ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, November 9, 2012

బకరాలు





లాభం’ అనే మాట ‘లోభం’కు వ్యతిరేకమేమోనర్రా! ఎంత లోభి ‘అయినా ‘లాభం’ వస్తుందంటే, స్వప్రయోజనాలకోసం దేంట్లోనయినా పెట్టుబడులకు సిద్ధపడిపోతాడనుకుంటా! అవతలి వారికి తనది ‘దానం’ ఇవ్వడం అంటే, ‘అప్పనంగా ఇచ్చేయడం ఎందుకు?’అని భావించేవాడు సైతం, తనకి ఎదురు లాభం వస్తుందంటే, తను మదుపుపెట్టేది రెట్టింపు అవుతుందంటే వెచ్చించడానికి సిద్ధమైపోతాడు’’ అన్నాడు రాంబాబు.

‘ఇనె్వస్టర్’ అన్నమాట- అలాంటివారి గురించే కదా! వ్యాపారం చేయకపోయినా, వ్యాపారంలో ‘ఇనె్వస్ట్’ చేయడం ద్వారా, తాను కష్టపడకుండా లాభాలను పొందాలనే ‘ఆశే’ ఇనె్వస్టర్‌లది! డబ్బు బాగా మూలుగుతూంటే అదివేరు. కానీ మామూలు ఉద్యోగి- మధ్యతరగతి జీవి అయినా, కొంచెం డబ్బు పొదుపుచేసుకోవడం-మున్ముందు హఠాత్తుగా వచ్చిపడే ఏ అవసరాలో ఇబ్బందిపడకుండా ఎదుర్కునేందుకు అవసరమే! అయితే అలా దాచుకునే డబ్బు- ఏ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌గానో, పోస్ట్ఫాస్ ఆర్.డి గానో దాచుకోవడం వేరు. దానివల్ల దాచుకున్న సొమ్ముకు వడ్డీ లభిస్తుంది. దాచుకున్న కాలాన్నిబట్టి, పొదుపుచేసిన సొమ్ముకు అదనంగా వడ్డీ రూపంలో కొంత సొమ్ము లభిస్తుంది’’ అన్నాడు శంకరం.

‘‘అది సజావైన తీరే! అందులో పెద్ద ‘ఆశ’ ఏమీ దాగిలేదు. కానీ చూసారూ! పెట్టిన సొమ్ము రెట్టింపు అవ్వాలనీ, ఇబ్బడిముబ్బడిగా లాభపడాలనే ఆశలే- మధ్యతరగతి జీవులను కూడా ‘ఇనె్వస్టర్లు’గా మారుస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్థిరాస్తికోసం, స్టాక్ మార్కెట్‌లో షేర్ల రూపంలో, అలాగే బంగారం, బాండ్లు మొదలైన వాటి పట్ల ఆకర్షితులను చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ ‘వ్యాపారం’ అంటున్నాం గానీ, ఒక్కసారి నిజంగా ‘జూదం’గా పరిణమిస్తున్నాయి అనిపిస్తోంది. వాటిల్లో ఇనె్వస్ట్‌చేసి సర్వం కోల్పోయిన వారున్నారు. ‘ఆశకొలదిగ పెరుగు అవనిలో నిరాశ’ అన్నట్లు- అధిక లాభాల ఆరాటమే, ఆరోగ్యాలకు చేటు తెచ్చేదిగానూ వుంటోంది మరి’’ అన్నాడు రాంబాబు.

‘‘నువ్వు ఎన్ని చెప్పు రాంబాబూ! ‘ఆశ’ మనిషికి సహజం! కొంతమేరకు అది తప్పదు కూడాను. కానీ ‘దురాశే’ చేటుతెచ్చేది. ‘జూదం’లో లాగానే- కొంత లాభం చవిచూస్తే చాలు, మరింత లాభాల కోసం, పణం పెట్టడం వ్యసనంగా రూపొందేట్లు, ‘ఇనె్వస్టర్లు’ కూడా వాటిల్లో ఇరుక్కుపోతూంటారు. చిట్‌ఫండ్ కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలు అంటూ వచ్చి- ఎందరో మధ్యతరగతి జీవుల కలలను పెంచి పోషించి, హఠాత్తుగా బోర్డు తిప్పేసి, నిలువునా ముంచినవి వున్నాయి. కానీ ఎప్పటికప్పుడు ‘ఆశ’అటువంటి వాటివైపు పరుగులు తీయిస్తూనే వుంటుంది’’ అన్నాడు ప్రసాదు.

‘‘అది సరే! టేకు చెట్ల కంపెనీ అనీ, రంగురాళ్ళ కంపెనీ అనీ, రొయ్యల కంపెనీ అనీ- స్టాక్‌మార్కెట్ బూమ్‌లో ఆర్థిక సరళీకరణలు ప్రవేశించాక దేశంలో, తొంభయ్యవ దశకంలో, జనాలను ‘ఇనె్వస్టర్లు’గా మార్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టుకున్నాయి! ప్రభుత్వ చట్టాలు వున్నా, నియంత్రణ సంస్థలు వున్నా సదరు కంపెనీల ఉధృతి, ఆగడాలు తగ్గలేదు’’ అన్నాడు శంకరం.

‘‘మోసపోయిన వాళ్లని ‘బకరా’లు అంటారు. ‘బకరా’ అంటే మేక. మేకల మీద పెట్టుబడితో బోలెడు లాభాలని ఇనె్వస్టర్లను బకరాలను చేసిన కంపెనీ కథ ఒకటి ఇటీవలే బయటికొచ్చింది. ‘బీటిల్ లైవ్ స్టాక్ అండ్ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే న్యూఢిల్లీ సంస్థ ఒకటి మేకల్లో ఇనె్వస్ట్ చేస్తే- ఇబ్బడిముబ్బడి లాభాలంటూ, కొన్ని సంవత్సరాలుగా పబ్లిక్ ప్రచారంతో ఊదరగొట్టిందిట.
ఒక మేక మీద కొన్ని వేల రూపాయలు ఇనె్వస్ట్ చేస్తే, నెలకు కనీసం రెండు శాతం లాభం చొప్పున, మూడునాలుగేళ్లలోనే పెట్టుబడి రెట్టింపవుతుందనీ, భారీ లాభాలు వస్తాయనీ ఒక స్కీమ్‌ను ముందుకు తెచ్చింది. ఒక్కో మేక ఏడాదిలో కనీసం నాలుగు పిల్లల్ని కంటుంది కనుక, ఈ నాలుగు పిల్లల్ని కొత్త ఇనె్వస్టర్లకు అమ్మితే, మొదటి ఏడాదే ‘ఇనె్వస్టెమెంట్’మీద నాలుగురెట్లు లాభం ఖాయమని ప్రచారంలో ఊరించింది.ఆ ప్రచారానికి ఎంతమంది ఇనె్వస్టర్లో ‘బకరా’లయిపోయారుట! ఈ కంపెనీ తీరుపై ‘సెబి’కి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందడంతో, అసలు రిజిస్టర్ చేసుకోకుండా, ముందుగా పర్మిషన్ కూడా లేకుండా- ఇనె్వస్ట్‌మెంట్ స్కీమ్‌ను నడిపిస్తున్నారని నోటీసులు జారీచేస్తే, అవి వెనక్కు తిరిగి వచ్చాయిట! ఆ కంపెనీ ప్రమోటర్లు బిచాణా ఎత్తేసారనే అనుమానం బలపడుతోందిట. ‘సెబి’ బహిరంగ ప్రకటన కూడా జారీచేసిందట. ఇలా మేకల కంపెనీ పేరనే ఇనె్వస్టర్లను బకరాలు చేయడం గమ్మత్తుగా లేదూ?’’ అన్నాడు రాంబాబు.


‘‘టోపీల కంపెనీయే ‘టోపీలు’ వేయడం, మేకల కంపెనీయే ‘బకరా’లను చేయడం తమాషా ఏమిటిలే! ఏదయినా నమ్మకం కలిగించడం, ఆశలను పురిగొల్పడంలో వుంది.‘‘నిన్ను అంతలా నమ్మినవాడిని మోసం ఎలా చేసావ్’’అని అడిగితే, ‘‘నమ్మాడు కాబట్టేగా మోసంచేయగలిగింది’’ అన్నాడట. మోసపోవడానికి- మోసం చేసిన వాడికంటే, మోసగాడిని నమ్మిన వాడే బాధ్యుడు. అలా నమ్మడానికి దురాశలూ, పేరాశలే కారణం మరి! ప్రజల్ని పాలించే పా లకులూ, నేతలే అత్యాశాపరులై, అవినీతి  కుంభకోణాల్లో కూరుకుపోతూంటే, నేతృత్వదరిద్రమైనజాతిలో‘యథారాజాతథాప్రజా’అన్నట్లు ప్రజాస్వామ్యవ్యవస్థే భ్రష్టుపట్టే స్థితి దాపురించడం బాధాకరమే మరి! ఈ వ్యవస్థను మార్చగలిగే, దురవస్థను పోగొట్టగలిగే కాలం ఎప్పటికి వస్తుందో మరి’’ అంటూ లేచాడు ప్రసాదు. *

2 comments:

kannaji e said...

బాగా వివరించారు సుధామ గారు...
ఒకళ్ళని లాభం లేదు...ఎవరో వస్తారని..ఎదో చేస్తారని ..ఒకళ్ళ మీద భారం వేసే..."మనం" మారాలి...అప్పటిదాకా...వట్టి ఇన్వెస్ట్మెంట్ కంపనీ ఏం ఖర్మా...బాబాలు ..మాతలు ..సో కాల్డ్ నాయకులు...అందరూ ఏమరుస్తూ ఉంటారు...:)

సుధామ said...

సరి అయిన మాట అన్నారు.ధన్యవాదాలు కన్నాజీ గారూ!