ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Monday, March 19, 2012

పుస్తక సమీక్షలు ఓ రెండు

ఆంధ్రభూమి దినపత్రిక

'అక్షర ' పేజీ లో

18.3.2012 ఆదివారం

నే రాసిన

రెండు సమీక్షలు


ఇజాలు కావు నిజాలే





వేయి శిల్పాలు సృష్టించిన మనిషి
ఒక శిలను సృష్టించగలడా!
అందుకే శిల్పాన్ని చెక్కడంకన్నా
శిలను సృష్టించడం కష్టం

అంటాడు ‘రాళ్లని ప్రేమిస్తున్న వేళ..’లో రాళ్లబండి కవితాప్రసాద్.

కవితాప్రసాద్‌లో కవితా నిర్మాణ వైదుష్యం వుంది. అది పద్యమైనా గద్యమైనా, వచన ఖండిక అయినా ఒక అభివ్యక్తి విన్నాణం, గాఢమైన ఒక తాత్త్విక స్పృహ వున్నాయి.

కొన్ని ఏకాంతాలు
సమూహంగా మారగలవు కాని
వేయి ఒంటరితనాలు
ఒక్క సమూహాన్ని సృష్టించలేవు

అని వ్యష్టి- సమష్టిగా మారడంలోని తిరకాసు చూపుతాడు. ‘‘ఏకాంతం ఒక ఊహ! ఒంటరితనం ఒక వాస్తవం’’ అంటాడు. ‘నేనొక సమాధానాన్ని ప్రశ్నించండి ప్లీజ్’ అంటూ- ‘‘సూర్యుడు సంధించే కిరణాల ప్రశ్నలు- చీకటికి అర్థంకావు- చీకటి చెప్పే నల్లటి సమాధానాలు- వెలుతురుకు వినబడవు- అయినా- విశ్వమే ఒక ప్రశ్నపత్రం- మనిషే ఉత్తీర్ణుడు కాలేకపోతున్నాడు’’ అంటూ

పొద్దున్న నిద్ర లేవగానే
నేనొక పరీక్ష హాల్‌లోకి మేల్కొన్నట్లుంటుంది
కాలెండర్లోని ప్రతి తేదీ
హాల్ టికెట్ నెంబర్లా కనిపిస్తుంది
ఆలోచన సిలబస్‌లో లేని ప్రశ్నలకు
ఆన్సర్లు రాయాల్సి వుంటుంది
ఇన్‌విజిబుల్ ఇనివిజిలేటర్
భయపెడుతుంటాడు.’’

అంటూ ‘బ్రతుకే ఒక ప్రశ్నార్థకంగా’ మనిషి నిత్యజీవనాన్ని స్ఫురింపచేస్తాడు! ‘మనిషిదేభాష’అనేది కూడా ఆలోచనాత్మకమైన సర్వప్రకృతి ప్రతిబింబ భావన. ‘దిసీజ్ హ్యూమన్ కెమిస్ట్రీ’అంటూ- నిజంగా జీవన రస రసాయినిక చర్యల గురించి ఆలోచింపచేస్తూ, ‘ఆకాశంలో జామెట్రీ’ని కూడా మనముందు పెడతాడు. నిశ్చల కాంతి సరోవరంలో నిర్ణిద్ర రాజహంసలా వుండాలనుకుంటాడు తాను.

అశాశ్వత విశ్వాసాల విధ్వంసాన్నై అనంత దిగంతాలకు అంతరాత్మనై నిశ్చల చలనంలా నిలచిపోవాలనేది కవి ప్రగాఢ కాంక్ష. ప్రకృతితో, సామాజిక సంవేదనలతో మిళితమవుతూ, తన హృదయ మథనాన్ని- కవితాత్మకంగా అభివ్యక్తం చేయడంలో నిజంగానే పాలనూ- నీటినీ వేరుచేయగల ప్రజ్ఞగల రాజహంసలా, అమానవీయతనూ- ఆధ్యాత్మిక తాత్త్వికతనూ విడదీసే ‘అగ్నిహంస’లా కవితాప్రసాద్ మనిషి తనాన్నీ మంచితనాన్నీ పాఠక మానస సరోవరంలో నింపుతూ పోయేందుకే- తన రెక్కవిస్తున్నారు.

శూన్యమేవావిశిష్యతే’ అంటున్నారు గానీ,‘‘కాల భస్మంతో అనంత శూన్యాన్ని పునరావాహన చేస్తాను’’ అనడంలో- ఒక కొత్త వినిర్మాణాకాంక్షనే ప్రోదిచేస్తున్నారు తప్ప, నిరాశను, నిస్తేజాన్నీ కాదని అర్థం చేసుకోవాలి. ‘స్వప్న మండలం’నుండి ‘ప్రాణతాండవం’ జరిగి, ‘వేయివికర్షణల మధ్య’ ‘అతి సహజంగా’ ‘విముక్తకం’అవుతున్న ఈ అగ్నిహంస కవిత్వం, ‘ఎవరూ చదవని పుస్తకం’కాదు, ‘మనసు జలదరించిన వేళ’ దేవుడు పారేసుకున్న ఆకాశం- ‘అందిపుచ్చుకోవడమే’!

-అల్లంరాజు


నవ్వుతూ బతకాలిరా

:



ప్రముఖుల’ హాస్య చతురోక్తులుగా యం.డి.సౌజన్య సంకలించిన - ‘నవ్వుతూ బతకాలిరా’ పుస్తకంలో ఇందిరాదత్ ఆధ్వర్యంలో జరిగిన మద్రాసు తెలుగు మహాసభలలో పేలని తన హాస్య ప్రసంగాల ప్రకరణాన్ని జోడించడం తమాషాగానే వుంది! కానీ మునిమాణిక్యం, భమిడిపాటిలతో మొదలెట్టి శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, చక్రపాణి, రావిశాస్ర్తీ, కట్టమంచి, సి.నా.రె, ఆచార్య దోణప్ప వంటి రచయితలూ; పద్మనాభం, బ్రహ్మానందం, ఏ.వీ.యస్, రావికొండలరావు, సూర్యకాంతం వంటి సినీ హాస్యనటులు; భానుమతి, జంధ్యాల, మారుతీరావ్ వంటి వారల హాస్యాన్ని సేకరించడానికి రచయిత పడిన శ్రమ మెచ్చతగింది. ఇందులోని హాస్యం కొంత ఇప్పటికే తెలిసిందే అయినా- కొందరి పేర ప్రసిద్ధమైన హాస్యం మరికొందరికి ఆపాదించినట్లు అక్కడక్కడ అనిపించినా, ‘ఎ జోక్ ఈజ్ ఎ జోక్ ఈజ్ ఎ జోక్ ఈజ్ ఎ జోక్’అన్నట్లు నవ్వు తెప్పించేది- ఏదయినా, ఎవరిదయినా, ఎప్పుడయినా, ఎలాగయినా ఆస్వాదించి ఆనందించదగిందే! ‘నవ్వుతే ఆరోగ్యం’ అని ఆయన మున్నుడిగా అన్న మాట ఈ కాలాన ప్రధానంగా ఎన్నదగింది మరి. ఒత్తిడుల ప్రపంచంలో- ఇలాంటి పుస్తకాల అవసరం ఎంతయినా వుంది. ఇన్నర్ కవర్‌లో పేర్కోలేదు గానీ, ఈ ప్రముఖుల చిత్రాలను చాలా అందంగా, సహజంగా చిత్రించిన చిత్రకారుడు (రావు?) కూడా అభినందనీయులు. ‘తెలుగు సినిమాలలో హాస్యం’, ‘కామెడీ విలన్ల కామెడీ’ సిద్ధాంత వ్యాసాలకు ప్రాతిపదికలన్నట్లుగా వున్నాయి. ‘సృజనశీలుర మాటల్లో హాస్యం’అనే ప్రకరణం విడిగా అనవసరమేమో! ఎందుకంటే కొందరు తప్ప, అందులోనివారు ప్రముఖులుగా- విడివిడిగా వారి హాస్యం గురించి ఇతరత్రా ప్రస్తావించబడినవారే!

- సుధామ


(ప్రముఖుల హాస్య చతురోక్తులు)
-యం.డి.సౌజన్య,
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,
విజ్ఞానభవన్, బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాద్-1, వెల: రూ.60
/-




0 comments: