగా మార్చుకో వచ్చు. కాని పరిసరాల ప్రభావం ఆ 'శాంతి' పై చాలా ఉంటుందనుకోండి.కష్ట నిష్టూరాలెన్నున్నా ఎంచుకోవడం మీ వంతే. ....శ్రేయోభిలాషి ...నూతక్కి రాఘవేంద్ర రావు.

సుధామ said...

మీరన్నది నిజం, ధన్యవాదాలు రాఘవేంద్రరావు గారూ!

సుధామ said...

మీరన్నది నిజం, ధన్యవాదాలు రాఘవేంద్రరావు గారూ!