ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, February 5, 2012

సునిశిత హస్య సరిగమలు

:''తెలుగు కార్టూనిస్టులలో ఆ మాత్రం తెలివైన వానిని ఇంతవరకూ చూడలేదు’’ అని పధ్నాలుగేళ్ళ క్రితం కార్టూనిస్టుల కుల గురువు బాపుగారి ప్రశంసలందిన కార్టూనిస్టు- ‘ఆ తెలివి తెల్లారినట్టే వుంది’ అనిపించుకోకుండా, ఇప్పటికీ దానిని నిలుపుకుంటూ కొనసాగిస్తున్నాడనడానికి దాఖలా- సరికొత్తగా వెలువడిన మూడవ సంపుటి ‘‘సరసి కార్టూన్లు.3’’.

కార్టూనిస్టుల తెలివి రెండు రకాలుగా వుంటుంది . ఒకటి రాత పరమైన ‘క్యాప్షన్’లోని క్లుప్తత, ధ్వని గాఢత అయితే; రెండవది రేఖాగతమైన ‘చిత్రణ’లోనిది. అయితే అసలు గొప్ప తెలివి ఎక్కడుంటుందంటే- తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్లు- దేనిదారి దానిది కాకుండా, రెండూ కలిసి సమన్వితమై, కార్టూన్లు చూసే వారికి ‘జగదానందకారకా!’అన్నట్లు భాసింపచేయడంలో వుంటుంది!


సరసి గీతల్లో ఒక ఒరిజినాలిటీ వుంది. గీతల్లో ‘సహజతను’ చిత్రించి వ్యంగ్యం పండిస్తాడే తప్ప, ‘వ్యంగ్య చిత్రం’ కదా అని అతిశయపు గీతలు లాగడు! ఈ కార్టూన్ల సంకలనంలో దేనికదే హాస్య వ్యంగ్యాలొలికిస్తూ, అచ్చంగా స్వచ్ఛంగా నవ్వులొలికిస్తాయి.


కార్టూనిస్టు కి వుండవలసిన ‘హాస్యదృష్టి’అనే ‘నిశిత పరిశీలన’లోనే ‘తెలివి’కి మూలా లున్నాయి. ఉదాహరణ కు యాభైవ పేజీలో ఓ కార్టూన్ గమనించవచ్చు- చిల్లరకు కొరత ఏర్పడటంతో ఈ మధ్య షాపుల్లో అర్ధరూపాయో, రూపాయో ఇవ్వవలసినచోట, ఒక చాక్లెట్ ప్రత్యామ్నాయంగా ఇచ్చే వైఖరి వచ్చింది! దీన్ని గమనించే సరసి- ఓ షావుకారుచిల్లర ఇచ్చేచోట,గుడిలో అర్చకుడి హారతి పళ్ళెంలోచాక్లెట్ వేసి పోతున్నట్లు, దానిని ఆ అర్చకులు వ్యాఖ్యానించుకున్నట్లు చిత్రించడం నిజంగా నవ్వు తెప్పిస్తుంది. అలాగే వ్యక్తిలోని ఓ గుణ స్వభావాన్ని వ్యంగ్యంగా ప్రతిఫలింపచేయడంలో 33వ పేజీలో కార్టూన్ ఒకటి గొప్ప ప్రతీక. ‘ఎట్టాగూ నీకో కన్ను కనబడదు కదా అని అట్టా చేయించాగానీ, నీ మీద నాకేవన్నా కోపమా అమ్మా!’’ అని కొడుకు తల్లితో అంటూంటాడు. ఆ తల్లికి కొడుకు చేయించిన ‘కళ్ళజోడు’కు ‘ఒక కంటి అద్దమే’ వున్నట్లు బొమ్మలో కనబడుతూంటుంది.


సరసిలోని మరో విశేషం- కార్టూన్లు, గీయడానికి ఎన్నుకునే ఇతివృత్తాలు. ఉదాహరణకు ‘మునులు’ అనే సబ్జెక్ట్‌మీద వేసిన కార్టూన్లు చూడచ్చు. మునులను వర్తమాన కాలానికి లాక్కువచ్చినట్లుగా నవ్వులు పండిస్తాడు సరసి. ‘‘వాడికి తెలియకుండా టెంట్ వేయించేశా! నిరాహారదీక్ష అనుకుని దేవుడింక ప్రత్యక్షంకాడు’’ అని 36వ పేజీలోని కార్టూను, ‘‘ఈ కొండ మీదసలు సిగ్నల్సుండవు. నువ్వెంత కాలం తపస్సుచేసినా దేవుడికి తెలియదు.’’ అనే 69వ పేజీలోని కార్టూను, 120వ పేజీలో దేవుడు ప్రత్యక్షమైతే పుస్తకం చూసి స్తుతిపాఠం చదువుతున్నట్లు చిత్రించడం, 37వ పేజీలో- ప్రత్యక్షమైన శివుడి తలమీద గంగ నీళ్లు పడుతూంటే, కళ్ళు మూసుకు తపస్సులోని ముని ‘‘ఏమేవ్! పైన ట్యాంకు నిండిపోయి ఓవర్‌ఫ్లో అవుతున్నట్లుంది. మోటార్ కట్టేయ్’’అని ఋషిపత్నితో పలకడం చూసి నవ్వకుండా మీరెలా వుండగలరు!


సరసి తెలివికి మరో గొప్ప దాఖలా- సాధారణంగా హాస్యానికి సంబంధం లేని ‘శవం’లాంటి సబ్జెక్ట్ మీద అద్భుతమైన హాస్యం పండించడం. చావు బాజా వింటూ- ‘‘బాగా వాయిస్తున్నారయ్యా! మా బావమరిది పెళ్లికి పెట్టిస్తానుండండి మీ మేళాన్ని’’ (93) అనడం, భుజంమీద నలుగురిలో ఒకడిగా పాడెనుమోస్తూ పక్కవాడితో- ‘‘సారీరా! నీ పెళ్లికి రాలేకపోయాను. బాగా జరిగిందటగా’’ (105) అని ఆ సందర్భంలో పలకరించటం, ‘‘కాస్త అక్కడిదాకా తెచ్చి పెట్టండయ్యా! అట్నుంచటే బస్సుకెళ్లిపోతా’’ (127) అంటూ పాడెమీద ఒకాయన తన సూట్‌కేస్ పెట్టడం- వంటి హాస్య కల్పనలు తనకే చెల్లాయి.


సరసి కార్టూన్ల సంకలనం.3లో మరో అదనపు ఆకర్షణ- ‘సరసికతలు’. వైశంపాయనుడు, సుబ్బాయమ్మ ప్రధానపాత్రలనుకోవచ్చు. హాస్య కథలంటే ఓ జోక్‌ని సాగదియ్యడం కాదు. ఒక నిశిత హాస్య సన్నివేశాన్ని, లేక పాత్ర గత మనస్తత్వాన్ని కథనంచేసి- నిజంగానే సరసికతను చూపారు. ‘లోయర్ బెర్త్’ కథలో- రైల్లో ఎప్పుడూ దానిమీదే పడుకునే అలవాటున్న ప్రయాణాల పెద్దమనిషి- పెళ్లిలో రాత్రి నిద్ర పట్టేందుకు ఒక మడత మంచంమీద పడుకున్నవారి, మంచం కింద పక్క వేసుకు పడుకుంటాడు. అలాగే ‘కూల్ కూల్’ కథలో- ఎండ వేడిమి తగలకుండా ఇంటి పైభాగాన పెయింట్ వేయించే రకంగానే, చల్లదనంకోసం తన ‘గుండు’కు పెయింట్ వేయించుకున్నాట్ట ఒకాయన.


ఉరుకుల పరుగుల యాంత్రిక ప్రపంచంలో, అందునా పరస్పర మానవ సంబంధాలు, ఆత్మీయతలు, సరదాలు కృత్రిమ మవుతున్న ఈ కాలాన- మనుషులను దగ్గరకు చేర్చే నవ్వుల పువ్వుల పరీమళాలను వికసింపజేస్తుందీ పుస్తకం.


-సుధామ

(సరసి కార్టూన్లు. (మూడవ భాగం)-
వెల: రూ.100/-
25/40/77, (ప్లాట్ నెం.56)

అనంత సరస్వతీనగర్,
మల్కాజ్‌గిరి,
హైదరాబాద్-47.)
(ఆంధ్రభూమి దినపత్రిక 5.2.2012 ఆదివారం 'ఆక్షర ' లో)

0 comments: