ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Tuesday, January 31, 2012

సజ్జన సాంగత్యం





ఈ సంసారమనే విషవృక్షానికి రెండే రెండు అమృత ఫలాలు వున్నాయట. అందులో మొదటిది సజ్జన సాంగత్యం. రెండవది సద్గ్రంథ పఠనం. మంచివారితో చెలిమివల్ల ఒనగూడే ప్రయోజనాలు- జీవిత సాఫల్య సోపానాలుగా భాసిస్తాయి. ‘దుష్టులకు దూరంగా వుండాలని’ కూడా మన పెద్దలు చెప్పారు. సంఘజీవి అయిన మనిషి- ఏకాంతంగా బ్రతకలేడు. సంఘంలో వుంటూనే, తన నడవడికను ఏర్పరుచుకోవాలి.

ఒక్కడే తినడం, తానుగానే ఆలోచించడం, తాను ఒంటరిననే భావంతో వుండకుండా, పదుగురు నడిచే బాటలో నడవాలనీ, పదిమందితో కలిసి సాగాలనీ, మిత్రులతో, హితులతో తన సుఖ దుఃఖాలను పంచుకోవాలనీ, సజ్జన సాంగత్యమే- చిత్తశాంతి కారకమనీ మహాభారతంలో చెప్పబడింది.

ఇంతకీ సజ్జనులంటే ఎలావుంటారు? వారితో సాంగత్యం సాధ్యమేనా? అంటే- మంచివారితో మెలగాలంటే మనలోనూ మంచి లక్షణాలు వుండాలి. ఒక్క గూటి పక్షులన్నీ ఒక చోటికి చేరుతున్నాయి అన్నట్లు తమ స్వభావ గుణాలకనుగుణంగానే సాంగత్యాలూ ఏర్పడతాయి.

కురు పాండవులకు విద్య గరిపిన ద్రోణాచార్యులవారు ఒకసారి పాండవాగ్రజుడు అయిన ధర్మరాజుతోనూ, కురుకులాధిపతి అయిన దుర్యోధనుడితోనూ లోకంలో సజ్జనులు ఎక్కడున్నారో చూసి రమ్మని పంపారట! యాత్ర చేసి తిరిగివచ్చిన ధర్మజుడు తనకు అందరూ మంచివాళ్ళే కనిపించారని చెప్పగా, దుర్యోధనుడు లోకం అంతా కపటులతోనూ, వంచకులతోనూ నిండి వుందనీ, ఒక్కడూ మంచివాడు కనబడడంలేదనీ చెప్పాడట. అంటే ఏమిటన్నమాట- ‘యద్భావం తద్భవతి’. మన భావానుగుణంగానే వ్యక్తులు కానవస్తారు. ‘కామెర్ల రోగికి లోకం అంతా పచ్చన’ అనీ, ఏ రంగుటద్దాలలోంచి చూస్తే అంతా ఆ రంగులోనే కనిపిస్తుందనీ మనవారు ఊరికే అనలేదు.

కొందరు ఇప్పుడు మంచితనం అస్సలు లేదనీ గతమే నయమనీ అంటూంటారు. ‘మంచి గతమున కొంచెమేనోయ్’ అన్నారు గురజాడ. గత కాలపు కీర్తి వైభవ స్మరణంతో సరిపెట్టరాదు. వర్తమానాన్ని మలుచుకోవాలి. నిజమే! అన్యాయం, అవినీతి, అక్రమాలు అధికమై సజ్జనులకు కాలం కాదనిపించేలానే పరిస్థితులు రూపొందుతున్నాయి. కానీ ఆశనూ, విశ్వాసాన్నీ త్యజించకూడదు. ‘మంచి’ అనేది మటుమాయం కాదు. మాయతోకప్పబడుతూంటుంది అంతే!


‘నీ స్నేహితుడెవరో చెప్పు, నువ్వెలాంటివాడివో చెబుతాను’ అన్న పలుకు ఊరికే రాలేదు. సాంగత్యంవల్లనే స్వభావాలు ఏర్పడతాయన్నది సహజం. ‘సిరి అబ్బదు కానీ చీడ అబ్బుతుంది’ అన్నారు పెద్దలు. చెడు త్వరగా పరివ్యాపిస్తుంది. మంచి గుణాలు అలవడడం, సంస్కారయుతమైన జీవనం లభ్యం కావడం అనేవి జన్మతః కొంత అలవడగా- సజ్జన సాంగత్యంవల్ల వికసనం పొందుతాయి.

సజ్జనులు కేవలం స్వార్థపూరితులుగా, వట్టి విషయలాలసులుగా ఎన్నడూ వుండరు! పరహితచింతనం, నలుగురికీ మేలు చేయాలనే సత్సంకల్పం, తమకు ఉన్నదానితో సంతృప్తి చెందుతూ ఉన్నదానిలోనే నలుగురికి పెడుతూ, సత్యవాక్కుతో, దీక్షతో, చిత్తశుద్ధితో, నిజాయితీతో జీవించడం సజ్జనుల లక్ష్యమై వుంటుంది. వారికి పాపభీతి, పరోపకార పరాయణత్వం వుంటుంది. అవతలివారిని వాక్కులతో నయినా- పరుషంగా మాట్లాడి, మనసు బాధించాలనే నైజం వుండదు. మంచితనానికి తావే లేదు మనిషిగ మసలే వీలే లేదు అనిపించే విపత్కర పరిస్థితులలో కూడా మొక్కవోని ధైర్యంతో మసలుతూంటారు వారు.

మంచి ఒక్కటే నిజానికి శాశ్వతంగా నిలుస్తుంది. సజ్జన సాంగత్యంవల్ల తృప్తి, సంతోషం, సుఖం, మనశ్శాంతి, నిర్భయత్వం ఒనగూడుతాయి. సంఘ శ్రేయస్సుకూ, వ్యక్తి వికాసానికీ పనికివచ్చే సజ్జన సాంగత్యం చేయడం సదా ఆచరణీయం.


  • - సుధామ
  • 31/01/2012
  • Andhrabhoomi (Daily)
  • 0 comments: