ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Wednesday, May 2, 2012

'కవికాలమ్ 'పై శైలజామిత్ర





ప్రముఖ కవయిత్రి,విదుషీమణి శ్రీమతి శైలజామిత్ర
నా 'కవికాలమ్'కవితా సంకలనం పై
అంతర్జాల మాసపత్రిక 'సుజనరంజని ' మే'2012 సంచికలో చేసిన సహృదయ సమీక్ష




పుస్తక పరిచయం
- పరిచయకర్త: శైలజామిత్ర




కాలం కడు విచిత్రమయినది. సమాజాన్ని ఆలోచనల మధ్య ఉంచుతూనే ఆవేదనలకు ఉసి గొల్పుతుంది. జీవిత పరిణామ క్రమంలో ఎన్నో సంఘటనలు, ఆవేశం, అనాలోచితం, అన్యాయం, అన్నింటిని మనం చూస్తూనే ఉంటాము, కాని వేటికి స్పందించాలి? ఎన్నింటిని తట్టుకుని నిలబడాలి? అనేది మాత్రం మనకు ఒక ప్రశ్న లానే నిలిచిపోతోంది. సమస్య మనది కాకుంటే సలహా వెంటనే ఇవ్వగలం. మనదే అయితే మాత్రం క్రుంగిపోతాము. ఇలా సమస్య ఏదైనా, మనదైనా కాకున్నా, మనదైనా ప్రతి దానికి ఆలోచించ గలమే తప్ప పరిష్కారం సరైనది ఇవ్వలేము. ఇచ్చినా అది సరైనదా లేక అర్థం లేనిదా అనేది కూడా అంచనా వెయ్యలేము. అలా కాకుండా అన్నింటిని అంచనా వెయ్యగలిగిన వాడు, తనపై తనకు నమ్మకం ఉన్నవాడే కవి. కాలం కవితో ఎక్కువ సాన్నిహిత్యాన్ని పెంచుకుంది. అందుకే కాలాన్ని అంచనా వేయగల శక్తి కవికి, కవిని ఆకళింపు చేసుకునే శక్తి కాలానికి మెండుగా ఉన్నాయి. అదే 'కవి కాలమ్'

కవిగా, రచయితగా, కార్టూనిస్టు గా, విమర్శకునిగా, సినీ సమీక్షకునిగా, కాలమిస్టుగా, పద ప్రహేళికల కూర్పరిగా, ప్రముఖ వక్తగా సుధామ పేరుతో తెలుగు సాహితీ లోకానికి చిరపరిచితులయిన అల్లంరాజు వెంకటరావు గారి కలంలో ఖచ్చితత్వం ఉంది. సమకాలీన కవిత్వం పట్ల అవగాహన ఉంది అన్నింటికీ మించి పద ప్రయోగంలో, భావ వ్యక్తీకరణలో నిర్దిష్టత ఉంది. "ప్రతి నేత వెనుకా విజయాలకు/ ..వనిత మాటేమో కాని / పార్టీ అధినేత ఊత / ఉవిద ఊదరగొట్టే సొద / మహిళా విభాగ సారధ్యం పేర / అదరగొట్టే వార్తల కధ " అంటూ "ఇంతుల దన్నులుండ తెరువేయ్యది" అనే కాలమ్ లో ప్రస్తుత రాజకీయాల పట్ల వ్యంగాస్త్రాన్ని సంధించారు.

నేడు కవిత్వం రెండు భాగాలయింది ఒకటి ప్రేమ కవిత్వం, రెండు సమయానుకులమయిన కవిత్వం. ఆంటే దేశంలో సంఘటన జరిగినా అందుకు వెంటనే ఖండిస్తూ రచించే కవిత్వానికి విషయ పరిజ్ఞానం ఉంది తీరాలి. కవిత్వం పదికాలాలు చరిత్రలో నిలిచిపోతుంది. తద్వారా ముందు తరాలకు నేడు జరిగిన, జరుగుతున్న సంఘటనలు తెలిపే ప్రయోజనం ఉంటుంది. అది కవిత్వమై నిలిచిపోతుంది. ఇక ప్రేమ కవిత్వం ఆంటే అందుకు ముగింపు ఉండదు. భగ్న హృదయాలు, లేదా గెలిచిన హృదయాలో ఏదయినా ప్రేమ కవిత్వం రాయచ్చు కాని అది ఎప్పడికప్పుడు మారిపోతూనే ఉంటుంది. కనుక సమాజపు తీరును కంటికి కట్టినట్లు తెలిపే కవిత్వం కలకాలం నిలిచిపోతుంది. కవి కాలమ్ లోని విషయాలు ఎన్నో తరాలకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంది . ఉదాహరణకు

" జర భద్రం కొడుకో" అనే కాలమ్ లో "దేహాన్ని దేశాన్ని పటిష్ట పరిచేందుకే / సందేహాలన్నీ వదులు/ చివరి రక్తపు బొట్టు వరకు/ ప్రజా సేవకే అంకితం అనే వాళ్ళు/ అంగ రక్షకులకై / అంగలార్చడం ఎందుకు?/ పౌరులకు భద్రత కలిపించలేని / నాయకుడు / ప్రజా ప్రతినిధిగా / ప్రజల్లోంచే ఏదో ముప్పు ఉందని /ప్రాణ రక్షణ కోరడమా?/ నువ్వు తమ నేతవనీ/తమ సుఖ సంతోష ప్రదాతవనీ/ విశ్వసిస్తే/ ప్రజలే రక్షించు కుంటారు.." అనే వాక్యాలలో ప్రజాసేవకోసమాన్ని రాజకీయాలలోకి వచ్చి చివరకు వెనుక అంగ రక్షకులని ఉంచుకోవడం పట్ల కవి నేటి రాజకీయ తీరును నిలదీశారు. మరోచోట " బుద్ద దేవుడు హింసా వాదియేనా?/ హంస రెక్కల గాయాన్ని మాన్పి / శాంతి గీతాంజలి / అర్పించే నికేతనంలో / రక్త చరికల రణ భేరియా ?" అని ప్రశ్నిస్తారు. "అర్థరాత్రి ఇళ్ళు వదిలిపోయే / సిద్దార్దుల కాలం కాదిది / నవ సమాజ కుతుహలుడు రాహులుడు / రాజ్యాధి నేత కావాలని / పార్టీ తీర్థాల / రధ సారధుల మనో రధం / నేటి కాలం " అనడంలో మనకు ఇక్కడ ఎవరిని ఉద్దేశించి ఏమంటున్నారో అనేది పూర్తిగా అవగతమవుతుంది.

రాజకీయం రాచపుండు లా దేశాన్ని సలిపెస్తోంది అనే మాట నిజం. కాని ఇందుకు పరిష్కారం లేదు. కంచె చేను మేసే తీరులో కాలం ఎప్పుడో మారిపోయింది. అవమానించినా లెక్క లేదు. ఆగ్రహించినా కోపం రాదు. ఒకరిపై మరొకరు పది ముష్టి యుద్ధం చేసినా వైరం కాదట. బూతుల పంచాంగం స్వర్య విహారం చేసినా అది తప్పు కాదట! ఇది నేటి రాజకీయం. కనుక రాజకీయాన్ని ఎన్నిసార్లు పిండి మరలో వేసి నుగ్గు నుగ్గు చేసినా దాని రూపు మారదు. స్థానం చెదిరిపోదు.

అనుకున్నారేమో అందుకే ఇలా " అంతా నిష్ణాతులే / అంతా అను భవగ్నులే/ ఇదామిద్దామని తేల్చక ఒకడు/ ఇదేమిటని ప్రశ్నించి ఒకడు/ రెచ్చగొట్టి ఉచ్చులు పన్నాలని ఒకడు/ హటాత్తుగా ఒక ఆలింగనం/పరుగెత్తుకొచ్చి ఒక పరామర్శ/రవ్వంత దొరికిన సందులోంచి/ రాజకీయ జీవిత స్పర్శ" అంటారు మనిషి లోంచి మనిషి మాయమయిపోయాడు. అవసరం, సమయానుకులత, ఎండకు గొడుగు పట్టె మనస్తత్వం, ఎవరితో మాట్లాడాలన్నా అక్కడ తమకేదో కావాలనే ఆరాటం, తో మనిషి ఏంటి ఏకంగా మరలా తయారయిన సందర్భాలెన్నో.. సంఘటనలెన్నో.. కాల౦, కలం తో కలిస్తే మాత్రం కనిపించేది కేవలం మనసే అనేది మనం గ్రహించాలి అందుకు ఉదాహరణలుగా ఇక్కడ గమనిస్తే " పోరుబాటే పోవుబాట అనే కాలమ్ లో "అస్తిత్వ పోరాట వేళ /ఆత్మ గౌరవ ఆరాటం వేళ/భాషా గోషను చేర పట్టి ఆనాడు/ఉస్ ఉర్దూ మానియానే /విశ్వ విధ్యాలయంగా తలంటిన వానిని / మన కొంపల్ని గూల్చి/ మన స్త్రీల చెరబట్టి/ఖాసిం రాజ్వీలను రజాకారులను/ గ్రామాలలో కదం తొక్కించిన వాడిని / కీర్తి గానాలతో కైవారాలు చేయడం / స్వాతంత్ర స్పుర్తికే విఘాతం! అంటారు. అలాగే మరో చోట మానవ సంభందాల పట్ల ఇలా స్పందిస్తారు " మానవ సంభందాలన్నీ / ఆర్ధిక సంభందాలవుతున్నప్పుడు/ అంతా అపనమ్మకమే! దోపిడీ ఒక్కటే దృగ్గోచర మవుతుంటుంది.. బాధ / మూలుగు/ ప్రాణభీతి/ బంధుగణం, ఆందోళన, అన్నింటి నేపధ్యాన/చికిత్స/మానవీయ విచికిత్సకు / ముందు నోచుకోవాలి మరి! అంటారు.

నిజమే! ప్రతి దారుణానికి కారణం మనిషి మనిషిలా జీవి౦చ లేకపోవడమే! అసూయ, ఓర్వలేని తనం, అందరికంటే తానే గొప్ప అనిపించుకోవాలనే మనస్తత్వం, ఒకరిని అవమానించి అయినా తాము పదిమంది నోట ప్రచారం అవ్వాలనే ప్రయత్నం, లాంటి వన్నీ నేడు మనుషుల్ని పట్టి పీడిస్తున్న సమస్యలు. అందుకే మానవీయత గురించి ఎంతో విపులంగా సుధామ గారు స్పందించిన తీరు ఎంతో అర్థవంతంగా ఉంది.

రాజకీయం, మానవీయం ఇంతేనా అనుకుంటే పొరపాటే. మరోచోట "అక్షరం - హృదయానికి బదులు" అనే కాలమ్ ను గమనిస్తే " ఎన్నాళ్ళయింది అక్షరాలను చూసి/ ఆత్మీయ లేఖలోని ఒక్కో అక్షరం/ నిజంగా ఒక ఉషా కిరణం/ చెవుల్లో జలతరంగాల్లా/ శబ్ద ధ్వనుల హోరు నుంచి/ ప్రశాంతంగా చూపుల పడవ సాగే /ఉత్తర వాహినిని చూసి/గంగాజల పవిత్ర స్నాతునిలా/ ఎంత పులకించి పోయాను "అంటూనే చివరిలో "సమిష్టి ప్రపంచంలో ఉంటూనే /నీకు నువ్వు నచ్చేలా బతకడం ముఖ్యం/ దానికి ఆలంబన మయ్యేదే "సఖ్యం"/ ఉత్తరాల తోటలో పక్షులమై పలకరిద్దాం/ ఆత్మీయ స్నేహంలో పులకరిద్దాం/ అక్షరాల అందంగా ఆనందంగా జీవిద్దాం" అంటారు. సఖ్యత అనేది ఉంటేనే జీవితానికి పరమార్ధం అని చెప్పే తీరు అధ్బుతం!
సుధామ గారు కవి కాలమ్ ను ఒక ప్రయోజనాన్ని ఆశించి రచించేరు. గ్రంధం చదివి పక్కకు పెట్టేది కాదు. చదివి దాచుకోవలసినది. విషయ పరిజ్ఞానం లేని వారందరికీ ఎంతో ఉపయోగించే గ్రంధం ఇది. ప్రతి కాలమ్ లో ఒక సందేశం ఉంది. ఒక హెచ్చరిక ఉంది. ఓదార్పు ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా కాలమ్స్ లో భాద్యత ఉంది. మరో ఆణిముత్యం గమనించండి

" అమ్మమ్మ చచ్చిపోయింది/ మనుమడి దిగ్విజయాన్ని కాంక్షించి / మెయిల్ ద్వారా ఓటేసి/ ఎనభై ఆరేళ్ళ జీవితాన్ని దాటేసి /మృత్యు శాంతిలోకి / శాశ్వతంగా వెళ్ళిపోయింది. అంటూనే చివరో శక్తివంతమయిన వ్యంగాస్త్రం సంధించారు చూడండి "చచ్చిపోయింది ఒబామా అమ్మమ్మే కాదు/ప్రపంచమంతా అమ్మమ్మా అని ముక్కున వేలేసుకున్న అమెరికన్ జాత్యహంకారం/ అదీ ఈమారు/ అమెరికన్ ఎన్నికల ప్రధాన సారం" అంటారు. ఆంటే వీరు విషయాన్ని తీసుకున్నా ఎక్కడా సర్దుకోవడం, పదం వాడటానికి సంకోచించడం లాంటివి చెయ్యలేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే వీరి కాలమ్ నైజం. అదే ఇప్పటి జీవితానికి ఎంతో అవసరం!

మనిషి నిప్పయితే మనిషిలోని అహంకారం నివురు. అహంకారం ఉన్నంత వరకు హృదయం మండుతున్న వాస్తవాన్ని ఎదుటివారు గ్రహించలేరు. మాటలు విసిరేస్తారు. అవమానిస్తారు. నిందలు వేస్తారు. అభూత కల్పనలు సృష్టించి జీవితాన్ని అర్థం లేకుండా చేస్తారు. అదే అహంకారం లేకుంటే మండుతున్న వాస్తవాన్ని చూసి పరుగులు తీస్తారు. అలా నిప్పు కనపడక, నివురును దాచుకోలేక మనిషి ఏకాకిగా మిగిలి ఏది అబద్దమో ఏది నిజమో తెలుసుకోలేని విధంగా మనకు కనిపించడం జరుగుతోంది. అందుకేనేమో వీరు అంటారు " శవాల గురించీ/ శవాలమీద పేలాలు ఏరుకోవడం గురించీ/ వాళ్ళు ఒకరినొకరు నిందించుకుంటారు/ ఓటమి తర్వతనేనా / కూటమి బీటలు వారింది?/ అసలు కలయికే / అర్థం కానిదీ/ అర్థం లేనిదీ కాలేదా/ ఒకరు కాదని /ఇద్దరి నిర్ణయాలు / ముంచింది మూడో వాడినా?/ అంటూనే చివరి లో "మించిపోయినదేమీ లేదు/ ముంచిపోయినా దాని గురించి / వెల్లువలో/ తల ఒంచి నిలిచిన పోచలా అయినా/తలెత్తుకు మళ్లీ నిలవచ్చు" అయిదు వేళ్ళు పిడికిలిగా మారినప్పుడు సాధించలేనిది ఏమి లేదని చెప్పే వీరి "చెయ్యి ముడిస్తే పిడికిలి " కాలమ్ ఎంతో విలువయినది. సందేశాత్మకమయినది.

ఇలా ప్రతి కాలమ్ ను ఎంతో శ్రద్దగా సుధామ గారు తీర్చి దిద్దారు. వ్యక్తిగా, సాహితీ వేత్తగా సుధామ తమదైన ఒక కొత్త వొరవడిని, శైలిని కనపరిచే వారు. అందుకే వీరి కలం లో కవిత అయినా, కాలమ్ లో విషయమైనా సూటిగా, మరొకరికి బాటగా నిలుస్తాయి. కవి కాలమ్ పట్ల నా అభిప్రాయం చెప్పగలగటం నా సుకృతం గా భావిస్తూ.. వీరికి అభినందనలు అందిస్తున్నాను.

0 comments: