ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, April 13, 2012

'సిక్స్‌ప్యాక్’ రచయిత
‘‘రచయిత దేవళ్రాజుకు సిక్స్‌ప్యాక్ వచ్చిందట’’ అన్నాడు రాంబాబు.

‘‘ఆయనకు డెబ్భై ఏళ్ళు. ఇప్పుడాయనకు ‘సిక్స్‌ప్యాక్’ రావడమేమిటి?’’ అన్నాడు సన్యాసి ఆశ్చర్యంగా.

‘‘అదేనయ్యా! ఆయన రాసిన ఆరు పుస్తకాలు ప్యాక్ చేసి, తాము చెప్పినన్ని ప్రతులూ, జిల్లాల్లోని అన్ని గ్రంథాలయాలకూ, నగర కేంద్ర గ్రంథాలయాలకూ ప్యాక్ చేసి పంపమనీ, అందినట్లుగా వాళ్లనుంచి రసీదులు అందాక, ఒక్క పుస్తకానికి 25 శాతం, రెండు పుస్తకాలకన్నా ఎక్కువ కనుక అయతే మరో అయిదు శాతం పుస్తకాలు లెక్కవేసుకుని, ఫైనల్ బిల్లు కలకత్తాకుపంపితే, రాజారామ మోహన్‌రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ రచయితల ప్రోత్సాహ నిమిత్తం ఏర్పాటుచేసిన నిధి నుండి డబ్బు చెల్లించడం జరుగుతుందనీ స్టేట్ లైబ్రరీ డైరెక్టర్ నుండి లెటర్‌వచ్చిందట! పైగా పదిహేను రోజుల్లోగా ఈ పని జరిగిపోవాలిట! పాపం! ఆ ముసలాయన రచయిత అయిన పాపానికి- ఏం చేయాలా అని, ఆందోళన పడుతున్నాడు’’ అన్నాడు రాంబాబు.


‘‘మరి సిక్స్‌ప్యాక్ అంటావేం గురూ! ఒక్క పుస్తకం దాదాపు ముప్ఫై లైబ్రరీలకు పంపాలటే, ఆరు పుస్తకాలకూ ఆరూ ఇంటూ ముప్ఫై నూట ఎనభై ప్యాకెట్లు కట్టాలి! పైగా- ఒక్క పుస్తకం ఇన్నేసి ప్రతుల ఒక్కొక్క ‘ప్యాక్’ అంటే, అది మామూలు బరువేం వుండదు. అవన్నీ మోసుకుని పోస్టాఫీసుకు వెళ్ళి, రిజస్టర్ పోస్ట్‌లో పంపాలి. లేదా కొరియర్‌లో పంపాలి. ఈ వయసులో ఈ పని అంతా ఆయన చేసుకోగలిగిందేనా?’’ సానుభూతిగా అన్నాడు సన్యాసి.


‘‘ఒక్క పుస్తకం నూట యాభై ఏడు కాపీలటోయ్! అంటే- తొమ్మిది వందల నలభై రెండు పుస్తకాలు. వాటన్నిటి అట్టల వెనకాలా, ఇన్నర్ పేజీల్లో ‘‘రాజారామమోహన రాయ్ లైబ్రెరీ ఫౌండేషన్ కానుక’’ అని స్టాంపు చేయించి, ఆ స్టాంపు అన్నింటా ముద్రించాలిట! ఈ చాకిరీ అంతా చేసుకుంటే- పుస్తకాలు భద్రంగా అందాయని ఆయా లైబ్రరీలనుండి రసీదులు అందితే, అప్పుడు బిల్లు కలకత్తాకు వెడితే, అక్కడినుంచి కమీషన్ పోను, మిగతా సొమ్ముకు- ఏడాదికో ఎప్పటికో చెక్కు రావచ్చు. డెబ్భై ఏళ్ళ ఓ ముసలి రచయిత-ఇంత శ్రమ పడగలడా? అన్న యోచన కూడా లేక, రచయిత పట్ల, ఒక సృజనకారుడి పట్ల చూపవలసిన గౌరవం ఇదేనా’’ అన్నాడు.


‘‘అవునయ్యా! మరి ఆ డబ్బులు కావాలంటే ఏం చేస్తాడు?’’ ఈయన పుస్తకాలు ఏ పబ్లిషరూ వేయడు. తనే పాపం దుగ్థకొద్దీ- అప్పో సొప్పో చేసో, పెన్షన్ డబ్బుల్లోంచో, పుస్తకం అచ్చేసుకుంటాడు. పుస్తకాల షాపువాళ్లు ఓ ఇరవై, పాతిక కాపీలు- యాభై శాతం కమీషన్‌కు అమ్మిపెడతామని మాత్రం తీసుకుంటారు. అవి అమ్ముడయ్యాయో లేదో, ఏడాదైనా ఈయన వాళ్లచుట్టూ తిరిగితే కానీ, వర్తమానమే వుండదు! వేసుకున్న పుస్తకానికి నాలుగు డబ్బులువస్తాయన్న ఆశ ఏదో ఇలా రాజారామ్‌మోహన్‌రాయ్ లైబ్రరీ వాళ్లు కొన్ని కాపీలు తీసుకుని, కొంచెం తక్కువశాతం- అంటే ఏ పాతిక శాతమో తీసుకుని డబ్బులిస్తారని అంగీకరించడమే పెద్ద ఆశ! కానీ ఏ స్టేట్ లైబ్రరీలోనో, సిటీ సెంట్రల్ లైబ్రరీలోనే మొత్తం పుస్తకాలు తీసుకుని, ఆ లైబ్రరీవాళ్లే జిల్లాలకూ వాటికీ పంపుకోవడం ఔచిత్యమూ, లైబ్రరీ వృత్తి ధర్మమూగానీ, ఆ చాకిరీ అంతా రచయితలనెత్తిన తోయడం నిజంగా అన్యాయమే! రచయితల పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో, ముఖ్యంగా మన రాష్ట్రంలో- సొంతంగా పుస్తకం వేసుకున్న రచయిత, పాపం ఇలాగైనా అచ్చుకు పెట్టుకున్న పెట్టుబడిలో ముప్పావు వంతయినా పొందే పరిస్థితే లేకపోవడం దారుణమే’’ అన్నాడు సన్యాసి.


‘‘రాజారామ్‌మోహన్‌రాయ్ ఫౌండేషన్ వాళ్లు ఈ రూల్ పెట్టినట్లు- రచయితలనుండి పుస్తకాలు ఆహ్వానించిన ప్రకటనలో ఏమీ పేర్కోలేదు. స్టేట్ లైబ్రరీ అథారిటీ వాళ్లు రచయితలకు సహకరిoచాలి. వాళ్ల దగ్గర పనిచేసే యంత్రాంగం తగినంతగా లేదంటే, ఏ ‘ఔట్ సోర్సింగ్’కో ఇవ్వవచ్చు. ఓ అయిదు శాతం కావలిస్తే రచయిత నుండి దానికీ తీసుకోవచ్చు! అంతేగానీ- ఇంత పని రచయితకు పెట్టడం ఏం సబబు? డెబ్భై ఏళ్ల రచయిత దేవళ్రాజు గారికే కాదు, ఏ రచయితకయినా ఇది తలకుమించిన బరువే!


సృజనాత్మక రచయిత మేధో పరిశ్రమకు, ఈ శారీరక శ్రమ కూడా అనివార్యం అయితే- ‘సిక్స్‌ప్యాక్’ శరీరం వున్నా, ఎంత సమయం, డబ్బూ ఖర్చుచేయాల్సి వుంటుంది? ఓ నలభై రూపాయల పుస్తకానికి ఫౌండేషన్ నుండి ఓ ఆరువేలు, పంపిన నూటయాభై ఏడు కాపీలకూ వస్తుందనుకున్నా- ఇరవై అయిదుశాతం కమీషన్ పోనూ, తన రిజిస్టర్ పోస్ట్, కొరియర్ ఛార్జీలు పోను చేతికి మూడువేలందినా అది యాభై శాతం ఎలాగూ అవుతుంది! ఏమయినా- రచయితలను ప్రభుత్వం ఎంత హీనంగా చూస్తోందో, వారి ఆశలను బలహీనతగా ఎలా ఆడుకుంటోందో- తలచుకుంటే బాధేస్తోంది. ‘కత్తి గొప్పదా? కలం గొప్పదా?’’ అంటే- ఆఖరికి కత్తి గొప్పదనిపించే స్థితే తెస్తున్నారు’’ అన్నాడు సుందరయ్య.

2 comments:

Mantha Bhanumathi said...

నిజమేనండీ సుధామగారూ!
నేనయితే పంపట్లేదు. ఈ ఎండల్లో అంత పని చేసే ఓపిక లేదు.
బాగా రాశారు.
భానుమతి.

Narayanaswamy S. said...

కత్తే డెఫినిట్ గా గొప్పది, ఇంకా సందేహమా? :)