ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, March 17, 2012

భాషకు ‘సమయాల’ సోకు


మన ప్రబంధాలు, కావ్యాలు భాషా పటిమను, భాషా సౌందర్యాన్ని అందించేవిగా వున్నాయి. తెలుగు సాహిత్యంలో ప్రబంధయుగం అని ప్రత్యేకంగా పేర్కొంటాం. శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలో అష్టదిగ్గజ కవులను సమాదరించడం మాత్రమే కాదు స్వయంగా ఆముక్తమాల్యద అనే ప్రబంధం రచించాడు.

ప్రబంధ రచన అనేది కవి యొక్క ప్రత్యేక ప్రతిభ. దానికొక రచనా సంవిధానం వుంది. ప్రబంధాలలో అష్టాదశవర్ణనలను కవులు పాటించారు. వాటిద్వారా ‘కవి సమయాలు’ అనేవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. భాషలోని సొగసులో కవి సమయాలు ఒకటి.


సమయం అంటే సంప్రదాయం. అంటే ఆచారం లేక మర్యాద. ఈ సంప్రదాయాలు దేశదేశాచారాలలాగా ఎప్పుడో ఏర్పడినవే. సంఘజీవులయన వ్యక్తులు దేశాచారాలు పాటించవలసినట్లే, కవులు ఔచిత్యంతో రచన చేయడానికి ‘కవి సమయాలు’ పాటించారు.
‘కవి సమయాలు’గా రూఢమైన వాటిని మార్చడానికి వీలులేదు. మారిస్తే భాషే తలక్రిందవుతుంది. అయితే ఔచిత్య దృష్టితో కొత్తవాటిని సృష్టించుకోవచ్చంటారు ఆలంకారికులు.

‘కవి సమయాలు’ అంటే ఎక్కువగా ప్రకృతిగత విషయాలే. ఉన్న ధర్మాన్ని నిబంధించడం, లేని ధర్మాన్ని నిబంధించడం, కొన్నింటికి కొన్నింటి పట్లనే ఉనికిని నిబంధించడం ఈ కవి సమయాల్లో చూస్తాం.


కవి సమయాలలో కొన్నింటిని వర్ణించడానికి, కొన్నింటిని వర్ణించకపోవడానికి నియమాలున్నాయి. మాలతీలత వసంతంలో పుష్పించుతున్నట్లు, చందనద్రుమాలకు ఫలపుష్పాలున్నట్లు అశోకానికి పండ్లున్నట్లు, కృష్ణపక్షంలోవెన్నెల వున్నట్లు, శుక్లపక్షంలో అంధకారం వున్నట్లు, మల్లెమొగ్గలకు, కాముకుల దంతాలకు తాంబూలం వేసుకున్నా ఎర్రదనం వున్నట్లు వర్ణించకూడదు. అలాగే పగటిపూట నీలోత్పల వికసనం స్ర్తిలకు నల్లదనం వర్ణించారు. నదులలో పంకజాలు, నీలోత్పలాలు, తటాకంలో హంసలు, పర్వతాల్లో బంగారం, రత్నం, ఏనుగులు లేకపోయినా, వున్నట్లు వర్ణించడం కవిసమయం.


చీకటిని పిడికెట్లో పట్టుకోవచ్చట. సూదులతో భేదింపవచ్చునట. ఆకాశగంగలో దిగ్గజాలు స్నానం చేస్తాయి.వెన్నెల ను దోసిళ్లతో ఎత్తవచ్చు. శివుని తలపై వున్న చంద్రుడు ఎప్పటికీ బాలచంద్రుడే అని వర్ణించడం కవి సమయమే.

అలాగే రంగుల విషయం. కొన్ని కొన్ని రంగులను కొన్ని కొన్ని భావాలకు ప్రతీకలుగా వర్ణించడం కవి సమయాల్లో వుంది. కీర్తిని, పుణ్యాన్ని, నవ్వును తెలుపుతో, అపకీర్తిని, పాపాన్ని నల్లదనంతో, కోపాన్ని, అనురాగాన్ని ఎర్రగా, అలాగే శైల, వృక్షాది, మేఘ, సముద్ర, లతలకును, రాక్షస, ధూప, పంక, కేశములకు నల్లదనమే వర్ణించాలి. చందన వృక్షాలు మలయ పర్వతంలోనే వుంటాయి. వసంతంలోనే కోకిల కూస్తుంది. వర్షాకాలంలోనే నెమలి నాట్యమాడుతుంది. కేకి కేకలు వేస్తుంది. కృష్ణ అంటే నలుపు, నీల అంటే ఆకాశవర్ణం, హరిత అంటే ఆకుపచ్చ, శ్యామ అంటే ముదురుపచ్చ. ఈ వర్ణాలకు ఐక్యము చెప్పవచ్చు అంటే కవి సమయాల ననుసరించి భేదం పాటించనవసరం లేదన్నమాట. అందుకే శ్యామసుందరుడు, నీలమేఘ శ్యాముడు కృష్ణపరమాత్ముడు అంటూ కృష్ణుని వర్ణించడం వుంది.

చంపక, భ్రమరాలకు విరోధం వున్నట్లు, చక్రవాక దంపతులకు రాత్రి వియోగం కలుగునట్లు, స్త్రీకి రోమావళి వున్నట్లు, సమద్రంలోనే మొసళ్లున్నట్లు, తామ్రపర్ణి నదిలో ముత్యాలు లభిస్తాయని వర్ణించాలి. ధ్వజము, చామరము, హంస, హారము, కొంగ, భస్మము వీటిని తెల్లదనమే వర్ణించాలి.అలాగే స్త్రీల కొన్ని చర్యలతో వృక్షాలకు సంబంధించిన విషయాలు కవిసమయాల్లో ప్రసిద్ధంగా వున్నాయి. పద్మినీ జాతి స్త్రీ తన్నడంవల్ల అశోకవృక్షం పుష్పిస్తుoదిట. వారు పుక్కిటబట్టి ఉమియడంవల్ల పొగడ చెట్టు, వారి కౌగిలింతతో గోరంట, వారి చూపులు సోకి బొట్టుగుచెట్టు, వారు నర్మగర్భంగా మాట్లాడడంతో మందారం, వారి నవ్వుతో సంపెంగ, వారి ముఖానిలంతో మామిడిచెట్టు, వారి సంగీతంవల్ల సురపొన్న, వారి నర్తనంతో కొండగోగుచెట్టు వికసిస్తాయని ‘కవి సమయం’. వసుచరిత్ర వ్యాఖ్యాత మాకందం స్త్రీల కరస్పర్శతో సంపెంగ ముఖరాగంతో, ప్రియాళువు సంగీతంతో వికసిస్తాయని పేర్కొన్నాడు.


కవులు కాలౌచిత్యాన్ని పాటించి ఋతువర్ణం చేయాలనీ, ఏ ఋతువులో ఏయే విషయాలను ప్రస్తావించాలనేది కవి సమయాలు సూచిస్తూంటాయి. లోకంలో అవి నిర్థారితాలుగా భాసిస్తూ వుంటాయి. అలాగే సంఖ్యానియమం కూడా వుంది. త్రికాలాలు, త్రిభువనాలు, త్రినేత్రుడు అంటాం. అలాగే తాంబూలగుణాలను త్రయోదశ సంఖ్యగానే చెప్పాలి. చంద్రుడివి పదహారు కళలు అంటారు. ఇలా కావ్యగత, ప్రబంధగత అంశాలుగా కవిసమయాలు కవుల రచనల్లో ప్రతిబింబితమవుతూ రావడం ఒక రచనా సౌందర్యంగా, భావాభివ్యక్తీకరణ సొబగుగా రాజిల్లుతోంది.

ఇప్పుడు ఈ కవి సమయాలు అనేకం పాతబడినట్లు, ప్రయుక్తంలో లేనట్లు కావడానికి అసలు కవిత్వ రీతుల్లో పద్య రచనా ఫణితి మందగించడమూ హేతువే. ఏమయినా పద్య వారసత్వాన్ని, హృద్యమైన పద్యంలో కవి సమయాల సౌందర్యాన్ని సంరక్షించుకుంటే భాషలోని పెన్నిధులను సంరక్షించుకున్నట్లే.

-సుధామ

(ఆంధ్రభూమి దినపత్రిక 'నుడి 'శనివారం 17.3.2012)

2 comments:

వెంకట రాజారావు . లక్కాకుల said...

నాటి కావ్యాల రత్నాల పేటికలుగ
తీర్చి భాషామతల్లికి కూర్చి రపుడు
పద్యమే యర్థ మవ్వని పాట్లు నేడు
ఏల నయ్య భాషకు ‘ సమయాల ‘ సోకు ?

బ్లాగు: సుజన-సృజన

సుధామ said...

ధన్యవాదాలు రాజారావు గారూ!మీరన్నది నిజం. ఏమయినా పద్య వారసత్వాన్ని, హృద్యమైన పద్యంలో సౌందర్యాన్ని సంరక్షించుకుంటే భాషలోని పెన్నిధులను సంరక్షించుకున్నట్లే.