ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, May 5, 2012

పదమొక్కటే.. అర్థాలెన్నో



ఇంగ్లీషులో ‘పన్’ అంటాం. ఒకే పదానికి అనేక అర్థాలు స్ఫురించేట్లు చేసే చమత్కార పద ప్రయోగం అది. దానినే మనం తెలుగులోశ్లేష అంటాం.
శ్లేషను ప్రయోగించుతూ మాట్లాడే శబ్దక్రీడ కూడా భాషలోని ఓ సొగసుతనమే.




శ్లేషను ఉపయోగిస్తూ ప్రాచీనకాలంలో తెలుగులో ద్వ్యర్థికావ్యాలు, త్య్రర్థికావ్యాలు రాసిన మహాకవులున్నారు. భారతార్థం వచ్చేలా, రామాయణార్థం వచ్చేలా రెండు రకాలుగా ద్యోతకమవుతూ పద్య రచనతో కావ్యాలల్లినవారున్నారు.




పింగళి సూరన రాసిన' రాఘవపాండవీయం' అటువంటి రెండర్థాల ద్వర్థికావ్యమే.గొప్ప శ్లేష వైభవంకలది. ఒక భాషలోని మాటల్ని ఆ భాషలోనే రెండు రకాలుగా విడగొట్టి రెండర్థాలను సాధించటం సభంగశ్లేష అంటారు. ఉచిత శబ్దశ్లేషఅని కూడా దానికి పేరు నానార్థాలు వచ్చేలా పదాలు ప్రయోగించటం అర్థశ్లేష.ఒక పదానికిగల ప్రసిద్ధమైన అర్థంతోపాటు మరొక అర్థాన్ని సాధించే చమత్కృతిని ముఖ్య గౌణవృత్తిశ్లేషఅనీ, పదం యొక్క అర్థాన్ని వేర్వేరుగా అన్వయించటాన్నిఅర్థాన్వయ శ్లేషఅనీ, అలాగే పదాలను వేర్వేరుగా అన్వయించటం శబ్దాన్వయ శ్లేష అనీ- ఇలాశ్లేషకూడా అనేక రకాలుగా పేర్కొనబడింది.


ఏమయినా పదము, పదము యొక్క అర్థం ఒకేలా కాకుండా పలురకాలుగా ధ్వనించే అందమే శ్లేషఅనేది.


ఆధునిక కాలంలో ఇంగ్లీషు, తెలుగు భాషల రెంటి పదాల సంకలనంతోనూ ఇలాంటిశ్లేషఉత్పత్తి చేసే చమత్కారం పెరిగింది. ‘పూర్వీకులు’ అంటే పూర్‌గానూ వీక్‌గానూ వుండేవారనీ, పండితుడు అంటే 'పన్' అనగాశ్లేషతో మాట్లాడేవాడనీశ్లేషఅనేదానికి ఇవాళ సరికొత్తదనాలు కూడా తోడవుతున్నాయి. సినిమాల్లో ద్వంద్వార్థాలు పాటల్లోనూ, సంభాషణల్లోనూ ఎక్కువైపోయాయి. కవిగారు ఓ పదం ప్రయోగించినా చిత్రీకరణలో దానికి వేరే అర్థంవచ్చేలా చూపడమూ జరుగుతుంది. ‘ఆకు చాటు పిందె తడిసె’ అని పాటలో కవి ఓ అర్థంలో ప్రకృతి పరంగా రాస్తే కెమెరా చిత్రీకరణలో తడిసిన హీరోయిన్ పైట చాటు అందాలు చూపడమూ దృశ్యశ్లేషఅనాలా మరి! ‘సినిమాల్లో ద్వంద్వార్థాలు ఎక్కడండీ బాబూ! ఒకటే అర్థం అది బూతే!’’ అని ఆర్తి చెందుతున్న వారూ వున్నారు.




నిజానికి శ్లేషలోమంచి చమత్కారం వుంది. సరదా వుంది. గుంభనమైన అర్థంవుంది. అరచాటు అందమూ వుంది. కానీశ్లేషను బూతుస్థాయికి దిగజార్చిశ్లేషఅంటేనే భయపడేలా చేస్తూ వచ్చింది ప్రధానంగా సినీ పరిశ్రమే అంటే కోపం తెచ్చుకోకూడదు.


పఠాభి అనే కవి ‘పఠాభి పన్‌చాంగం’ పేర ఇలాంటిశ్లేష వాక్యాల
సముదాయంతో ఎంతో సరదాలు పంచాడు. ఇటీవలి కాలంలో శంకరనారాయణ వంటి వారుశ్లేష భాషణం తోశ్లేషభాషణాలు నేడు హీరోల పలుకుల్లోకీ వ్యాప్తి చెందాయి. అతివేల శృంగార అర్థాలు స్ఫురించేశ్లేషలు జుగుప్సస్థాయికి దిగజారిన సందర్భాలూ వున్నాయి.


నిజానికిశ్లేష పదప్రయోగం గొప్ప ప్రజ్ఞ.


"రెండర్థంబుల పద్యమొక్కటియు నిర్మింపంగ శక్యంబుగా
కుండుందద్గతి కావ్యమెల్లనగునే నోహోయనం జేయదే
పాండిత్యంబున నందునుం తెనుగు కబ్బంబద్భుతం బండ్రుద
క్షుండెవ్వాడిల రామభారత కథల్ జోడింప భాషాకృతిన్"


అని పింగళి సూరన రామ భారత కథలనుశ్లేషవైభవంతో రాఘవ పాండవీయంగా రచించి మెప్పు పొందాడు. ఉదాహరణకు సూరన ఒక పద్యంలో ‘ఏనుంగని కరమరయక’ అంటాడు. రామాయణార్థంలో ఏనుంగు + అని కరము + అరయక అని గ్రహించినప్పుడు ఏనుగనుకొని దశరథుడు ముని బాలకుని సంహరించాడు అనే అర్థంవస్తుంది. అదే భారతార్థంలో ఏనున్ + కనికరము+ అరయక అంటూ నేను దయలేకుండా మునిపై బాణం వేశానని పాండురాజు దిగులు చెందడంగా రెండో అర్థంగా వస్తుంది. ఇలా సూరన తన శబ్దశక్తిని ప్రయోగించి మొత్తం కావ్యాన్ని భారత, రామాయణార్థాలు రెండూ తెలిసేలా రాసాడు.




శ్లేషతో మాట్లాడటం కొందరికి సంభాషణా చాతుర్యంలో సహజవైఖరే. ఒకామె మిత్రునికి ఇల్లు చూపిస్తానని తీసుకువెడుతోంది. 'నాతి దూరమె యిల్లు పదములా'ఱె అన్నాడట అతను ఆమెతో. ఆమె కూడా 'నాతి దూరమె యిల్లు పదము లాఱె' అని బదులిచ్చింది. ఇక్కడ అతడు అడగడంలో' నాతీ! ఓ స్ర్తి దూరమే యిల్లు- అనగా ఇల్లు దూరమా? పదము లాఱె అనగా కాళ్లు నొచ్చుతున్నా' అంటే ఆమె సమాధానం 'న - అతి దూరమె యిల్లు అనగా ఇల్లు అతి దూరమేమీ కాదు పదములాఱె అంటే ఆరడుగులే ఇంక' అని అర్థం వెల్లడవుతుంది. ఇదిశ్లేషవైభవమే మరి!




పఠాభి ‘పన్’చాంగంలోని ఈ చమత్కరాలు గ్రహించండి.


‘‘నారికి వార నారికి నడుమ వారగలదు’’
‘‘పనిపాటలన్న నా కయిష్టము పాటలు రాయడం నా పని’’
‘‘దండం పట్టుట కన్నా పెట్టుట మంచిది’’
‘‘పువ్వు పుట్టగానే పరీమళించదు. పువ్వుగానే పరీమళిస్తుంది’’
‘‘కలవరమాయే మదిలో’’
ఇలాంటిశ్లేషచమత్కారాలు ఎన్నో.





ఒక సెలూన్ షాపు క్రిందనుండి మేడ మీదకు మార్చారు. యజమాని అక్కడ బోర్డు ఇలా పెట్టాడు ‘‘క్రింది వెంట్రుకలు నరుకు షాపు మెడపైకి మార్చబడినది’’ అని.' మే'డ బదులు 'మెడ' అని రాయడంతో ఇంకా నవ్వు రాదా మరి!ఇది శ్లేష కాదనుకోండి.అచ్చుతప్పు లాంటిదే!


శ్లేషఅనగానే అందులో అశ్లీలత చూడడం, చూపడం ఎక్కువైపోవడంవల్ల ద్వంద్వార్థాల శ్లేషకు గౌరవం పోగొట్టుకుంటున్నది మనమే. కానీ భాషలోని ఆ సొగసును అందంగా అందిపుచ్చుకుని 'మారేడు నీవని మారేడు తేనా నీ పూజకు' అని భక్తిగాశ్లేషించిన వేటూరి వంటి కవులూ వున్నారు. ఆశ్లేష మనం అందుకోవడంలో వుంది. ఔను కదా!
*

3 comments:

కనకాంబరం said...

ఎన్నెన్నోవిషయాలు తెలిసినవి విన్నవే , ఎంతో విపులంగా తెలుసుకున్న తృప్తి. .సుధామ గారు నమస్కారం. ఎలా వున్నారు ? శ్రేయోభిలాషి ..నూతక్కి రాఘవేంద్ర రావు.(Kanakambaram)

anrd said...

భాషను గురించి చక్కటి విషయాలను తెలియచేసినందుకు కృతజ్ఞతలండి.

Unknown said...

శ్లేషలంకరాల సొగసు కనుమరుగవుతుంది. ఒకవేళ అలాంటి పదాలను బూతులాగే చూస్తున్నారు తప్ప అందులోని గుడార్థం తెలుసుకోలేపోతున్నారు.. చక్కటి సమాచారం అందించందుకు ధన్యవాదాలు అండి