ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, February 8, 2013

తీరే ‘ఆధార్’దంత!


(రైట్ సైడ్ 'ఆధా'అని కనబడుతోంది గా! అంటే సగం సగం అర్థాంతరం అనేగా!)
‘‘ప్రేమ ఇచ్చిన
ప్రేమ వచ్చును
అన్న సూక్తం కూడా పాతబడుతోంది! ఇచ్చిందే వస్తుందన్న విశ్వాసం లేదు. రాకపోగా అందుకు ప్రతిగా వ్యతిరేకమైనది ఎదురుకావచ్చు. ఎదురు చూసింది రాకపోవచ్చు. రానిదానితో మరోదానికి అనుసంధానం ఉండి, అది కూడా ప్రతికూలం కావచ్చు’’ అన్నాడు ప్రసాద్.


‘‘పెళ్లి కాని ప్రసాదూ! నువ్వు ‘వాలెంటైన్స్‌డే’ మూడ్‌లో ఉన్నట్లున్నావ్!కానీ చూసావ్! ఇచ్చిన దానికి వస్తుందన్న విశ్వాసం లేదనీ, పైగా వ్యతిరేకం కావచ్చనీ, దానితో ముడిపడినదీ అందక-కొండెక్కుతుందనీ, నువ్వంటున్న విషయం, నా మటుకు-ప్రేమతో ముడిపడిందిగా తోచటంలేదు. ఆ భావాలకు ఆధారం ‘ఆధార్’ కార్డు ఏమోననిపిస్తోంది’’ అన్నా డు శంకరం.

రాంబాబు నవ్వాడు- ‘‘్భలేవారర్రా! ‘ఎవడిగోల వాడిదే’ అంటే ఏమో అనుకున్నాను గానీ, ఇదేనన్న మాట! ఆధార్ కార్డుకూ, వంట గ్యాస్‌కూ ముడిపెడుతూ ఈ నెల 15లోగా ఆధార్ కార్డు పొందకపోతే, గ్యాస్ నిలిపివేస్తామన్న నిబంధన ఎంత గగ్గోలు రేపిందో చూస్తున్నాంగా! ఆ నిబంధనను వాయిదా వేయాలని కేంద్రాన్ని సిఎంగారే స్వయంగా కోరారట కూడానూ! అయినా ‘ఆధార్’ కార్డు గురించి అంత పట్టింపెందుకో అర్ధం కావడంలేదు! మొన్నటి దాకా ‘రేషన్ కార్డు’ రాజ్యమేలింది. మధ్యతరగతి జీవులకూ ‘పాన్‌కార్డ్’ ప్రాముఖ్యం హఠాత్తుగా పెరిగింది. ఇప్పుడు అన్నింటికీ విశ్వరూప సందర్శనంగా ‘ఆధార్’ కార్డు అవతరిస్తోంది. సామాన్యులకు వీటివలన ఉత్తరోత్తరా జరిగే మేళ్లేమిటో గానీ, ప్రస్తుతానికి కీళ్లరిగేలా తిరుగుతూ, ‘ఆధార్’ గురించి నానా యాతనలు పడుతున్నారు. అధికారులకు కూడా -‘ఆధార్’ నమోదులు, పంపిణీలు కూడా పెద్ద తలనొప్పయి కూచుంటున్నాయి. నమోదు చేసుకుని నెలలు గడుస్తున్నా కార్డు అందనివారు లక్షల్లో ఉన్నారట’’ అన్నాడు రాంబాబు.

‘‘అన్నింటికంటే ఇంకో తమాషా చూశారా! మొదటి రెండు దశల్లో హైదరాబాద్‌లో-ఆధార్ కేంద్రాల్లో నమోదు చేసుకున్న వారు 48 లక్షల మంది కాగా, ఆధార్ పోర్టల్ 51 లక్షల మందికి కార్డులు జారీ చేసినట్లు తెల్పుతోందట! నమోదు చేసుకున్న వారికంటే కార్డులు అందనివారు అధికంగా ఎలా ఉంటారో సదరు అధికార గణానికే తెలియాలి మరి! ‘కాకిలెక్కలు’ అని మనం అంటాం చూసారా! అలాం టి లెక్కలే రెక్కలు విప్పుకున్నట్లుంది పరిస్థితి! సచివాలయంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగిన సమీక్షా సమావేశంలో-ఐటి విభాగం మొన్న మంగళవారం ఓ నివేదికను సమర్పిస్తూ-2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 8.44 కోట్లు కాగా, ఇప్పటికే 6.5 కోట్లమంది ఆధార్ కార్డుకోసం నమోదు చేసుకున్నారని వీరిలో ఇప్పటి 5.24 కోట్లమందికి కార్డులు అందాయనీ, ఇంకా కేవలం 1.25 కోట్ల మంది మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉందని పేర్కొందిట. అదే నిజమైతే-రాష్ట్రంలోని పలు పట్టణాల్లో ‘ఆధార్’ గురించిన ఇనే్నసి క్యూలు, ఇంత గందరగోళం ఇదంతా దేనికి?’’ అన్నాడు సన్యాసి.

‘‘తీరి కూర్చుని-ఉన్నది ఉన్నట్లుగా, జరుగుతున్న దాన్ని ప్రశాంతంగా ఉండనీయక, ‘కొత్తపథకం’ అంటూ మొదలుపెట్టడం దేనికి? ‘ఆధార్’ పథకం పకడ్బందీగా అమలుపరచడం చేతకానప్పుడు, చేతగాని పనులు పెట్టుకుని ప్రజలను ఇబ్బందులపాలు చేయడం దేనికి? ‘ఆధార్’ కార్డులు సవ్యంగా జారీ చేయలేనప్పుడు, చాలినన్ని ‘ఆధార్’ కేంద్రాలను రాష్ట్రం అంతటా పెట్టి సమర్ధంగా నిర్వహించలేనప్పుడు, గ్యాస్ పంపిణీ వంటి వాటిని ఆధార్‌తో అనుసంధానించడం అమానుషం కాక మరేమిటి? గతంలో నమోదు చేయించుకున్న వారు కార్డు రాకపోవడంతో మళ్లీ తాజాగా నమోదు చేసుకోవడానికి ప్రయత్నించడంవల్ల మరింత గందరగోళం ఏర్పడుతోంది! కార్డుల జారీలో ‘కాకి లెక్కలు’ హాస్యాస్పదంగా మారాయి. ‘ఆధార్’ కార్డు పొందడానికి ప్రక్రియ కూడా సులభతరంగా ఏమీలేదు కదా?ఒకసారి నమోదు చేయించుకున్నాక-నిర్దిష్ట గడువులోగా ఆధార్ కార్డు అందే వ్యవస్థ లేకపోతే-ఏమిటి ప్రయోజనం? ఈప్రభుత్వం చేసే పనులన్నీ ఇలాగే తగలడుతున్నాయి! రైల్లో ప్రయాణం చేసేవారు విధిగా ‘ఒరిజినల్’ గుర్తింపు కార్డు చూపాలని నిబంధన వేసారు. అసలే ప్రయాణాల్లో హడావుడి, తికమకలూ, మతిమరుపులూ ఉన్నప్పుడు ‘అసలు కార్డు’ను దేన్ని దగ్గరుంచుకున్నా-అది ‘పాన్‌కార్డు’ కానీ, ‘ఆధార్ కార్డు’ కానీ, మరోటి గానీ, పోయే ప్రమాదమూ లేకపోలేదు! ఒరిజినల్ పోతే ఎంత ఇబ్బందో వేరే చెప్పాలా? ‘నకలు’ పోతే మరో నకలు తీసుకోగలం. అసలుదే పోతే మళ్లీ పొందడానికి ఎంత తతంగం? ఈ మధ్య మరి నియమం సడలించారేమో తెలీదుగానీ- ‘గత నెల రైలు ప్రయాణం చేసినప్పుడు అసలు గుర్తింపుకార్డు కాక దాని నకలు చూపించానని, అది చెల్లదనీ, టిక్కెట్టు కొననట్టే లెక్క అనీ, ఆ టికెట్ కలెక్టర్ యాగీ చేసి చివరకు ఓ వంద చేతిలో పెడితే మిన్నకున్నాడని’ మా మామయ్యే చెప్పారు!’’ అన్నాడు శంకరం.

‘‘అదే నాయనా! ఆ ఒళ్లు మంటలు, కోపాలు తగ్గించుకోవాలి. నీకు బాగా కోపం వస్తే-హాయిగా చక్కని సంగీతం విను. లేదూ! మంచి పుస్తకం తీసి చదువు. నేనంటే పెళ్లి కానివాడిని కనుక, ఓ అందమైన అమ్మాయి బొమ్మనయినా చూస్తాను నీకేం! హాయిగా నీ పర్సులోని మీ ఆవిడ ఫోటో తీసి చూసుకోవచ్చు’’ అన్నాడు ప్రసాదు.

శంకరం మాత్రం నవ్వేసి-‘‘బ్రదరూ! ‘నమోదు చేస్తే కార్డు వచ్చును’ అన్నదెంత సత్యమో, ‘ప్రేమ ఇచ్చిన-ప్రేమ వచ్చును’ అన్నదీ అంత సత్యమే! అయితే దానిని అందుకోవడానికి ముందు-పడాల్సిన తంటాలు, ఎదురు చూపులూ, బోలెడుంటాయి.అయినా ఈ దేశంలో ప్రజలకు సహనము, ఓర్పు వంటివి నేర్పేందుకే ప్రభుత్వం కొత్త కొత్త పథకాలు పెట్టి, వాటితో రకరకాల అనుసంధానాలు చేస్తుంటుంది. బిపి, సుగర్ వంటివి తెప్పించి, ‘ఆరోగ్యశ్రీ’లను వికాసవంతం చేస్తుంది! అంచేత నిరాధారంగా పాపం ప్రభుత్వాన్ని తిట్టుకోక, ‘స్థిత ప్రజ్ఞత్వం’మీద ఆధారపడే స్థితి హేతువవుతున్నందుకు నమస్కరించాలి’’ అంటూ లేచాడు.

*