‘‘అది నువ్వనుకున్నంత సుళువు కాదు. అది ఏదయినా సరేను! సమాజంలో సవాలక్ష అవకతవకలున్నాయి. అసలు నువ్వు దేని గురించి పరివర్తనా ధ్యేయం తో ఆలోచిస్తున్నావో, అది ముందు తెలియాలి కదా! అది కేవలం నీ వ్యక్తిగతమా, లేక పదిమందికీ చెందిన సామాజికమా, అనేది కూడా ప్రధానమే. అది ఈ.... సరికే బలంగా పాతుకు పోయిందయితే నీకది పెను సులువుగా నిలుస్తుంది. అదీకాక, దాని గురించిన భావన నీ ఒక్కడిదా లేక మిగతా వారుకూడా నీలాగానే ఆలోచిస్తున్నారా? అలా ఆలోచించేవారు ఇంకా ఉన్నట్లయితే నీకు అండగా ఎందరు నిలుస్తారు? అలా నిలవడానికి వచ్చిన వారు చివరివరకూకూడా మధ్యలో జారిపోకుండా నిలబడతారా? అన్నదీ- చాలాముఖ్యమైన విషయం...నువ్వది జాగ్రత్తగా చూసుకోవాలి. అయినా మరో విషయం కూడా వుంది. అనేకం ఉన్నప్పుడు, నువ్వన్నట్లు సమస్యలకు పరిష్కారం అన్నది ప్రాధాన్యతాక్రమంలో క్రమక్రమానుగతంగా జరగాలి. దీనితో సరిపెట్టుకుంటానంటే అన్యాయం అవుతుంది. అయితే అన్నీ నా వం తేనా? అని నువ్వనవచ్చు. ఒక్కొక్కదానికీ ఒక్కో సంస్కర్త ఉండాలనేమీ లేదు. ఒక సంస్కర్త అనేక విషయాలపట్ల దృష్టి సారించవచ్చు. అలా వీలు కానప్పుడు- సమాజంలోని అసహన విషయాలపట్ల ఒకేలా ఆలోచించగలిగే వారు కొందరు. పంచుకుని పనిచేయవచ్చు. ఇంతకీ ఇవాళ నువ్వు పూనిక వహిస్తున్నదేమిటి?’’ అని ఆపకుండా శంకరం మాట్లాడుతూంటే అందరం ముసిముసిగా నవ్వుకుంటూనే అవాక్కయి చూస్తున్నాం.
ఇంతకీ శంకరం వాగ్ధాటికి కారణం ఏమిటంటే రాంబాబు వస్తూ వస్తూనే- ‘‘ఇవాళ ఒకటి మార్చి...’’ అన్నాడంతే! అన్నాడో లేదో శంకరం ఇలా తగుల్కున్నాడు.
‘‘నాయనా శంకరం! కాస్సేపు ఆగుతావా? రాంబాబు చెప్పింది ఇవాల్టి తేదీ అంతే! ఇవాళ ఒకటి మార్చి, రేపు రెండు మార్చి, అలా ఈ నెల పొడగుతా తాను ఏమిటేమిటో మార్చి, సంఘ సంస్కరణ పనులకు పూనుకున్నట్లుగా భ్రమించి, నీ ఉచిత సలహాల విశే్లషణతో మమ్మల్ని చావగొట్టకు’’ అన్నాడు నవ్వుతూనే ప్రసాదు.
గాలి తీసేసిన బుడగలా శంకరం ‘‘అవునా!’’ అన్నాడు.
ఒక ప్రక్క బడ్జెట్ బాదుళ్ళు, మరోప్రక్క హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లు, రాజకీయాల పేరిట కుళ్ళు, 2014 ఎన్నికల కోసం మొదలైన ఎత్తుగడల హడావిళ్ళు. వీటన్నింటితో దిమ్మతిరిగి ఏదో చేయాలన్న ఉక్రోషం పొడుచుకొచ్చినందువల్లే శంకరం ‘మార్చి’ అనగానే మార్పు గురించి అనుకుని ఆవేశపడ్డడని మా అందరికీ అర్థమైపోయింది. పూర్ క్రీచర్! అలా ఒకటి మార్చి అనగానే అది తేదీ ప్రస్తావన అనుకోక, సంస్కరణ హృదయంతో ఒక సంఘ దురాచారాన్నో, సమస్యనో మార్చి, ముందుకెళ్లదలచుకున్నట్లుగా సంభవించడం, నిజంగా పాపం! సమాజం గురించి బాధ్యతాయుతంగా ఆలోచించడమే కదా! ఇవాళ ఒకటి మార్చి విజయం సాధించగలిగితే నిజంగా గొప్పే! ఆ స్పూర్తితో మరోటి మార్చి వేసేందుకూ పురోగమించవచ్చు.
రాంబాబు శంకరంతో అన్నాడు- ‘‘శంకరం! నేను అలవోకగా ప్రస్తావించిన వర్తమానం నుంచే నువ్వొక భవిష్యత్ విశే్లషణ చేశావు. నేను ‘తారీఖు’ గురించి అంటే. నువ్వు సమాజం ‘తరీఖా’ గురించి వెళ్లావు. నిజంగానే మార్చి అనే నెల అలా ‘మార్చ్’ చేసి, సంఘ సంస్కరోన్ముఖం కాగలిగిన నెల అయితే ఎంత బాగా వుంటుంది! నిజంగా ఒకటి మార్చినా సంతోషమే మనం. అయితే మనవల్ల ఏమవుతుందని ఒక అన్నా హజారేనో, కజ్రేవాలానో అనుకుంటే- అవినీతి గురించి, ప్రభుత్వాల పారదర్శకత గురించీ ఇంతయినా జనంలో చైతన్యం రాగలిగేదా? ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ అత్యాచార సంఘటన, హైదరాబాద్‌లో జరిగిన ‘నిర్దయ’ బాంబు విస్ఫోటన సంఘటన... దేశంలో కొన్ని మూలాలను కదిపి, ప్రజలను ఆలోచనలో పడవేస్తున్న మాట యథార్థమే! పరిస్థితులు సవ్యంగా లేవనీ, వ్యవస్థలో మార్చి తీరవలసిన అంశాలు అనేకం ఉన్నాయనీ, అంతా నిర్ద్వంద్వంగా అంగీకరించేదే! అయితే ఈ చైతన్యం ఎలా ఒక వ్యవస్థీకృత మార్గంలో మార్పుకై కృషి చేస్తుందనేదే నిర్దేశించుకుని ఆచరణాత్మకం చేసుకోవలసిన విషయం’’.. అన్నాడు రాంబాబు.
'మార్చి ఒకటి అని ఒకటి మార్చి నువ్వుంటే నిజంగా బాగుండేది రాంబాబూ! అయినా చూసావూ! ‘పదం’లోంచి ‘పథం’ ఆవిష్కరించుకోగలగడమూ అవసరమే! ‘‘వస్తున్నా మీకోసం’’ అని చంద్రబాబు పాదయాత్ర తన కోసమే మొదలు పెట్టినా, అది ఆయన ఆలోచనా సరళిని ఒకటి మార్చినా విశేషమే కదా! దారి పొడునా బహూకృత వేషాలేన్నో ఆయన వేసారుకదా! నిజంగా వేషం వేసినందుకైనా ఆ పాత్ర గత వ్యక్తి జీవనసరళి ఆయనకు ఏ మేరకు అవగాహనకు వచ్చినా, అది ప్రవర్తన మార్చి వ్యవరించుకునేందుకు మున్ముందయినా పనికి వస్తుంది! అట్టేసినా, నట్లేసినా ఆ కష్ట జీవి కార్మిక జీవన అవగాహన ఏ మేరకు లభించినా రేపు గద్దెనెక్కినప్పుడు వారి బ్రతుకులు మార్చి, రాణించేందుకు భిత్తిక కాగలుతుంది. అధికారం తిరిగి రాబట్టుకునేందుకే ఈ పాదయాత్రలన్నమాట వాస్తవమే అయినా. రేపు గెలుపు లభించినా లభించకపోయినా, ఆయన తత్త్వాన్ని మార్చి, ఈ పాదయాత్ర పనికిరాగలిగినా గొప్పే! భేషజాలకూ, ఆర్భాటాలకూ కాక నిజంగా ప్రజా సమస్యల అధ్యయనానికి ఉపకరించగలిగితే మంచిదే! జరిగిన సంఘటనలన్నీంటినుంచీ ప్రధాని మొదలు పోలీసు అధికారులూ, పౌరులైన సామాన్యులూ అందరూ ఎవరి విశే్లషణ వారు చేస్తుంటారు. అది సహజం! కానీ శుష్కప్రియాలూ- శూన్య హస్తాలూ కాక ఉన్నంతలో ఉపకారం దిశగా ఎవరూ అలా ఉద్యమించి సహకరించగలరన్నదే ప్రధానాంశమవుతుంది’’ అన్నాడు ప్రసాదు.
‘‘సరే ‘ఒకటి మార్చి’ నిజంగా ఒక ఆలోచనను మార్చి ఉపయుక్తమైనా సంతోషమే! ఆవేశాన్ని ఆలోచనగా మార్చి ఆచరణలోకి ‘మార్చ్’ చేయాలన్నదే అభిమతం! పూర్తిగా మార్చి అప్పుడు నూతన ఆర్థిక సంవత్సరాగమనంతో ఏమవుతుందో చూద్దాం’’అంటూ లేచాడు శంకరం.
0 comments:
Post a Comment