ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Monday, February 13, 2012

శాంతి సౌఖ్యాలు

మతం అనేదాన్ని ఒక మార్గం అనుకొంటే అది మానవ జీవిత సాఫల్య మార్గం అవుతుంది. ప్రతి మతమూ మానవాభ్యుదయాన్నీ, శాంతినీ అభిలషించిందే. ‘విశ్వాసమే దేవుడు’ అని అంటాడు టాల్‌స్టాయ్. అయితే ఆ విశ్వాసం విచక్షణతో ఉండాలి. కాని మూఢ విశ్వాసంతో ఉండకూడదు.

నిజానికి నిరాకారుడు, నిర్గుణుడు అయిన దైవానికి ఒక ఆకృతిని కల్పించుకుని, అందుకు ఆరాధనా మార్గాన్ని ఏర్పరచుకున్నది మనుష్యులే. హిందూ, ముస్లిం, బౌద్ధం, జైనం, సిక్కు, పార్శీ, క్రైస్తవం ఇలా ఎన్నో మతాలు ప్రపంచంలో అనేకంగా వున్నాయి. చిత్తమెచట భయశూన్యమో, ఎక్కడ సంతృప్తి, సంతోషం సమకూడుతాయోఅదే స్వర్గం అని భావించవచ్చు.

భగవంతుడు ఒక్కడే. కాని ఆయనకు మనమే ఎన్నో పేర్లు పెట్టుకొన్నాం. మన భావాన్నిఅనుసరించి పేర్లు పెట్టుకొన్నట్టుగానే ఆకారాలను సృష్టించుకొన్నాం. ఎవరికి ఏ భగవన్నామంమీద అపార విశ్వాసమో దానినే జపించవచ్చు. దాని ప్రకారం ఆ యా భగవంతుడిని సగుణంలోనో, నిర్గుణంలోనో పూజిస్తాం. అర్చిస్తాం. గమ్యం ఒకటే అయనా దారులు ఎన్నో ఉన్నట్టు భగవంతుడు ఒక్కడే అయనా ఎన్నోరూపాలతో ఏన్నో దర్శనాలతో భగవంతుని తత్వాన్ని అర్థంచేసుకొంటాం.దీన్ని చెప్పేదే మతం.

పరికించి చూస్తే మనకు ఒక మతంలోనే అనేక శాఖలు, ఉపశాఖలూ కనిపిస్తాయి. హైందవంలో శైవ, వైష్ణవాలూ మస్లింలలో సున్నీ, షియాలు, క్రైస్తవంలో కేథలిక్కులు, ప్రొటెస్టెంట్‌లు కానవస్తారు. అంటే మతం అనే మార్గంలోనే మళ్లీ అనేక వీధులన్నమాట. అయితే చివరకు చేరుకునే ‘అంతిమ గమ్యం’ ఒకటే అయినప్పుడు, ఎవరికి అనుకూలమైన దారిలో వారు ప్రయాణించడం సహజం! ప్రయాణించే ఒక రైలు స్టేషన్ చేరడానికే- ఎవరి మార్గంలో వారు వస్తున్నప్పుడు, ఇంత వైవిధ్యం వుండడంలో దోషం లేదు. అయితే వాటిలో వైరుధ్యాలను ఎన్ని, విద్వేషాలనూ, అవతలివారి మార్గానికి అవరోధాలనూ కల్పించడమే కూడనిపని.

‘మత సామరస్యం’ అన్నమాట వచ్చినపుడు ‘సత్యం’ అన్నదే అసలు సామరస్యం. సత్యం ఒక్కటే. ఆ సత్యాన్ని వీక్షించడంలోనే దృక్కోణాలు వేరు కావచ్చు. సత్యం అనేది ఒక గోళం వంటిది. గోళానికి ఒకవైపున వున్నవారికి ఆవలివైపు కన్పించదు. అంతమాత్రాన తాను చూసిందే, తాను విన్నదే సత్యమనుకోవడం సరికాదు. అంతేకాదు! తనకు భిన్నమైన, తన అభిప్రాయాలకు వేరయిన అభిప్రాయాలను ప్రకటించేవారినీ, తమదైన మార్గాన్ని అవలంభించేవారినీ శత్రువులుగా పరిగణించడం వెర్రితనం!

అవతలివారు, వారి విశ్వాసాలకనుగుణంగా, జీవించే విశ్వాసాన్ని ఇవ్వగలగడమే సమరసభావం! అదే ‘సామరస్యం’ .కలిసిమెలిసి జీవించడంలో భిన్నాభిప్రాయాలు, అవరోధాలు కానక్కర్లేదు. పైగా అది అంతర్గత వైయక్తిక విశ్వాసం! సమష్టి జీవనానికి ఏ మతమూ ఆఘాతం కలిగించదు. కలిగించకూడదు. స్నేహవాతావరణం వుండాలే కానీ, హేళనాయుత వైఖరులు విడనాడి మసలుకోవాలి.

మనిషి మతం కన్నా గొప్పవాడు. మనిషితనం, మానవత్వమే ముందు మనిషికి కావాల్సింది. మనిషి సుఖశాంతులను కోరని మతం అంటూ ఏదీ లేదు! మతాలసారం అంతా ఒక్కటే! శాంతి సుఖాలకు అది ఆలంబనం కావాలనే. మనుషులలో ఆలోచన్లను అర్థం చేసుకోకపోవడం వల్ల ఒక్కసారి మత విద్వేషాలూ, కల్లోలాలు చెలరేగుతూంటాయి. జనం మధ్య సామరస్యం దెబ్బతింటూంటుంది. అందుకే వ్యాకులం తొలగించే కరుణయే కులం. మమత పెంచుకు మసలు మానవతే మతం. నిజానికి పైకి భిన్నాలన్నీ లోన సున్నాలే. అట్టహాసపుజీవి ఆత్మ లోతంటితే అసలు పరమార్థం తెలుస్తుంది.

మతసామరస్యం అనేదే దైవం మెచ్చే జీవన స్వారస్యం.
- సుధామ
(13/02/2012 - ఆంధ్రభూమి - దినపత్రిక )

1 comments:

సుధామ said...

బాగుందని ఫోన్ చేసిన మిత్రులకు ధన్యవాదాలు