ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, February 3, 2012

ఉపేక్షాకృతం‘నా కు తెలిసిన ఒకతను ఓ నగర కళాశాలలో చదువుకుని, పరీక్షలు పాసై, ఉద్యోగం అదే కాలేజీలో లెక్చరర్‌గా సంపాదించి, ఆ తరువాత ఆ కాలేజీకే ప్రిన్సిపాల్ అయ్యాడు. అది కళాశాలగా కాకపూర్వం పాఠశాలగా వుండేదిట! అతను పాఠశాల విద్యార్థిగా కూడా-అక్కడే చదువుకున్నాడు. తాను చదివిన చోటికి తానే అధికారి కావడం విశేషం కదూ!’’ అన్నాడు రాంబాబు.

సన్యాసి నవ్వాడు ‘‘ఇవాళ అందులో విశేషం ఏమీ లేదు! నిన్నటివరకు ఏ జైళ్ళశాఖకు అధికారిగా, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా వున్నాడో, అదే అత్యున్నతాధికారి- నిందితుడిగా నిలబడి, అదే జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి రావడం ఇవాల్టి విశేషం అనాలి!’’ అన్నాడు.

‘‘ఏదయినా ‘స్వయంకృతం’అనే అనాలంటాను నేను! ‘‘యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ’’అని వివేకానందులు అన్నట్లు, తాను చదివిన ‘పాఠశాల’కు తానే ప్రిన్సిపాల్ అయిన వాడొకరు. తాను సంస్కరించిన ‘చెఱశాలకు’తానే నిందితునిగా వెళ్లవలసి వస్తున్నదొకరు.‘బండ్లు ఓడలు- ఓడలు బండ్లు అవుతాయన్న’మాట ఊరికే రాలేదు! ఐ.ఏ.ఎస్. అధికారి అని నిన్నటిదాకా బ్రహ్మరథం పట్టినవాళ్ళే- ఇవాళ నిందితునిగా, అక్రమార్కునిగా చూడడంకన్నా విషాదం ఏముంది’’ అన్నాడు శంకరం.

‘‘బిభుప్రసాద్ ఆచార్యను ‘‘బి.పి.ఆచార్య’’గా- మొన్నటిదాకా ఒక పేరున్న ఐ.ఏ.ఎస్. ఆఫీసర్‌గా పేర్కొనేవారు! ఇవాళ సి.బి.ఐ. ఎమ్మార్ కేసులో అరెస్టు అవడంతో ఆచార్యగారి ‘బి.పి.’ కూడా పెరిగిపోయే వుంటుంది. ఆ స్థాయిలో వున్న మనిషి నిందితుడిగా తేలడం నిజంగా శోచనీయం మరి’’ అన్నాడు సన్యాసి పెదవి విరుస్తూ.

చట్టం సంగతేమో గానీ- ఇవాళ దేశంలో అవినీతి తన పని తాను చేసుకుపోతోంది! ‘ఇన్ఫోసిస్’ సంస్థ వ్యవస్థాపకులైన నారాయణమూర్తిగారన్నట్లు- ఇవాళ యువత ఆదర్శంగా తీసుకుంటున్న వ్యక్తులు గాంధీయో, నెహ్రూయో, సుభాష్‌చంద్రబోసో, వివేకానందుడో కాదు. ధనసంపత్తితో కోట్లకు పడగలెత్తినవారు వారికి ఆదర్శం అవుతున్నారు. నువ్వు ‘స్వయంకృతం’అన్నావ్ చూసావ్ శంకరం! ‘స్వయంకృతం’ అంటే తమనుతామే ఎలాగైనా ఆ స్థాయికి తెచ్చుకోవాలన్న వ్యామోహాలే, విలువలకు తిలోదకాలిచ్చేలా చేస్తున్నాయనుకుంటాను.’’అన్నాడు రాంబాబు. ‘‘అవినీతిపరులే ఆదర్శవంతులుగా ‘ఐకాన్’లు అనుకోవడం నేటి యువత దౌర్భాగ్యం’’ అని కూడా అన్నాడు.

‘‘ఎవ్వారలుపేక్ష చేసిన అది వారల చేటగు... అంటూ భారతంలో ఓ పద్యం వుంది. ‘నేను చేయడం లేదు కదా’! ‘నేను నిమిత్తమాత్రుడిని’ అనుకుంటూ... తనచుట్టూ జరుగుతున్న అవినీతి పట్ల ఉపేక్ష వహించి, సరిచేసే చర్యలు తీసుకోక వౌనం వహించడంవల్ల కూడా, ‘చేటు’ కలుగుతుంది! ఎమ్మార్ వ్యవహారంలో- ఎపిఐఐసి వాటా తగ్గినా బిపి ఆచార్య ప్రేక్షకపాత్ర వహించి ఉపేక్షించారనీ, తద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయలు నష్టం కలిగిందని, ఆయన కోట్లు ఆర్జించకపోయి వుండవచ్చు గానీ- విల్లాల విక్రయాల్లో ఎపిఐఐసి వాటా తగ్గింపులాంటి కీలక అంశాలను సంస్థ తాలూకు బోర్డులో చర్చించకుండానే- ఏకపక్షంగా వ్యవహరించి, నేరానికి పాల్పడ్డారనీ సి.బి.ఐ. నివేదికలో- ‘బి.పి.ఆచార్య’ గురించి పేర్కొంది! ఎపిఐఐసికి సి.ఎం.డిగా ఆయన పనిచేసిన రోజుల్లో, ఎమ్మార్- ఎం.జి.ఎఫ్, స్టైలిష్ హోమ్ వంటి ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా వ్యవహరించి, వారితో చేతులు కలపడం- ప్రభుత్వాన్ని మోసగించి అక్రమాలకు పాల్పడడమే అయ్యింది మరి’’ అన్నాడు శంకరం.

‘‘ ‘ధృతరాష్ట్ర ప్రభుత్వం’అన్న మాట వుంది! కొడుకు మీది వల్లమాలిన ప్రేమకొద్దీ- దుర్యోధనుడు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగనిచ్చిన ధృతరాష్ట్రుడు భౌతికంగా అంధుడే కాదు, ద్రౌపది వలువలూడుస్తున్నా ప్రతిఘటించలేని ‘సంస్కారాంధుడు’ కూడా అయ్యాడు, చెరుపు తెచ్చుకున్నాడు. వై.ఎస్. హయాంలో జగన్ అక్రమాస్తుల పెంపకం- కేవలం ముఖ్యమంత్రి పుత్ర ప్రేమవల్లనే కాదు, ఆయన కనుసన్నల్లో మెలిగో, ‘మనకెందుకులే’ అని ఉదాసీనమవడం వల్లనో- అవినీతి అక్రమాలు ఇబ్బడిముబ్బడయ్యాయి. పేరుకి ప్రజాసంక్షేమ కార్యక్రమాలూ, పేదలపక్షం కబుర్లూ గానీ- ‘సంపన్నత’ అంతా మేటపడిన చోట్లు వేరు! ‘మేత’ ఎవరికి ఎంత వెదజల్లి, మోతమోగే ఎత్తులకు ఎవరు, ఎలా ఎదిగారో- అధికారులూ, పాలనాదక్షులూ క్షుద్ర రాజకీయాలముందు ఎలా ఒదిగారో, కథనాలు ఒకటొకటిగా వెలుగుచూస్తున్నాయి. సామాన్యుడికి ‘మాన్యుడు’అంటూ కితాబునిస్తూ, వారికి ఓదార్పు హిత వచనాలు- వారి దైన్యం పట్ల బుగ్గలు పుణుకుతూ పలికి, తాము మాత్రం తన సంపన్న సైనం పెంచుకుని, కాలాన్ని జయించి- అధికారం హస్తగతం చేసుకోవాలని పేట్రేగిన వారి వ్యవహార సరళివల్లే- పరిస్థితులు ఈ స్థాయికి పడిపోయాయి. ఉన్నతాధికారులై వుండీ ఉచితానుచిత వివేచన చూపవలసిన వారి ఉపేక్షాధోరణులే- వారినే ఇవాళ కాల నాగులై చుట్టుకుంటున్నాయి మరి’’ అన్నాడు సన్యాసి.

‘‘పాపం చెయ్యకపోయినా, పాపం పెరుగుతున్నచోట, ‘‘పాపం! పోనీలే’’ అని ‘అనుతాపం’ ఏమీలేకుండా, ఉపేక్షించడమూ పెద్ద పాపమే! అని వర్తమాన ఘటనలూ- క్రమంగా క్రమంగా ఋజువు చేస్తున్నాయర్రా! మంచికన్నా చెడుకి సంచలన స్వభావం ఎక్కువ. సంచలనాలకు చలన రహితంగా అలవాటు పడిపోవడమూ రుగ్మతే! బి.పి. ఆచార్య వ్యవహార సరళి ‘బ్యాడ్ ప్రిసిడెంట్’గా తేలిందందుకే! నాడు అధికారిగా ఏ జైలును పర్యవేక్షించవెళ్లాడో, నేడు నిందితుడిగా అదే జైలు పాలయ్యే స్థితి కలగడం చూసాకయినా- రాబోయే, కాబోయే ఐ.ఏ.ఎస్‌లు- ‘ఏమేరకు అవినీతి సమరం’ చేస్తారో, పరివర్తనలకు ఈ ఘటనలు ఏమేరకు గుణపాఠాలు కాగలుగుతాయో ఎదురుచూడాల్సిందేలే!’’ అంటూ లేచాడు రాంబాబు

03/02/2012

4 comments:

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

స్వర్గం నరకం అని వేరే లేదు. మన చేసే పాపాలకు దేముడు ఇక్కడే శిక్ష వేస్తాడు. అలాటి వాళ్ళు ఘోరమైన చివరి క్షణాలు అనుభవిస్తారనడనికి ఇప్పూడు జరుగుతున్న సంఘటనలే ఉదాహరణలు. బగా వ్రాశారు.

సుధామ said...

మీ తక్షణ ప్రతిస్పందనకు ఎంతగానో ఆనందించాను.ధన్యవాదాలు అప్పారావు గారూ!మీ నిత్యోత్సాహం నా బోంట్లకు నిజంగా స్ఫూర్తిదాయకం.

శ్రీలలిత said...

ఇప్పుడు ఈ దేశంలో జరుగుతున్న విషయాలు చూస్తుంటే
"పెరుగుట విరుగుట కొరకే.." అన్న నానుడి నిజమనిపిస్తోంది.

సుధామ said...

కదా!...శ్రీలత గారూ!