ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, August 10, 2012

గ్యాసానందం


‘‘మెత్తని వాడిని చూస్తే మొత్తబుద్ధయ్యింది’అని సామెత. మొత్తంగా వుండేదాంట్లోంచి, తమ చిత్తంగా తరలించేయడం అనేది దారుణమే! ఆంధ్రప్రదేశ్ ‘రత్నగర్భ’అంటారు గానీ, దాన్ని ‘గ్యాస్’గా- మన రాష్ట్రంనుంచి మహారాష్ట్రానికి రత్నగిరి కంటూ తరలింపు చేయాలనుకోవడం మన చేతకానితనమే అవుతుంది! ముఖ్యమంత్రి లగాయితు మంత్రులందరూ కూడా మేల్కొని, మహారాష్టక్రు గ్యాస్ తరలింపు నిలిపివేయడం ఇప్పటికి సంతోషమే’’ అన్నాడు శంకరం.

‘‘పెట్రోలియ శాఖామంత్రిగా కేంద్రంలో మన రాష్ట్రానికి చెందిన జైపాల్‌రెడ్డిగారే వుండీ, అసలు అలాంటి ఆలోచన, నిర్ణయం జరగడమే మన అసమర్థత కాదుటోయ్! రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్ట్‌కు కూడా ఆయనగారు గ్యాస్ కేటాయింపులు చేయలేదు సరికదా, ఉన్న గ్యాస్‌ను కూడా తీసేసారు అన్న ప్రతిపక్ష ఆరోపణలో నిజం లేదా’’ అన్నాడు ప్రసాదు.


‘‘మహరాష్టల్రోని రత్నగిరి పవర్‌ప్లాంట్ ‘దభోల్’కు రసాయన ఎరువుల కర్మాగారంతో సమానంగా ప్రాధాన్యం ఇచ్చి రాష్ట్ర కోటానుంచి గ్యాస్‌ను తరలిస్తూ 2008లోనే మంత్రుల సాధికారిక బృందం చేసిన నిర్ణయం ఇప్పుడు అమలుచేయబోయారు. నిజానికి కేజీ బేసిన్ డి6 క్షేత్రం నుంచి మన రాష్ట్రానికి 9.16 ఎంఎంఎస్‌సిఎండీ గ్యాస్ కేటాయించినా ఉత్పత్తి కొరత అంటూ 3.48 యూనిట్లకు కుదించారా! అందులోంచి మళ్లీ రెండు యూనిట్లు రత్నగిరికి తరలిస్తే మనకి మిగిలేది! 1.48 యూనిట్లే! రాష్ట్రం అసలే వెలుగులు కోల్పోతూండగా గ్యాస్ ఆథారిత విద్యుత్ ప్లాంట్లన్నీ మూతబడే స్థితి దానికి అంగీకరించి చేజేతులా తెచ్చుకున్నట్లు కాలేదా? ఎప్పుడో మేల్కోవలసింది కనీసం ఇప్పటికైనా మేల్కొని కేంద్రంపై ఒత్తిళ్లు, వేడుకోళ్లు కావించడంతో తాత్కాలికంగానయినా ఆ నిర్ణయం ఆగి రాష్ట్రం గ్యాస్ రాష్ట్రంలోనే నిలుస్తోంది’’ అన్నాడు సన్యాసి.


‘‘రత్నగిరి ప్లాంట్‌ను బహుళజాతి సంస్థ ఎన్రాన్ నెలకొల్పింది. ఎన్రాన్ వివాదగ్రస్తమవడంతో పూర్తయిన ప్లాంట్‌ను వదిలేయగా ఆ ప్లాంట్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక ఆర్థిక పునర్నిర్మాణ సంస్థ ‘బిఐఎఫ్‌ఆర్’కు అప్పగించింది. నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావు, మన నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి దాన్ని తీసుకుని తెరముందు బినామీలను పెట్టారనీ కేంద్రంవద్ద చక్రం తిప్పి 2008లోనే అందుకే తమ ప్లాంట్‌కు ప్రాధాన్య ప్రాతిపదికపై గ్యాస్ ఇప్పించుకున్నారనీ, మన రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లు కొన్ని పూర్తయి గ్యాస్‌కోసం ఎదురుచూస్తున్నా వై.ఎస్ అందుకే పట్టనట్లు ఊరుకుని రత్నగిరి ప్లాంట్‌కు గ్యాస్ కేటాయింపు మన రాష్ట్రంనుంచి తరలిపోవడానికి తన స్వార్థంతోనే కారణమైనారనీ ఇవాళ వినబడుతున్నమాట వట్టి ‘గ్యాస్’అనుకోలేం కదా’’ అన్నాడు ప్రసాదు.


‘‘అలాంటప్పుడు మెత్తనివాడిని చూస్తే మొత్తబుద్ధయ్యింది అని ఎలా అంటాం. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని దొంగచేతికే తాళాలిచ్చిన చందం అయిందనాలి మరి. ఏమయినా మహారాష్టక్రు తరలించిన మన గ్యాస్ కోటాను పునరుద్ధరించాలన్న ప్రధాని నిర్ణయం పెట్రోలియంశాఖ అమలుచేయడం నిండా సంతోషం. ‘మన గ్యాస్ మనకే’ అన్నదే ఆనందం’’ అన్నాడు శంకరం.


‘‘అలా చంకలు గుద్దుకు సంతోషిస్తే లాభం లేదు సుమా! ఈ నిర్ణయంతో తలమీద కత్తి వ్రేలాడడం పోయిందనుకోలేం. అసలు రత్నగిరి ప్లాంట్‌కు ఇచ్చిన రసాయన ఎరువుల కంపెనీ హోదాని రద్దుచేయాలి. పెట్రోలియంశాఖ అలా నోటిఫికేషన్ జారీచేయకపోతే మళ్లీ మహారాష్ట్ర ప్రభుత్వం ఏ లాబీయింగో చేసి మన గ్యాస్ తరలించుకుపోయే ప్రమాదం లేకపోలేదు. అంచేత మన మెతకతనాన్నీ, మెత్తదనాన్నీ వీడి మన గ్యాస్ వనరుల్లో ఎలాంటి కోత పడకుండా, మన కోటా మరేచోటికి తరలిపోకుండా మన స్ఫూర్తి నిలుపుకోవాలి. సాధికార మంత్రుల బృందానికి మళ్లీ సమీక్షకు వెళ్లినప్పుడు నాలుగేళ్ళ క్రితం నిర్ణయం పునరావృత్తం కాకుండా జాగ్రత్తపడాలి. ఏమయినా గత నిర్ణయాన్ని నిలిపివేసి మన రాష్ట్రం గ్యాస్‌ను మనకే వుంచేయడం, తరలింపును నిలుపుచేయడం ఒక ఘన విజయంగానే భావించాలి’’ అన్నాడు సంతోషంగా సన్యాసి.


‘‘గ్యాస్ కబుర్లు అంటే గాలికబుర్లు అనికాక నిజంగా గ్యాస్ కబుర్లే ముచ్చటించావర్రా! కానీ చూసారూ! సమస్య ఏదయినా దాని తాలూకు వాస్తవ విషయాలు ఒకలా వుండగా ‘గ్యాస్’అనగా గాలికబుర్లు కొన్ని పోగవుతూ వుంటాయి. అందులోని నిజానిజాల తవ్వితీతలు చాలా అవసరం. వైఎస్సార్‌గారి బినామీ పెట్టుబడులు మహారాష్ట్ర రత్నగిరి ప్లాంట్‌లో వుండడంవల్లనే మన రాష్ట్ర గ్యాస్ కోటానుండి అక్కడికి తరలింపు నిర్ణయం ఆనాడు జరిగిందని ఇవాళ అనుకుంటున్నారంటే ‘ఊరికే ఆడిపోసుకోవడం’అని కొట్టిపారేయడం సులభమేగానీ రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టడం అనేది జరిగితే నిజంగా అది నిరసించదగిన విషయమే! రత్నగిరి ప్రాజెక్ట్‌కు కేటాయించిన గ్యాస్‌ను తిరిగి మనకు ఇచ్చేలా ప్రధాని చర్యలుతీసుకోవడం అందుకు మన రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు ఏకత్రితంగా వుండటం ఎంతయినా అభినందించదగిన సంగతే. రాబోయే పార్లమెంట్ సమావేశాలను మన గ్యాస్ మనకివ్వకుంటే స్తంభింపచేస్తామని ప్రతిపక్ష తెలుగుదేశం హెచ్చరిక చేసి, బాబుగారు స్వయంగా ప్రధానికి లేఖ రాయడంవల్లనే ఈ విజయం సాధ్యమైందని ఘనత తమదిగా తెలుగుదేశం చెప్పుకుంటే చెప్పుకోనీగాక! ఏది ఏమయినా ఎవరి కారణంగానయినా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకపోవడం, మన విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ కొరత కొంతమేరకయినా తగ్గడం హ్యాపీ న్యూస్! ఈ హ్యాపీ డేస్ కొనసాగాలని కాంక్షిద్దాం’’అంటూ లేచాడు రాంబాబు.





12 comments:

JANARDHAN AMBALLA said...

సుధామ గారూ!
మీ గ్యాస్ కబుర్లు ద్రవంగా మారి మా మెదడులో ఇంకి పోయాయి.
-అంబల్ల జనార్దన్.

సుధామ said...

అంబల్ల జనార్దన్ గారూ!మీ ఆదరాభిమానాలకు సంతోషస్వాంతుడనయ్యాను.కృతజ్ఞతలు

Jai Gottimukkala said...

సింగరేణి బొగ్గు బెజవాడకు తరిలించడం ఒప్పు అయితే, కేజీబీ గాసు రత్నగిరికి తరిలించడం తప్పు ఎలా అవుతుంది?

సుధామ said...

అంతర్ రాష్ట్ర రవాణాకు రాష్ట్రేతర తరలింపుకు తేడా లేదంటారా జయ్ గారూ!

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

/సింగరేణి బొగ్గు బెజవాడకు తరిలించడం ఒప్పు అయితే,/
సింగరేణి బొగ్గు సింగరేణి మండలం/ ఖమ్మం లోనే వాడక హైదరాబాద్, వరంగల్లు మెదక్‌లకు ఎందుకు బాగమివ్వాలి? వరంగల్లు మిర్చి, బియ్యం అక్కడే వాడుకోక ఎందుకు రాష్ట్రమంతా అమ్ముకుంటున్రు?

ఇప్పుడర్థమయ్యింది, రాష్ట్రం అన్న కాన్సెప్టే తెలియని వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం ఎందుకివ్వడం లేదో, ఈ విషయంలో ఇటాలీనుంచి వచ్చినా సోనియాను మెచ్చుకోవాల్సిందే. కె.జి గ్యాస్ కరెంట్ తెలంగాణాకు వద్దు అని ఆందోళన చేయున్రి.

Anonymous said...

రత్నగిరి ప్లాంట్‌ను అడ్డుకోవడం సరికాదు. కె.జి గ్యాస్ వాళ్ళకు ఇవ్వడం( అమ్మడం) తప్పు కాదు. మహారాష్ట్రకే కాదు త్రిపుర, నాగాలాండ్‌లక్కూడా మంచి రేటుకు అమ్ముకునే హక్కు రాష్ట్రానికి వుంటుంది. ఆ ఆదాయంలో లోకల్ జిల్లా అభివృద్ధికి కొంత శాతం ప్రత్యేకంగా కేటాయింప బడాలి.

సుధామ said...

SNKR గారూ! మీ ప్రతిస్పందనకు ఆనందిస్తున్నాను. ధన్యవాదాలు.

narayana said...

sudhama garoo.. paatha pustakala kosam bhagyanagaramlo gaalnchi ninnane mee pustakam konnaa..raatriki chadavalani .

సుధామ said...

పోన్లెండి సెకండ్ హ్యాండ్ లోనేనా దొరికాను.ఇంతకీ ఏ పుస్తకం నారాయణ గారూ!

Sarma Namuduri said...

మీ ఆర్టికల్ చాల బాగుంది అందరికి అర్ధం అయ్యేటట్లు
నాకు అర్ధం కానీ విషయం ఓ ఎన్ జిసి అన్ని సంవత్సరాలు అన్వేషించి చివరికి ఎవరికో ఉపయోగం అయ్యేటట్లు చేసారు
ఒక కంపెనీ తీసుకున్న (అన్వేషణకి ) కొద్ది కాలం లోనే అపారమయిన గ్యాస్ నిక్షేపాలు వెలుగు చూసాయి అది ఎలా సాద్యం
ఎమోసారు అర్డంకావు మాలాంటి ఎర్రబస్సు ఎక్కి పట్నం వచేవాళ్ళకి
ఐ ఎ ఎస్ చదివి ఒక జిల్లా ఏడ్మిని స్టేషన్ అంత చేతిలో వున్నా ఒక ఎమ్ ఎల్ ఎ తిడితే ఏమికానట్లు
ఐ పి ఎస్ చదివి ప్రజలని వారి హక్కులు ... అంత సక్రమంగా అమ్లుజరిగెట్టు చూసే టి ఆయన్ని ఒక ఎమ్ ఎల్ ఎ తిడితే ఏమికానట్లు
చూస్థు ఉండటం ఇవి అన్ని మాబోటి పల్లిటూరివాళ్ళకి ఎలా అర్ధం అవుతాయి
టి వి లలో ఉదయాన్నే పెద్ద పెద్ద వొళ్ళు తిట్టుకునే దేప్పిపోడుచుకునే మాటలు రోత పుట్టించడం లేదా సారు
ఈ నాయకులు మాలన్తివాళ్ళకి ఏమిచేస్తారు సారు నేతి బీర కాయలో నెయ్యి ఉన్నంత
మే ము కల కంటూ వుంటాము వాళ్ళు కోటిస్వరులు అవుతూ వుంటారు
వాళ్ళు ఒకళ్ళ కొకల్లు వియ్యం అందుకుంటారు మబోతివాళ్ళు కుత్తుకలు తెన్చుకుంతము ....ఇదే సారు నా స్వాతంత్రియం నాకు ఇచ్హిన బహుమతి

సుధామ said...

మీరన్నది వాస్తవం శర్మగారూ! సామాన్యుడి ఆర్తి ని మీరు సరిగ్గా ప్రతిఫలింపచేసారు.కృతజ్ఞతలు