ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, May 4, 2012

సాగనంపడాలు..







‘‘పంపడం అనే దానిలో ఆనందం వుందా? బాధ వుందా?’’ అని అడిగాడు శంకరం సాలోచనగా.




‘‘ఏమిటి పంపడం? అది చెప్పుముందు! శాశ్వతంగా పంపడాలూ, వట్టినే సాగనంపడాలూ కూడా వున్నాయి. అంచేత అందులో కార్యకారణ సంబంధం వుంటుంది. ‘వచ్చి సంతోషపెట్టేవారు కొందరయితే, వెళ్లి సంతోషపెట్టేవారు మరికొందరుంటారు’ అని బంధుమిత్రుల గురించి ఒకాయన వ్యాఖ్యానించినట్లు- కొన్ని వస్తువుల్ని, కొందరు మనుషుల్ని- పంపడం, సాగనంపడం, వదిలించుకోవడం అనేవి జరుగుతూనే వుంటాయి. అలాంటి సందర్భంలో ఆయా వస్తు, వ్యక్తి గుణ సంచయ స్వభావం బట్టి- విషాదానందాలనేవి వుంటాయి’’ అన్నాడు సుందరయ్య.



‘‘ఒకరిని బస్సో, రైలో, విమానమో ఎక్కించి సాగనంపడం వుంది. అలాగే పదవీ విరమణ చేసిన వారిని సాగనంపడం వుంది. పిల్లాడికో, పిల్లకో పెళ్లి చేసి పంపడం వుంది. పెద్దలూ, సెలబ్రటీలు దర్శనమిచ్చి మళ్లీ వెళ్లిపోయేటప్పుడు- ‘వీడ్కోలు’ పలకడమూ వుంది. ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తులనుబట్టి, వారితో మనకు వున్న సంబంధ బాంధవ్యాలను బట్టి, సాన్నిహిత్యాన్నిబట్టి, ఇష్టాయిష్టాలను బట్టి సాగనంపడంలోని సంతోష, సంతాపాలనేవి వ్యక్తవౌతాయన్నది వాస్తవం. నేను పదో తరగతి చదువుతున్నపుడు అనుకుంటా! మా ఇంగ్లీష్ పుస్తకంలో ‘సీయింగ్ పీపుల్ ఆఫ్’ అనే పాఠం వుండేది. ఎవరు రాసినదో గుర్తులేదు గానీ- ఆత్మీయులైన వ్యక్తిని రైలెక్కించడానికి వెళ్లడం అనేది అందులో ఇతివృత్తం. ఆ సమయంలో ఒకరినొకరు విడిచి దూరమవుతున్న వారి మనఃస్థితినీ, ఆ సందర్భంలో వారి మాటలూ, చేతలనూ ఎంతో సహజంగా రాసాడా రచయిత. అది అత్యంత సాధారణంగా కనబడే దృశ్యం ఆనాడు. ‘‘రైలు మీ ఊరు చేరేసరికి ఎంతవుతుందంటావ్’’, ‘‘మధ్యలో ఏ స్టేషన్‌లో ఆగినప్పుడయినా భోంచేయడం చేస్తావుగా’’, ‘‘రైల్లో ప్యాంట్రీ కారు వుందా’’, ‘‘అందరినీ అడిగానని చెప్పేం’’ లాంటి ప్రశ్నలూ పలకరింపులూ, సాగనంపవచ్చినవారి నోట వెలువడడం ఎంత సహజమో, వాటికి సమాధానాలూ- ప్రయాణించే వ్యక్తి అంతే ‘యథాలాపంగా’ ఇవ్వడమూ అంత సహజం! ఏమయినా- తాత్కాలికంగానయినా సరే, ఆత్మీయులు దూరంగా వెళ్లడం, వారిని సాగనంపడానికి వెళ్లడం- లోన ఒక దిగులు రేఖ కలిగి వుంటూనే, వారు ఏ పైచదువులకో, ఉద్యోగాలకో, ఉన్నత స్థాయిని అందుకోవడానికో, మరో సుఖ జీవనంలోకో తరలివెడుతూంటే- ఒక ‘సంతోష వీచిక’ కూడా కలగలిసే వుంటుంది మరి’’ అన్నాడు రాంబాబు.




‘‘ఆడపిల్లకు పెళ్లి చేసి పంపడం నాటికీ నేటికీ తల్లిదండ్రులకు ఒక్కలానే వుంది. ‘‘‘అమ్మదొంగా! నిన్ను చూడకుంటే నాకు బెంగా!’’ అంటూ పాలగుమ్మి విశ్వనాథంగారు ఆర్ద్రంగా అమ్మాయిమీద పాట రాసినట్లు- అలాంటి వీడ్కోలు వేళ తల్లిదండ్రుల హృదయాలు భారంగానే వుంటాయి!



ఇప్పుడు పంపడాలు, తరలివెళ్లడాలు రాజకీయాల్లోనూ వొచ్చాయి. సచిన్‌నో, రేఖనో రాజ్యసభకు పంపడం వుంది. అంటే అది ఒక రంగం నుండి ఎంపిక చేసి, మరో రంగానికి పంపడమే కదా! తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి తరలివెళ్ళేవారున్నారు. నిజానికి అది వారి నిర్ణయం. కానీ తమ అభిమానులు పంపడంగా- వారు అభివర్ణించుకుంటారు. ఒక పార్టీమీద ఎన్నికయిన వ్యక్తి ఆ పార్టీకి అంటిపెట్టుకుని ప్రజాసేవ చేస్తాడనే- అతగాడికి ఓటువేసిన ప్రజలు భావించి పంపినట్లు. కానీ ప్రజలు తనను ఎలా, ఎప్పుడు ఎందుకు, ఏ దృష్టితో, ఏమాశించి పంపిందీ గాలికి వదిలేసి, తన అభీష్టం మేరకు వ్యవహరించడం, ‘‘తన కార్యకర్తల మేరకు- అభిప్రాయం మార్చుకున్నానని’’ పలకడం వట్టి అబద్ధం. ‘రీపోల్’ ఎన్నికల్లో వుంది కానీ- ‘రీకాల్’ అనేది లేదు. అదే వుండి వుంటే- తాము సాగనంపినవారు వెళ్లిన ధ్యేయంతో సాగుతూండనప్పుడు, వెనక్కి పిలిపించే వ్యవహారమూ రాణించగలుగుతుంది. మనం పంపడంలోని ఆనందాన్ని మనకు విషాదంగా మార్చే వారే కనబడుతున్నారు కానీ, గుండెబరువుతో మనం సాగనంపినా- గుండె నిండుగా సంతోషాన్ని నింపగలవారు కరువవుతున్నారు మరి’’ అన్నాడు శంకరం.




‘‘సాగనంపడాలకు స్వయంగా వెళ్లడం అనేది కూడా క్రమేపీ మాయమవుతోందర్రా! ఈ సెల్‌ఫోన్‌లు గట్రాలూ వచ్చాక. రైలెక్కించడానికో, ఎయిర్‌పోర్ట్‌కో- వెళ్లకుండానే ‘బై.. సీయు’ అనో; ‘ఆల్ ది బెస్ట్’ అనో ఓ ఎస్సెమ్మెస్ ఇచ్చి ఊరుకుంటున్నారు. కన్నవారినయినా- సాగనంపడానికి రానవసరం లేదనీ, వచ్చినా వృథా అనీ భావించేవారూ తయారవుతున్నారు. మానవ సంబంధాలు మృగ్యం అవుతున్నాయనడానికి ఈ సాగనంపు, వీడ్కోలు ఘట్టాలూ క్రమంగా మసకేయడం ఒక ప్రబల నిదర్శనమే! రాష్ట్ర ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యం అంటుంది. కానీ ఇవాళ రైలు ఫ్లాట్‌పాం టిక్కెట్టు ధర ‘అయిదు రూపాయల’యింది. అంచేత రైలెక్కించడానికో, రైలు దిగుతున్నవారిని స్వాగతించడానికో కూడా అయిదు రూపాయలు ఖర్చుపెట్టడం అవసరమా, పైగా దానికోసం ఆ రైలు స్టేషన్‌కు ఏ ఆటోలోనో వెళ్లిరావడం కూడా ఎందుకు? అనుకునే వైఖరి కానవస్తోంది! పోయినవారిని కాటికి వెళ్లి సాగనింపేవారి సంఖ్య తగ్గిపోతోందట! ‘ఉనికి శాశ్వత’మనే మాయ కమ్ముతోంది తప్ప, విడివడడం లేదు సుమా! అన్నాడు లేస్తూ సుందరయ్య.

0 comments: