ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, February 15, 2013

వసంత పంచమి










"మాఘమాసం ప్రవేశించిన అయిదవ రోజు శ్రీపంచమి. దీనినే వసంత పంచమి అంటున్నాం. సంస్కృతికీ, సాహిత్యానికీ, జ్ఞానానికీ వేల్పుగా- సరస్వతిని సంభావించి పూజించుకుంటాం’’అన్నాడు సుందరయ్య.

‘‘సరస్వతి పూజలు ఎప్పుడో మందగించాయి! సాహిత్యంలోనూ సరస్వతి చిహ్నం చాదస్తంగానూ, అభ్యుదయ నిరోధకంగానూ భావించే ధోరణులొచ్చాయి. ఎమ్.ఎఫ్. హుస్సేన్ లాంటి చిత్రకారుడు సరస్వతిని నగ్నంగా చిత్రీకరిస్తే ఎవరూ మాటాడలేదు. నిజానికి సరస్వతి చిహ్నంతోవున్న ‘యువభారతి’ సాహితీ సాంస్కృతిక సంస్థను వెనక్కునెట్టీ, కొందరు నిరాదరించడానికీ అదీ కారణం అనిపిస్తుంది. ‘‘మాణిక్యవీణాం’’అంటూ ప్రార్థన పాడితే- ‘‘కుచోన్నతే, కుంకుమ రాగశోణే..’’అని తల్లిని అలా సంభావిస్తారా? అని ఎద్దేవాచేసేవారు బయలుదేరారు. పవిత్రత స్థానంలో కాముకదృష్టి- మనం చూసే, భావించే వైఖరిలో వుంటుంది గానీ, నిజానికి ‘ స్త్రీ' ఆది దేవతగా, ప్రకృతి శక్తిగా వందనీయురాలు! అక్షరాభ్యాసం చేసేరోజు సరస్వతి పూజలు నేడు ఎప్పుడో మందగించాయి. ఓం నమశ్శివాయ అనీ, అ ఆ ఇ ఈలు అనీ ,పలకపట్టీ బలపంతో తొలి అక్షరాలు రాసి దిద్దించడంపోయి, అక్షరాభ్యాసానికీ ‘ఎబిసిడిలు’రాసే రోజులు దాపురించాయి’’ అన్నాడు ప్రసాదు.

‘‘మరీ అలా కొట్టిపారేయకోయ్ ప్రసాదూ! వసంత కాలం ఆగమన సూచికగా ‘వసంత పంచమి’కి ప్రాము ఖ్యం వుండనే వుంది! రాముడు శబరి ఆశ్రమంలో- ఆమె ఇచ్చిన ఎంగిలి పండ్లను తిన్నది ఈరోజునే అని ఒక కథనం! ఏమయినా- ఫలపుష్ప సంభరితమైన కాలం వసంతాగమన కాలమే కదా! మాఘ శుక్ల పంచమినాడు పసుపురంగుకు బోలెడు ప్రాధాన్యం. కుంభమేళాలో ఈరోజు ఉదయం ప్రత్యేక స్నానాలు చేస్తారు. షష్ఠి తిథి రాకముందే- పూజా పునస్కారాలు పూర్తిచేసుకునేవారుంటారు. వసంత పంచమి సరస్వతీదేవి పుట్టినరోజుగా సంభావిస్తారు. జ్ఞానానికి ప్రతీక సరస్వతి కనుకనే, విద్యాలయాల్లో ఈరోజు విద్యార్థులు ఆమెను పూజించడం ఒకప్పుడు ఆనవాయితీగా వుండేది. ఆంగ్లమాధ్యమ పాఠశాలలు పేట్రేగిపోయాక ఇటువంటి విలువలు అంతరించిపోవడంలో ఆశ్చర్యంలేదు! హైదరాబాద్‌లో బాలికల పాఠశాల స్థాపించిన మాడపాటి హనుమంతరావుగారు, రావ్‌బహద్దూర్ వెంకట్రామారెడ్డిగారు ఆరోజుల్లో ‘సరస్వతీ పూజ’ను వసంత పంచమినాడు బడిలో నిర్వహింపచేసేవారుట! మాడపాటి హనుమంతరావుగారి పేరిటనున్న బాలికా పాఠశాలలో నేటికీ ఆ ఆచారం పాటిస్తున్నారని తెలిసి, నాకు సంతోషం కలిగింది’’అన్నాడు రాంబాబు.

‘‘ఆనందోత్సాహాలతో జరుపుకునే వసంత పంచమికి అంతా పసుపురంగు పూలతో అలంకరించడం, పసుపుపచ్చని వస్త్రాలు ధరించడం, అలాగే లడ్డు, మైసూర్‌పాక్ వంటి పసుపురంగు మిఠాయిలను పంచిపెట్టుకోవడం చేస్తూంటారు. ఉత్తర భారతంలోనూ, నేపాల్‌లోనూ ‘వసంత పంచమి’కి ప్రాధాన్యం ఎక్కువ! పితృదేవతలు సంతృప్తిచెందుతారని ఈరోజు బ్రాహ్మణులకు అన్న సంతర్పణలూ చేస్తుంటారు. చలికాలం క్రమంగా అంతరించిపోయి, ప్రకృతి కొత్త శోభలు సంతరించుకుంటుంది. పంజాబ్, హర్యానాలలో వసంత పంచమికే గాలిపటాలు ఎగురవేసే ఉత్సవం నిర్వహించడం విశేషం. పంజాబ్‌లో ఈరోజు అమరవీరుడు రామ్‌సింగ్ కుక జన్మదినంగానూ జరుపుకుంటారు. బ్రిటిష్‌వారికి ఎదురొడ్డి పోరాడి, బర్మా జైలుకి తరలింపబడి అక్కడే మృతుడైన అతనిని - ఒక సాధువుగానూ, అతని బోధనలను ఆదర్శనీయంగానూ పంజాబ్ పౌరులు సంభావిస్తూంటారు. పాకిస్థాన్ లాహోర్‌లో కూడా ‘హకీకత్‌రాయ్’ స్మరణగా- వసంత పంచమిరోజు గాలిపటాలు ఎగరేస్తూ ఉత్సవాన్ని పాటిస్తారుట’’ అన్నాడు శంకరం.
‘‘రాధాస్వామీ సత్సంగులకు వసంత పంచమి ప్రాముఖ్యం అధికం. రాధాస్వామీ మతం ప్రథమగురువు అయిన స్వామీజీ మహరాజ్ అసలు పేరు శ్రీ శివదయాల్‌సింగ్. ఆగ్రా పన్నీగల్లిలో జన్మించిన ఆయన ఆరవ ఏటనుండే ఆధ్యాత్మిక నిరంతరాభ్యాసిగా మారారు. 1861లో వసంత పంచమిరోజునే రాధాస్వామీ సత్సంగాన్ని ఆయన ప్రారంభించారు. 1866నుండి అది క్రమంగా పరివ్యాప్తమవుతూ ‘సంతుమతం’గా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది సత్సంగీలతో పరిఢవిల్లుతోంది. సురత్‌శబ్దయోగ సాధనతో- సమకాలిక సద్గురువును ఆశ్రయించి, పూర్తి శాకాహారులుగా నియమబద్ధ జీవనం గడుపుతూంటారు. 1915 జనవరి 20 వసంత పంచమిరోజునే ‘దయాల్బాగ్’ రాధాస్వామీ కేంద్రంగా ఆగ్రాలో నెలకొల్పబడింది. వ్యవసాయ క్షేత్రాలు, వైద్యాలయాలు, దయాల్బాగ్ విశ్వవిద్యాలయం నేడు ప్రత్యేకతను సంతరించుకుని, భాసిల్లుతున్నాయి. ప్రొఫెసర్ ప్రేమ్‌శరణ్ సత్సంగి వారి ఆధ్యాత్మిక గురుత్వంలో దయాల్బాగ్ రాధాస్వామీ మతం నేడు విస్తరిస్తోంది’’ అన్నాడు సుందరయ్య.
‘‘ ‘వసంత పంచమి’ అన్న అంశం వెనుక ఇన్ని విశిష్ఠతలు దాగి వున్నాయని నాకు లాగానే బహుశా చాలామందికి తెలిసి వుండకపోవచ్చు. నిజానికి ఇవాళ హైందవ పండుగలు అనేకం మారుతున్న కాలాన్నిబట్టి, నవతరం అభిరుచులనుబట్టి కేవలం నామమాత్రావశిష్టం అయ్యే ప్రమాదమూ  పొంచుకొస్తోంది. విద్యావివేకాలతో, విజ్ఞానంతో ముడిపడి, నవ నవోన్మేషమైన ప్రతిభా ప్రకృతితో అనుసంధానమైన ‘వసంత పంచమి’ని స్వాగతించి, సమాదరించుకోవలసిన అగత్యం ఎంతయినా వుంది! ఏమయినా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు.’’అంటూ ప్రసాద్ అందరితో నవ్వుతూ కరచాలనం చేసాడు.