ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, February 19, 2012

సజీవ దృశ్యాల దందెడ

దందెడ’ బావిలో నీళ్లు తోడే సాధనం. రథాన్ని లాగటానికీ, లావులావు మొద్దులు, రాళ్లుమోయడానికీ వాడేది. నారపోచలేకమై కరితిరిగి ‘దందెడ’ అయ్యింది. ఈత కమ్మలు కోసి, నారజీరి, కట్టలు గట్టి తాడు పేనడం, పురివేయడం... ‘దందెడ’ పేనడమంటే మాటలు కాదు. ఎంత లావుగా కావాలంటే, అన్ని పురులు కలిపి ఒక్క దగ్గర పేనాలి. ‘దందెడ’ పేనడం అందరికీ రాదు. అదొక ప్రత్యేకమైన కళ, అనుభవం, నైపుణ్యం. పురి గట్టిగా వుండకపోతే ‘దందెడ’కు బలం వుండదు. తొందరగా తెగిపోతుంది విడివిడిగా విచ్చుకుపోతుంది.

తన కవిత్వాన్ని ‘దందెడ’గా అందిస్తున్న పొన్నాల బాలయ్యలో బతుకును అర్థంచేసుకుని, పరమార్థం తెలియచెప్పే విన్నాణం వుంది. అక్షరాలను అర్థవంతంగా, భావనోద్దీపకంగా ఎంత బలంగా పేనాలో తనకు తెలుసు! ‘దందెడ’ను దేనికి వినియోగించాలో కూడా అతనెరుగును. ‘‘చెర్నకోలపై తెలంగాణ దరువేస్తున్న చిర్రల్ని పట్టిన వేళ్లు పేనిన ‘దందెడ’ చిత్రిస్తున్నాడు పొన్నాల బాలయ్య. ‘ఎగిలివారంగ’నే మొదలైన బాలయ్య కవన సస్యానికి ‘దందెడ’ బొక్కెనపట్టి తడి పెడుతున్నాడు’’ అన్న నందిని సిధారెడ్డి మాటలు యధార్థం.

దళిత జీవన గాఢతనూ, ఆ గాఢతలోని మట్టి సౌందర్యాన్నీ ఆమూలాగ్రం పట్టిచూపుతాడు కవి. తీరుతీర్లుగా చేతి వృత్తులు ఎలా విచ్ఛిన్నమవుతున్నాయో, వృత్తి జీవనంపై ఆధారపడిన బ్రతుకులెలా ఛిద్రమవుతున్నాయో, సజీవ దృశ్యాలుగా ఈ అక్షరాలతో పేనాడు. ‘మాదిగా’! అని చెప్పుకునే గొప్ప- చెప్పుల తయారీ నైపుణ్యాన్ని జీవద్భాషలో పలికించాడు బాలయ్య.

ఆరె రంపెతో చర్మాన్ని
అనువుగా విడిపించె కారగిరి
లందల సొరెమారు చెక్కలు ఉత్కినశెల్ల
తోలును పారకట్టెతో మడత సఫాయిదీసి
పని గూటం గుద్దిన శీరుకకు
మడిమె కుదిరెల మరో దిద్దు కుట్టు సృష్టి

అంటాడు ‘అలుకల చెప్పులు’ కవితలో

సాగరమంటే నీళ్ళే
నిజంగా నీళ్ళే
నీళ్లు లేకనే బతుకులు
నిత్తెం కొర్రాయోలె మండుడు
సముద్రం లేని కాడ
అడవే దిక్కవుడు


అని మొదలయ్యే ‘అలలతడి’లో అందుకే కుండబద్దలుకొట్టినట్లే చెబుతాడు-‘‘తెగువారం చేసి అడుగుతున్నం
జగడం లేదు కొట్లాట లేదు
మా రాజ్యం మా వాట మాకు కావాలె
అమృతం కాకున్నా మాకిన్ని నీల్లు కావాలె.’’ అంటాడు.


తెలంగాణపై రాసిన కవితల్లో స్పష్టంగా, బలంగా తన భావాలను పదునుగా సంధించాడు. ‘పొట్టకూటికి వచ్చినోళ్ళతో కాదు- పొట్టకొట్టే వాళ్లతోనే పోరాట’మన్న జయశంకర్‌గారికి నివాళిగా, తెలంగాణ పోరాటంలో గోగుపువ్వుల రథచక్రాలై ఆకాశంలో దీపాలైన అమరులకు అంకితంగా ఎక్కుబెట్టిన ఆయుధంగానూ, బతుకు బావి జీవ జలాన్ని తోడిపోసే సాధనంగానూ తన కవిత్వాన్ని ‘దండెడ’గా మంజీరా రచయితల సంఘం ముందుకు తేవడం గుండెకు హత్తుకోదగిన అంశం. ఎన్నదగిన కవితాభివ్యక్తి విన్నాణం పొన్నాల బాలయ్య సంధించిన బాణం- ‘దండెడ’.

- సుధామ


దందెడ(కవిత్వం) - పొన్నాల బాలయ్య,
మంజీరా రచయితల సంఘం ప్రచురణ,
ప్రతులకు: పొన్నాల బాలయ్య,

ఆరెపల్లి విలేజ్, బస్వాపూర్ పోస్ట్,
కోహెడ మండలం,
కరీంనగర్- 505473,
వెల: రూ.50/-

(19.2.2012 ఆంధ్ర భూమి దినపత్రిక ఆదివారం అక్షర లో )

0 comments: