ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, January 18, 2013

'మన భయ్యం’

"'చావల్ కో కహ్‌తేహై బియ్యం
సైతాన్ కో కహ్‌తేహై దయ్యం!'


అని చిన్నప్పుడు స్కూల్లో ఆటలాడుతూ అరుస్తూ వుండేవాళ్లం. బియ్యానికీ దయ్యానికీ సారూప్యం ఏమిటో అప్పుడు తెలిసేది కాదు. కానీ నిత్యావసర సరుకులు దాచేసి, కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు అమ్ముకునే బ్లాక్ మార్కెట్ గాళ్ళ గురించీ, పిల్లలకు పాల డబ్బాలు కూడా దొరకక మధ్యతరగతి వాళ్లు సైతం కునారిల్లిన వైనాల గురించీ, ఆ తరువాత తరువాతే తెలుస్తూ వచ్చింది.’’ అన్నాడు రాంబాబు దినపత్రిక పేజీలు మడిచి పెడుతూ.

‘‘ఎవరికయినా ప్రాథమికావసరం తిండి’’ కూలివాడయినా, కార్పొరేట్ కంపెనీ అధిపతి అయినా- నాలుగువేళ్లూ నోట్లోకి వెళ్లడం గురించే కష్టపడేది. అయితే అందరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. విస్తళ్లు కుట్టుకుని ఆ డబ్బుతో కడుపునింపుకోవాల్సిన స్థితీ కొందరికుంటుంది!’’ అన్నాడు ప్రసాదు.

‘‘అందుకనే కదుటోయ్! మన రాష్ట్రంలోనే మొదటిసారిగా రూపాయికే కిలో బియ్యం ఇచ్చే ‘మన బియ్యం’ పథకానికి అంకురార్పణ చేసింది. మొన్నటినుంచీ- ముందుగా కరీంనగర్, నల్గొండ, వరంగల్‌లో ప్రారంభించబడిన ఈ పథకం, వచ్చేనెలకల్లా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు విస్తరించనుంది.ఏడు జిల్లాల్లో ముందు ప్రయోగాత్మకంగా పైలట్ పథకంగా నిర్వహిస్తున్న ఈ ‘మన బియ్యం’ పథకాన్ని రాష్టమ్రంతటా క్రమేపీ విస్తరించాలని ప్రభుత్వం తలపోస్తోంది. రెండు కోట్ల ఇరవై అయిదు లక్షల పేద ప్రజలకు‘మన బియ్యం’ పథకం- ప్రయోజనం చేకూర్చబోతోంది! ఉగాదినుండి కేవలం బియ్యం మాత్రమేకాకుండా, గోధుమ పిండి, నూనె, చక్కెర, కారం వంటి ఓ ఎనిమిది నిత్యావసర సరుకులను 295 రూపాయల విలువగల వాటిని కేవలం 185 రూపాయలకే- తెల్లరేషన్ కార్డులున్న పేదలకు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. ఇది అభినందనీయం కాదూ!’’ అన్నాడు సన్యాసి.

‘‘వేసినప్పుడు పథకాలన్నీ చెప్పుకోవడానికి బహురంజుగానే వుంటాయర్రా! కానీ ‘బియ్యం’ అంత సన్నంగానూ, అంత నాణ్యంగానూ రూపాయికే కిలో కచ్చితంగా పేదలకందుతుందన్న గ్యారంటీ ఏదీ? ‘బియ్యం’ కాజేసే ‘దయ్యం’ ఎప్పుడో అదాటున సాక్షాత్కరిస్తుంది. ఇంతకుముందూ.. అందవలసిన ప్రయోజనాలు అసలు వారికి అందకుండా, బియ్యాన్ని లారీలతో పక్కదారి పట్టించి, అమ్ముకు లాభపడిన వాళ్లున్నారు. అలాంటివారివల్ల ఎంతటి పథకమయినా ‘నీరుగారి’, పేదల ప్రయోజనాలను దెబ్బతీసి, కేవలం ‘ప్రచారార్భటిగానే’ మిగిలిపోయిన విషయాలు మనకు తెలియనివి కావుగా!- రూపాయికి - ‘కిలో బియ్యం’అంటే సామాన్యమైన సంగతికాదు! ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం అన్నప్పుడే- అది ఎంతోకాలం నిలబడలేక, తర్వాతి కాలంలో తస్సుమంది. అప్పట్లో పంజాబ్ మొదలైన పక్క రాష్ట్రాలనుంచి ధాన్యం కొనుగోలుచేసి తెప్పించి, పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసినా- అది ప్రభుత్వానికే భారమై కూచుని, ఆ పథకానికి ఆపై కాలంలో, ‘గండి’పడింది! మరల ఇదేల ఈ పథకం అని ఇప్పుడు ఎవరికయినా మరి సందేహం కలగడంలో విడ్డూరమేం లేదు’’ అన్నాడు రాంబాబు.

‘‘సంకల్పం వుండాలి. దాన్ని చిత్తశుద్ధితో అమలుపరిచే దృక్పథమూ, ప్రణాళికా వుండాలి. అప్పుడు అసాధ్యమేమీ కాదోయ్! ఇంతవరకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధాన్యం సేకరించి, పౌర సరఫరాలశాఖకు అందించగా ప్రజాపంపిణీ జరిగేది. గోడౌన్స్‌నుంచే బియ్యం దొంగ రవాణా జరిగిన వృత్తాంతాలూ గతంలో బయటపడ్డాయి. కానీ చూసా రూ! బియ్యం అక్రమ తరలింపుచేస్తే- పి.డి.యాక్ట్ ద్వారా చర్యలు తీసుకుంటామనీ, ఎక్కడో పొరుగు రాష్ట్రాలనుంచి కొనడం కాకుండా, మన రైతులకు గిట్టుబాటు ధర దొరికేలా, మన ధాన్యా న్నే ‘మన బియ్యం’గా అందివ్వాలన్నదే ఇప్పటి ప్రభుత్వ లక్ష్యంట! ‘ఎక్కడ కొనుగోలు చేసింది అక్కడే’ పేదలకు పంపిణీ చేయడం లక్ష్యంగా ఈ ‘మన బియ్యం’ పథకం మొదలెట్టామంటున్నారు ముఖ్యమంత్రిగారు. మీకు తెలుసా! తొమ్మిది వేల ఆరువందల కోట్ల రూపాయలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బు చెల్లించి నిర్వహిస్తున్న ‘మన బియ్యం’ పథకం ద్వారా - పౌర సరఫరాలశాఖకు - కిలో రూపాయికి అమ్మడంవల్ల 400 కోట్ల రూపాయలే సమకూడుతాయంటే- మిగతాదంతా సబ్సిడీగా ఇస్తున్నట్లేకదా! నలభైఆరు వేల రేషన్ షాపుల ద్వారా ‘మన బియ్యం’ పథకం ద్వారా పేదలకు నాణ్యమైన, సన్నబియ్యం అందిస్తామంటున్నారు ముఖ్యమంత్రి’’అన్నాడు సన్యాసి.

‘‘ ‘మన బియ్యం’అంటు న్నా.. ‘మన భయ్యం’అలానే వుంటుంది. ముప్ఫై కోట్ల ధాన్యం బస్తాలు సేకరిస్తామనీ, ఉగాదినుంచీ వట్టి బియ్యమేకాక పలు నిత్యావసర వస్తువులు కూడా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామనీ, అందునా ‘ఆధార్’కార్డు అనేది పూర్తిగా అమల్లోకి వచ్చాక, ఎవరయినా, ఏ రేషన్ షాపునుంచైనా కొనుగోలు చేయవచ్చనీ- తెల్లకార్డులున్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి భరోసా కల్పిస్తున్నారు. అసలు 2014లో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని- మనకు ప్రజాబలం ఓట్లద్వారా దొరుకుతుందో దొరకదో అనే ‘్భయం’తోనే, ఈ ‘బియ్యం’ పథకం ఆరంభించినట్లుందనే విమర్శలు ఇప్పటికే మొదలయ్యాయి! జనాకర్షక పథకాలేవి వచ్చినా, వాటికి అస్తిత్వం వుండదు. ప్రజలకు ముందు కలగాల్సింది ‘నమ్మకం!’ మొదటి ప్రారంభంరోజే- రేషన్ షాప్ డీలర్లు ఆందోళన చేసారు. వారి కమీషన్ శాతం పెంచాలనీ, ‘మన బియ్యం’ పథకం తమ ప్రయోజనాలను దెబ్బతీసేది కారాదనీ మరి వారి ఆందోళన! ఒకటి మాత్రం నిజం!- ‘‘దానే దానే మే లిఖాహువా హై ఖానే వాలే కా నామ్’’అన్నట్లు, ప్రతి ధాన్యపు గింజ మీదా- అది చేరవలసిన నోటి గలవారి ‘పేరు’రాసి వుంటుందట! అందువల్ల ‘మన బియ్యం’వంటి పథకాలు నిలిచి నిజంగా పేదల కడుపు నింపే ప్రజోపయోగ పథకాలుగా రాణిస్తాయని ఆకాంక్షిద్దాం! మంచిని ఆశించడం ఎప్పుడూ మంచిదే కదా!’’ అన్నాడు ప్రసాదు తలాడిస్తూ.
***

0 comments: