ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, February 12, 2012

నీటిచుక్క నిలువుటద్దంలో కవిత్వం



‘‘ప్రజలు దాహమంటే నదిని మోసుకొచ్చాను
తీరా తెచ్చాక వద్దన్నారు-
ఏమంటే
నదిలో అక్షరాలు లేవుట.’’


అంటాడు అరుణ్‌బవేరా!
అక్షరమే దాహార్తిని తేర్చే జీవ బిందువు అని ఎరిగిన కవి కనుకనే - ‘ఒక కన్నీటి చుక్కకోసం’ ‘షరా మామూలుగా’, ‘నీకోసం రాస్తూరాస్తూ’ ‘ఉనికిని దాచుకోలేను’అని అభివ్యక్తమవుతున్నాడు.

‘ఇక్కడ
ఎవరి ఏడుపు
వాళ్ళు ఏడవాల్సిందే
ఎవరి బతుకు
వాళ్ళు బతకాల్సిందే’

అన్న గతానుగతిక వాస్తవం తానెరుగును. అయినా ‘రోజూ నిద్ర లేవడం ఒక జాగృతీ- రోజూ నడవడం- ఒక పురోగమనమూనూ’అని విశ్వసించి, ‘వీరుడా దానం చెయ్యి’ అంటూ సాటి వాడికోసమూ- వెలుగూ, చీకటీ, వేగం, యోగం, కలలూ, కౌగిలీ, కరుణా, కాఠిన్యం అన్ని దానం చెయ్యమంటాడు.

‘‘ఏ సంఘర్షణా కొత్తదనానికి చోటివ్వదు
ఏ నిరీక్షణా కొత్త గీతాలకి గొంతివ్వదు.’’

అని షరా మామూలుగా అనడం మాత్రం ‘‘క్రియా శూన్యతలో- అనాది కాంక్షలు దగ్ధ స్మృతులై- జీవ రహిత చేతస్సులై - వ్యూహలన్న నిట్టూర్పుల్లో మణిగినపుడు’’ అంటున్నట్లే వుంటుంది. జీవన రేఖలో సరళతను కాక వక్రతను, వ్యగ్రతను మాత్రమే దర్శించడం అరుణ్ బవేరాకు ‘సహారా’ అనగల ‘ఆసరా’ కాజాలదు.

నువ్వు నా చుట్టూ సముద్రంలా
చుట్టుకుని కెరటాలు కెరటాలుగా
లేస్తున్నప్పుడు
నీ ఆనందంలో బరువెక్కి నేను పచ్చగా పూస్తాను

అని భరోసా యిస్తున్న కవి ‘ఒకరి అవసరాల్ని ఒకరు పంచుకోలేం’ అన్న ఏకాకితనాన్ని ధ్వనించనవసరం లేదు. నేను మాట్లాడవలసిన మాటలన్నీ దోవనిండా రాల్చుకుంటూ పోయాక నా వెనుక అడుగులు తొక్కుకుంటూ వస్తున్నవారు నా మాటలను జెండాలుగా ఎగరేస్తారు అని విశ్వసించినవాడు మాట్లాడవలసిన మాటలు ఇంకా మిగిలే వున్నాయ్. మరింతగా కూర్చుకోవలసి వున్నాయి. ఒక కన్నీటి చుక్కకోసం, అది రాలడానికే కాదు, తుడవడానికి కూడాను.

- సుధామ

ఒక కన్నీటి చుక్కకోసం
(కవిత్వ సంకలనం)
- అరుణ్‌బవేరా-
మెజారిటి ప్రచురణలు గుషిని పోస్ట్,
నెల్లిమర్ల మండలం,
విజయనగరం- 535218,
వెల: 40 రూ/-


(ఆంధ్రభూమి (దినపత్రిక) ఆదివారం' అక్షర '12.2.2012 సంచికలో)
 

0 comments: