ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, February 12, 2012

భగ్గుమన్న హృదయఘోష

‘తడి నిప్పు’ అన్న మాటే నిజానికి విరోధాభాస కానీ ‘బడబానలం’ ఎంత సహజమో సమాజ స్థితిగతుల పట్ల హృదయదఘ్నంగా కలత చెందిన కవి నిప్పైరగలడమూ అంత సహజం. తడికట్టెనయినా ఊది ఊది మండింప చేయాల్సిన అగత్యం ఉంటూనే ఉంటుంది.


కరచాలనాలు కరకుగా
స్పృశించినప్పుడు
కుదుపు కుదుపుకో తడినిప్పు
మానసంలో రాలుతుంటుంది


అంటాడు బోజంకి వెంకటరవి. ఒకప్పుడు ‘మేథోవలస’ను నిరసించిన దేశంలోనే పరాయ్యికరణ పెరిగి ధనవ్యామోహం కుటుంబ జీవన మానవీయ విలువలను కూడా కునారిల్లచేస్తోంది.

‘దేశాన్ని పొట్లం చుట్టి-
వాడి అంగట్లో పెట్టడానికి
పూనుకున్న పాలకులారా’

అంటూ నేటి పాలనా వ్యవస్థే ఈ దేశంలో మేధకు ఇక్కడ ఆలనాపాలనా కరువయ్యి వలసను వంటబట్టించుకుంటున్న వక్రపథానికి హేతువనీ, దానిని గొప్పగా సంభావించడం సిగ్గుచేటనీ పేర్కొంటాడు రవి.

‘డాలర్ దాడిలో గురుపీఠం’ అనే కవిత ఈ తరాన్ని ఆలోచనల్లో అపమార్గం పట్టిస్తున్న విద్య పేరిట అమానవీయ సంస్కృతి మీద సంధించిన ఒక అస్తమ్రే.



ఉద్రేకాలు, ఉద్వేగాలు కన్నీటి మంటలుగా కవితల్లో రూపుకట్టించినా నిర్వేదాన్ని, నిరాశను ప్రోదిచేయక ఆశ వైపు, ఆశయంవైపు అడుగులు వేయిస్తాడు కవి. దుఃఖానికి ఓదార్పుగానే కవితను చైతన్యీకరిస్తాడు. ప్రపంచీకరణ అంటే శిల్పం శిలగా మారిపోయే తిరోగమనం కారాదనీ ఈ దేశ జ్ఞాన సంపద, మేధావిత్వం ‘‘మా పట్టాల మీద మేమే వలసలుపోతూ.. మా దేశంలో మేమే పరాయవుతున్నాం’’ అనేట్లు వేదనా దగ్ధం కారాదనీ కాంక్షిస్తాడు.

- అల్లంరాజు

తడి నిప్పు (కవిత్వం)
వెల. 60/-
బోజంకి వెంకటరవి.
వి.శాంతపాలెం, ఎ.కోడూరు,
విశాఖపట్నం జిల్లా


(ఆంధ్రభూమి (దినపత్రిక) ఆదివారం' అక్షర '12.2.2012 సంచికలో)

0 comments: