ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, February 1, 2013

తల్లి ఉల్లి లొల్లి...




‘‘ఏంతినాలో అర్ధంకావడంలేదు’’అన్నాడు సన్యాసి నుదురు చిట్లిస్తూ.

‘‘రోజుకు మూడుపూట్లా కాదు, కేవలం రెండు పూట్లా- ఇంత అన్నం, పప్పు, కాసింత సాంబారో, రసమో; ఇంత కూరో, ఆపై మజ్జిగా వుంటే చాలదూ! మనిషి కడుపునిండడానికి.’’ అన్నాడు శంకరం.

‘‘ఇది మామూలు మధ్యతరగతి తిండి. పేదవాడికి అదీ లేదు. అన్నంలో ఇంత పచ్చడి, లేక ఓ ఉల్లిపాయ ముక్క మిరపకాయ పెట్టుకుని కడుపునింపుకునే వారు లక్షలాదిగా ఇప్పుడూ వున్నారు. ‘బ్రతకడానికే తిండి గానీ, తిండికోసం మాత్రమే బతకడం కాదుకదా!’’ అన్నాడు ప్రసాదు.

‘‘నోట్లోకి నాలుగు ముద్దలు పోవడానికి రోజంతా కష్టపడితే గానీ-అవకాశం లేని దీనులు చాలామంది వున్నారు! మధ్యాహ్న భోజన పథకం కోసమే పిల్లల్ని బడులకు పంపి, తాము ఏ ‘పనికి ఆహార పథకమో’ వెతుక్కునే వారున్నారు! ప్రభుత్వాలు వేసేవి మటుకు పనికిరాని పథకాలుగా వున్నాయి. కిలో బియ్యం రూపాయికే అంటూ ‘మన బియ్యం’ పథకం అంటున్నా, వట్టి బియ్యం ఎవరూ తినరు కదా! వాటిల్లో అధరువులకు కూరగాయల ధరలు ఎలా మండిపోతున్నాయో చూసారా! అంతెందుకు? పేదవాడు- అన్నంలో ఇంత ఉల్లిపాయ నంచుకు తిందామన్నా, ఉల్లి ధరలు గిల్లినట్లు ఏడిపిస్తున్నాయి చూసారా! దాన్ని గురించే ‘‘ఏం తినాలో అర్థంకావడం లేదు’’ అన్నాను, అంతేగానీ నా గురించి కాదు. ఎప్పుడూ లేనట్లుగా ఒక్క నెలలోనే ఉల్లిపాయ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి,’’ అన్నాడు సన్యాసి ఆర్తిగా.

‘‘ వర్షాభావ పరిస్థితులే ప్రధాన కారణమని వ్యాపారస్తులు కూడా చెబుతున్నారు కదా! జంట నగరాల విషయమే తీసుకున్నా- ఉల్లిగడ్డల సరఫరా, నగరానికి ప్రధానంగా మహారాష్టన్రుంచి ఎక్కువ. అయితే, మహారాష్టల్రో వర్షాభావ పరిస్థితులవల్లే- దిగుబడి బాగాపడిపోయి, రోజుకు నూరు, నూట యాభై లారీల ఉల్లిపాయలు దిగుమతి అయ్యే పరిస్థితి, ఇప్పుడు యాభై లారీలకు పడిపోయిందిట మరి! మన రాష్ట్రంలోని- చిత్తూరు, కర్నూలు, కడప, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలనుంచి కూడా ఉల్లిగడ్డల దిగుమతులు పడిపోయి, ఉల్లి ధరలు పెరిగిపోతున్నా, పౌర సరఫరాలశాఖకు ఏం పట్టనట్లే వుంది! పేదవాడు ఇంక నువ్వన్నట్లు ఏం తిని బ్రతకాలో అర్థంకావడంలేదు మరి’’అన్నాడు రాంబాబు కల్పించుకుంటూ.

‘‘మన బియ్యం అందరికీ కాదు కదా! అదేదో తెల్లరేషన్ కార్డుల వారికే! అదీను- కొంత పరిమితిలోనే! అసలు మామూలు మధ్యతరగతి మనిషి అయినా- ఇవాళ బియ్యం కొనుక్కునే పరిస్థితే కన్పించడం లేదుగా! మార్కెట్లో కిలో 43 రూపాయలు పెడితేగానీ, ఓ మోస్తరు మంచి సన్న బియ్యం దొరకడం లేదివాళ. ధాన్యం నూర్పిళ్ల సమయంలో అధిక వర్షాలు కురిసి, రైతులు తీవ్రంగా నష్టపోయారట. అంతెందుకు! ఒక్క గుంటూరు జిల్లా సాగర్ ఆయకట్టులోనే సుమారు 3.25 లక్షల ఎకరాలలో- ఖరీఫ్‌లో వరి సాగును రైతులు కోల్పోవడమంత విషాదం మరేమిటి చెప్పు? వ్యాపారులు బియ్యం మార్కెట్‌ను శాసిస్తున్నారు కొందరు. బియ్యం, పప్పులాంటివే కొనలేనంతగా మారిపోతే, ఇంక ‘‘ఏం తినాలో అర్థంకావడం లేదు’’ అన్న ఆర్తి సహజమే’’అన్నాడు ప్రసా దు కూడాను.

‘‘పేదలు ఎందరో- సినిమాల్లోనూ చూపించేట్లుగా వట్టి అన్నంలో ఇంత ఉల్లిపాయ, మిరపకాయ నంచుకు తిన్నట్లుగానూ వుంటూంటారు కదా! నిజంగా ఉల్లి అంత మేలుచేసే విషయం ఏముందంటారు? నాకు తెలియకడుగుతాను’’ అన్నాడు శంకరం.

‘‘ఎర్ర ఉల్లి గుండె జబ్బులకి దివ్య ఔషధమోయ్! శరీరంలోని కొలస్ట్రాల్‌ని అది పోగొడుతుంది. కఫం, శీతలానికి ఉల్లిపాయే విరుగుడు. ఉల్లిని ఎక్కువగా వాడే వారిలో - క్యాన్సర్ ప్రమాదం చాలా తక్కువట! చైనాలో ఉల్లిని ఎక్కువగా వాడతారు కనుకనే, ప్రపంచం మొత్తాన 40 శాతం ఉదర సంబంధ క్యాన్సర్ కేసులు అక్కడ చాలా తక్కువ. మన దేశంలోనూ ఉల్లి వాడకం నిజానికి తూర్పు దేశాల్లో లాగానే బానే వుంది. వేసవి కాలం ఉల్లి వాడకం - ‘దాహ తాపాన్ని తగ్గిస్తుంది’ కాబట్టి, సమ్మర్‌లో ఉల్లికి డిమాండ్ ఢిల్లీవరకూ ఎక్కువే! అన్నంలో వట్టి ఉల్లిపాయ నంచుకోవడం గురించి ఆశ్చర్యపోతున్నావేమో గానీ, వంద గ్రాముల ఉల్లిపాయలో యాభై కేలరీలు వుంటాయి. ప్రతి మనిషికీ రోజుకి 70 కాలరీలు కనీసం అవసరం. కంటికీ, జ్ఞాపక శక్తికీ, జీర్ణక్రియకీ కూడా ఉల్లిదోహదకారి’’ అన్నాడు సన్యాసి.

‘‘మా అమ్మమ్మ చెబుతూండేది- ఉడికించిన ఉల్లి చర్మపు రంగుకీ, దాని నిగారింపుకీ, ఆకలి పెంచడానికీ దోహదం చేస్తుందిట! స్ర్తిలలో ‘సంతానలేమి’ని పోగొట్టడానికి దోహదపడగలదుట. అజీర్ణంగా అనిపిస్తే- ఉల్లిని చిన్న ముక్కలుగా తరిగి, నిమ్మరసం పిండి, అన్నంలో తినిపించేది మా అమ్మమ్మ. అలాగే నీళ్ళ విరేచనాలవుతూంటే- ఉల్లిని అరగదీసి, బొడ్డుపై రాసేది! లేదా ఉల్లిరసం పట్టు నాభిపై వేసేది. నిజంగా మంచి గుణం కనబడేది తెలుసా! కలరా వ్యాధికి- ఉల్లి రసంలో ఉప్పు కలిపి తాగించేవారు మా ఆయుర్వేదం తాతగారు. హై.బిపి వున్నవారు పచ్చి ఉల్లిని తినాలిట! మానసిక అలసటను ఉల్లి దూరం చేస్తుంది. ఉప్పు, ఉల్లి కలిపి నమిలితే వాంతులూ కట్టేస్తాయిట. ఉల్లిని నీటిలో ఉడికించి, ఆ కషాయం రోజూ మూడుపూటలా తాగితే- ‘మూత్రం’ సాఫీగా జారీ అవుతుంది! అంతెందుకు?- దగ్గు, గొంతు నొప్పి, జలుబు వుంటే- ఉల్లిని చితగ్గొట్టి, ముక్కుదగ్గర పెట్టుకుని వాసన చూస్తూంటే కూడా గుణం కన్పిస్తుంది! ఉల్లిపాయ చీల్చి వెనిగర్‌లో వేసిన ఉప్పు మిరియంతో కలిపి రోజూ రెండుపూట్లా తింటే- ‘జాండీస్’కూడా తగ్గిపోతుందిట. బాగా తాగిన వాడయినా ఓ కప్పు ఉల్లిరసం తాగితే- దమ్ము దిమ్ము పోయి, ‘నిషా’దిగిపోతుంది. మరి ఇంత మేలొనర్చే ఉల్లి కాబట్టే- దాని ధర కొండెక్కి కూచుంటే, నిజంగానే ‘‘ఏం తినాలి’’అన్న నిర్వేదం సహజం మరి.’’ అన్నాడు ప్రసాద్ తన అనుభవసారం వివరించి లేస్తూ.

0 comments: