‘‘ఒక్కో వికెట్టూ డౌన్ అవుతోంది’’ అన్నాడు శంకరం చెమ్మగిలిన కన్నులు తుడుచుకుంటూ.
‘‘కానీ ఆట ఆగదు’’ అన్నాడు ప్రసాదు.
‘‘మీరు క్రికెట్టు పరిభాష మాడ్లాడుతుంటే, అది అస్తమించిన అక్కినేని మహానటుడి గురించో, రాష్ట్ర రాజకీయం గురించో తెలీడం లేదు. కన్నులు చెమ్మగిల్లడం ఇవాళ జీవితం గురించీ, తెలుగువారి భావి జీవితం గురించీ కూడా జరుగుతోంది. ఒక విధంగా అక్కినేని వంటివారు అదృష్టవంతులు. కళాకారునిగా ప్రాంతాలకు, దేశాలకు అతీతంగా అందరి హృదయాల్లో ప్రతిభా సమైక్యంగా రాణకెక్కి రాలిన నక్షత్రాలు వారు. ఇవాళ కళలను కూడా సంకుచిత ధోరణులతో వీక్షించి గణించే దుస్థితిలో పడి, దూరాలను పెంచుకుంటూ ,ద్వారాలను మూసుకుంటున్న స్థితిలో, విడగొట్టడంకాక కలిపికుట్టిన అందరి హీరో వారు. భావిపరిణామాల బాధలేవీ లేకుండా నూరేళ్ళు బ్రతికితే ఇంకేం చూడాల్సివస్తుందో అన్నట్లుగా- హాయిగా తరలిపోయినందుకు అదృష్టవంతుడనాలి. శరీరంలోని క్యాన్సర్‌ని ధైర్యంగా నిబ్బరంగా ఎదుర్కొన్న ఆయన ఇక సమాజ రుగ్మతలు చూడలేనన్నట్లే తరలిపోయారనుకోవాలి. లేకపోతే నూరేళ్లు బ్రతుకుతాననుకున్నవాడేగా’’ అన్నాడు సన్యాసి.
‘‘కాలం ఒకరికోసం ఆగదు సన్యాసీ! పరిణామాలు ఎలా వుంటాయో ఎవరూ ఎప్పుడూ చెప్పలేం. జీవితం నిజంగా ఒక క్రీడే! బరిలో వున్నంతసేపూ ఆడుతుండాల్సిందే. ప్రతికూల పరిస్థితులు రాక మానవు. ధీర చిత్తతతో ఎదుర్కోవాలి. నిజమే! చివరిబంతి వరకూ ఆడుతూ వుండాల్సిందే! ఎవరయినా సరే! ఎన్ని వికెట్లు డౌన్ అవుతున్నా, ఆటలో ఎవరు క్షతగాత్రులవుతున్నా, ఎవరు పెవిలియన్ దారిపడుతున్నా, ఉన్నవారు ఆడాల్సిందే! ఆట అన్నాక ఇరుపక్షాలు ఎప్పుడూ వుంటాయి. జీవితం క్రికెట్‌లోనూ నిన్ను ‘ఔట్’చేయాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా ఒక్కోసారి వికటించి ప్రయత్నిస్తూనే వుంటాయి. ఉదయకిరణమూ చీకటిలోకి పోతుంది. అలాగని చీకటీ శాశ్వతం కాదు. వెలుగునీడలు, సుఖదుఃఖాలు బ్రతుకులో సహజం. బ్రతికినంత కాలం పదిమందికోసం బ్రతికిన వాళ్ళే గొప్ప. స్వార్థ క్రీడాకారులా? సమాజహిత చింతనాపరులా? అన్నదే గణనకొచ్చే విషయం. సినిమాలయినా, రాజకీయాలయినా ఎటుపోతున్నాయి అన్నదే ఇవాళ చింతనీయం’’ అన్నాడు ప్రసాదు.
‘‘సమాంతరంగా అనేకం సాగిపోతూంటాయి. అందుకే ‘ఆట ఆగదు’ అన్న మాట వచ్చింది. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు చర్చ జరుగుతోంది. ఇందిరాపార్కుదగ్గర సమైక్య ధర్నా సాగుతోంది. అక్కినేని భౌతికకాయ సందర్శనం జరుగుతోంది. ఢిల్లీలో కేజ్రీవాల్ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారన్న వార్త వస్తోంది. ఒకటారెండా ఒకేసారి అనేకానేక ఛానెల్స్! ఏ ఛానెల్ ధోరణి దానిదే. ఇదంతా కలిసేకదా కాలం కదలికలన్నీ. వీటిల్లో వాస్తవాలూ వుంటాయి, ఊహాగానాలూ వుంటాయి. ఒకే పాన్పుపై కలసి శయనించే దంపతుల తలలో సైతం ఆలోచనల్లో సప్తసముద్రాల అనుల్లంఘనీయ వ్యత్యాసం అన్నట్లు, ఏకకాలంలో ఇన్ని వైరుధ్యాలూ, వైవిధ్యాలూ సహజాతి సహజం’’అన్నాడు సన్యాసి మళ్ళీ.
‘‘వైరుధ్యాలూ, వైవిధ్యాలూ సహజమే అయినా- ఉన్నంతలో ఏకత్రితంకోసం ఆరాటం అనేది ఒకటుంటుందోయ్! అదికూడా మానవ నైజమేనేమో! తెలుగువారు విడిపోవడంవల్ల ఇరుప్రాంతాలూ నష్టపోతాయని సి.ఎం. కిరణ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. అది ఆయన ఒక తెలుగు సి.ఎం.గా అంటే ‘కామన్‌మేన్’గా అంటున్నారని గుర్తించడం అవసరమేమో! ఎందుకంటే హైకమాండ్ ఉద్దేశాలకు విధేయ కాంగ్రెస్ కార్యకర్తగా వుండవలసిన మనిషి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడంటే, అక్కడ ఆయన చూసుకుంటున్నది స్వలాభాపేక్షనా లేక రాష్ట్ర ప్రజాప్రయోజనమా అని ఆలోచించడానికి అభ్యంతరపడుతున్నవారున్నారు.
తననుతాను ఆఖరి బంతివరకూ జట్టు గెలుపుకోసం ఆడే క్రీడాకారుడిగా అభివర్ణించుకుంటున్న ఆయన- సమైక్యంకోసం పట్టుబడుతున్నారంటే, రాష్ట్ర విభజనవల్ల కలిగే భవిష్యత్ పరిణామాలు తెలుగువెలుగుకు, తెలుగు తేజానికీ గట్టి ఆఘాతం అనీ, దేశంలో తెలుగువాడి ప్రాభవం మసకబారుతుందన్న ఆర్తిఅనీ అనుకోవచ్చుకదా! సమైక్యంకోసం ఆయన కొత్తపార్టీ పెట్టడానికయినా సిద్ధమైపోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. దానికి ‘బ్యాట్’గుర్తును ఎంపిక చేసుకుంటున్నారనీ అంటున్నారు. BAT అంటే ‘బైండింగ్ ఆంధ్రప్రదేశ్ టుగెదర్’ అన్నదే ఆయన ఆకాంక్ష అనుకోవాలి. BAT అంటే గబ్బిలం అనీ ,తలకిందులుగా తపస్సుచేసినా విభజన పరిణామాన్ని ఆపడం సాధ్యంకాని పని అనీ ,వ్యాఖ్యానిస్తున్నవారున్నారు.
బి.ఎ.టి. బ్యాట్- ‘బైఫరికేషన్ ఆఫ్ ఆంధ్రా తెలంగాణ’అని ఆయన గుర్తించడం మంచిది అని అదే బ్యాట్‌తో ఆయన విసరదలుచుకున్న బంతిని ఎదుర్కోవాలని చూస్తున్నవారూ వున్నారు. కొత్త పార్టీలు పుట్టుకురావడం కాదు కావలసింది. జన హృదయాలలో మార్పు గురించిన చైతన్యం పుట్టుకురావడం ముఖ్యం. అవినీతిపైనా, హింసా నేరాలపైనా సమూలంగా క్షాళన చేసే అభ్యుదయమనే ఉప్పెన ప్రతి ఆమ్‌ఆద్మీ హృదంతరాళంనుంచీ చిమ్ముకురావడం అవసరం.
కవులూ, కళాకారులూ మునుపు సంకుచితత్వాలకూ పాక్షికతలకూ, పక్షపాతాలకూ అతీతంగా, విశ్వజనన భావనతో విశ్వశ్రేయస్సుకోసం, మానవీయ విలువలకోసంగా నిలుస్తూవచ్చారు. నిజంగానే గుర్తింపబడని శాసనకర్తలుగా జనంలో మంచి మార్పుకోసం- తమతమ పంథాలను అనుసరించి పురోగమించారు. తెలుగువారందరికీ లెజెండ్స్‌గా, ఐకాన్స్‌గా నిలచిన అక్కినేని వంటివారు ముందుతరాలకూ అలానే స్ఫూర్తిమంతంగా నిలుస్తారా? కాలగర్భంలో కలసిపోయిన మట్టిబొమ్మలుగానే మిగిలిపోతారా? అన్నదే నేటి రాజకీయ వైక్లబ్యపు రాష్ట్రీయ ఆర్తి! ఎవరి బ్రతుకయినా గుర్తించాల్సిన వైయక్తిక క్రీడాస్ఫూర్తి.’’అంటూ లేచాడు రాంబాబు.
Andhrabhoomi (Daily) 24.1.2014
0 comments:
Post a Comment