ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, June 8, 2012

' పొడిచెనదే శుక్రతార..'  ‘‘పొడిచెనదే శుక్రతార...’’ అని శ్రీరంగం గోపాలరత్నంగారు ఆ రోజుల్లో పాడిన పాట ఇంకా నా చెవుల్లో రింగుమంటూంది. ఎవరు రాసారో తెలీదు కానీ, ఆవిడ గళంలో ఆ పాట నిజంగా జీవం పోసుకుంది. మొన్న శుక్రుని అంతర్యానం రోజు నాకదే గుర్తుకొచ్చిందంటే నమ్మండి’’ అన్నాడు సుందరయ్య ఆ పాట జ్ఞాపకపు తన్మయత్వాన్ని అరమోడ్పు కన్నుల్లో ప్రదర్శిస్తూ.

‘‘ఎప్పుడో వందేళ్ళకు ఒకసారి జరిగే అంతరిక్ష అద్భుతం మొన్న జరిగిన శుక్రుని అంతర్యానం! ఇప్పటికి కేవలం యాభైమూడుసార్లే గత అయిదువేల సంవత్సరాలలో ఇది జరిగిందట! మళ్లీ రెండువేల నూటపదిహేడవ సంవత్సరంలో కానీ ఇది జరగదట. మొన్న చూడడం జీవితంలో ఒక అద్భుతమైన విషయమే కదా! ‘సోలార్ ఫిల్టర్స్’తో చూడగలగడం తమ భాగ్యం అని మురిసిపోయిన వారెందరో వున్నారు. నిజంగా గత పదేళ్లలో ‘అంతరిక్ష అద్భుతాలు’ అనేకం చూసాం. సూర్యుడిని ‘కంకణ’ ఆకారంలో కూడా చూసాం! ఇలాంటివి చూసినప్పుడే- ప్రకృతి ముందు మనిషి నిజంగా ఎంత చిన్నవాడో కదా అనిపిస్తుంది’’ అన్నాడు శంకరం.


‘‘నువ్వన్నది నిజం శంకరం! కానీ ప్రకృతి శక్తుల గ్రహించు నరుడు ఇవాల్టి ఆధునిక మానవుడు. ప్రాణ రహస్యం ఒకటి ఇంకా కనుగొనలేదు గానీ, నిజానికి మానవుడే మహనీయుడు. మొన్నటి శుక్ర అంతర్యానపు పరిశోధనలు, అనేక ఖగోళ రహస్యాలను మరింత వెలుగులోకి తెస్తాయన్నది వాస్తవం! శుక్రుడు భూమికంటే వ్యాసంలో ఓ ఆరువందల యాభై కిలోమీటర్లు మాత్రమే తక్కువ. శుక్ర గ్రహం వ్యాసం
పన్నెండువేల తొంభై రెండు కిలోమీటర్లుట! నిజానికి మొన్న- సూర్యుడికీ భూమికీ నడుమగా ఈ శుక్రుని అంతర్యానం జరిగింది. కానీ ఇది ‘గ్రహణం’ కాదు. సూర్యుడికి దగ్గరగా వున్న గ్రహాల్లో బుధుడు, శుక్రుడు వున్నారు. బుధుని అంతర్యానాన్ని చూడడం పూర్తిగా అసాధ్యం! కానీ శుక్రుని అంతర్యానం నూట అయిదేళ్లకోసారి జరిగి, మళ్లీ వెంటనే ఎనిమిదేళ్లకు దృశ్యమానం అవుతుందట గానీ, మొన్నటిలాగా- అసలు ‘శుక్రుని అంతర్యానం’ భూమిమీద మనిషికి గోచరమైంది- ఇప్పటికి ఇంతకు ముందు ఆరుసార్లేనట! మొన్న ఏడవసారి చూడగలిగాం అన్నమాట! నిజానికి సూర్యుడికీ, శుక్రగ్రహానికీ మధ్య కూడా నూట ఎనిమిది మిలియన్ కిలోమీటర్ల దూరం వుంది. వంద కిలోమీటర్ల సైజులో వ్యాపించిన అగ్నిపర్వత శ్రేణులు శుక్రుని మీద నూట అరవై ఏడు వున్నాయిట. అత్యంత కాంతివంతమైన శుక్రగ్రహం నిజానికి- సూర్యోదయ, సూర్యాస్తమయాల వేళ ‘శుక్రతార’గా దర్శనమిచ్చేదే! కానీ చందమామకు మచ్చలాగా- సూర్యుడి మీద నల్లటి మచ్చగా కనబడుతూ, దిష్టిచుక్క ముఖంమీద దిద్దినట్లుగా, హవాయి దీవుల్లో సూర్యుడి బింబానికి ఒకవైపూ, మన వరంగల్‌లో మరోవైపూ ప్రయాణం చేసి, ఆరుగంటలపాటు కనువిందు చేసిన ‘ఖగోళ అద్భుతం’- మొన్న జరిగింది. పాశ్చాత్యులు శుక్రుని ‘వీనస్’అనేస్త్రీగాసంభావిస్తూ, గొప్ప సౌందర్యరాశిగా తలుస్తారు. మిగతా గ్రహాల్లాకాక- శుక్రుడు తూర్పునుంచి పడమటకు ప్రయాణిస్తాడు. అంచేత శుక్రగ్రహం మీద సూర్యుడు పడమటన ఉదయించి తూర్పున అస్తమిస్తాడు. సర్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు ఆవరించి వుండే శుక్రగ్రహం మీద- మనిషి కాలుమోపడం కాదుకదా, వేలుపెట్టడం కూడా అసాధ్యం! శుక్రుడి మీద ఉష్ణోగ్రత ఎప్పుడూ నాలుగువందల అరవై డిగ్రీలకు పైనే అంటే ఊహించండి. నలభై ఆరు డిగ్రీల ఎండకే ఇక్కడ ఈ ఎండాకాలంలో మనం తట్టుకోలేము’’ అన్నాడు గోపాలం చిన్నగా నవ్వుతూ.

‘‘సర్లే! ఇంకో వారంరోజుల్లో నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రాన్ని తాకుతాయనీ, ఈసారి వర్షాలు బాగా పడతాయనీ అంటున్నారుగా! ఏమయినా ఎన్ని ‘అద్భుతాలను’ ప్రదర్శించినా, ప్రకృతి అనుకూలంగానూ, సమతుల్యంగానూ వున్నప్పుడే కదా ప్రయోజనం. సౌందర్య విలసితం అనుకున్న ప్రకృతి అద్భుతాలయినా- వైపరీత్యాలకూ, ఉత్పాతాలకూ దారితీయకుండా వుంటే చాలుననే మనం కోరుకునేది. రెండువేల
పన్నెండులోనే ప్రళయం వస్తుందనీ, వాటికి ఈ అంతర్యానాల వంటివి కూడా హేతువులేననీ భయపెట్టే జ్యోతిషులు, శాస్తజ్ఞ్రులు కూడా వున్నారు మరి’’ అన్నాడు శంకరం. ‘‘ఈ ‘వక్ర’ అంతర్యానాల గురించీ ఆలోచించాలి మరి’’అని కూడా అన్నాడు.

‘‘భలే అన్నావ్! గ్రహగతుల సంగతేమోగానీ, వాటి ప్రభావాలవలన ఔనో, కాదో గానీ- ప్రస్తుతం మానవ ప్రకృతులు మాత్రం ఉత్పాతాలుగానే పరిణమిస్తున్నాయర్రా! మద్యం సిండికేట్లపై మొన్ననే సరికొత్తగా దాడులు జరిగాయి. ఎక్సైజ్ పోలీసులే కొందరు కోట్ల లంచం మింగబోతూ పట్టుబడ్డారు. సూర్యగ్రహణాలు, చంద్ర గ్రహణాలు కంటే ఇప్పుడు భూమిమీద- ‘అవినీతి గ్రహణం’ పట్టింది. గవర్నమెంట్ ఆఫీస్‌లో బంట్రోతు దగ్గర్నుండి, సి.బి.ఐ కోర్టు జడ్జివరకూ కూడా- ఈ గ్రహణం బారినపడి ‘లంచావతారం’ ఎత్తుతున్నారు. సూర్యుడి వెలుగుతోనే- చంద్రుడు, భూమి వెలుగుతున్నాయంటారు కానీ, ఇవాళ భూమిమీద పదవులు, అధికారాలు, వారసత్వాల వెలుగుల్లో- ప్రజల పాలిట ‘శనిగ్రహాల్లా’ దాపురించిన నేతలెందరో, కోట్లకు అవినీతి పడగలెత్తి వెలిగిపోతున్నారు! అంతరిక్షంలోని వాటికి కాదు, భూమిమీద, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన నేతల ‘అద్భుతాలకే’- ప్రజలు ఆశ్చర్య చకితులవుతున్నారు. తమ బ్రతుకులేమవుతాయోనని బెంబేలెత్తుతున్నారు. ‘‘పొడిచెనదే శుక్రతార’’ అని పాడిన శ్రీరంగం గోపాలరత్నం ఇప్పుడు బ్రతికి వుంటే ‘పొడిచెనిదే వక్రతార’ అని బాధపడుతూ పాడేదేమో’’ అన్నాడు సుందరయ్య లేస్తూ.
0 comments: