ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, February 10, 2012

నీ(తిమా)లి నేతలు

‘‘అది కాదోయ్ శంకరం! సినిమా హాల్లోనే వున్నావ్. సినిమా నచ్చలేదు. ఏం చేస్తావ్? మధ్యలో లేచి బయటికెళ్లిపోతావ్. లేదూ! ఏ.సి. హాల్ అనుకో! చక్కగా సీట్లోనే గుర్రెట్టి నిద్రోతావ్. ఔనా! ఏదో ఓ మీటింగ్ చూడ్డానికి వెళ్లావ్! వేదిక మీద వక్త ప్రసంగం నచ్చలేదు. పక్కవారితో మెల్లిగా కబుర్లలో పడతావ్ - లేదూ! ఏదో పుస్తకం తీసి చదూకోవడం మొదలెడతావ్. ఉండాల్సిన చోట్లోనే వుండి, ప్రత్యామ్నాయ వ్యవహారం చేయడంలో విడ్డూరం ఏముంది’’ అన్నాడు రాంబాబు యథాలాపంగా.


‘‘అదిగో! అలా అంటేనే మరి, చిర్రెత్తుకొచ్చేది. నువ్వు ఒకే పనిమీద ఒక చోటికి వెళ్లినప్పుడు, ఆ పనిలోనే మగ్నమై వుండాలిగానీ, ప్రత్యామ్నాయ వ్యవహారాలు చేయడం అసంబద్ధం, అసమంజసం. సరే! నీ వ్యక్తిగతమైన సంగతయితే పోనీలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా వుండి, సభకు హాజరైనందుకు వున్న సదుపాయాలూ అవీ పొందుతూ, ప్రజాసంక్షేమ చర్చలు సాగుతూంటే, తన విలాసా‘లాలస’లో మునగడం అన్యాయంకాదూ!’’ అన్నాడు శంకరం.

‘‘దేన్ని గురించి నాయనా మీ వాదం! కొంచెం వివరింపరాదే!..’’ అన్నాడు సన్యాసి కుతూహలంతో.

‘‘కర్ణాటక విధాన సభలో ఓ మంత్రి వరేణ్యులుంగారు సభలో చర్చ సాగుతూండగా - తన సోఫిస్టికేటెడ్ సెల్‌ఫోన్‌లో పోర్నోగ్రఫీ చిత్రాలు చూస్తూకూచున్నారు. ఆయన ఏం చేస్తున్నాడా అని పక్క కూర్చున్న అతను తొంగిచూసి అతనితో కలిసి ఆ నీలి చిత్రదృశ్యమాలికను ఎంజాయ్ చేసారు. అధికారపక్షంలో - బాధ్యతాయుత స్థాయిలో వుండి, అలాంటి చవకబారు పనులు చేయడం - ప్రజాప్రతినిధులుగా మరీ సిగ్గుచేటుకాదూ! సభలో మాట్లాడుతున్న విషయాలమీద శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత విస్మరించి, క్లాస్‌రూమ్‌లో పిల్లాడు మాస్టారుపాఠం చెబుతూంటే కాగితాల మీద పిచ్చిగీతలు గీసుకోవడమా ఇది?’’ అన్నాడు శంకరం.

‘‘అది వారి నైజం అయినప్పుడు ఏం చేయగలం చెప్పు’’ అన్నాడు రాంబాబు.

‘‘ఎందుకు చెయ్యలేరు? ప్రజలకు ఆగ్రహం కలిగితే ఆయనను మంత్రి పదవి నుండి దిగిపొమ్మని మరి ఆందోళన చేస్తారా లేదా? బుద్ధులు గరపవలసిన పెద్దలే వక్రమార్గం పడితే ఎలాగు? కర్ణాటకలో సదానందగౌడ ముఖ్యమంత్రిగా బి.జె.పి. ప్రభుత్వం వుంది. బి.జె.పి., భజరంగ్‌దళ్ - మన భారతీయ సంప్రదాయం, ఆచారాలు, వ్యవహారాలు, హిందూ మత ప్రాభవం అంటూ పెద్ద కబుర్లు చెబుతూంటారా లేదా, అది చెప్పు’’ అన్నాడు శంకరం.

‘‘ఎందుకు చెప్పరు? ఫిబ్రవరి పధ్నాలుగు ‘వాలెంటైన్స్ డే’ మన సంస్కృతి కాదనీ, ఆ రోజు ప్రేమికులమంటూ ఎవరయినా రోడ్ల మీద తిరిగితే వూరుకోం అనీ, బలవంతంగా ఆ జంటకు పెళ్ళి చేసేస్తామనీ హెచ్చరికలు కూడా జారీచేస్తూంటారు కదా! - నిజమే! నువ్వనట్లు ‘‘చెప్పేది శ్రీరంగనీతులు దూరేవి దొమ్మరి గుడిసెలు’’ అని సామెత చెప్పినట్లుగా - ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు వల్లిస్తూ, తాము మాత్రం బూతుల్లో దృశ్య శ్రవణాంకితులు కావడం నిందార్హమైన సంగతి, క్షమార్హం కాని సంగతి. ఆ బుద్ధులు వాళ్లకుండాలి. కానీ తాను బూతుబొమ్మలు చూడడం లేదనీ, ఓ నేర పరిశోధన కథ నేదో వీక్షిస్తున్నానని ఆయన అన్నట్టున్నాడు కదా’’ అన్నాడు రాంబాబు.

‘‘పట్టుబడ్డవారు బుకాయించడం మామూలేగా! అసలు ఇలాంటివారికి తగిన గుణపాఠం చెప్పాలి. ‘రీకాలింగ్’ సిస్టమ్ మన ఎన్నికల సంవిధానంలో వుండాలని కొందరు మేధావులు వూరికే అనలేదు’’ అన్నాడు శంకరం.

‘‘లోకంలో మంచి చెప్పేవారూ, వినేవారూ లేక లోకం పాడైపోవడం లేదు, ఆచరించేవారు లేక’ అంటాడు రచయిత బుచ్చిబాబు. బి.జె.పి. పాలిత కర్ణాటక రాష్ట్రంలోనే - సంప్రదాయ వ్యతిరేక వ్యవహారాలు సర్కారు కనుసన్నల్లోనే సాగుతున్నాయి. ‘ఉడిపి’ వంటి పవిత్ర స్థలంలో పర్యాటక అభివృద్ధి పేరిట, ‘రేగ్‌పార్టీ’లంటూ - దానిని మరొక ‘గోవా’గా - విదేశీ అశ్లీల నృత్యాలు, డ్రగ్స్, మద్యంలతో విరాజిల్ల చేయడం జరుగుతోందిట! సముద్ర తీరపు ఏకాంత ప్రదేశాల్లో సంగీత మధురిమలంటే ఏమోగానీ, ‘గోకర్ణం’ వంటి పుణ్యస్థలాల్లోనూ డ్రగ్స్, అశ్లీల నృత్యాల కల్చర్ చెలామణీ అవుతోంది. ముఖ్యమంత్రిగారు అదేమీ కాదనీ, విచారణ జరిపి నిజమని తేలితే, ఎంతటివారలనయినా ఉపేక్షించక చర్యలు తీసుకుంటామంటూ ‘చట్టం’ తన పని తాను చేసుకుపోతుంది’ అని దాటవేత ధోరణి కబుర్లే చెప్పారు. కానీ నిజంగా ఇది సీరియస్‌గా పట్టించుకోవలసిన సంగతే నర్రా!’’ అన్నాడు సన్యాసి.


‘‘కర్ణాటక విధాన సభలో బూతు బాగోతం నడిపిన ముగ్గురు మంత్రులూ - ప్రజల నుండి చెలరేగిన నిరసనల కారణంగా, మొత్తానికి రాజీనామా చేసారులే! వాటిని అంగీకరించి, ఆ తరహా చర్యలు చేసే ప్రజాప్రతినిధులకు - పార్టీలకతీతంగా ‘చెక్’ పెట్టి తీరాల్సిందే! ‘రాజకీయాలు’ అంటే - దొంగలు, గూండాలు, అవినీతిపరులు, నేరచరిత్రగల వారనే అభిప్రాయము ఇప్పటికే జనంలో బలంగా పడి, అసహ్యంకలుగుతోంది! ఇలా ‘క్యారెక్టర్’లేని వికృత మనోవాంఛలు గలవారు కూడా ప్రజాప్రతినిధులుగా పనికిరారు! గంగా జలాలను శుద్ధిచేసే ప్రాజెక్ట్‌కంటే త్వరితంగా, రాజకీయాల్లోకి వచ్చే నేతలు బుద్ధి, శుద్ధి గలవారుగా ప్రజలకు సిద్ధింపచేసే చర్యలు ఈ దేశంలో జరగాలి. ఉదాసీనత, ఉపేక్ష వహించకుండా - ఓటర్లు తాము ఎన్నుకునే వ్యక్తులు నీతి, నిజాయితీ, సత్ప్రవర్తన గలవారై ఉండేలా చైతన్యం పొంది, ముందు తాము ప్రలోభాలకు అతీతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి’’ అన్నాడు దృఢంగా శంకరం.

0 comments: