‘‘ఫిబ్రవరి అనగానే బడ్జెట్ నెల అని మన దేశంలో స్థిరపడిన సంగతే! బడ్జెట్ వస్తోందంటేనే దేని ధరలు పెరుగుతాయో, దేని ధరలు తగ్గుతాయో, వేటివేటిపై పన్నుల భారం పడుతుందో, పన్నులేని వార్షికాదాయం పరిమితి ఉద్యోగులకు ఏమయినా పెంచుతారో లేదో అనే ఉత్కంఠ ప్రజానీకంలో పాతుకోవడం మామూలే! ఫిబ్రవరి తరువాత నెల ‘మార్చి’ అని వుండడంలో ఎంతో ఔచిత్యం వుందనీ అది సామాన్యుడి జీవితాన్ని ఎంతోకొంత ‘మార్చి’ వేసేదేననీ ఒక భావన. నిజానికి జనవరి 1 నూతన ఆంగ్ల సంవత్సరం, ఆ తరువాత ఉగాది తెలుగు సంవత్సరాది అయినా ఏప్రిల్ ఒకటి నుండి మొదలయ్యే నూతన ఆర్థిక సంవత్సరం ప్రభావం నిజానికి ఎక్కువ. ఫిబ్రవరిలో ప్రతిపాదింపబడే బడ్జెట్ అమలు ఏప్రిల్ నుంచి జరుగుతుంది. అందుకే ఫలానా వాటి ధరలు పెరిగిపోతాయి అనే ఊహాపోహలు చెలరేగినప్పుడు వాటి అమ్మకాలు ఫిబ్రవరిలో ఊపందుకోవడం వ్యాపారస్తులకు అనుభవంలోని విషయమే! కేంద్రం ఫిబ్రవరి 25న రైల్వే బడ్జెట్‌ను 28న సాధారణ బడ్జెట్‌ను సమర్పిస్తుంది. రాబోయే బడ్జెట్ ఎలా వుంటుంది అన్న చర్చలు, వాటిపట్ల సామాన్యుడి కలలు, ఇవన్నీ ఈ నెలలో సహజంగా పొడచూపేవే!’’ అన్నాడు సుందరయ్య దినపత్రిక బిజినెస్ పేజీలు చూసి మడుస్తూ.
‘‘అయ్యా! సుందరయ్యగారూ! బడ్జెట్ ప్రవేశపెట్టడంతో సంబంధం లేకుండానే ప్రభుత్వం ఇప్పుడు తెలివిమీరి వ్యవహరిస్తోంది. పెంచాలనుకున్న ధరలు ముందే పెరిగిపోతున్నాయి. రైల్వే ఛార్జీల ధరలు ఈ సరికే పెంచేశారు. సరే పెట్రోల్, డీసిల్ ధరలు, గ్యాస్ ధరల సంగతి చెప్పనే అక్కర్లేదు. శుక్లపక్షం, కృష్ణపక్షంలా వాటిల్లో పెరుగులు, విరుగులు ఎప్పుడు సంభవిస్తాయో చెప్పలేం! మీరన్నట్లు ఒకప్పుడు ధరలు, పన్నుల వ్యవహారం బడ్జెట్‌తో ముడిపడి ఫిబ్రవరి మాసంలో బహిర్గతం అయ్యేది కానీ ఇప్పుడు దాంతో సంబంధం లేకుండానే జరిగిపోతోంది. దాంతో తెలివిగా బడ్జెట్ సామాన్యుడికి భారమేమీ కాదనీ, ధరలేమీ పెంచలేదనీ, సామాన్యుడి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమనీ అంకెలగారడీతో బడ్జెట్ నమ్మబలికే వ్యవహారంగా మలచి చూపుతున్నారు,’’ అన్నాడు శంకరం.
‘‘ఆ మాట నిజం శంకరం! పన్నులు విధించడం గురించి బడ్జెట్ ప్రవేశపెట్టాకగానీ తెలియకుండా వుండే గోప్యత పాటించడాన్ని తప్పు పట్టలేం. కానీ బడ్జెట్‌లోని వౌలిక అంశాలు ముఖ్యంగా ప్రభుత్వ పథకాల కేటాయింపులు, వాటి ప్రయోజకత్వాల మీద కూలంకషమైన అధ్యయనం, చర్చ జరగాలి. బడ్జెట్ ప్రతిపాదించడానికి ముందు ఆర్థికమంత్రి కొన్ని వారాల ముందే విభిన్న వర్గాల ప్రతినిధులను కలుసుకుని అభిప్రాయాలు తెలుసుకోవడం, విధానపరమైన లోపాల సవరణకు యత్నించడం జరగాల్సిన సంగతి. అదేదో చిత్తశుద్ధితో జరగాలిగానీ ఆనవాయితీ ఉబుసుపోకగా కాదు. బడ్జెట్‌వల్ల బ్రతుకులో పొడచూపేదేమిటి? బడ్జెట్ ‘మార్చి’ అందించేదేమిటి? అనే ఆశ పౌరులకు సహజం. అసలు ప్రభుత్వ రాబడి వ్యయాల వివరాలే కంప్యూటీకరణ జరిగి ఇన్నాళ్ళయినా ఇంకా కచ్చితంగా అందించలేని పరిస్థితి వుండడం మాత్రం శోచనీయం’’ అన్నాడు రాంబాబు.
‘‘ప్రభుత్వ పథకాలకు ముఖ్యంగా జనాకర్షక పథకాలకు కేటాయింపులు అనేవే బడ్జెట్‌లో కొట్టవచ్చినట్లు కనబడే అంకెలవుతున్నాయి. ధరలన్నీ చుక్కలనంటుతూంటే మన రాష్ట్రంలో రూపాయికే కిలో బియ్యం అనీ, తమిళనాడులో రూపాయికే ఇడ్లీ అనీ హోరెత్తించే చర్యలు నిజంగా ఆ పథకాల ప్రయోజకత్వంపై విశ్వాసంతోటివేనా లేక ఓట్ల బ్యాంకు జమ్మిక్కులా అనిపించడం సహజం. ప్రాథమిక విద్య, వైద్యం ఉపేక్షిస్తూ ఉపకారవేతనాలు, ఆరోగ్యశ్రీలు అంటూ బడ్జెట్‌లో రంగుల కలల్ని కోట్లాది రూపాయల కేటాయింపుతో ఆవిష్కరించడం విశ్వసనీయతకు ఏ మేరకు దోహదం చేస్తుంది’’ అన్నాడు శంకరం.
‘‘మనం వైఫల్యం పొందుతున్న రంగాలేమిటి? ఖర్చుచేసే మొత్తాల ద్వారా ఆశించిన ప్రయోజనం అందని అంశాలేమిటి? పథకాల రూపకల్పనకు అమలుకు మధ్య విశ్వసనీయత గోచరించని అగాథ వైఖరులేమిటి అన్న విషయం స్పష్టంగా అవగాహన కావాలర్రా! ఉదాహరణకు విద్యుత్ సరఫరాలో వైఫల్యం కారణంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఎలా నష్టపోతున్నాయో, కరెంటు కోతలతో ఎలా పని గంటలు వృధా అయిపోతున్నాయో బడ్జెట్ రూపకల్పనలో దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా నష్టనివారణకు ప్రయోజన సంవిధానాలకు చర్యలుండాలి. అర్థవంతమైన వ్యయం తత్సంబంధిత ప్రణాళికలు వున్నప్పుడే కదా ఆదాయవృద్ధి రేటు పెరిగేది. బడ్జెట్‌లో దేనికి ఎంత కేటాయించినా వాస్తవంలో అవి రూపుదిద్దుకోవడం అన్నది ముఖ్యం. తమాషాగా ఈసారి మన రాష్ట్ర బడ్జెట్ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టడమే లేదు. ఈసారి మార్చి 15కు గానీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదు. ఇక దానిని ఆమోదింపచేసుకోవడం మేలోగానీ జరగకపోవచ్చు. బడ్జెట్ ప్రభావం జనజీవితం మీద అనివార్యమైన సంగతి. ‘కుటుంబ బడ్జెట్’ అనేదీ ఒకటుంటుంది. కుటుంబ పెద్ద దాని గురించి ఆలోచిస్తూంటాడు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైనప్పుడు నిజానికి ఇంటిని నడపడం అనే దానిపై ఒక అవగాహన కలిగి బడ్జెట్ వేసుకుని పాటించడం సాఫీగా వుంటుంది. ఒకరి జీతం విలాసాలకు, మరొకరిది గృహ నిర్వహణకు అన్నట్లుంటే అది సక్రమమని భావించలేం. గృహనిర్వహణ కూడా బాధ్యతాయుతంగా అవసరాలను బాధ్యతలను సజావుగా నిర్వర్తింపచేసుకునేదిగా సమష్ఠి ప్రతిపాదనలతో సాగాలి. ధరలు ‘జెట్’ వేగంతో దూసుకుపోతున్న ఈ రోజుల్లో ‘బడ్జెట్’ - ‘బ్యాడ్-జెట్’ కాకూడదు. కేంద్ర, రాష్ట్రాలకే కాదు ప్రతి కుటుంబానికే బడ్జెట్ - ఆదాయ వ్యయాల లెక్కలు, కెటాయింపులు ఇవన్నీ అవసరమే. ఆర్థికాభివృద్ధికి మానవాభివృద్ధికి దోహదపడేది బడ్జెట్’’ అన్నాడు సుందరయ్య లేస్తూ.
0 comments:
Post a Comment