ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, October 18, 2014

వ్యక్తిత్వ వికాసంలో యువతకు కరదీపిక






ఎడ్మినిస్ట్రేటర్స్‌లో రైటర్స్ అరుదు. తాము నడచిన దారిని తమ తరువాతి తరానికి ఉపయుక్త లక్షణ గ్రంథంగా రాసి చూపగలగడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఓటములను ఎలా ఎదుర్కొని విజయపథగాములు కావాలి? జయాలకు పొంగిపోక ఎలా ప్రజోపయోగ సంవిధానాలకు పునరంకితం కావాలన్న సంగతులు యువతకు సుబోధకం చేసేలా ఆత్మీయ సరళ సంభాషణ వింటున్నట్లు సాగే ఆత్మకథాత్మక రచన ‘మోహన మకరందం’. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పనిచేసిన మోహన్ కందాగారి అనుభవాలూ- జ్ఞాపకాలూ ఈ పుస్తకం. బాపుగారి బొమ్మలు ఈ రచనకు పువ్వుకు తావిలా సమకూరాయి.


మేనేజ్‌మెంట్ స్కిల్స్ వుంటే ఏ శాఖ గురించయినా అవగాహన పెంచుకుని రాణించవచ్చు. మానవ వనరులను చక్కగా ఉపయోగించుకోవడంలోనే అధికారుల ప్రజ్ఞాపాటవాలుంటాయి. ఆయా రంగాలకు సంబంధించిన పరిజ్ఞానం సమగ్రంగా లేకున్నా అధిపతులుగా రాణించగల్గడం ప్రజ్ఞే! మోహన్ కందాగారు చేనేత శాఖలో, ఫిషరీస్‌లో, సివిల్ సప్లయిస్‌లో, ఎక్సయిజ్ శాఖలో, కమర్షియల్ టాక్స్‌లో, ఎగ్రికల్చర్‌లో, ప్లానింగ్‌లో, కో-ఆపరేషన్‌లో ఇలా ఒకదానికి మరోదానికీ పొంతన లేని అనేక శాఖల్లో పనిచేసిన అపారానుభవం కలవారు. అంతేకాదు, ఏ శాఖలోవున్నా ఆ శాఖ అధిపతిగా మంచి పేరుతెచ్చుకున్నవారు. పట్నంలోనే పుట్టి పట్నంలోనే పెరిగినా రూరల్ ఎకానమీపై సాధికారంగా అన్నీ తెలిసినవారు.


తమ బాల్యంనుండి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా రిటైరయ్యే పర్యంతం బ్రతుకుదారుల్లోని ముఖ్య సంఘటనలనూ, ఉద్యోగరీత్యా ఎదుర్కొన్న ప్రముఖ వ్యక్తులనూ, తమ సాహిత్య, సంగీతాది రంగాల పరిపరి పరిచయాలను కూడా వీటిల్లో ఎంతో ఆసక్తిదాయకంగా వివరించారు. మలుపు తిప్పే పలు ప్రభుత్వ పథకాల, రాజకీయ ఘటనల వెనుక తాము నిర్వహించిన భూమికను ఇందులో నిగర్వంగా చెప్పుకున్నారు. 


నిశిత పరిశీలన, సద్యఃస్ఫూర్తి, లలిత కళాభినివేశం, క్రీడా స్ఫూర్తి, ఉదాత్త విలువల గురించి ఆర్తిగలవారు కావడంవల్లనే ఈ మోహన మకరందాన్ని అందంగా ప్రయోజనదాయకంగా మలచి అందించగలిగారు.

 ‘తడాఖా చూపించాలి ఒకోసారి!’ ‘నామీద నీకు నమ్మకం లేదా?’, ‘ఎవరి పనివారు చేయాలి’, ‘సెన్సాఫ్ హ్యూమర్’ ‘సేద తీరాలంటే సంగీతం తప్పనిసరి’, ‘నేను క్లవరా’, ‘మేం ఏ ఎండకు ఆ గొడుగుపడతామా?’, ‘నేను మద్రాసీనా, హైద్రాబాదీనా’వంటి ప్రకరణాలన్నీ ఆసక్తిగా చదివించడమేకాదు మోహన్‌కందాగారి బహుముఖీన దక్షతను అక్షరాలా రూపుకట్టిస్తాయి.


ఎన్టీఆర్ లాంటి ముఖ్యమంత్రితో విభేదించ గల కలేజా ఎలా చూపిందీ, ఎన్నో విపత్కర పరిస్థితుల్లో ఎలా నేర్పుగా అధిగమించి వచ్చిందీ, పెంపుడు జంతువులవద్ద ఎలా సేదతీరిందీ కూడా వీటిల్లో వివరించారు. బ్యురోక్రట్స్ అనుకునే వారిలో ఇంతటి పదునైన బుర్ర, ఇంతటి విట్స్ దాగివుంటాయని ఇలాంటి పుస్తకం చదివితేనేగా తెలిసి వచ్చేది. అందరూ చదివి ఆనందించదగ్గ అనుభవాల సమాహారం ఈ గ్రంథం. యాజమాన్య దక్షత సాధించదలుచుకున్న యువతకు ఒక ఆదర్శ కర దీపిక.

  • -సుధామ

మోహన మకరందం
(అనుభవాలు- జ్ఞాపకాలు)-
వెల: 200రూ/-
డా.మోహన్‌కందా, సి.17,
స్టోన్‌వాలీ అపార్ట్‌మెంట్స్,
రోడ్ నెం.4, బంజారాహిల్స్,
హైద్రాబాద్-34;





Andhrabhoomi (Daily)-Akshara- 18th October'2014


0 comments: