ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, May 6, 2012

ఆత్మపరిశీలనకు తోడ్పడే ‘అపరాధ’ పరిశోధన

ఎంత ప్రతిభావంతుడైన రచయిత అయినా చేసిన ప్రతి రచనా గొప్పగా వుండకపోవచ్చు. కవిగా కీర్తిప్రతిష్ఠలు ఈసరికే ఆర్జించిన ఓ కవి సరికొత్త రచన అని చెప్పుకునేది అతి పేలవంగా వుండవచ్చు. ఎంత గొప్పవారయినా అన్నీ గొప్ప రచనలు చేయలేదన్నది ఒక వాస్తవం అయితే, కొన్ని సందర్భాలలో పాఠకులకు వారు తీవ్ర అసంతృప్తిని తమ రచనతో కలిగించే అవకాశమూ వుంది. రచన ద్వారా వారి ప్రకటనో,విశ్లేషణో, తీర్మానమో, వారు చెప్పగలిగి వుండీ వదిలేసిన అంశమో, అసంతృప్తి హేతువు కావచ్చు. పాఠకుని దృష్టిలో అది ఆ సృజనకారుడి అపరాధమే.‘‘ఏ ప్రక్రియలో ఏ సాహిత్యాన్నయినా మనఃపూర్తిగా చదవాలి. తటస్థంగా

విశ్లేషించాలి. వ్యక్తిగత వ్యామోహాలతో కాదు. వ్యామోహాలంటే ఇక్కడ నా ఉద్దేశం ప్రక్రియా వ్యామోహాలు, స్నేహధర్మాలు, భాషా లౌల్యాలు, ప్రోత్సాహక చాపల్యాలు, భజన చేసే ప్రేమలు’’ అంటారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ.
ఈ ప్రమాణాలను విశ్వసిస్తూనే ‘తెలుగు కవుల అపరాధాలు’ అనే గ్రంథాన్ని వెలువరించారు. ‘తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు’ అన్న మాట ప్రక్కనబెట్టి, శ్రీకాంతశర్మగారికి నచ్చని విషయాలు, సాహిత్యంలో ఆయన కవులు, రచయితల అపరాధాలుగా గ్రహించినవేమిటి అన్న సంగతి గమనించి ,ఆయన రాసిన వివరణాత్మక వ్యాసాలను పఠిస్తే ఆయన నిజాయితీ హృదయం ఏమిటో అర్థమవుతుంది.


నిజానికి 1918లో ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో రామకృష్ణ కవులు (ఓలేటి వెంకటరామశాస్ర్తీ, వేదుల రామకృష్ణశాస్ర్తీ) ‘ఆంధ్ర కవుల యపరాధములు’ అని రాసిన ఓ ముప్ఫై ఒక్క తేటగీతిపద్యాలనుస్వయంగా తెల్పుతూ అనుబంధంలో ఆ పద్యాలను సంతరించి ఇచ్చారు కూడాను.


ఆంధ్రలోకోపకారము నాచరింప
భారతమ్మును నన్నయభట్టు తెలుఁగుఁ
జేయుచున్నాఁడు సరియె; బడాయిగాక
తొలుత సంస్కృత పద్యమెందులకుఁ జెపుఁడి


అని మొదలవుతాయి రామకృష్ణకవుల ఆ పద్యాలు.


పొడి కవిత్వ మల్లు పోతరాజును ఱేఁడు
వేఁడు పిలిచి గౌరవింపరామి
హాలికుఁడయి రేఁగి యవనీశ్వరుల దిట్టె
నక్క ద్రాక్ష పండ్ల నానుడి గతి


అని పోతన్న గురించి కూడా అంటారందులో.

ఆ పద్యాలన్నీ చమత్కారంగా, మేలమాడుతున్నట్లుగా ఒక వంక నిందాస్తుతులుగా కూడా రాణిస్తున్నాయని గ్రహించగలం. కానీ శ్రీకాంతశర్మగారి వ్యాసాలు అలాంటి శషభిషలు కూడా ఏమీలేకుండా నిర్మొహమాటంగా సాగుతాయి. తాను అనుకున్నదీ, తనకు నచ్చనిదీ, వారు ఎంతటివారలయినా వెరవక వ్యక్తీకరించగలగాలన్నదే శర్మ తలంపు.మొహమాటాలూ, మెరమెచ్చులు, స్వప్రయోజనాలకుద్దేశించిన భజనలు నేటి కాలాన సాహిత్య రంగంలో మరీ ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్నాయి. కవులకు ముఠాలు, గ్రూపులు, ప్రక్రియ పేర ఓహోం ఓహోం... మోతలు, అధికారంలోనూ, పదవి లోనూ వున్నవారి నుండి ఏ స్వలాభాలకోసమో భజనలు చేయడాలూ,కుకవిస్తుతులూ, సుకవి నిందలూ ఈ కాలాన మరీ విచ్చలవిడి అయ్యాయి.


నిజానికి ‘‘సాహిత్య పాఠకుల్ని షాక్ చేద్దామనే ఉత్సాహంతో వ్రాసినవి కావ''ని అందుకే ముందుగా ఆ ముఖంలో వెల్లడించారు రచయిత. రామకృష్ణ కవుల పద్యాల ప్రేరణతోనే, ఒక రీతిగా అందులోని అంశాలతోనే తొలి వ్యాసాలు కనిపిస్తాయి.

తాము తమ కావ్య పద రచనా కాలంలో ఏ కోశానా ఊహించని, ఉద్దేశించని కొత్తకొత్త అర్థాలనేవో వ్యాఖ్యాతలనే అపర కవులు కల్పించి అబ్బురపరచడం గురించి, సాహిత్య విమర్శకుల చేయిదాల గురించి ‘అపర కవులు -అంతరార్థ
శోధకులు’ వ్యాసం వివరిస్తుంది.యతి విటుడుగాక పోవునే అస్మదీయ
కావ్య వైరాగ్య వర్ణనా కర్ణనమున!
విటుడు యతి కాకపోవునే అసమదీయ
కావ్య శృంగార వర్ణనాకర్ణనమున


అన్న సంకుసాల నృసింహకవిది ప్రగల్భవాక్కుగాఅలానేవేదంవారు, పింగళివారు, చిలుకూరి పాపయ్యశాస్ర్తీగారు తమ వ్యాఖ్యానాలతోవెలార్చినప్రాగల్భ్యాలను ఇందులో పేర్కొన్నారు.‘తిట్టు... కవిత్వమా?’ అనేది కూడా ఆలోచింపచేసే వ్యాసం. కసి ఎందుకు ఏర్పడుతుందంటే ఎవరి కారణాలు వారికి వుంటాయి. ‘‘ఈ కసినే వ్యక్తిపరంగా ఆలోచిస్తే అమానుషం అంటాం. వ్యవస్థపరంగా ఆలోచించి రాజకీయ సిద్ధాంతంగా రూపొందిస్తే ‘వర్గ కసి’ అంటూంటాం'' అంటారీ వ్యాసంలో.అలాగే ‘హాస్యం పేరిట అపహాస్యం’ అనే వ్యాసంలో ‘‘తెలుగు సాహిత్యంలో కొందరు కొందరు వ్యక్తుల దుష్ప్రవర్తనల కారణంగా, భయం, స్వార్థం, పిరికితనం, డంభాచారాలు ఆధారంగా బ్రాహ్మణులు, కోమట్లు, వితంతువులు, వేశ్యలు, ప్రత్యేకించి హాస్యంపేరిట అపహాస్యాన్నే
పంచిపెట్టారు’’ అని సోదాహరణంగా వివరిస్తూ ‘‘ఒకప్పుడు ‘మందు’గా భావించి సంఘసంస్కారానికి అపహాస్యాన్ని వారు వాడి వుంటారని మనం సరిపెట్టుకున్నా- నేటికది విషంగా పరిణమించిందని చెప్పక తప్పదు’’ అని సరిగానే తీర్మానించారు.‘‘తెలుగు సాహిత్యంలో పానుగంటివారూ, విశ్వనాథవారూ ఈ ఇద్దరే, రాధ నిజమైన ఆధ్యాత్మిక హృదయాన్ని సరిగ్గా ఆవిష్కరించారనుకుంటాను’’ అంటూ వ్యక్తికి సంబంధించిన ఘోష అయిన మానసిక విరహం రాధకు జోడించి, ఆ పాత్రను కొందరు తెలుగు కవులు (సినీ కవులతో సహా) భ్రష్టుపట్టించిన వైనం ‘అపరాధగా మారిన రాధ’ వ్యాసంలో
విశ్లేషించారు.‘ప్రతిభకు ప్రవర్తనకు పొత్తు లేదా?’ అనే వ్యాసం తప్పక ఉదాహరించవలసిందే. ‘‘ఆయన రాసి పారేసిన కవిత్వం గుబాళిస్తుంటే- తాగి పారేసిన సీసాల సంగతి మనకెందుకు’’ అని శ్రీశ్రీ గురించి కాళోజీ అన్నా- శ్రీశ్రీ మీద అభిమానంతో ఇంట్లో సైకిలు కొనుక్కోమని రెండువందల రూపాయలిస్తే దాంతో మద్రాసు వెళ్లి, ఓ రచయిత్రిని
తాగిన మైకంలోతన ఎదురుగా నానా దుర్భాషలాడుతూ దర్శనమిచ్చిన తన అభిమాన కవి శ్రీశ్రీ కారణంగానే సాహిత్యం మీదా, కవుల మీదా రోత పుట్టి తిరిగి వచ్చి, మళ్లీ ఆ జోలికి వెళ్లని మిత్రుడు తెలుసు నాకు. కవులన్నా ,రచయితలన్నా ఎంత ప్రైవేటు జీవితం వున్నా ‘ప్రజాపరిశీలనం’ వుంటుంది.కవులూ, రచయితలే కాదు సెలబ్రిటీలు ఎవరైనాసరే.


ఈ వ్యాసం చివరలో శ్రీకాంతశర్మ ఇలా అంటారు- ‘‘మానవ సంబంధాలలో ప్రవర్తన ద్వారా మనం ఏమిటో ముందు మనం తెలుసుకోగలగాలి. తెలుసుకున్నాక ఒకవేళ మనకి ప్రతిభంటూ ఉంటే ,సాటి మనుషులకు ఇచ్చే ఏ రూపంలో హామీలైనా సరే, ప్రబోధాలైనా సరే, మనంతట మనం ఏపాటి ప్రవర్తనలోకి ఇంకించుకోగలం? అని గుర్తించగలగాలి. గుర్తించలేమూ, మనం కవిత్వం రాయకపోయినా, సాహిత్యప్రక్రియలతో జల్లులాడకపోయినా ఏమీ లోకానికి నష్టంలేదు. రాదు’'.‘ఒక్క వేలు చూపి ఒరులను నిందించ మూడు వేళ్లు నిన్ను వెక్కిరించు’ అన్న చందాన- అపరాధ పరిశోధన మంచిదే! అది ఆత్మపరిశీలనకు కూడా మార్గంవేయాలి అన్న గ్రహింపునిస్తుంది ఈ పుస్తకం. ‘‘ఆస్వాదయోగ్యత, సాధికారత సృజనకు రెండు రెక్కలు. సాహిత్యమార్గం సంక్లిష్టం, దురవగాహం, అపవ్యాఖ్యా బాధితం కాకూడదు’ అన్నదే గ్రంథ లక్ష్యం ఆ లక్ష్యసాధనలో రచయిత అపరాధం తెలుకోవాలనుకున్నా ఈ గ్రంథం చదవవలసిందే.-సుధామ


(తెలుగు కవుల అపరాధాలు
- ఇంద్రగంటి శ్రీకాంతశర్మ -
వెల: రూ.80/-
వాహిని బుక్‌ట్రస్ట్,
1-9-286/2/పి,
విద్యానగర్,
హైదరాబాద్- 44.)(Andhrabhoomi (Daily)-'AKSHARA' -6.5.2012 Sunday)

2 comments:

phaneendra said...

good book, nice intro

సుధామ said...

Thank you Phaneendra garu