Sunday, January 13, 2013
జీవనకాలమిస్టు కవిత్వం
ఆయన ప్రధానంగా కథకుడు, నవలా రచయిత, నాటక రచయిత, అంతకు మించి, మంచి రంగస్థల, సినీ నటుడు. మానవీయత మూలకందంగా ఉద్విగ్నభరితుడయ్యే సహజ స్వభావి కనుకే- ‘కాలమిస్టు’గానూ ‘జీవనకాలం’తో రాణిస్తూ వచ్చాడు. ఆయనే గొల్లపూడి మారుతీరావు. మారుతీరావులోని కవి కోణాన్ని ముందుకుతెస్తూ, విజయవాడ సాహితీమిత్రులు వెలువరించిన గ్రంథం ‘మారుతీయం.’
‘‘కవిత ఆలోచనలకి అందమైన ఫిలిగ్రీనేత
మనస్సుచుట్టూ మన్నికయిన బంగారు మలామా’’
అంటూ- తన జీవితకాలంలో ఉగాది కవి సమ్మేళనాల్లో, డైరీల తొలి పేజీల్లో, విరహాల్లో, వియోగాల్లో, బాధాస్మృతుల్లో, నివాళుల్లో ఉద్వేగం చెందిన అనుభూతుల్ని, తన కవితాహృదయంగా ఇందులో ఆవిష్కరించారు మారుతీరావు.
ఈ సంకలనంలో ప్రేమగీతాలు, ఆసుపత్రి పాటలు, వాసుస్మృతులు, మళ్ళీ మళ్ళీ వసంతం, ఉగాది కవితలు, స్వాతంత్య్ర గీతం, ఏరినపూలు, హైకూలు, పాటలు, పల్లవులు అనే ప్రకరణాలుగా మారుతీరావు కవిత్వ భావనలన్నీ సంతరించడం జరిగింది.
ప్రేమ గీతాలులో ‘రాలిన పూలు’- దాశరథి అనువదించిన గాలిబ్ గీతాల పంథాలో అభివ్యక్తమవుతున్నాయి.
‘‘వలపు వలన బ్రతుకు బహురుచ్యమైనది
ఎడద తీయదనము బడయసాగె
బాధకౌషధమ్ము బడసియు డెందంబు
మందులేని బాధ నొందెమరల’’
అని గాలిబ్ గీతం
పలికితే, ఆ బాణీలోనే మారుతీరావు-
‘‘బ్రతుకు బాధను వరియించి గతుకు వార
బాధ కవితను వరియించి అతుకువేసె’’
అంటాడు. ఓ జీవితకాలపు సుదీర్ఘ యాత్రలో ఏ ప్రక్రియా శిల్పానికే లొంగని ఊహల ఉమ్మెత్త పూల తోరణంగా, అనుభూతికి అందమైన సంతకంగా- తన ‘మారుతీయం’ అంటున్న మాట నిజమేగానీ, ఉమ్మెత్త పూల సౌందర్యంలోనూ ఓ మత్తు వుంది, గమ్మత్తువుంది. పైగా సామాన్యుడి సరసన నిలిచే సుగంధ సౌందర్యం ఉమ్మెత్త. ‘రాలిన పూలు’ వెదజల్లే కవిత్వ పరీమళం నిజంగా బాగుంది-
కాంత కౌగిట రంజిల కాంక్ష లేదు
ఆమె హృద్గత భావమ్మునైన చాలు
జగమునకు దివ్విటీ పట్టుపగలుకన్న
కాంత కౌగిట కరగు చీకటులు మిన్న
ఆలయమ్మున వెలసిన స్వామి! హృద
యమున వెలిసిన వెలది మాటేమి సేతు
నాదు మది మెత్తనని యేరు నమ్మవలదు
ఆమె కౌగిట ఆర్ద్రతగాంచె నంతె!
అంటూ సాగిపోయే ఈ ‘రాలిన పూలు’ ప్రేమగీతాల మధ్య మరికొన్నిటిలో-
నీతులెన్నొ చెప్పునేత యెవ్వడేని
గోతిలోన దింపు జాతినెల్ల
పదము పేర్చినంత పద్యమెట్టులనను
కోక కట్టినంత కోమలగునె
సజ్జనుని బ్రతుకు రెండింట శాశ్వతమ్ము
మొదట; యిప్పుడు, మనమున మెదిలినపుడు
వంటి సామాజిక నిర్వచనా నీతులూ చొచ్చుకుపోయి కనిపిస్తాయి.
ఈ ‘ప్రేమ గీతాలు’లో భావుక అంతరంగం వ్యక్తమవుతోంది. ప్రేమ ఓ అందమైన అనుభవం, హృదయాన్ని ఆర్ద్రంచేసే ఆలోచన. దాన్ని గుర్తుపట్టు, గుర్తుపెట్టడానికి ప్రయత్నించకు.. అంటూ- ప్రేమ హృదయాలు మాట్లాడుకునే భాష అనీ, మట్టిబెడ్డను మణిదీపంలా వెలిగించే మంత్రదండం అనీ, వయస్సు ముంగిట్లో కళ్ళు విప్పే తియ్యటి ఉదయం అనీ, మనస్సుని గుడిగా మలిచే వింత శక్తి అనీ పలు రకాలుగా నిర్వచిస్తారు.
‘‘టెలిఫోన్ తరంగాలు నీ గొంతు పరీమళాలతో తలంటుపోసి రాత్రిని పూల పల్లకిలో ఊరేగిస్తాయి’’అని ఆమె సంభాషణల పట్ల సంతోష స్వాంతుడవుతాడు. ‘‘ఆలోచనల్ని పదిలంగా మడతపెడితే నిద్రవుతుంది. కోరికల్ని రహస్యంగా మడత విప్పితే కలవుతుంది. నువ్వు నా నిద్రలో కలవి. కలకోసం ఎదురుచూసే నిద్రవి’’అని సంభావించడం బాగుంది.
ఇక ‘ఆసుపత్రి పాటలు’ ప్రకరణం- యాక్సిడెంట్ కారణంగా ఆసుపత్రి గదిలో వున్నప్పుడు- ఆలోచించే మెదడూ, రాసే కుడి చెయ్యి దెబ్బ తినకపోవడంవల్ల, జనియించిన భావాల తోరణం. ‘‘విరిగింది కాలే అయితే- పొరుగు మంచంమీద పగిలిన తలని చూడు’’ ‘‘జీవనాన్ని టోకుగా కొన్ని నెలలు వాయిదావేయించే విచిత్రమైన కర్మాగారం ఇది’’అంటూ ఆసుపత్రిలో - అనూహ్యంగా రచించాలనుకున్న భావనా చిత్రం, అవ్యాహతంగా జారే కన్నీటికి అంచులు తొడిగినప్పటి గుండె గుబుళ్ళను ఆరవేస్తూంది.
‘వాసుస్మృతులు’ కన్న కొడుకుని కోల్పోయిన పితృ హృదయాన్ని ముందుంచి, పఠితను చలింపచేసేవిగా వున్నాయి!
‘‘ఏడు సముద్రాలు దాటి కోరుకున్న రాజకుమారికోసం పదేళ్ళు తపస్సుచేశాడు చిన్న కెరటాన్ని దాటి యిటువేపు అడుగువెయ్యలేకపోయాడు...
నా అడుగుజాడల్ని కొలిచి మిల్లీమీటరు తేడా రాకుండా నడిచేవాడు నాకంటే ముందు ఎందుకు అడుగువేశాడో అర్ధంకాదు’’
అన్న స్మృతిలోని వాక్యాలు విస్మృతిలోకి వెళ్ళవు!
ఇక ‘ఉగాది కవితలు’ ఆహుతుల ముందు కవి సమ్మేళనాల్లో విన్పించిన కవితలు.‘‘చదువుకొనే కవితకి అనుభూతి ప్రాణమయితే, చదివే కవితకి అనుస్పందన ప్రాణప్రదం. మొదటిది అంతర్ముఖి. రెండవది ఎదుటి వ్యక్తి మమేకానికి ఎదురుచూసే ఇష్టసఖి’’ అంటారు మారుతీరావు. సంకలనంలో కొంచెం దీర్ఘ కవితలంటే ఇవే. ఎందుకంటే సభావేదికలపైనుండి రసజ్ఞ ప్రేక్షకుల కరతాళ ధ్వనుల సంస్పందనలకు ఎదురుచూసే తరుణాలలోనివి కదా!
‘‘అదేమిటండీ బాబూ
అప్పుడే వచ్చేసిందా ఉగాది
అప్పుడెప్పుడో వచ్చిన
దివిసీమ ఉప్పెనలాగ
పెళ్ళాన్ని మోసంచేశానని
అర్ధాంతరంగా తోసుకొచ్చిన
ఆస్ట్రేలియా ప్రధాని కన్నీళ్ళలాగ
భారతదేశంలో పుట్టి బ్రిటిష్ రాజకీయాల్ని
కుదిపి పలకరించిన
పామెలా బోర్డెస్ సెక్సుకథలాగ’’
అంటూ సమకాలీన ‘వార్తా’వరణాన్ని- ఉగాది ఇతివృత్తానికి ఆభరణంగా జంటించడం వీటిల్లో చూస్తాం! పది కాలాలకు ప్రతినిధులుగా పది ఉగాదుల సరిగమ పదని భావాలున్నాయి వీటిల్లో.
సంకలనంలో ‘ఏరినపూలు’ ఒక మంచి భావ ప్రకరణం.
‘‘ఓర్పు నిన్నటి చర్యలకు
నేడు ఇచ్చే తీర్పు
రేపు నేటిని మనశ్శాంతిగా
తర్జుమా చేసే చల్లటి ఓదార్పు’’
‘‘నీవు నా జీవన ప్రాంగణంలోకి అడుగుపెట్టాకే
మళ్ళీ నా కలం ఈ ప్రేమ రసైక జీవిని మేలుకొలిపింది
ప్రతి ఆలోచనలోనూ కొత్తగా దర్శనమిచ్చి
ప్రతి దర్శనలోనూ కొత్త ఆలోచనని రేకెత్తిస్తున్నావు నీవు’’
వంటి మంచి అభివ్యక్తీకరణలున్నాయి ఇందులో.
అలాగే గొల్లపూడి ‘హైకూలు’ నిర్వచన పంక్తులుగా ద్యోతకమవుతాయి. అనుభవించే నేడు- కళ్ళబడకుండా- రెప్పల్ని కప్పే కంటివాపు- ‘రేపు’అనీ, కారుమబ్బుల అవసరం లేకుండా అనవరతం కురిసే వానజల్లు- ‘నమ్మకం’అనీ అంటారు. అర్థంకాని ఎన్నో ఆలోచనల వర్షం నుంచి అవిశ్రాంతంగా కాపాడే పెద్ద దిక్కు ‘విశ్వాసం’ అంటారు.
ఆకాశవాణిలో పనిచేసినందువల్ల కాబోలు ఆయన కలం కొన్ని ‘పాటలనూ’ సంతరించింది. ‘‘ఒకటీ ఒకటీ రెండూ ఏ భాషలోనయినా- నువ్వూ నేనూ ఒకటీ ఈ దేశంలో యికపైనా’’ వంటి సమైక్య భావనా గీతం, వెన్నెల రేయెటు వేగెనో ఉన్న క్షణాలివి సాగెనో, ఓ విభావరీ ఓహో విభావరీ వంటి భావగీతాలు, మరి కొన్ని పల్లవులూ మారుతీయంలో పలికాయి.
గొల్లపూడి మారుతీరావుగారి కవితా హృదయం ప్రేమ, స్నేహం, వాత్సల్యం వంటి మానవీయ భావాల మూలకందంగా అభివ్యక్తమవుతోంది. 1960ల నుండి అడపా దడపా రాసుకున్న కవిత్వమంతా ఇక్కడ ప్రోగై అందివస్తోంది. కవితా నిర్మాణం, కవితాశిల్పం వంటి పెద్దపెద్ద పదాల జోలికిపోకుండా, కేవలం మనసుపెట్టి చదవాల్సిన కవిత్వం ఇది. ఇక సహానుభూతితో సంస్పందించదగిన కవిత్వం ఇది.
ఇవాళ క్రొత్తగా మారుతీరావుని కవిగా ప్రొజెక్ట్ చేయడంవల్ల ఆయన బావుకునేదేదీ లేదు. కానీ, ఎంతో బావున్న ఆయనలోని ‘వౌలిక కవి’ని గుర్తించడమూ అవసరం! ఆయన పేరుచెప్పకుండా ఇందులోని కవితలు ఎవరికి ఏవి చూపినా, కచ్చితంగా ఇవి ఎవరో ఓ మంచి కవి రాసినవని పాఠకులు నిస్సందేహంగా కవితాభిరుచిగల వారెవరయినా తృప్తిగా తలలూపుతారు. తీయని అనుభూతి సంస్పందనల మనసు మారుతం ‘మారుతీయం’. సాహితీమిత్రుల చర్య అభినందనీయం.
-సుధామ
మారుతీయం (కవిత్వం)
గొల్లపూడి మారుతీరావు
సాహితీమిత్రులు
28-10-26/1,
అరండల్‌పేట, విజయవాడ-2
ప్రచురణ.
వెల: రూ.100/- 'అక్షర ' 13.1.2013
Labels:
పుస్తక సమీక్షలు
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
chakkani sameeksha
Thank you Bhanu!
గొల్లపూడి మారుతీరావు గారు బహుముఖ ప్రఙ్నాశాలి. సాహిత్యాన్ని గుర్తించలేని ఆంధ్రదేశంలో పుట్టడం ఆయన దురద్రుష్టం. మన అద్రుష్తం. ఇంకే రాష్త్రంలో ఐనా ఆయనకు మంచి గుర్తింపు వచ్చేది. మీ సమీక్ష కు ధన్యవాదములు.
కెజికె
అవును సుధామగారూ!
ఆయన కవిత్వంకాదుకేవలం అక్షరాలకూర్పు.
మరుద్వేగంతో హృదయం స్పందించిన తీర్పు-గంటి
Post a Comment